నిన్ను నమ్మి యుంటి రాఘవా నే
నెన్న నితరు లెవరి నైన
కరిరాజును కాచినట్టి ఘనుడ వనుచు నమ్మితి
ధరను ధర్మపరుల గావ దక్షుడ వని నమ్మితి
పరమదయామూర్తి వనుచు బాగుగ లోనమ్మితి
వరద జన్నజన్మములుగ బాగా నమ్ముకొంటిని
అన్నిలోకములకు దిక్కు వనుచు నిన్ను నమ్మితి
పన్నుగ నాపన్నుజన బంధుడ వని నమ్మితి
తిన్నగ నావెతలు దీర్చు దేవుడ వని నమ్మితి
ఎన్నెన్నో జన్మములుగ నిన్నే నమ్ముకొంటిని
కలిబాధను నివారించ గలుగుదు వని నమ్మితి
ఇలను నేను పుట్టుట యిక కలుగదని నమ్మితి
కొలుచు నాకు మోక్షము చేకూర్చెదవని నమ్మితి
జలజనయన నిన్ను నేను చాలా నమ్ముకొంటిని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.