శ్రీరామ శ్శరణం మమ యని
చక్కగ నుడువర ఓనరుడా
శ్రీరాముని కారుణ్యము నిక
చూరగొందువుర ఓనరుడా
శ్రీరఘురామునిపై చిత్తంబును
స్థిరముగ నిలుపర ఓనరుడా
చేరి రాముడే నీహృదయములో
స్థిరముగ కొలువగు నోనరుడా
నారాయణుడే శ్రీరాముడని
నమ్ముము స్థిరముగ నోనరుడా
ఆరాముడు నీకన్నివిధంబుల
నండగ నిలబడు నోనరుడా
రాముడె భవతారబ్రహము ప్రణవము
రామనామమే ఓనరుడా
రామనామమును మించిన మంత్రము
భూమిని లేదుర ఓ నరుడా
పామరు డితడని పండితు డితడని
రాముడు చూడడురా నరుడా
రామ రామ యను నెవ్వరి కైనను
క్షేమము సత్యం బోనరుడా
భవతారకమగు రామనామమును
వదలకు వదలకు మోనరుడా
వివరింపగ నా నామమంత్రమును
శివుడును విడువడురా నరుడా
భువనత్రయమున రామనామమే
ముఖ్యమంత్రముర ఓనరుడా
కువలయమున శ్రీరామనామమే
గొప్పరక్షరా ఓనరుడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.