9, మార్చి 2022, బుధవారం

దాశరథీశతకం - 2


రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ 
స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద 
శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో 
ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 
 
 
ఈ పద్యం కూడా అన్నీ‌ సంబోధనలతో‌ నడుస్తోంది.
రామ 
విశాలవిక్రమపరాజితభార్గవరామ 
సద్గుణస్తోమ 
పరాంగనావిముఖసువ్రతకామ 
వినీలనీరదశ్యామ 
కకుత్స్థవంశకలశాంబుధిసోమ 
సురారిదోర్బలోద్దామవిరామ 
భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
 
విశాలవిక్రమపరాజితభార్గవరామ  అనే సంబోధనకు అర్ధం పరాక్రమంతో‌ పరశురాముణ్ణి జయించిన వాడా అని. రాముడు శివుడి వింటిని ఎక్కుపెట్టబోతే అది కాస్తా విరిగింది. ఆ విరగటంతో వచ్చిన చప్పుడు ఎంత దారుణంగా ఉందంటే సభలో ఉన్నవాళ్ళందరూ మూర్చబోయారు దాన్ని తట్టుకోలేక. కొధ్ధిమంది మాత్రం‌ నిబ్బరంగా ఉండగలిగారంతే. వాళ్ళెవరంటే విశ్వామిత్రమహర్షి, లక్ష్మణస్వామి వారు, జనకమహారాజు గారు మాత్రమే.  శివుడు విల్లా మజాకానా! సీతారామకళ్యాణం‌ జరిగింది. మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళ పెళ్ళిళ్ళూ అయ్యాయి. ఈశివధనుర్భంగ వార్తకు కోపించి పరశురాముడు వచ్చాడు. నువ్వెవడివిరా ఇంకొక రాముడివీ, ఈ జమదగ్ని కొడుకు రాముడుండగానూ! నాగురువుగారు శివుడి విల్లు పొగరుగా విరగ్గొట్టి ప్రతాపం చూపుతావా? అని గర్జించి, చేతనైతే ఈవిష్ణు ధనస్సును ఎక్కుపెట్టరా చూదం అని విష్ణుధనస్సును ఇచ్చాడు. రాముడు సవినయంగానే ఆవిల్లు అందుకొని బాణం ఎక్కుపెట్టాడు. పైగా పరశురాముడితో ఒక ముక్క అన్నాడు. రాముడు ఉత్తినే ఏపనీ చేయడు. ఇప్పుడు చెప్పు ఈబాణాన్ని ఎక్కడ విడిచేదీ? నీకు సులభంగా సిధ్ధగమనంతో‌ ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తిని కొట్టేయనా, నీవు తపస్సుతో సంపాదించుకొన్న పుణ్యలోకాలను కొట్టెయ్యనా? అని. రాముడు విష్ణుధనస్సుని ఎక్కుపెట్టి ఇలా అంటూ‌ ఉండగా అకాశంలో నిలచి దేవతలంతా మహోత్సాహంతో చూసారు. పరశురాముడిలోని విష్ణుతేజం రాముడిని చేరుకున్నది. ఆయన విష్ణువు యెక్క ఆవేశావతారం కదా. పరశురాముడు చిరజీవిని, అపుణ్యలోకాలతో నాకు పనిలేదు వాటిని కొట్టేయవయ్యా నాగమనశక్తిని కొట్టవద్దు. ఎందుకంటే‌ ఈభూమినంతటినీ‌ ఒకప్పుడు నేను జయించి కశ్యపుడికి దానం చేసేశాను. అందుచేత భూమిమీద రాత్రి నేను నిలువరాదు అన్నాడు. అలాగు పరశురాముడిని రాముడు తన బాహు విక్రమంతో జయించాడు. ఈ‌కథను గుర్తుచేయటానికే విశాలవిక్రమపరాజితభార్గవరామ అన్నారు రామదాసు గారు. 
 
ఇక్కడొక చమత్కారం ఉంది విశాలవిక్రమపరాజితభార్గవరామ అన్నదిరెండుసంబోధనలుగా విడదీయవచ్చును. 
విశాలవిక్రమ
పరాజితభార్గవరామ 
అని
విశాలవిక్రమ అంటే త్రిలోకాలలోనూ ప్రఖ్యాతమైన పరాక్రమం కలవాడా అని అర్ధం.  ఈసంబోధనకు సమర్ధనగా కాకాసురవృత్తాంతాన్ని గుర్తుచేసుకుందాం. ఈ కాకాసురుడు అనే వాడు, సీతమ్మ జోలికి పోయి రాముడి బ్రహ్మాస్త్రానికి గురైనాడు. వాడు ప్రాణభయంతో రక్షించేవాడిని వెతుక్కుంటూ‌ మూడులోకాలూ తిరిగి అలసిపోయాడే కాని, రాముడి అస్త్రాన్నుండి మేము కాపాడగలం అన్న మొనగాణ్ణీ ఎవణ్ణీ చూడలేదు. చివరకు రాముడే అనుగ్రహించవలసి వచ్చింది శరణు మహాప్రభో అని ఆ రాముడి కాళ్ళమీద పడ్దాక.
 
పరాజితభార్గవరామ అన్న సంబోధనకు మనం అర్ధం చెప్పుకోవటం జరిగింది కదా.

రాముణ్ణి సద్గుణస్తోమ అని పిలుస్తున్నాడు రామదాసు. స్తోమం అంటే‌ సమూహం. సద్గుణాల పుట్ట అట రాముడు. అసలు రామాయణ కావ్యారంభం అన్నది ఇలా సద్గుణాల పుట్ట ఐన వాడు ఎవడన్నా ఉన్నాడా అని నారదులవారిని వాల్మీకి మహర్షి అడగటంతోనే కదండీ ప్రారంభం ఐనదీ? ఆ నారదులవారేమే నువ్వన్న సద్గుణాలన్నీ కూడా రాముడికే ఉన్నాయీ‌ అని చెప్పి రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పారు వాల్మీకికి. ఆ దరిమిలా ఆ రామకథనే బ్రహ్మగారి వరప్రభావంతో సంపూర్ణంగా దర్శిస్తూ మహత్తర కావ్యంగా వాల్మీకి విరచించారు ఆదికావ్యం రామాయణాన్ని. రాముడెంత సద్గుణవంతుడూ అంటే రాక్షసుడైన మారీచుడే‌ రామో విగ్రహవాన్ ధర్మః అని చెప్పాడు. ధర్మమే రాముడి స్వరూపం. ఆయన మాటా బాటా అందరికీ ఆదర్శం కదా యుగయుగాలకూను. అంత సద్గుణశాలి రాముడు.

పరాంగనావిముఖసువ్రతకామ అన్న మంచి సంబోధన ఒకటి ఇందులో ఉంది.  పరాంగనలు అంటే ఇతరుల భార్యలు. ఇతరుల భార్యల పట్ల వైముఖ్యం కలవాడు అని చెప్పటమూ‌ అది ఒక సువ్రతం అనగా మంచి వ్రతం అని ఒక కితాబు ఇవ్వటమూ పైగా రాముడికి అట్లా ఇతరుల భార్యల పట్ల వైముఖ్యం కలిగి ఉండటం చాలా ఇష్టం‌ అని చెప్పటమూ ఈసంబోధన ద్వారా తెలుస్తోంది. రాముడి జీవితంలో పెళ్ళి చేసుకోమని వెంటబడ్డది ఒక్క శూర్పణఖ మాత్రం‌ కనిపిస్తుంది. అందమైన స్త్రీగా వచ్చినది ఒక రాక్షసి అని రాముడు గ్రహించాడా లేదా అన్నది ప్రక్కనబెడితే ఆయన మాత్రం నేను ఏకపత్నీవ్రతుణ్ణి, అవతలికి పో అనేశాడు. పరాంగనలను రాముడు కన్నెత్తి చూసే వాడు కాదు. ఆమాటకు వస్తే లక్ష్మన్న కూడా అంతే! ఆయన సీతమ్మ పాదాలనే‌ కాని ముఖం చూసి ఎన్నడూ మాట్లాడనే లేదు.

వినీలనీరదశ్యామ అనేముక్కకు అర్ధం చూదాం. నీరదం అంటే మేఘం. నీరములు అనగా నీళ్ళను ఇచ్చునది కాబట్టి నీరదం అని విగ్రహవాక్యం. శరత్కాలంలోని దూదిపింజెల్లాంటి మేఘాలు తెల్లగా ఉంటాయి కాని నీళ్ళను క్రుమ్మరించే‌ శ్రావణమేఘాలు అదొక తమాషా నలుపు రంగులో ఉంటాయి. సంస్కృతభాషలో నీలం అన్న ముక్కకి నలుపు అని అర్ధం. తెలుగులో నీలం అంటే నలుపన్న అర్ధం లేదు, అది వేరే రంగు. విష్ణువు నీలం అన్నారు కదా అని మన నాటకాలవాళ్ళూ బొమ్మలు వేసే వాళ్ళూ ఆయనకు సంస్కృత నీలవర్ణం బదులు తెలుగు నీలంరంగు వేసేసారు. సాక్షాత్తూ రాయల్ బ్లూ ఇంక్‌ పీపాలో ముంచి తీసారు. అన్నట్లు వినీల అన్నారు కదా, వినీల అంటే మరేమీ లేదు మంచి నీలవర్ణం అని అనగా దట్టమైన కారుమబ్బు రంగట! రాముడూ‌ కృష్ణుడూ కూడా ఒకే రంగు. అన్నట్లు అర్జునుడూ అదే‌ రంగు. ఒక సందర్భంలో అర్జునుడే‌ అంటాడు నేనూ కృష్ణుడూ తప్ప ఈశరరవర్ణంలో లోకంలో మరెవ్వరూ ఉండరు అని.

కకుత్స్థవంశకలశాంబుధిసోమ అన్న సంబోధన రాముడి వంశాన్ని స్మరించె చెప్పేది. రాముడిది కకుత్స్థవంశం. ఇక్ష్వాకుడి కొడుకు కుక్షి.  అ కుక్షి కొడుకు వికుక్షి. ఒకసారి దేవతల తరపున రాక్షసులతో యుధ్ధంచేసినప్పుడు, ఈవికుక్షికి ఇంద్రుడే ఒక ఎద్దు రూపంలో వాహనం అయ్యాడట. అప్పటినుండి అతనికి కకుత్స్థుడు అనీ‌ ఇంద్రవాహనుడు అనీ బిరుదులు వచ్చాయి. వంశాన్ని సముద్రంతో పోల్చి, ఆ సముద్రుడికి చంద్రుడిలాగా ఫలాని వంశసముద్రానికి నీవు చంద్రుడివి అని ప్రశంసించటం సంప్రదాయం. రాముడు అలా కకుత్స్థుఁడి వంశ సముద్రానికి చంద్రుడు అని చెప్తున్నారు రామదాసు గారు.

ఇక సురారిదోర్బలోద్దామవిరామ అన్న సంబోధన ఉంది. సురారులు అటే సురలకు అరులు, అరి శబ్దానికి అర్ధం శత్రువు అని. సురలంటే‌ దేవతలు కాబట్టి సురారులు అంటే‌ రాక్షసులు. అ రాక్షసులకు రాముడు విరాముడట అనగా మంగళం పాడినవాడు. చంపిపారేసినవాడు. అల్లాటప్పా రాక్షసులను చంపితే గొప్పేమీ? ఆ రాక్షసులను దేవతలు చంపలేకపోతే రాముడూ చంపాడంటే వాళ్ళెలాంటి వాళ్ళూ? దోర్బలోద్దాములు అట. అంటే పట్టపగ్గాలు లేని భుజబలం కలవారు. దేవతలనె గడగడలాడించిన వారు. వాళ్ళ పనిపట్టినవాడు రాముడు అని రామదాసుగారు పొగడుతున్నారు.
 
ఒక చిన్న సంగతి. రాముడు పరాంగనావిముఖసువ్రతకాముడు అన్నారు.ఇందులో ఏమి విశేషం ఉందీ అనపించవచ్చును. రామచంద్రుడు రామాయణమహాకావ్యంలో నాయకుడు. అయన పరాంగనావిముఖసువ్రతకామ చరిత్రుడు. ఆ కావ్యంలోని ప్రతినాయకుడు రావణుడు. అతగాడు కూడా మహాతేజస్వి. గొప్ప పరాక్రమం కలవాడు. దేవతలకే అసాధ్యుడు. మహాశివభక్తుడు. వేదవేత్త. వేదపఠనంలో ఘన జట వగైరా విధానాలున్నాయే -- ఘనాపాఠి, జటాంతస్వాధ్యాయి వగైరా మాటలు వినే ఉంటారు కదా -- ఆ విధానాలకు రూపకర్త రావణుడే‌ అంటారు. అంత గొప్పవాడు. ఐతేనేమి ఆరావణుడు పరాంగనాసుముఖదుర్వతకామ చరిత్రుడు. అందుకే ఆతప్పు చేసిచేసి చివరకు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళి రాముడి చేతిలో చచ్చాడు.  అలా ఈ పరాంగనావిముఖసువ్రతకామ అన్న సంబోధన ఈసంగతిని మనకు గుర్తు చేయటానికి వాడారనుకోవచ్చును.

ఆ రాముడు మనవాడే భద్రగిరి మీద విడిది చేసి ఉన్నాడు. ఆయన కరుణాపయోనిధి అనగా ఆయన దయలో సముద్రం వంటి వాడు.