14, ఏప్రిల్ 2026, మంగళవారం

నిను నమ్మితి మని యెరిగియు

 

నిను నమ్మితి మని యెరిగియు నీవో

  కనియును గననటు లున్నావు

కనుగొని మము కరుణించెడు దాకను

   నిను వదలుట యను నది లేదు


నిను నమ్మిన కరి కుయ్యిడ వైళమ

  జని దానిని రక్షించితివి

నిను నమ్మిన ద్రోవది నిను వేడగ

  ఘనముగ వలువల నొసగితివి

నిను నమ్మిన యంబరీషు గావగ

   పనిచితివి నీచక్రమును

నిను నమ్మిన సురవరులను బ్రోవగ

   యినకులమున ప్రభవించితివి


నిను నమ్మిన ఋషియాగము గావగ

  ధనువును గొని వని కరిగితివి

నిను నమ్మిన సుగ్రీవునికై 

  వాలిని మృగమన వేటాడితివి

నిను నమ్మిన సజ్జనుని విభీషణు

  ఘనముగ రాజును చేసితివి

నిను నమ్మిన హనుమంతుని బ్రహ్మగ

  ఘనసృష్టికి నియమించితివి


నిను నమ్మిన జయవిజయుల శాపము

  లను బాపగ సమకట్టితివి

నిను నమ్మిన సురవరులకు మేలుగ

  దనుజుని రావణు జంపితివి

నిను నమ్మిన సీతమ్మకు శోకం

  బును దక్షతతో తీర్చితివి

నిను నమ్మిన భక్తులమగు మమ్మును

   కనుగొని రామా కావవయా

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.