6, సెప్టెంబర్ 2026, ఆదివారం

పొగడ నింకొకరి నేము పొడగానము

 

పొగడ నింకొకరి నేము పొడగానము ము

జ్జగములను వాడొక్కడె సర్వోత్తముడగుటచే


కొంద రల్ప సిరులగోరి కుజనులను పొగడెదరు

కొందరేమో సిధ్ధులకై కొలచెద రాసురలను

కొందరు మెరమెచ్చులకై యందరను పొగడెదరు

అందరి వలె గాక మేము హరిని దక్క పొగడము


పొగడరాని వారి జేరి పొగడి లాభ మనగ

తగనిపనికి ప్రతిఫలముగ తలవంపులు కలుగుట

పొగడదగిన శ్రీరాముని పొగడి లాభ మనగ

తగిన ఫలము మాకు బంధములు తెగిపోవుట


హరేరామ యనుచుండెద మహర్నిశలు మేము

హరిగుణములు కీర్తించెద మహర్నిశలు మేము

హరితత్త్వము చింతించెద మహర్నిశలు మేము

హరిని దక్క మేమన్యుల నసలు గణియించము


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.