యుధ్ధం - శాంతి.
వ్యతిరేక పదాలు అని కొన్ని ఉంటాయి. వెలుగు - చీకటి, తెలుపు - నలుపు, సంతోషం - దుఃఖం ఇత్యాది బోలెడు ఉన్నాయి. కాస్త సమయం తీసుకొని మనలో ఎవరన్నా సరే ఇలాంటివి బోలెడు పట్టీగా వేయగలరు.
ఈపని ఎంతో కొంతగా చిన్నపిల్లలు కూడా చేయలరు.
అందుకే, పాఠశాల చదువులో కూడా ఇలా వ్యతిరేకపదాలను గూర్చి కూడా చెప్పటం ఉంటుంది. కనీసం మా చిన్నప్పుడు అలా ఉన్నదని గుర్తు.
యుధ్ధము - శాంతి అనేవి కూడా ఇలాంటి వ్యతిరేకపదాలే.
నిజానికి ప్రపంచంలో ఎప్పుడు చూచినా ఏదో ఒక చోట చిన్నదో పెద్దదో యుధ్ధం జరుగుతూనే ఉంటుంది. కొత్తగా మొదలైనప్పుడో, తీవ్రత పెరిగి ప్రమాదం అంచుకు చేరినప్పుడో తప్ప కొనసాగుతున్న యుధ్ధం గురించిన వార్త క్రమంగా అప్రధానం ఐపోతూ వస్తుంది. కాబట్టి దాన్ని ప్రపంచం అంతగా పట్టించుకోదు.
అవునుకదండీ. ఇద్దరు సామాన్యులు రోజుల తరబడీ తగాదా పడుతున్నా, కొట్లాడుకుంటున్నా అది ప్రపంచానికి పెద్ద వార్త కాదు. మహా ఐతే వారున్న పేటలో ఒకరోజు పాటు ఒక వార్త కావచ్చును.
కాని రెండు దేశాలు కొట్లాడుకుంటుంటే అది ప్రపంచం తప్పకుండా గమనించకుండా ఉండలేదు. ఏదో ఒక పూట వార్తగా విని ఊరుకోలేదు.
దేశాలమధ్య కొట్లాటను యుధ్ధం అంటారు. చిత్తం.
కాని తమాషా ఏమిటంటే నిత్యం ఎక్కడో అక్కడ యుధ్ధం జరుగుతూనే ఉంటుందట!
యుధ్ధానికి వ్యతిరేక పదం శాంతి అని కదూ చెప్పుకున్నాం?
ఈశాంతి అనే స్థితి ఉన్నట్లే కనిపిస్తుంది కాని ప్రపంచంలో అది ఆట్టే నిలకడగా ఉండే పరిస్థితి కాదు.
వెలుతురు లేకపోవటమే చీకటి. దుఃఖం లేకపోవటమే సుఖం. ఇల్లాగు మనం వ్యతిరేక పదాల పధ్ధతిని అర్ధం చేసుకోవచ్చును. ఇదేం విశేషం కాదు.
అలాగే యుధ్ధం లేకపోవటమే శాంతి.
నిజానికి యుధ్ధానికీ యుధ్ధానికీ మధ్య విరామం శాంతి.
ఆవిధంగా రెండవప్రపంచ యుధ్ధానికీ మూడవప్రపంచయుధ్ధానికీ మధ్య నడుస్తున్న శాంతి కాలం ఇప్పటికి డబ్భైయేళ్ళుగా నడుస్తోంది.
కాని అది ఇంకెంత కాలమో నడిచేలా లేదు.
ఏకొట్లాటలో నైనా కొట్టుకొనే ఇద్దరి పక్షాన చుట్టుప్రక్కల వారు చేరి సమర్ధింపులు చేయటమూ చేతైనంతగా ఎగదోయటమూ చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ రష్యాదేశాల మధ్యన యుధ్ధం నడుస్తోంది.
ఇందులో రష్యన్ సామ్రాజ్యవాదాన్ని చూసే వాళ్ళూ, పుతిన్ గారు నయా హిట్లర్ అనే వాళ్ళూ బోలెడు మంది కనిపిస్తున్నారు.
అలాగే ఇందులో ఉక్రెయిన్ చేసిన మహాపరాధాల నెన్ని రంకెలు వేస్తున్న వాళ్ళూ బోలెడు మంది కనిపిస్తున్నారు.
తప్పెవడిదీ అన్నది వేరే సంగతి, ఇది ముదిరి మూడోప్రపంచయుధ్ధంగా ఎక్కడ పరిణమిస్తుందో అనీ, ఆ వంకన అణుయుధ్ధానికి ఎక్కడ దారితీస్తుందో అనీ హడిలి చస్తున్న వాళ్ళు బోలెడు మంది కనిపిస్తున్నారు.
వార్త అన్నది వ్యాప్తిలోనికి వచ్చాక చర్చ జరుగుతుంది. అన్ని రకాల మాధ్యమాల్లోనూ ఈచర్చ జరుగుతుంది. జరుగుతోంది కూడా.
బ్లాగుల్లో కూడా, రష్యాను వెనుకవేసుకొని వస్తున్నవారిని చూస్తున్నాను. రష్యాదే తప్పన్నవారినీ చూస్తున్నాను. నాకు అంత రాజకీయపరిజ్ఞానం లేదు. కాబట్టి ఎవరినీ మెచ్చుకోలేను, విమర్శించనూ లేను.
కాని అందరిలాగే ఈయుధ్ధం ముదరకుండా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నడుస్తున్న శాంతి కొనసాగాలని కోరుకుంటున్నాను.
True Indian non-aligned living in India unlike Indo Americans.
రిప్లయితొలగించండియుధ్ధానికీ యుధ్ధానికీ మధ్య విరామం శాంతి. -👌
రిప్లయితొలగించండిదశాబ్దాల వ్యవధిలో ప్రజల కష్టంతో అభివృద్ధి సాధించిన యుక్రేయిన్ దేశ నగరాల్లో కొన్ని రోజులలోనే ఎన్నో విధాలుగా విధ్వంసం జరగడం, దేశ ప్రజలు సంక్షోభంలో కూరుకుపోవడం తీవ్ర క్షోభ కలిగిస్తుంది. రష్యా పైన కూడా తీవ్ర ప్రభావం ఉండి తీరుతుంది. పెద్ద శక్తివంతమైన దేశాల మధ్య పోరులో చిన్న బలహీన దేశాలు నలిగి పోతాయి. అమెరికా నాటో కూటమిని రష్యా సరిహద్దుల దాకా విస్తరిస్తూ పోవడం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. అమెరికా యూరప్ దేశాల కూటమి రష్యా చైనా కూటమి మధ్య జరిగే ఆధిపత్య పోరు ఏ పరిణామాలకు దారి తీస్తుందో ? త్వరలో యుద్ధం ముగిసి పోవాలని ప్రపంచ దేశాల ప్రజలు కోరుకుంటున్నారు.