16, మార్చి 2022, బుధవారం

ఇంటిపని అని బోలె డున్నాదిరా అది ఎంతచేసిన తరుగకున్నాదిరా

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుటనే చిత్తంబులో మానకున్నానురా
ఓరామ నీచిత్త మిక నెట్టులున్నదో ఆరీతిగా నింక నడిపించరా  
 
ఇంటిపని అని బోలె డున్నాదిరా అది ఎంతచేసిన తరుగకున్నాదిరా
ఇంటిదని ఒక సుదతి యున్నాదిరా అది ఎంతతెచ్చిన మెచ్చకున్నాదిరా
 
బిడ్దలని ఒక కొందరున్నారురా వార లడ్డదిడ్డము లాడుచున్నారురా
దొడ్దప్రభువులు కొందరున్నారురా వార లడ్డమైన మాట లాడేరురా

మరి మిత్రులని కొందరున్నారురా వారు మనవద్ద నెంతసే పుంటారురా
ఇరుగుపొరుగని కొందరున్నారురా వారు పరుషంబులే తరచు పలికేరురా
 
బంధుబలగము మిక్కి లున్నాదిరా నాకు వారునా వారెప్పు డైనారురా
బంధాలు పదిలక్ష లున్నాయిరా వాటి బాధనే పడలేక యున్నానురా
 
అందమైన లోక మంటారురా దీని యందాలు గొప్పలే మున్నాయిరా
బందిఖానావంటి యిల్లుందిరా యందు బందీగ నే జిక్కియున్నానురా
 
శాస్త్రంబులని చాల యున్నాయిరా నేను చదివిచచ్చిన దేమి యున్నాదిరా
శాస్త్రంబు లటులుంచి చదువుసంధ్య లంటి చచ్చిన దేమంత యున్నాదిరా
 
మిడిమిడి జ్ఞానంబు మెట్టవేదాంతంబు మించి తెలి వేమంత యున్నాదిరా
వడివడిగ వయ సుడిగిపోవుచున్నది కాని బ్రతుకున సుఖమన్నదే లేదురా

సంసార మిటువంటి దని తెలియక నేను సంసారమున చిక్కు కున్నానురా
హింసించు చున్నదీ సంసార మిక దీని నెంత మాత్రము తాళగాజాలరా
 
హరిహరి నీవొకడ వున్నావురా చాలు నన్నిటను తోడుగా నున్నావురా
మరి నీదు తారకమంత్రంబునే నేను మానక చేయుచు నున్నానురా