5, సెప్టెంబర్ 2026, శనివారం

పూని నన్ను బ్రోవకున్న


పూని నన్ను బ్రోవకున్న పోయిపోయి నేడు

నేనెవ్వరి వేడుదురా నిరుపమగుణశీల


ఏనోడో కరినిగావ నిట్టే పరుగుబెట్టినది

మానక మదనారి బ్రోవ మానినివై మెరసినది

ఆనాడా సతికి చీరనంతపొడుగు చేసినది

ఈనాడీ నిర్దయతో నిపుడు చెల్లాయెనురా


కంబంబున వెలసి బాలఘాతినణచి వేసినది

అంబరీషు కావచక్రమంపి సంపాదించినది

కంబుకంఠి గావ దనుజు కంఠంబులు తరిగినది

డంబంబుగ మిగిలిపోవ దగిన దిప్పు డాయెనురా


ఎంత కీర్తి యెంత కీర్తి యెవ్వరికిని లేని కీర్తి

యింతితనరాని కీర్తి నిపుడు చెడగొట్టుకొనకు

అంతులేని దయాశాలి వన్న పేరు నిలుపు కొనగ

పంతమింక విడచి బ్రోవవయ్య శ్రీరామచంద్ర



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.