23, జూన్ 2026, మంగళవారం

లోకమేల లోకులతో నీకు పనియేల


లోకమేల లోకులతో నీకు పనియేల
శ్రీకరుడగు రాముడు నీచెంతనున్న వేళ

తెలియనగు ప్రపంచమెల్ల తెలియు నింద్రియంబుల
కలవంటిది నిజము కాదు కనుక స్థిరబుధ్ధియై
కలరూపు గ్రహించనెంచి కమలాక్షు మదినెంచి
పిలువ పిలువ వచ్చి వాడు పలుకరించు వేళను

మాయామయజగము నందు మసలుట నిక మాని
ధ్యేయమైన నాత్మతత్త్వమే యెంచిన వాడవు
మాయకవల నుండు నారాయణుడే నేడు
హాయిగాను నీవాడై యలరించెడి వేళను

భవచక్రము నందు జొచ్చి పడిన బాధలు చాలు
సవినముగ భవము లింక చాలునని వేడుచు
భవముదాట హరిమార్గము పట్టినట్టి నీకు
అవిరళముగ దారి జూప హరి తోచిన వేళను