8, ఏప్రిల్ 2026, బుధవారం

ననుజూచి నవ్విన నాకేమి రామ


ననుజూచి నవ్విన నాకేమి రామ

ననుజూచి యేడ్చిన నాకేమిరా


మనసార యొకమంచి మాట నేచెప్పితే

విని కించపడి కోపమున నెవ్వరో

వినరాని యనరాని వింతమాటల తోడ

మనసునొవ్వగ దుడుకు లనినంత నాకేమి


నినుజూచి సంతోషమున నేను పాడుటను

గని యోర్వలేని దుర్జను లెవ్వరో

మనసులో కిల్బిషము మాటలో మోములో

కనుపింపగా వికవికలు బోవ నాకేమి


నీకరుణ నాకుండ లోకాన నెవరేమి

ఆకతాయి మాటలాడితే నాకేమి

నాకు నీవండయై నడిపించుచుండగా

చీకాకు నరుల వీక్షింపగా నాకేల



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.