28, మార్చి 2022, సోమవారం

సమస్తలోక శంకరమ్

సమస్తలోకశంకరమ్ విముక్తపూరుషార్చితమ్
నమామి రామ మచ్యుతమ్ స్మరామి రామ మవ్యయమ్

సదా ధరాత్మజాయుతమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా సలక్ష్మణమ్ హరిమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా శివాది ప్రస్తుతమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా మహాకృపార్ణవమ్ స్మరామి రామ మవ్యయమ్

సదా త్రిలోకవందితమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా సురారినాశకమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా యశోవిభూషితమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా సుభక్తపోషకమ్ స్మరామి రామ మవ్యయమ్

సదా సుఖాసనస్థితమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా సమీరజానుతమ్  స్మరామి రామ మవ్యయమ్
సదా విమోహనాశకమ్ స్మరామి రామ మవ్యయమ్
సదా భవాంతకమ్ హరిమ్ స్మరామి రామ మవ్యయమ్


27, మార్చి 2022, ఆదివారం

నిన్నే నమ్మితి గాదా

నిన్నే నమ్మితి గాదా శ్రీరామచంద్ర నీవాడనైతి గాదా
నన్నే నమ్మి కొలిచి నీనామమే తలచి నీవాడ నైతి గాదా

ధారాళమైన కృపకు క్షీరసముద్రము శ్రీరాముడే యనుచును
లేరు వేరొకరు చూడ శ్రీరాముని వంటి కారుణ్యమూర్తి యనుచును
ఊరూర నీదు భక్త వీరులు పొగడుచుండ నుత్సాహించి వినుచును
వారల వలన నిన్ను గూరిచి తెలిసికొనుచు భక్తిపరుడ నగుచును

కూరిమి పంచినట్టి కోతిరాజుకు భీతి తీరిచి నట్టి వీరుడా
తీరుగ నమ్మికొలుచు కోతికి బ్రహ్మపదవి దీవించినట్టి దేవుడా
ఔరౌర ఉడుతకైన కూరిమి పంచువాడ ఓహో శ్రీరామచంద్రుడా
నోరార నీదుకీర్తి నుడువుచుండెడి నాపై కూరిమి చూపరాదా

చేరి నిన్నేకొలుచు సద్భక్తుడను కాదా చింతలు తీర్చరాదా
నీరజనయన భవసాగరమున నుండి నేడే రక్షింపరాదా
ఆరయ నాదు భక్తు లెన్నడు చెడరనుచు నాడిన దీవు కాదా
ఔరా నీవే రామో ద్విర్నాభిభాషతే యన్నది నిజము కాదా




మంచివాడ వయ్యా రామ మంచివాడవు

మంచివాడ వయ్యా రామ మంచివాడవు నిన్ను

మించినట్టి దయానిధిని మేమెఱుగము


చిన్నగా పిలువగనే సీతారామా నీవు

తిన్నగా పలికెదవో దేవదేవా

అన్ని కోరికలు మాకనుకూలముగా మమ్ము

మన్నించి ఇచ్చెదవో మంచివాడా


చెడ్డవాడైన గాని సీతారామా కాళ్ళ

కడ్ఖముగా పడివేడిన నంతే చాలు

వడ్డించి కృపారసము బహుప్రేమతో నీవు

దొడ్డ మేలు చేయుదువో దుష్టదమనా


ఎంత మంచివాడవో యిందిరారమణ నీదు

ఇంతినే పౌలస్త్యున కెర వేసినావు

పంతగించి వాని నడచి ప్రపంచమున కీవు

చింతదీర్చి క్షేమంబును చేకూర్చితివి


24, మార్చి 2022, గురువారం

బ్రహ్మజనకుడే రాముడై రావణు గూల్చి విరాజిలగా

బ్రహ్మజనకుడే రాముడై రావణు గూల్చి విరాజిలగా
బ్రహ్మానంద పరవశులైరి బ్రహ్మాదులు దిగివచ్చిరి

దిగివచ్ఛిన ఆ సరిసిజాసనుడు దేవదేవుడవు నీవనెను
జగదీశ్వరుడవు నారాయణుడవు జానకిరామా నీవనె
జగన్మాతకే యగ్నిపరీక్షను జరిపించితి వోహో యనెను
నిగమవేద్య నీలీలల నెఱుగగ నేరము గాదా మేమనెను

దిగివచ్చిన ముక్కంటి రాముడా దివ్యము నీచరితం బనెను
జగదీశ్వరుడవు నారాయణుడవు జానకిరామా నీవనెను
దిగివచ్చిన దేవేంద్రుడు రామా తీరెను నాకష్టం బనెను
తగిన ప్రత్యుపకారము నేను తప్పక చేయదు నిపు డనెను

దిగివచ్చిన దశరథభూజానియు జగముల రక్షించితి వనెను
జగదీశ్వరుడవు నీవని తెలిసెను సంతోషించితి నేననెను
తగినవిధంబుగ పట్టము గట్టుక ధర నేలుము నీవిక ననెను
యుగయుములు నీకీర్తి రహించును జగములలో చక్కగ ననెను



తక్కిన దేవత లొకయెత్తు మన దశరథరాముం డొకయెత్తు

తక్కిన దేవత లొకయెత్తు మన దశరథరాముం డొకయెత్తు
తక్కిన మంత్రము లొకయెత్తు భవతారకమంత్రం బొకయెత్తు

మిక్కిలిధనము గడించుచు బొక్కుచు మిడుకుటలో సుఖ మొకయెత్తు
చక్కని ప్రేమను పంచెడు రాముని చరణసేవ సుఖ మొకయెత్తు
మిక్కిలి మారులు పుట్టుచు సుఖముల నిక్కడ వెదకుట యెకయెత్తు
అక్కజముగ హరిపదమును చేరి యచట సుఖించుట యొకయెత్తు
 
పదవులు ధనములు బంధుమిత్రుల వలన కలుగు బల మొకయెత్తు
సదయుండగు శ్రీరామచంద్రుడే యెదనుండిన బల మొకయెత్తు
అదనుగ మణిమంత్రౌషధములచే నగుచుండెడి బల మొకయెత్తు
విదితముగా హరిభక్తిపరతచే వెలయుచుండు బల మొకయెత్తు

పొరి తలిదండ్రులు మానక నీపై కురిపించెడి దయ యొకయెత్తు
కరుణామయుడగు రామచంద్రుడు కురిపించెడి దయ యొకయెత్తు
గురవులు పెద్దలు నీయభివధ్ధిని కోరి కురియు దయ యొకయెత్తు
మరియిక పుట్టవు పొమ్మని రాముడు కరుణించుట యది యొకయెత్తు



 

21, మార్చి 2022, సోమవారం

బ్రహ్మానుభవము కలిగెడు దాక బ్రహ్మ మెఱుకపడదు

బ్రహ్మానుభవము కలిగెడు దాక బ్రహ్మ మెఱుకపడదు
బ్రహ్మానుభవము కలిగిన పిమ్మట బ్రహ్మమె తానగును
 
బ్రహ్మము గూర్చి పుస్తకములలో వ్రాతలు చదువుకొని
బ్రహ్మాండముగా పండితులందరు పలుకుచుందు రెపుడు
బ్రహ్మము గూర్చి పండితులాడెడు పలుకులు దబ్బరలు
బ్రహ్మానుభవము లేని వారల పలుకు లగుట వలన
బ్రహ్మవిదులలో  సగుణబ్రహ్మోపాసకు లొకరీతి
బ్రహ్మవిదులలో నిర్గుణబ్రహ్మోపాసకు లొకరీతి
బ్రహ్మానుభవము క్రమముగ నిర్గుణబ్రహ్మమయం బగును
బ్రహ్మతత్త్వవిదు లానందఘన స్వరూపులే కనుక 
బ్రహ్మాత్మైకస్వరూపుని ధనములు బడయుదు రాత్మజులు 
బ్రహ్మాత్మైకస్వరూపుని పుణ్యము బడయగలరు హితులు
బ్రహ్మాత్మైకస్వరూపుని పాపము బయడదు రహితులిక
బ్రహ్మవిదుడు ప్రారబ్ధము గడిచి బడయగలడు ముక్తి
బ్రహ్మానుభవము కలుగుచుండు పరబ్రహ్మము కృపచేత
బ్రహ్మము కృపతో సగుణంబగుచు ప్రభవించెను ధరణి
బ్రహ్మమపుడు శ్రీరామచంద్రపరబ్రహ్మముగా నెసగె
బ్రహ్మానందము కోరిన వారు రాముని గురుతెఱిగి
బ్రహ్మంబనుచు భజించి జగమే రామమయం బనుచు
బ్రహ్మవేత్తలై బ్రహ్మాత్మైకత బడయగలరు నిజము
బ్రహ్మానుభవసంపూర్ణులు వారు బడయగలరు ముక్తి
 


మానవకాంతవు కావనిపించును మానిని నీవెవరు

మానవకాంతవు కావనిపించును మానిని నీవెవరు
హీనదానవుడ మానవకాంతను మానిని సీతనుర
 
ఏమియు నాహారముగా గొనవట యెట్టులుందు వీవు
రామనామమే ఆహారమురా రాక్షసుడా నాకు
 
ఏమియు త్రావక దప్పిగొనక నీ వెట్టు లుండగలవు
రామనామమే సోమరసమురా రాక్షసుడా నాకు

భూమినుండి ప్రాదుర్భవించినది పొలతుక నిజమేనా
భూమిజాతనుర నీకు మిత్తినిర పోరా దానవుడా
 
రాముడు చిచ్చఱకంటివింటినే భామా విరచెనటే
రాముడు విరచును నీగర్వమును రాక్షసుడా రేపు
 
రాముడు వైష్ణవధనువు నెత్తెనట భామా నిజమేనా
రాముడె వెన్నుడు వాని కసాధ్యము రాక్షసుడా లేదు
 
రాముడు హరియా నీవు లచ్చివా లేమా నిజమేనా
ఏమో యిలపై నీల్గెడు నాడే యెఱుగగలవు నీవు

హరహర శివశివ హరహర యనుచు

హరహర శివశివ హరహర యనుచు హరుని చేరితే హరుడేమో
పరమ సుఖంబుగ పద్మాసనమున హరిని తలచుచు నున్నాడు

    తారకనామము నానందముగా ధ్యానము చేయుచు నున్నాడు
    శ్రీరఘురాముని నామస్మరణము చేయుచు సుఖముగ నున్నాడు
    మారజనకుని మదిలో తలచుచు మారవైరి హరి డున్నాడు
    గౌరీనాథుడు శ్రీహరిధ్యానము ఘనముగ చేయుచు నున్నాడు

హరిహరి మాధవ హరిహరి యనుచు హరిని చేరితే హరియేమో
పరమేశ్వరుని హరుని తలంచుచు పరమసుఖముగా నున్నాడు

    ధ్యానము చేయుచు శివపంచాక్షరి తన్మయుడై హరి యున్నాడు
    అ నారాయణు డానందముగా హరుని స్మరించుచు నున్నాడు
    ఆ నటరాజును మదిలో మలచుచు అతి భక్తుడు హరి యున్నాడు
    శ్రీనాధుడు హరి శివధ్యానమును ప్రీతిగ చేయుచు నున్నాడు

హరుని చేరితే హరుడేమో హరిధ్యానములో నగుపడును
హరిని చేరితే హరియేమో హరధ్యానములో నగుపడును
హరిహరు లిరువురు వేరువేరని యనుకొంటే యిది వింత
హరిహరు లిరువురు నొకటే నన్నది యెఱుగ కలుగు పులకింత

రక్షించుము రక్షించుము రామచంద్రా

రక్షించుము రక్షించుము రామచంద్రా జగ
ద్రక్షకుడవు నీవే కద రామచంద్రా
 
రామ నీదు నామమునే నుడివెద నుడివెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు చరితమునే చదివెద చదివెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు యశంబునే పొగడెద పొగడెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు భక్తులతో కలిసెద కలిసెద రామచంద్ర నన్ను రక్షించుమా
 
రామ నీదు విభవమునే తలచెద తలచెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు క్షేత్రములను తిరిగెద తిరిగెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు మహిమలనే చాటెద చాటెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీదు విక్రమమే చాటెద చాటెద రామచంద్ర నన్ను రక్షించుమా
 
రామ నీకు సేవకుడ నయ్యెద నయ్యెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీకు నిత్యమును మ్రొక్కెద మ్రొక్కెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీకు శరణమని పలికెద పలికెద రామచంద్ర నన్ను రక్షించుమా
రామ నీ కన్యమునే తలపను తలపను రామచంద్ర నన్ను రక్షించుమా

19, మార్చి 2022, శనివారం

హరి వీవు హరి యతడు

హరి వీవు హరి యతడు మరి మీ యిరువురి
కర మరుదగు జోడీ ఘనమైనది

సురకార్యార్ధము హరి నరుడాయెను
హరికార్యార్ధము హరు డంతట
ధరియించెను వానర రూపంబని
మరి బ్రహ్మాదులు మరిమరి పొగడగ

హరి నిన్నెఱుగును మరి హరి నెఱుగిన
హరిరూపమున నున్న హరుడా శ్రీ
హరిసందేశము హరియుంగరమును
హరిణాక్షి సీత కందించినావు

హరినీ శరమై యమరెను త్రిపురా
సురులను జంపగ హరి రాముడై
దురమున నుండగ తొడరి రథంబుగ
అరి నెదిరించిన హనుమంతుడా


పరమపావనుడైన పవమానసూనుడే

పరమపావనుడైన పవమానసూనుడే
అరయ వచ్చెనా అది పరమశుభకరము

శ్రీరామచంద్రుని తా చేరి పలుకరించెను
ఆరాక రామవిభున కతి మంగళకరమై
ఆ రావణు కసిమసగి యవనిజను కాచి
శ్రీరఘువరు డమిత కీర్తి చెందినాడు

సీతమ్మతల్లిని తా చేరి పలుకరించెను
ఆతల్లి కతని రాక అతి మంగళకరమై
నీతితప్పిన రావణుని నేలబడ జేసి
ప్రీతితో రణవిజయుని విభునిజేర్చె

ఆరావణాసురు తా చేరి పలుకరించెను
ఆరాక లంకాపతి కతి మంగళకరమై
ఘోరశాపము చేత గొన్న యుపాధిని
శౌరి భటుడు జయుడదే జారవిడచె







17, మార్చి 2022, గురువారం

చిలుకపలుకుల స్వాము లున్నారు వారు తెలిసితెలియక పలుకుచున్నారు

చిలుకపలుకుల స్వాము లున్నారు వారు
తెలిసితెలియక పలుకుచున్నారు 

చదివిన శాస్త్రవిజ్ఞాన మంతయు దెచ్చి
ముదమార పంచుచు మురియుచున్నారు
విదితంబు గాకాత్మవిజ్ఞాన మించుకయు
విదులమని కడు విఱ్ఱవీగుచు పలికేరు

శివుడు వేరను మాట చెప్పుచున్నారు కే
శవుడు వేరనుచును చాల పలికేరు
వివరింప నిర్వురును వేరుకాదను మాట
నవినీతులై విడచి అతిగ మాట్లాడేరు

మేము స్వాములని మేము భక్తుల మని
రామచంద్రా వీరు రవ్వ చేసేరు
ఏమాత్రమును బ్రహ్మ మెఱుగని వీరెల్ల
సామాన్యులకు బోధ సాగించుచున్నారు











16, మార్చి 2022, బుధవారం

శ్రీమన్నారాయణ దేవా హరి శ్రీమద్దశరథనందన

రామా శ్రీమన్నారాయణ హరి శ్రీమద్దశరథనందనా
కామితవరదా కలుషవిదారణ శ్రీమద్దశరథనందనా
 
రామా కౌసల్యాసుఖవర్ధన శ్రీమద్దశరథనందనా
రామా ప్రావృణ్ణీరదశ్యామా శ్రీమద్దశరథనందనా
రామా పుంసాంమోహనరూపా శ్రీమద్దశరథనందనా
రామా రవికులజలనిధిసోమా శ్రీమద్దశరథనందనా
 
రామా కౌశికమునిమఖరక్షక శ్రీమద్దశరథనందనా
రామా పశుపతికార్ముకభంజన శ్రీమద్దశరథనందనా
రామా క్షోణీతనయారమణా శ్రీమద్దశరథనందనా
రామా భార్గవగర్వవినాశక శ్రీమద్దశరథనందనా
 
రామా రాఘవ వనమాలాధర శ్రీమద్దశరథనందనా
రామా ఖరదూషణత్రిశిరాంతక శ్రీమద్దశరథనందనా
రామా మారీచప్రాణహర శ్రీమద్దశరథనందనా
రామా జటాయుసుగతిప్రదాయక శ్రీమద్దశరథనందనా
 
రామా భయదకబంధనిషూదన శ్రీమద్దశరథనందనా
రామా శబరీదత్తఫలాశన శ్రీమద్దశరథనందనా
రామా రవిపుత్రప్రియమిత్ర శ్రీమద్దశరథనందనా
రామా గర్వితవాలివినాశన శ్రీమద్దశరథనందనా
 
రామా ఘనవారాన్నిధిబంధన శ్రీమద్దశరథనందనా
రామా రావణదైత్యవినాశన శ్రీమద్దశరథనందనా
రామా సీతాశోకవినాశన శ్రీమద్దశరథనందనా
రామా బ్రహ్మాద్యమరాభినుత శ్రీమద్దశరథనందనా
 
రామా సాకేతపురాధీశ్వర శ్రీమద్దశరథనందనా
రామా సకలోర్వీజనవందిత శ్రీమద్దశరథనందనా
రామా భక్తజనాశ్రయచరణా శ్రీమద్దశరథనందనా 
రామా భవభయవారక నామా శ్రీమద్దశరథనందనా
 
రామా జయజయ రమ్యగుణాశ్రయ శ్రీమద్దశరథనందనా
రామా త్రిజగన్మంగళరూపా శ్రీమద్దశరథనందనా
రామా మునిజనమోక్షప్రదాయక శ్రీమద్దశరథనందనా
రామా వైకుంఠాధిప శ్రీహరి శ్రీమద్దశరథనందనా
 
 

ఇంటిపని అని బోలె డున్నాదిరా అది ఎంతచేసిన తరుగకున్నాదిరా

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుటనే చిత్తంబులో మానకున్నానురా
ఓరామ నీచిత్త మిక నెట్టులున్నదో ఆరీతిగా నింక నడిపించరా  
 
ఇంటిపని అని బోలె డున్నాదిరా అది ఎంతచేసిన తరుగకున్నాదిరా
ఇంటిదని ఒక సుదతి యున్నాదిరా అది ఎంతతెచ్చిన మెచ్చకున్నాదిరా
 
బిడ్దలని ఒక కొందరున్నారురా వార లడ్డదిడ్డము లాడుచున్నారురా
దొడ్దప్రభువులు కొందరున్నారురా వార లడ్డమైన మాట లాడేరురా

మరి మిత్రులని కొందరున్నారురా వారు మనవద్ద నెంతసే పుంటారురా
ఇరుగుపొరుగని కొందరున్నారురా వారు పరుషంబులే తరచు పలికేరురా
 
బంధుబలగము మిక్కి లున్నాదిరా నాకు వారునా వారెప్పు డైనారురా
బంధాలు పదిలక్ష లున్నాయిరా వాటి బాధనే పడలేక యున్నానురా
 
అందమైన లోక మంటారురా దీని యందాలు గొప్పలే మున్నాయిరా
బందిఖానావంటి యిల్లుందిరా యందు బందీగ నే జిక్కియున్నానురా
 
శాస్త్రంబులని చాల యున్నాయిరా నేను చదివిచచ్చిన దేమి యున్నాదిరా
శాస్త్రంబు లటులుంచి చదువుసంధ్య లంటి చచ్చిన దేమంత యున్నాదిరా
 
మిడిమిడి జ్ఞానంబు మెట్టవేదాంతంబు మించి తెలి వేమంత యున్నాదిరా
వడివడిగ వయ సుడిగిపోవుచున్నది కాని బ్రతుకున సుఖమన్నదే లేదురా

సంసార మిటువంటి దని తెలియక నేను సంసారమున చిక్కు కున్నానురా
హింసించు చున్నదీ సంసార మిక దీని నెంత మాత్రము తాళగాజాలరా
 
హరిహరి నీవొకడ వున్నావురా చాలు నన్నిటను తోడుగా నున్నావురా
మరి నీదు తారకమంత్రంబునే నేను మానక చేయుచు నున్నానురా


ఈమాత్ర మెఱుగరా

ఈమాత్ర మెఱుగరా ఏమి గురువులు మీరు
రామరామా చాలు మీమాటలు

శ్రీరామనామ మను సిధ్ధౌషం బొకటి 
    సేవించదగినదై యుండ
మీరేల భవరోగ మను దాని కొకమందు
     తీరుగా లేదు పొమ్మనుచు
ధారుణీతల మందు తప్పుమాటను ప్ర
      చారంబు చేయుచున్నారో
ఔరౌర అది యొప్పునా రామనామామృత
      మన్ని రోగములకు మందు

శ్రీరామనామ మను చింతామణి యొకటి
      చేతిలో సిధ్దముగ నుండ
 మీరేల సకలసంపద లిచ్చు మణి యొండు
       మేదినిన్ లేదు పొమ్మనుచు
 ధారుణీతల మందు తప్పుమాటను ప్ర
      చారంబు చేయుచున్నారో
 ఔరౌర అది యొప్పునా రామనామమణి
      ఆమోక్షమైన నందించు

శ్రీరామనామ మను జీవులందరు జపము
      చేయగా దగు మంత్ర ముండ
మీరేల సకలజనసంసేవ్య మంత్రమే
      మేదినిన్ లేదు పొమ్మనుచు
ధారుణీతల మందు తప్పుమాటను ప్ర
    చారంబు చేయుచున్నారో
ఔరౌర అది యొప్పునా రామమంత్రంబు
     నందరును చేయనే వలయు

15, మార్చి 2022, మంగళవారం

వినరయ్య వినరయ్య

వినరయ్య వినరయ్య శ్రీరామభక్తుని విధమును విశదంబు గాను

శ్రీరామతత్త్వంబు చింతించునే కాని చింతించ డన్యంబు లెపుడు
శ్రీరామభజనంబు చేయుచుండును కాని చేయ డన్యుల భజన మెపుడు
శ్రీరామచరితమే చెప్పుచుండును కాని చెప్ప డన్యుల గూర్చి యెపుడు
శ్రీరామయశమునే చాటుచుండును లెక్కచేయ డన్యుల  గొప్ప లెపుడు

శ్రీరామచంద్రునే సేవించుకొను గాని సేవింప డన్యుల నెపుడు
శ్రీరామభక్తులను చేరుచుండును కాని చేరబో డన్యుల నెపుడు
శ్రీరామ గానంబు చెవిబెట్టునే కాని చెవు లన్యముల కీయ డెపుడు
శ్రీరామ పారమ్యమే యొప్పుకొను కాని వేరుమాటే యొప్పుకొనడు

శ్రీరాముడే తండ్రి యని తలచునే కాని వేరుగా తలపోయ డెపుడు
శ్రీరాముడే తల్లి యని తలచునే కాని వేరుగా తలపోయ డెపుడు
శ్రీరాముడే విభుం డని తలచునే కాని వేరుగా తలపోయ డెపుడు
శ్రీరాముడే దైవ మని తలచునే కాని వేరుగా తలపోయ డెపుడు

10, మార్చి 2022, గురువారం

రామా రామా రాజీవానన రావయ్యా రామా

రామా రామా రాజీవానన రావయ్యా రామా
ఏమాత్రము నేతాళలేనని యెంచుము శ్రీరామా

ఎన్నడైన నే మరచియుంటినా నిన్ను మహాత్మా రామా
ఎన్ని జన్మలుగ కొలుచుచుంటినో యెఱుగుదు వీవే రామా 
నిన్నేనమ్మితి సన్నుతాంగ హరి నీరజనయనా రామా 
నన్నెప్పటికిక గట్టెక్కింతువు నారాయణ హరి రామా 
 
వేనవేలుగా తనువుల దాల్చితి వేదన లందితి రామా
ఏనాటికి నను దయజూచెదవో యినకులతిలకా రామా
దీనులపాలిటి కల్పవృక్షమవు దిక్కువు నాకు రామా
నేనెంతగ మొఱబెట్టిన వినవిది నీకు న్యాయమా రామా

భయములు పెక్కులు కలుగుచున్నవి భండనభీమా రామా
జయశీలుడవని నమ్మితినే యిటు జరుగవచ్చునా రామా 
దయగలవాడవు నీవని నేను తరచుగ విందును రామా
దయగలవాడవు నీవైతే నను దయజూడవయా రామా
 
మరుజన్మంబున నరుడనగుదునను మాటసత్యమా రామా
నరుడనైనను నీనామంబును మరచెదనేమో రామా
పరమార్తుడ నిను వేడుకొందును వలదిక జన్మము రామా
కరుణను నాభవబంధంబులను ఖండింపవయా రామా

తప్పులు చేయని నరుడున్నాడా ధరణీతలమున రామా
తప్పులు గలవని నాపై నీవు తామసింపకుము రామా
ఒప్పుగ నిదె నీ సన్నిధిచేరి యుంటిని కదరా రామా
తప్పుల నెన్నక నాపై నీవు దయచూపవయా రామా


9, మార్చి 2022, బుధవారం

దాశరథీశతకం - 2


రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ 
స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద 
శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో 
ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 
 
 
ఈ పద్యం కూడా అన్నీ‌ సంబోధనలతో‌ నడుస్తోంది.
రామ 
విశాలవిక్రమపరాజితభార్గవరామ 
సద్గుణస్తోమ 
పరాంగనావిముఖసువ్రతకామ 
వినీలనీరదశ్యామ 
కకుత్స్థవంశకలశాంబుధిసోమ 
సురారిదోర్బలోద్దామవిరామ 
భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
 
విశాలవిక్రమపరాజితభార్గవరామ  అనే సంబోధనకు అర్ధం పరాక్రమంతో‌ పరశురాముణ్ణి జయించిన వాడా అని. రాముడు శివుడి వింటిని ఎక్కుపెట్టబోతే అది కాస్తా విరిగింది. ఆ విరగటంతో వచ్చిన చప్పుడు ఎంత దారుణంగా ఉందంటే సభలో ఉన్నవాళ్ళందరూ మూర్చబోయారు దాన్ని తట్టుకోలేక. కొధ్ధిమంది మాత్రం‌ నిబ్బరంగా ఉండగలిగారంతే. వాళ్ళెవరంటే విశ్వామిత్రమహర్షి, లక్ష్మణస్వామి వారు, జనకమహారాజు గారు మాత్రమే.  శివుడు విల్లా మజాకానా! సీతారామకళ్యాణం‌ జరిగింది. మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళ పెళ్ళిళ్ళూ అయ్యాయి. ఈశివధనుర్భంగ వార్తకు కోపించి పరశురాముడు వచ్చాడు. నువ్వెవడివిరా ఇంకొక రాముడివీ, ఈ జమదగ్ని కొడుకు రాముడుండగానూ! నాగురువుగారు శివుడి విల్లు పొగరుగా విరగ్గొట్టి ప్రతాపం చూపుతావా? అని గర్జించి, చేతనైతే ఈవిష్ణు ధనస్సును ఎక్కుపెట్టరా చూదం అని విష్ణుధనస్సును ఇచ్చాడు. రాముడు సవినయంగానే ఆవిల్లు అందుకొని బాణం ఎక్కుపెట్టాడు. పైగా పరశురాముడితో ఒక ముక్క అన్నాడు. రాముడు ఉత్తినే ఏపనీ చేయడు. ఇప్పుడు చెప్పు ఈబాణాన్ని ఎక్కడ విడిచేదీ? నీకు సులభంగా సిధ్ధగమనంతో‌ ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తిని కొట్టేయనా, నీవు తపస్సుతో సంపాదించుకొన్న పుణ్యలోకాలను కొట్టెయ్యనా? అని. రాముడు విష్ణుధనస్సుని ఎక్కుపెట్టి ఇలా అంటూ‌ ఉండగా అకాశంలో నిలచి దేవతలంతా మహోత్సాహంతో చూసారు. పరశురాముడిలోని విష్ణుతేజం రాముడిని చేరుకున్నది. ఆయన విష్ణువు యెక్క ఆవేశావతారం కదా. పరశురాముడు చిరజీవిని, అపుణ్యలోకాలతో నాకు పనిలేదు వాటిని కొట్టేయవయ్యా నాగమనశక్తిని కొట్టవద్దు. ఎందుకంటే‌ ఈభూమినంతటినీ‌ ఒకప్పుడు నేను జయించి కశ్యపుడికి దానం చేసేశాను. అందుచేత భూమిమీద రాత్రి నేను నిలువరాదు అన్నాడు. అలాగు పరశురాముడిని రాముడు తన బాహు విక్రమంతో జయించాడు. ఈ‌కథను గుర్తుచేయటానికే విశాలవిక్రమపరాజితభార్గవరామ అన్నారు రామదాసు గారు. 
 
ఇక్కడొక చమత్కారం ఉంది విశాలవిక్రమపరాజితభార్గవరామ అన్నదిరెండుసంబోధనలుగా విడదీయవచ్చును. 
విశాలవిక్రమ
పరాజితభార్గవరామ 
అని
విశాలవిక్రమ అంటే త్రిలోకాలలోనూ ప్రఖ్యాతమైన పరాక్రమం కలవాడా అని అర్ధం.  ఈసంబోధనకు సమర్ధనగా కాకాసురవృత్తాంతాన్ని గుర్తుచేసుకుందాం. ఈ కాకాసురుడు అనే వాడు, సీతమ్మ జోలికి పోయి రాముడి బ్రహ్మాస్త్రానికి గురైనాడు. వాడు ప్రాణభయంతో రక్షించేవాడిని వెతుక్కుంటూ‌ మూడులోకాలూ తిరిగి అలసిపోయాడే కాని, రాముడి అస్త్రాన్నుండి మేము కాపాడగలం అన్న మొనగాణ్ణీ ఎవణ్ణీ చూడలేదు. చివరకు రాముడే అనుగ్రహించవలసి వచ్చింది శరణు మహాప్రభో అని ఆ రాముడి కాళ్ళమీద పడ్దాక.
 
పరాజితభార్గవరామ అన్న సంబోధనకు మనం అర్ధం చెప్పుకోవటం జరిగింది కదా.

రాముణ్ణి సద్గుణస్తోమ అని పిలుస్తున్నాడు రామదాసు. స్తోమం అంటే‌ సమూహం. సద్గుణాల పుట్ట అట రాముడు. అసలు రామాయణ కావ్యారంభం అన్నది ఇలా సద్గుణాల పుట్ట ఐన వాడు ఎవడన్నా ఉన్నాడా అని నారదులవారిని వాల్మీకి మహర్షి అడగటంతోనే కదండీ ప్రారంభం ఐనదీ? ఆ నారదులవారేమే నువ్వన్న సద్గుణాలన్నీ కూడా రాముడికే ఉన్నాయీ‌ అని చెప్పి రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పారు వాల్మీకికి. ఆ దరిమిలా ఆ రామకథనే బ్రహ్మగారి వరప్రభావంతో సంపూర్ణంగా దర్శిస్తూ మహత్తర కావ్యంగా వాల్మీకి విరచించారు ఆదికావ్యం రామాయణాన్ని. రాముడెంత సద్గుణవంతుడూ అంటే రాక్షసుడైన మారీచుడే‌ రామో విగ్రహవాన్ ధర్మః అని చెప్పాడు. ధర్మమే రాముడి స్వరూపం. ఆయన మాటా బాటా అందరికీ ఆదర్శం కదా యుగయుగాలకూను. అంత సద్గుణశాలి రాముడు.

పరాంగనావిముఖసువ్రతకామ అన్న మంచి సంబోధన ఒకటి ఇందులో ఉంది.  పరాంగనలు అంటే ఇతరుల భార్యలు. ఇతరుల భార్యల పట్ల వైముఖ్యం కలవాడు అని చెప్పటమూ‌ అది ఒక సువ్రతం అనగా మంచి వ్రతం అని ఒక కితాబు ఇవ్వటమూ పైగా రాముడికి అట్లా ఇతరుల భార్యల పట్ల వైముఖ్యం కలిగి ఉండటం చాలా ఇష్టం‌ అని చెప్పటమూ ఈసంబోధన ద్వారా తెలుస్తోంది. రాముడి జీవితంలో పెళ్ళి చేసుకోమని వెంటబడ్డది ఒక్క శూర్పణఖ మాత్రం‌ కనిపిస్తుంది. అందమైన స్త్రీగా వచ్చినది ఒక రాక్షసి అని రాముడు గ్రహించాడా లేదా అన్నది ప్రక్కనబెడితే ఆయన మాత్రం నేను ఏకపత్నీవ్రతుణ్ణి, అవతలికి పో అనేశాడు. పరాంగనలను రాముడు కన్నెత్తి చూసే వాడు కాదు. ఆమాటకు వస్తే లక్ష్మన్న కూడా అంతే! ఆయన సీతమ్మ పాదాలనే‌ కాని ముఖం చూసి ఎన్నడూ మాట్లాడనే లేదు.

వినీలనీరదశ్యామ అనేముక్కకు అర్ధం చూదాం. నీరదం అంటే మేఘం. నీరములు అనగా నీళ్ళను ఇచ్చునది కాబట్టి నీరదం అని విగ్రహవాక్యం. శరత్కాలంలోని దూదిపింజెల్లాంటి మేఘాలు తెల్లగా ఉంటాయి కాని నీళ్ళను క్రుమ్మరించే‌ శ్రావణమేఘాలు అదొక తమాషా నలుపు రంగులో ఉంటాయి. సంస్కృతభాషలో నీలం అన్న ముక్కకి నలుపు అని అర్ధం. తెలుగులో నీలం అంటే నలుపన్న అర్ధం లేదు, అది వేరే రంగు. విష్ణువు నీలం అన్నారు కదా అని మన నాటకాలవాళ్ళూ బొమ్మలు వేసే వాళ్ళూ ఆయనకు సంస్కృత నీలవర్ణం బదులు తెలుగు నీలంరంగు వేసేసారు. సాక్షాత్తూ రాయల్ బ్లూ ఇంక్‌ పీపాలో ముంచి తీసారు. అన్నట్లు వినీల అన్నారు కదా, వినీల అంటే మరేమీ లేదు మంచి నీలవర్ణం అని అనగా దట్టమైన కారుమబ్బు రంగట! రాముడూ‌ కృష్ణుడూ కూడా ఒకే రంగు. అన్నట్లు అర్జునుడూ అదే‌ రంగు. ఒక సందర్భంలో అర్జునుడే‌ అంటాడు నేనూ కృష్ణుడూ తప్ప ఈశరరవర్ణంలో లోకంలో మరెవ్వరూ ఉండరు అని.

కకుత్స్థవంశకలశాంబుధిసోమ అన్న సంబోధన రాముడి వంశాన్ని స్మరించె చెప్పేది. రాముడిది కకుత్స్థవంశం. ఇక్ష్వాకుడి కొడుకు కుక్షి.  అ కుక్షి కొడుకు వికుక్షి. ఒకసారి దేవతల తరపున రాక్షసులతో యుధ్ధంచేసినప్పుడు, ఈవికుక్షికి ఇంద్రుడే ఒక ఎద్దు రూపంలో వాహనం అయ్యాడట. అప్పటినుండి అతనికి కకుత్స్థుడు అనీ‌ ఇంద్రవాహనుడు అనీ బిరుదులు వచ్చాయి. వంశాన్ని సముద్రంతో పోల్చి, ఆ సముద్రుడికి చంద్రుడిలాగా ఫలాని వంశసముద్రానికి నీవు చంద్రుడివి అని ప్రశంసించటం సంప్రదాయం. రాముడు అలా కకుత్స్థుఁడి వంశ సముద్రానికి చంద్రుడు అని చెప్తున్నారు రామదాసు గారు.

ఇక సురారిదోర్బలోద్దామవిరామ అన్న సంబోధన ఉంది. సురారులు అటే సురలకు అరులు, అరి శబ్దానికి అర్ధం శత్రువు అని. సురలంటే‌ దేవతలు కాబట్టి సురారులు అంటే‌ రాక్షసులు. అ రాక్షసులకు రాముడు విరాముడట అనగా మంగళం పాడినవాడు. చంపిపారేసినవాడు. అల్లాటప్పా రాక్షసులను చంపితే గొప్పేమీ? ఆ రాక్షసులను దేవతలు చంపలేకపోతే రాముడూ చంపాడంటే వాళ్ళెలాంటి వాళ్ళూ? దోర్బలోద్దాములు అట. అంటే పట్టపగ్గాలు లేని భుజబలం కలవారు. దేవతలనె గడగడలాడించిన వారు. వాళ్ళ పనిపట్టినవాడు రాముడు అని రామదాసుగారు పొగడుతున్నారు.
 
ఒక చిన్న సంగతి. రాముడు పరాంగనావిముఖసువ్రతకాముడు అన్నారు.ఇందులో ఏమి విశేషం ఉందీ అనపించవచ్చును. రామచంద్రుడు రామాయణమహాకావ్యంలో నాయకుడు. అయన పరాంగనావిముఖసువ్రతకామ చరిత్రుడు. ఆ కావ్యంలోని ప్రతినాయకుడు రావణుడు. అతగాడు కూడా మహాతేజస్వి. గొప్ప పరాక్రమం కలవాడు. దేవతలకే అసాధ్యుడు. మహాశివభక్తుడు. వేదవేత్త. వేదపఠనంలో ఘన జట వగైరా విధానాలున్నాయే -- ఘనాపాఠి, జటాంతస్వాధ్యాయి వగైరా మాటలు వినే ఉంటారు కదా -- ఆ విధానాలకు రూపకర్త రావణుడే‌ అంటారు. అంత గొప్పవాడు. ఐతేనేమి ఆరావణుడు పరాంగనాసుముఖదుర్వతకామ చరిత్రుడు. అందుకే ఆతప్పు చేసిచేసి చివరకు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళి రాముడి చేతిలో చచ్చాడు.  అలా ఈ పరాంగనావిముఖసువ్రతకామ అన్న సంబోధన ఈసంగతిని మనకు గుర్తు చేయటానికి వాడారనుకోవచ్చును.

ఆ రాముడు మనవాడే భద్రగిరి మీద విడిది చేసి ఉన్నాడు. ఆయన కరుణాపయోనిధి అనగా ఆయన దయలో సముద్రం వంటి వాడు.

8, మార్చి 2022, మంగళవారం

హరేరామ జైజై హరేకృష్ణ జైజై

హరేరామ జైజై హరేకృష్ణ జైజై
పరాత్పరా మునిజనభావితహరి జైజై
 
ధరాసుతామనోహరా హరేరామ జైజై 
సురాధినాథప్రస్తుతశుభవిక్రమ జైజై
నరాధినాథవందితచరణారవింద జైజై
పురాంతకాభినందిత హరేరామ జైజై

రావణాదిదనుజగణవిరామ రామ జైజై
పావనాతిపావనపదపంకేరుహ జైజై
శ్రీవిదర్భజార్చితపద శ్రీకృష్ణ జైజై
దేవ దుష్టరాక్షసాధీశనాశ జైజై
 
కరుణామయ జైజై కమలనయన జైజై
పరమపురుష జైజై భక్తపాల జైజై
నిరుపమాన జైజై నిరంజన జైజై
పరమేశ్వర జైజై పరంజ్యోతి జైజై

ఎంతచిత్రమో‌ కదా యీసంగతి

ఎంతచిత్రమో‌ కదా యీసంగతి
వింతగా రామకథ విధి లిఖించె
 
గద్దె కెక్కవలెను రేపు వాడనగా తండ్రి
వద్దు వాడడవికి పోవలెననె పినతల్లి
ముధ్దులసతి మాటలకు మూర్చిల్లె జనపతి
సద్దుచేయ డడవులకు జనెను శ్రీరాముడు

వద్దు నాకు గద్దె యనుచు వచ్చి భరతు డడిగె
గద్దె నీది పాలించగ కడగుమనె రాముడు
పెద్దగ వాదించి యతడు విభుని యొప్పించెను
ముద్దుగ నీపాదుకలు భూమినేలు ననుచు
 
ముద్దరాలు సీత నెత్తుకపోయినట్టి రావణుని
పెద్దయనిని చంపి సతితి విడిపించె రాముడు
పెద్దలు బ్రహ్మాదు లంతట వెన్నుడవు నీవనిన
పెద్దగ నచ్చెరువుపొందె విభుడు శ్రీరాముడు
 

రామా నమో పరంధామా నమో

రామా నమో పరంధామా నమో శుభ
నామా నమో ఘనశ్యామా నమో

నారాయణా మత్స్య కూర్మ వరాహ నరసింహ రూప నమో నమో
నారాయణా కశ్యపాత్మజ వామన నతబలిదైత్య నమోనమో
నారాయణా భృగునందన క్షత్రియనాశక రామ నమోనమో
నారాయణా రఘునందన సీతానాయక రామ నమో నమో
నారాయణా యదునందన కృష్ణా శూరజనేశ్వర నమో నమో
నారాయణా బుధ్ధ కల్కిస్వరూపా నళినదళేక్షణ నమో నమో

నారాయణా హరి కామారి నుత భవతారకనామ నమో నమో
నారాయణా జగదోధ్ధార సు‌‌రమునినాథవినుతభావ నమో నమో
నారాయణా పరమానందకంద నందనందన నమోనమో
నారాయణా జగదానందకారక నారకమోచన నమోనమో

నారాయణా కరుణాక‌‌‌ర శ్రీకర తారకనామ నమోనమో
నారాయణా భవదుఃఖవిమోచన నారదసన్నుత నమోనమో
నారాయణా సురవై‌రిగణాంతక కారణకారణ నమోనమో
నారాయణా పరమాత్మా దశ‌‌‌రథనందన రామ నమోనమో



7, మార్చి 2022, సోమవారం

దాశరథీ శతకం - 1


శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం 
గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు 
ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో 
త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 
 

ఈ పద్యం‌ నిండా సంబోధనలే 

శ్రీరఘురామ 
చారుతులసీదళదామ 
శమక్షమాదిశృంగారగుణాభిరామ 
త్రిజగన్నుతశౌర్యరమాలలామ 
దుర్వారకబంధరాక్షసవిరామ 
జగజ్జనకల్మషార్ణవోత్తారకనామ 
భద్రగిరి దాశరథీ 
కరుణాపయోనిధీ!

ఈ పద్యం అంతా శ్రీరామచంద్రుడిని సంబోధించుతూ నడుస్తోంది. ఈ సంబోధనలను మనం చక్కగా అర్ధం చేసుకుంటే అమృతతుల్యం ఐన దీనిలోని తీయందనం మన హృదయాలకు బాగా హత్తుకుంటుంది.

శ్రీరఘురామ అని పద్యాన్ని రామదాసు గారు ఎత్తుకున్నారు.

పద్యాన్నేమిటి లెండి,  ఈ శతకాన్నే రామదాసు గారు ఈసంబోధనతో ప్రారంభించారు.

రాముణ్ణి మనం రఘురాముడు అంటాం. రఘువీరుడు అంటాం. రాఘవుడు అంటాం. రఘుపుంగవుడు అంటాం. రాఘవేంద్రుడు, రఘునాథుడు ఇలా కూడా అంటాం. ఎందుకంటే ఆయన రఘువు అనే‌ మహానుభావుడి యొక్క వంశంలో జన్మించాడు కాబట్టి అని స్థూలంగా భావన. అదేమిటండీ రాముడు పుట్టింది సూర్యవంశంలో అంటారు కదా అని మీరనవచ్చును. అవును, రాములవారు పుట్టినది సూర్యవంశంలోనే. ఐనా అది రఘువంశం కూడా. అదెలా అని మీరు తప్పకుండా అడగుతారు.

రాముడి వంశానికి మూలపురుషుడు సూర్యభగవానుడి కుమారుడైన వైవస్వత మనువు. ఈ సూర్యుడంటే సమస్త భూమండలంలోని సమస్త జీవులకూ జీవన కారకుడు! ఆ వైవస్వతమనువు కుమారుడు ఇక్ష్వాకుడు. అందుచేత ఈవంశాన్ని ఇక్ష్వాకు వంశం అని కూడా అంటారు. రామదాసు గారే ఒక కీర్తనలో ఇక్ష్వాకుకులతిలక అని పిలిచారు రాముణ్ణి. గుర్తుచేసుకోండి.

ఈ వంశక్రమంలో 61వ మహారాజు రఘుమహారాజు. ఆయన కుమారుడు అజుడు. ఈ‌అజును కుమారుడు దశరథమహారాజు. దశరథుని కొడుకు కాబట్టి రాముణ్ణి దాశరథి అంటారు. అలా ఈరాముడు సూర్యవంశంలో 64వ వాడు.

రఘుమహారాజు గారు చాలా దొడ్డప్రభువు. అయనకు వచ్చిన కీర్తి కారణంగా వారిది రఘువంశం ఐనది.

ఒకసారి రామచంద్రుడు వశిష్టు మహాముని గారిని ఒక ప్రశ్న వేసాడు. మహాత్మా, మాది రఘువంశం అని పేరు. ఇప్పుడు నేను రావణాసురుణ్ణి చంపి లోకాలకు క్షేమం కలిగించానని దేవతలే పొగడుతున్నారు కదా. ఈ‌కారణంగా నానుండి ఈవంశానికి రామవంశం అని పేరువస్తుందా అని అడిగాడు. వశిష్టమహర్షి నవ్వి, అబ్బాయీ, మీవంశం రఘువంశంగానే నిలిచిపోతుందయ్యా అన్నాడు.

ఒకప్పుడు రఘుమహారాజు విశ్వజిత్తు అనే‌ యాగం చేసి సమస్తసంపదనూ‌ పంచిపెట్టేసాడు. ఇంక యజ్ఞపరిసమాప్తి కావస్తుండగా ఒక ముసలి బ్రాహ్మడు వచ్చి నాకొక దాసీ కావాలయ్యా, ఎవరూ అండలేని వాడిని, ఇంత ఉడకేసి పెట్టే దిక్కూ‌లేదు నాకు అని అర్ధించాడు.. 

దానికేం‌ భాగ్యం అని మహారాజు గారు అంతఃపురదాసీలను అందరినీ పిలిపించాడు.ఆ బ్రాహ్మడు అందరినీ దగ్గరగా వచ్చి చూచి చివరకు ఒకామెను చూపి ఈమెను ఇవ్వండి అన్నాడు.

అందరూ కొయ్యబారిపోయారు. ఆతను చూపించినది మహారాణిని.

కొంచెం కలకలం రేగటంతో ఆబ్రాహ్మడు ఏమి అని అడిగితే‌ దాసీలు విషయం చెప్పారు.

అయ్యో, నాకు చూపు సరిగా అనదు. అదీ కాక, నగానట్రా కూడా ఆట్టే లేక సాదా వస్త్రాలు ధరించి ఉంటే ఈమె కూడా దాసీ అనుకున్నాను మన్నించండి అన్నాడు బ్రాహ్మడు.

అయ్యయ్యో అదేమీ ఇబ్బంది కాదు. ఈమెను మీరు దాసీగా స్వీకరించండి అన్నాడు రఘుమహారాజు!
 
అప్పుడు ఆబ్రాహ్మడు నిజరూపం ధరించి, ఇంద్రుడిగా ప్రత్యక్షం అయ్యాడు. రఘుమహారాజును ఆశీర్వదించాడు. ఏమి దాతవయ్యా, ఇంక నీవంశం రఘువంశం అవుతుంది అని.

ఈకథను చెప్పి, రామా నీవు రఘుమహరాజు ఎంతటి దాతయో విన్నావు కదా, నువ్వే‌చెప్పు అన్నాడు వశిష్ఠుడు. రాముడు నవ్వి మాది ఎప్పటికీ‌ రఘువంశమే అన్నాడు.

ఆ రఘువు వంశంలో జన్మించి రాముడు రాఘువుడు అయ్యాడు. అందుకే ఈపద్యంలో రఘురామ అన్న సంబోధన.
 
మరొక సంబోధన ఈపద్యంలో చారుతులసీదళదామ అని. శ్రీమహావిష్ణువుకు తులసి అంటే‌ ప్రీతి. ఆయన అవతారం ఐన రాముడు తులసీదళాల మాలలు ధరించినవాడు.తులసి అంటే లక్ష్మియే.  
 
ప్రసీద దేవదేవేశి ప్రసీద హరివల్లభే 
క్షీరోదమాధనోద్భూతే తులసి త్వాం నమామ్యహమ్

అని తులసీ ధారణ శ్లోకం.

పూర్వం పురుషులు ముఖ్యంగా రాజులు పుష్పహారాలను ధరించటం అనేది ఉండేది. శ్రీరాముడు వనవాసం చేస్తున్న రోజుల్లో అమ్మవారు సీతమ్మ ఆయనకు తులసి మాలలు గ్రుచ్చి ఇస్తూ ఉండేదని ప్రతీతి. అమ్మవారు స్వయంగా ప్రీతితో గుచ్చిన దండలు బావుండవా యేమి. అందుకే చారు తులసీదళ దామాలు. చారు అంటే అందమైన అనీ, దామం అంటే మాల  అర్ధం సంస్కృతంలో.

ఇంకా రాముణ్ణి శమక్షమాదిశృంగారగుణాభిరాముడు అంటున్నారు. శృంగార అంటే చక్కని అని అర్ధం ఇక్కడ. మనస్సుకు ఆహ్లాదం కలిగించేది అన్న భావంలో. అయనకు ఉన్నవన్నీ‌ మంచి గుణాలే. అన్నీ మన మనస్సుకు సంతోషం కలిగించేవే. అయన గొప్ప శమం‌ అనే‌ గుణం కలవాడు. ఈ‌శమం అన్న మాటకి అర్ధం ఇంద్రియ నిగ్రహం. ముఖ్యంగా అంతరింద్రియ నిగ్రహం. ఎంత క్లిష్టపరిస్థితిలోనూ‌ మనస్సులో ఏవికారమూ లేక ధర్మం నుండి అంగుళం కూడా కదలకుండా ఉండే వాడు రాముడు. ఇక క్షమ అంటే తెలుసుగా. ఇతరులు తనపట్ల తప్పులు చేసినా, వాళ్ళు వచ్చి తప్పైపోయిందయ్యా మన్నించు అంటే‌ మంచులా కరిగిపోయి క్షమించేయటం రాముడికే చెల్లుతుంది.

కాకాసురుడి కథ అంటూ‌ ఒకటి ఉంది. సాక్షాత్తూ సీతమ్మవారే ఈకథని హనుమంతుడికి చెప్పి నన్ను చూసినట్లు ఈకథ చెప్తే రామయ్య నమ్ముతాడుపో అంటుంది. మీదిమీదికి వచ్చి సీతమ్మను ఒక కాకి రూపంలోని దుష్టుడు గాయపరచితే రాముడి వాడిమీద కోపించి బ్రహ్మాస్త్రం వేసాడు. దాన్నుండి కాపాడేవాళ్ళెవరూ లేరని తెలిసివచ్చి వాడు రామయ్య కాళ్ళమీద పడితే క్షమించేసాడు రాముడు. అంతదాకా ఎందుకూ? రావణుడు కాని వచ్చి క్షమించమంటే కూడా క్షమించటానికి తనకు అభ్యంతరం లేదని కూడా రామయ్య సెలవిచ్చాడు కదా! అదీ ఆయన ఉదారత. ఈవిధంగా రామయ్య వన్నీ మంచి గుణాలే. ఈముక్కని చెప్పటం ఎందుకూ అంటే మనబోటి వాళ్ళం ఎన్నో తప్పులు తెలిసీ తెలియకా చేస్తూనే ఉంటాం. మరీ యోగ్యులం ఐతే క్షమిస్తా రక్షిస్తా అని రామయ్య మడికట్టుకొని కూర్చోవటం లేదు. అయన మంచివాడు. మనం ఇంతవరకూ ఎలాంటి వాళ్ళమైనా శరణాగతులం ఐతే తప్పకుండా మనని రక్షించి తీరతాడు అని చెప్పటానికే రామదాసుగారు రామయ్యను శమక్షమాదిశృంగారగుణాభిరాముడని అనటం.

అయన, అంటే రాముడు త్రిజగన్నుతశౌర్యరమాలలాముడు. మీరు అష్టలక్ష్ములని వినే ఉంటారు. లక్ష్మి అంటేనే సౌభాగ్యం, సమృధ్ధి. ఏవిషయంలో ఐనా అలా ఉంటే అది తద్విషయకమైన లక్ష్మి. రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి ఇలా అనేకంగా చెప్పుకోవచ్చును.  రమ అంటే కూడా లక్ష్మి అనే అర్ధం. శౌర్యరమ అంటే ప్రతాపలక్ష్మి అన్నమాట. లాలామ అంటే స్త్రీ అని అర్ధం. రాముడి ప్రతాపాన్ని దేవతలే దిగివచ్చి మరో పొగిడారు. వాళ్ళూ వీళ్ళు పొగిడితేనే గొప్ప అనుకుంటామే, ఏకంగా బ్రహ్మ , గారూ, శివుడూ, ఇంద్రుడూ‌ వచ్చి పొగిడారు. అగ్నిదేవుడు పొగిడాడు. దశరథుడే వచ్చి ఆశీర్వదించాడు. ఇదీ రాముడి ప్రతాపానికి వచ్చిన ప్రశంశ. అన్నిలోకాల్లోనూ‌ ప్రతిష్ఠ ఉన్న మునులూ దేవతలూ పొగడ్డం సామాన్యం కాదు కదా. మూడులోకాల్లోనూ‌ పొగడిక వచ్చిన శ్రీరామచంద్రుడిని త్రిజగన్నుత శౌర్య రమాలలాముడు అన్నాడు రామదాసు.

దుర్వారకబంధరాక్షసవిరామ అని అన్నారు కదా, ఈ‌కబంధుడు ఎవరంటే వాడొక రాక్షసుడు అని ఈ‌సంబోధనలోనే‌ కబంధరాక్షస అని చెప్పారు కాని ఇంతకీ ఎవడు వీడు?  వీడు నిజానికి ఒక శాపగ్రస్తుడైన గంధర్వుడు. వికారమైన రాక్షసరూపంతో అడవిలో పడి ఉన్న వీడు సీతకోసం వెదకుతున్న రామలక్ష్మణులను పట్టుకుంటాడు. వాళ్ళు వాడి చేతులు నరికిపాడేస్తే శాపం పోయి తనవృత్తాంతం గుర్తుకు వస్తుంది. రామా నన్ను మీరు ఎంతకొట్టినా చావను. నన్ను ప్రాణాలతోనే గోతిలో‌పూడ్చి వేయండి అని అడుగుతాడు. అలా చేసిన పిదప వాడు స్వస్వరూపంతో స్వర్గానికి పోయాడు. యోజనం‌పొడుగు చాచగల చేతులతో కబంధుడు ఎలాంటి ప్రాణికీ తప్పించుకోలేని భయంకరమైన రాక్షసుడు. అంతే దుర్వారుడు అన్నారు. ఇదీ దుర్వారకబంధరాక్షస విరామ అనటంలో తాత్పర్యం. ఇక్కడ విరామం ఏమిటండీ అంటే వాడికి మంగళం పాడటమేను. అంటే చంపటం అన్నమాట.

జగజ్జనకల్మషార్ణవోత్తారకనామ అని ఒక కొంచెం జటిలమైన సంబోధన చేసారు.  ఇందులో జగత్తు అంటే ప్రపంచం ఉంది. జనం అంటే ప్రపంచప్రజల ప్రస్తావన ఉంది. కల్మషార్ణవం అంటే పాపసముద్రం ఉంది. తరణం అంటే దాటడం. ఇక్కడ ఉత్తారకం అంటే (సముద్రాన్ని) దాటించేది అన్న సూచన ఉంది. నామం అంటే‌ మరేమిటీ రామనామమే. కొంచెం అన్వయం చేసుకుందాం. ప్రపంచం ఉంది. దాన్నిండా జనం ఉన్నారు. వాళ్ళు పాపాలు చేస్తున్నారు. అసలీ ప్రపంచమే‌ ఒక పాపసముద్రం ఐపోయింది. దాన్ని దాటటం దాదాపు అసంభవం. ఎలా పడ్డారో వీళ్ళు ఇందులో పడ్డారు. అలుస్తున్నా, ఈ పాపసముద్రాన్ని ఈదటమే‌కాని దాటటం లేదు. దుర్లభం. పుణ్యం బ్రహ్మాండంగా ఉంటే స్వర్గమూ, పాపం విస్తారమైతే నరకమూ. మిశ్రమం ఐతే ఈప్రపంచంలో జన్మలెత్తి అనుభవిస్తూ ఉండటమూ. పాపాల వల్ల వల్లమాలిన బాధలు. అలాగని ప్రపంచం అనేదాన్ని దాటిపోలేరు. కానీ, ఈజనం రామనామం చేసారో, ఆపాపాల సముద్రాన్ని సుళువుగా దాటిపోతారండీ. ఇంక జన్మ ఎత్తే‌ పనే లేదు. అందుకై జగజ్జనకల్మషార్ణవోత్తారకనామ అని పొగడ్డం. అందుకే కదా రామనామాన్ని తారకనామం అంటారు. రాముడి నామాన్ని పొగడ్డం అన్నా రాముణ్ణి పొగడ్డం అన్నా ఒక్కటే. నామానికి, నామ్నికీ‌ అబేధం అని మర్చిపోకండి.

ఈ‌శతక మకుటం భ్రద్రగిరి దాశరథీ, కరుణాపయోనిధీ అన్న రెండు సంబోధనలతో ఉంది. భద్రగిరి దాశరథీ అంటే భద్రగిరి మీద విడిది చేసి  ఉన్న దాశరథీ అని అర్ధం. దాశరథీ అని అనటం గురించి మొదట్లోనే‌ చెప్పుకున్నాం కదా, దశరథుడి కొడుకు కాబట్టి అని. ఇది సంస్కృతభాషలో పధ్ధతి. దశరథుడి కొడుకు దాశరథి.ధృతరాష్ట్రుడి కొడుకు ధార్తరాష్ట్రుడు. కుంతి కొడుకు కౌంతేయుడు. ఇలాగు అన్నమాట.

కరుణాపయోనిధీ అంటే కరుణ అనే సముద్రం. పయోధి, పయోనిధి అన్నవి సముద్రానికి పర్యాయపదాలు. ఇక్కడ పయస్సు అంటే పాలు అనీ‌ నీరు అనీ రెండు రకాల అర్ధాలూ ఉన్నాయి సంస్కృతంలో. రాముణ్ణి కరుణాసముద్రుడు అని అనటం వినే‌ ఉంటారు కదా. ఇక్కడ కొంచెం అందంగా కరుణ అనే పాలసముద్రం అండీ‌ మా రాముడు అని చెప్పుకుందాం.

కొంచెం వివేచనగా మరొకసారి చూదాం.
 
శ్రీరఘురాముడు అనటం ద్వారా మహాదాత వంశంలో పుట్టి దాతృత్వం వారసత్వంగా కలవాడివి, మాకు నీదయతో మోక్షం అనేది దానంగా ఇవ్వు అని సూచించటం కనిపిస్తుంది.
 
చారుతులసీదళదాముడు అనటం ద్వారా విలాసవంతమైన పుష్పాలమాలలున్నా నీవు సువాసన ఉన్న తులసిని ఆకు ఐనా ఆదరించేవాడివి, సామాన్యులమైన మాలో మంచిని చూచి ఆదరించమనటం కనిపిస్తుంది.
 
శమక్షమాదిశృంగారగుణాభిరాముడు అనటం ద్వారా మాతప్పులను మన్నించే ఔదార్యం చూపమని అర్ధించటం సూచ్యంగా ఉంది.
 
త్రిజగన్నుతశౌర్యరమాలలామ అన్నప్పుడు నీశౌర్యం మమ్మల్ని పీడించే అరిషడ్వర్గంపైన నీ‌ప్రతాపం చూపమని సూచన ఉంది.

దుర్వారకబంధరాక్షసవిరామ. మనిషిలోని లోభమే కబంధుడు. అరిషడ్వర్గం రాక్షసమూకయే. రాక్షసులను విరచినట్లే మాలోపాలను విరచి మాకు స్వస్వరూపజ్ఞానం అనుగ్రహించమన్న ప్రార్ధన ఉంది.
 
జగజ్జనకల్మషార్ణవోత్తారకనామ అని చెప్పటం ద్వారా కల్మషపూరితమైన జగత్తు నుండి ఉద్దరించి మోక్షం ప్రసాదించమని అడగటం ఉంది.
 

సర్వమంగళాధవ శివ శంభో...శంభో


(Venkata Ramana యుట్యూచానెల్ నుండి)

సర్వమంగళాధవ శివ శంభో...శంభో
శర్వ శంకర  గిరీశ భవహర శంభో...శంభో

సకలైశ్వర్య ప్రద దేవ శంభో..శంభో
శకటాసురహరసఖ మహదేవ శంభో..శంభో

సరసీరుహదళశశివదనాంబక శంభో..శంభో
స్మరహర పాలక కపాలధర భవ శంభో..శంభో

సగుణోపాసకజనజయసులభ శంభో..శంభో
జగదుదయస్థితి సంహారకర శంభో..శంభో

చంద్రకళాధర వ్యాఘ్రాజినధర శంభో..శంభో
చంద్రచ్ఛవి నిర్జిత వృషవాహన శంభో..శంభో

శరణాగతజన రక్షణనియమ శంభో...శంభో
శరదంబుదనిభసుందరదేహ శంభో..శంభో

సామజ చర్మ విభాసిత చేల శంభో..శంభో
సామజ దనుజాంబుదవాతూల శంభో..శంభో

సలలిత నాగ విభూషణ పురహర శంభో..శంభో
సలిలవిభాస శిరోపరిభాగ శంభో..శంభో

సదమలభక్త వశీకృత హృదయ శంభో..శంభో
సదయావిరచిత దితిసుత విలయ శంభో..శంభో

జలజాతేక్షణ పూజిత చరణ శంభో..శంభో
జలనిధిభవ హాలాహల భక్షణ శంభో..శంభో

శౌరి గణేశ్వరతపనోమాన్విత శంభో..శంభో
సారస సంభవ జగన్నాధనుత శంభో..శంభో

సర్వమంగళాధవశివశంభో...శంభో
శర్వ శంకర  గిరీశ భవహర శంభో...శంభో

వేంకటరమణ యూట్యూబ్ ఛానెల్ చాలా బాగుంది. చక్కటి సంప్రదయ గీతాలతో ఈ ఛానెల్ వీనులవిందు చేస్తోంది.

5, మార్చి 2022, శనివారం

యుధ్ధానికీ‌ యుధ్ధానికీ మధ్య విరామం శాంతి


యుధ్ధం - శాంతి.

వ్యతిరేక పదాలు అని కొన్ని ఉంటాయి. వెలుగు - చీకటి, తెలుపు - నలుపు, సంతోషం - దుఃఖం ఇత్యాది బోలెడు ఉన్నాయి. కాస్త సమయం తీసుకొని మనలో ఎవరన్నా  సరే ఇలాంటివి బోలెడు పట్టీగా వేయగలరు. 

ఈపని ఎంతో కొంతగా చిన్నపిల్లలు కూడా చేయలరు.

అందుకే, పాఠశాల చదువులో కూడా ఇలా వ్యతిరేకపదాలను గూర్చి కూడా చెప్పటం ఉంటుంది. కనీసం మా చిన్నప్పుడు అలా ఉన్నదని గుర్తు.

యుధ్ధము - శాంతి అనేవి కూడా ఇలాంటి వ్యతిరేకపదాలే.

నిజానికి ప్రపంచంలో‌ ఎప్పుడు చూచినా ఏదో ఒక చోట చిన్నదో పెద్దదో యుధ్ధం జరుగుతూనే ఉంటుంది. కొత్తగా మొదలైనప్పుడో, తీవ్రత పెరిగి ప్రమాదం అంచుకు చేరినప్పుడో‌ తప్ప కొనసాగుతున్న యుధ్ధం గురించిన వార్త క్రమంగా అప్రధానం ఐపోతూ వస్తుంది. కాబట్టి దాన్ని ప్రపంచం‌ అంతగా పట్టించుకోదు. 

అవునుకదండీ. ఇద్దరు సామాన్యులు రోజుల తరబడీ తగాదా పడుతున్నా, కొట్లాడుకుంటున్నా అది ప్రపంచానికి పెద్ద వార్త కాదు. మహా ఐతే వారున్న పేటలో ఒకరోజు పాటు ఒక వార్త కావచ్చును.

కాని రెండు దేశాలు కొట్లాడుకుంటుంటే అది ప్రపంచం తప్పకుండా గమనించకుండా ఉండలేదు. ఏదో ఒక పూట వార్తగా విని ఊరుకోలేదు.

దేశాలమధ్య కొట్లాటను యుధ్ధం అంటారు. చిత్తం.

కాని తమాషా ఏమిటంటే నిత్యం ఎక్కడో‌ అక్కడ యుధ్ధం జరుగుతూనే ఉంటుందట!

యుధ్ధానికి వ్యతిరేక పదం‌ శాంతి అని కదూ చెప్పుకున్నాం? 

ఈ‌శాంతి అనే స్థితి ఉన్నట్లే‌ కనిపిస్తుంది కాని ప్రపంచంలో అది ఆట్టే నిలకడగా ఉండే పరిస్థితి కాదు.

వెలుతురు లేకపోవటమే‌ చీకటి. దుఃఖం లేకపోవటమే‌ సుఖం. ఇల్లాగు మనం వ్యతిరేక పదాల పధ్ధతిని అర్ధం చేసుకోవచ్చును. ఇదేం విశేషం కాదు.

అలాగే యుధ్ధం లేకపోవటమే శాంతి.

నిజానికి యుధ్ధానికీ‌ యుధ్ధానికీ మధ్య విరామం శాంతి.

ఆవిధంగా రెండవప్రపంచ యుధ్ధానికీ మూడవప్రపంచయుధ్ధానికీ‌ మధ్య నడుస్తున్న శాంతి కాలం ఇప్పటికి డబ్భైయేళ్ళుగా నడుస్తోంది.

కాని అది ఇంకెంత కాలమో నడిచేలా లేదు.

ఏకొట్లాటలో నైనా కొట్టుకొనే ఇద్దరి పక్షాన చుట్టుప్రక్కల వారు చేరి సమర్ధింపులు చేయటమూ చేతైనంతగా ఎగదోయటమూ చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ రష్యాదేశాల మధ్యన యుధ్ధం నడుస్తోంది.

ఇందులో రష్యన్ సామ్రాజ్యవాదాన్ని చూసే వాళ్ళూ, పుతిన్ గారు నయా హిట్లర్ అనే వాళ్ళూ బోలెడు మంది కనిపిస్తున్నారు.

అలాగే ఇందులో ఉక్రెయిన్ చేసిన మహాపరాధాల నెన్ని రంకెలు వేస్తున్న వాళ్ళూ బోలెడు మంది కనిపిస్తున్నారు.

తప్పెవడిదీ అన్నది వేరే సంగతి, ఇది ముదిరి మూడో‌ప్రపంచయుధ్ధంగా ఎక్కడ పరిణమిస్తుందో అనీ, ఆ వంకన అణుయుధ్ధానికి ఎక్కడ దారితీస్తుందో అనీ హడిలి చస్తున్న వాళ్ళు బోలెడు మంది కనిపిస్తున్నారు.

వార్త అన్నది వ్యాప్తిలోనికి వచ్చాక చర్చ జరుగుతుంది. అన్ని రకాల మాధ్యమాల్లోనూ‌ ఈచర్చ జరుగుతుంది. జరుగుతోంది కూడా.

బ్లాగుల్లో కూడా, రష్యాను వెనుకవేసుకొని వస్తున్నవారిని చూస్తున్నాను. రష్యాదే తప్పన్నవారినీ చూస్తున్నాను. నాకు అంత రాజకీయపరిజ్ఞానం లేదు. కాబట్టి ఎవరినీ మెచ్చుకోలేను, విమర్శించనూ లేను.

కాని అందరిలాగే ఈయుధ్ధం ముదరకుండా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నడుస్తున్న శాంతి కొనసాగాలని కోరుకుంటున్నాను.

సకలజగము లేలు వాడు జానకీవల్లభుడు

సకలజగము లేలు వాడు జానకీవల్లభుడు
సకలజనులు వెస వాని శరణువేడుడీ
 
ఈరాము డెవ్వడనుచు నెవ్వ రైన నడుగుదురా
ఈరాముని యుగములుగ నెఱుగును జగము
ఏరాముడు జగధ్ధితము కోరి ధరకు వచ్చినాడొ
ఆరాముని యెఱుగమనక కోరుడీ‌ శరణము
 
చేరి కొలుచు సురల దృష్టికి నారాయణ దేవుడు
ఆరయ యోగుల దృష్టికి నతడు బ్రహ్మము
శ్రీరాముని మించు వాడు సృష్టి నెట్లుండును
శ్రీరాముని యెఱుగమనక కోరుడీ‌ శరణము
 
శరణము కోరు వారి సకల భయలులు తొలగు
శరణము కోరు వారి జన్మ ధన్యము
శరణము కోరి రామచంద్రుని సేవించితే
నరులారా తరించెదరు శరణము కోరుడీ

 

శ్రీరామ రామ యని నో‌రారా పలుకరా నోరార యని హరిని చేరరా

శ్రీరామ రామ యని నో‌రారా పలుకరా
నోరార యని హరిని చేరరా

ఈనోరు పలుకనేల నెల్లప్పుడు ననృతముల
ఈనోరు పలుకనేల నెల్లప్పుడు ప్రల్లదముల
ఈనోరు రామనామ మేల పలుకదో
ఈనాటినుండి యైన నెంచి పలుకనీరా

ఈనోటికి హితవు కదా నెల్లపుడు షడ్రుచులు
ఈనోటికి రామనామ మేల అరుచి యైనది
దాని ముందమృతమైన తక్కువ కదరా
ఈనాటి నుండి అనుభవించి పొంగిపోరా
 
ఏనోటను రామనామ మెల్లప్పుడు పలుకునో
ఏనోటికి దాని కన్య మించుక రుచికాదో
ఆనోరే పరమపూత మాతడే‌ ధన్యుడౌ
ఈనాటి నుండి ప్రీతి నెల్లప్పుడు పలుకరా


3, మార్చి 2022, గురువారం

శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామా

శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామా

నారాయణా నీవు శ్రీరాముడను పేర ధారుణిం‌ బ్రభవించి నావయ్యా
వారిజాసను దొట్టి సురముఖ్య లర్ధింప వసుధపై ప్రభవించి నావయ్యా
 
కారుణ్యమూర్తివై మునియాగమును గావ ఘోరాటవుల జొచ్చినావయ్యా
ఘోరాకృతులు పాడు రాకాసు లట మూగ నారాచముల ద్రోలినావయ్యా

ఆపైన మిథిలలో హరుని వింటిని ద్రుంచి అవనిజాతను పొందినావయ్యా
కోపించి దుమికిన పరశురాము నెదిర్చి గొప్పపేరును పొందినావయ్యా
 
పిన్నమ్మ కైకమ్మ పొమ్మంచు సెలవీయ విపినభూముల కేగి నావయ్యా
వెన్నంటి యవనిజయు తమ్ముడౌ సౌమిత్రి వెంటరా నీవేగి నావయ్యా

అచట రావణు డనెడి రాక్షసేశ్వరుడు నీ‌యతివనే గొనిపోయినాడయ్యా
విచలించి రామయ్య సీతమ్మకై నీవు బిట్టుగా శోకించి నావయ్యా
 
నీబలం బెఱిగి సుగ్రీవుడను కపిరాజు నీకాప్తుడై నిలచినాడయ్యా
నీబంటు హనుమన్న చేరి లంకాపురి నీతన్వికై వెదకి నాడయ్యా
 
కపిసేనతో గూడి కడలినే కట్టి లంకాద్వీపమును బట్టి నావయ్యా
విపరీత బుధ్ధి రావణుని యుధ్ధమ్మునను విరచి యతివను కాచి నావయ్యా
 
ఆరావణుని చావు కెదురుచూచెడి సురల యానంద మింతింత కాదయ్యా
నారాయణా నీవు శ్రీరామ రూపమున నడిపించివి లీల యనిరయ్యా

శ్రీరాముడను నేను దశరథసుతుడను చిత్రంబు మీమాట లన్నావయా
చేరి సాకేతంబు లోకేశులు నుతింప సింహాసనం బెక్కి నావయ్యా

నీదివ్యచరితంబు పాడువా రందరకు నిత్యంబు శుభములే‌ కలిగేను
నీదివ్యనామంబు నిత్యంబు స్మరియింప నిక్కముగ మోక్షమే‌ కలిగేను


2, మార్చి 2022, బుధవారం

శ్రీవైష్ణవులలోన శివుడే పెద్ద

శ్రీవైష్ణవులలోన శివుడే పెద్ద
శ్రీవైష్ణవులలోన శివుడే దొడ్డ

శివుడు చేయుచునుండు శ్రీరామనామము
శివుడు కాడాయేమి శ్రీవైష్ణవుడు
ఎవరు రాముని మంత్ర మెంచిచేయుదురు కే
శవుని యానగ వారు చాల వైష్ణవులు

వాతలు పెట్టుకొన్న వైష్ణవు లగుదురె
ప్రీతితో పొగడక వెన్నుని భక్తుల
ప్రీతితో పొగడక మ్రొక్కక కొందరు ప్ర
ఖ్యాతిగ శ్రీహరుని గౌరవించెదరట
 
ఎవ్వాని శివుడని యెంచుచున్నారో
అవ్వాడె కేశవుం డని తెలియుడు
నవ్వుతాలుగ నాడి నారకమేగక మీ
రివ్వసుధ హరుహరుల నిర్వుర గొల్వుడు


శివశివ యనవే మనసా నీవు

శివశివ యనవే మనసా నీవు
శివుడా వాడెవ్వ డనకే నీవు
శివుడెక్కడా యని యనకే నీవు
శివుడే‌ కేశవు డెఱుగవె నీవు
శివమయ మని సర్వ మెంచవె నీవు
శివమయ మని జగ మెంచవె నీవు
శివమయ మని తను వెంచవె నీవు
శివునే తల్లిగ నెంచవె నీవు
శివునే తండ్రిగ నెంచవె నీవు
శివునే గురువుగ నెంచవె నీవు
శివభక్తకోటిని చేరవె నీవు
శివుని చేరగా తలచవె నీవు
శివుని యానతిని కోరవె నీవు
శివుని సన్నిధిని చేరవె నీవు
శివుని మ్రోల నిలుచుండవె నీవు
శివుని గని పరవశించవె నీవు
శివుని తత్త్వము నెంచవె నీవు
శివశివ శివశివ యనవే నీవు
శివుని పూజలు చేయవె నీవు
శివుని నామములు చెప్పవె నీవు
శివుని స్తోత్రములు చేయవె నీవు
శివుని పాటలు పాడవె నీవు
శివుని కరుణను కోరవె నీవు
శివుని వరములు కోరవె నీవు
శివుడే గురువని యెఱిగిన నీవు
శివుని వేడవే భవతారకము
శివుడిచ్చు నీకు భవతారకము
భవతారక మది రామమంత్రము
శివుని గొల్చెడు రాముని మంత్రము
శివుడు నిత్యము చేయు మంత్రము
శివుని కరుణచే చేకూరు సిధ్ధి
భవమిక లేనట్టి బ్రహ్మత్వ సిధ్ధి