10, మార్చి 2022, గురువారం

రామా రామా రాజీవానన రావయ్యా రామా

రామా రామా రాజీవానన రావయ్యా రామా
ఏమాత్రము నేతాళలేనని యెంచుము శ్రీరామా

ఎన్నడైన నే మరచియుంటినా నిన్ను మహాత్మా రామా
ఎన్ని జన్మలుగ కొలుచుచుంటినో యెఱుగుదు వీవే రామా 
నిన్నేనమ్మితి సన్నుతాంగ హరి నీరజనయనా రామా 
నన్నెప్పటికిక గట్టెక్కింతువు నారాయణ హరి రామా 
 
వేనవేలుగా తనువుల దాల్చితి వేదన లందితి రామా
ఏనాటికి నను దయజూచెదవో యినకులతిలకా రామా
దీనులపాలిటి కల్పవృక్షమవు దిక్కువు నాకు రామా
నేనెంతగ మొఱబెట్టిన వినవిది నీకు న్యాయమా రామా

భయములు పెక్కులు కలుగుచున్నవి భండనభీమా రామా
జయశీలుడవని నమ్మితినే యిటు జరుగవచ్చునా రామా 
దయగలవాడవు నీవని నేను తరచుగ విందును రామా
దయగలవాడవు నీవైతే నను దయజూడవయా రామా
 
మరుజన్మంబున నరుడనగుదునను మాటసత్యమా రామా
నరుడనైనను నీనామంబును మరచెదనేమో రామా
పరమార్తుడ నిను వేడుకొందును వలదిక జన్మము రామా
కరుణను నాభవబంధంబులను ఖండింపవయా రామా

తప్పులు చేయని నరుడున్నాడా ధరణీతలమున రామా
తప్పులు గలవని నాపై నీవు తామసింపకుము రామా
ఒప్పుగ నిదె నీ సన్నిధిచేరి యుంటిని కదరా రామా
తప్పుల నెన్నక నాపై నీవు దయచూపవయా రామా