7, సెప్టెంబర్ 2026, సోమవారం

నిన్ను నమ్మి నేనుంటే నీవు పట్టనటు లుంటే

 

నిన్ను నమ్మి నేనుంటే నీవు పట్టనటు లుంటే

నన్ను జూచి లోకమెల్ల నవ్విపోవదా


నానాబాధలనే నీవు నాకు ప్రసాదిస్తూ ఉంటే

యేనాడును నిన్ను తిట్ట లేనైతినిరా

పోనిమ్మివి యెల్ల నాదు పురాకృతకర్మఫలము

లేనని సరిపెట్టుకొంటి లేరా నిజము


నీవు పొమ్ము పొమ్మంటేనే నేను ధరకు దిగితి గాని

కావలెనని నేల మీద కాలుపెడితినా

నీవు నన్ను భవచక్రములో నీవిధి నిరికించినావు

బావుకొన్న దేమి నేను భగవంతుడా


చిక్కులిన్ని తెచ్చిన దీవు శ్రీరామచంద్రమూర్తి

చక్కబరచవలసిన దీవే యక్కజంబుగ

మ్రొక్కెద నాస్వస్వరూపమున నన్నుంచగదయ్య

నిక్కువముగ విసిగిపోతి నీవే దిక్కు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.