7, మార్చి 2022, సోమవారం

దాశరథీ శతకం - 1


శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం 
గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు 
ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో 
త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 
 

ఈ పద్యం‌ నిండా సంబోధనలే 

శ్రీరఘురామ 
చారుతులసీదళదామ 
శమక్షమాదిశృంగారగుణాభిరామ 
త్రిజగన్నుతశౌర్యరమాలలామ 
దుర్వారకబంధరాక్షసవిరామ 
జగజ్జనకల్మషార్ణవోత్తారకనామ 
భద్రగిరి దాశరథీ 
కరుణాపయోనిధీ!

ఈ పద్యం అంతా శ్రీరామచంద్రుడిని సంబోధించుతూ నడుస్తోంది. ఈ సంబోధనలను మనం చక్కగా అర్ధం చేసుకుంటే అమృతతుల్యం ఐన దీనిలోని తీయందనం మన హృదయాలకు బాగా హత్తుకుంటుంది.

శ్రీరఘురామ అని పద్యాన్ని రామదాసు గారు ఎత్తుకున్నారు.

పద్యాన్నేమిటి లెండి,  ఈ శతకాన్నే రామదాసు గారు ఈసంబోధనతో ప్రారంభించారు.

రాముణ్ణి మనం రఘురాముడు అంటాం. రఘువీరుడు అంటాం. రాఘవుడు అంటాం. రఘుపుంగవుడు అంటాం. రాఘవేంద్రుడు, రఘునాథుడు ఇలా కూడా అంటాం. ఎందుకంటే ఆయన రఘువు అనే‌ మహానుభావుడి యొక్క వంశంలో జన్మించాడు కాబట్టి అని స్థూలంగా భావన. అదేమిటండీ రాముడు పుట్టింది సూర్యవంశంలో అంటారు కదా అని మీరనవచ్చును. అవును, రాములవారు పుట్టినది సూర్యవంశంలోనే. ఐనా అది రఘువంశం కూడా. అదెలా అని మీరు తప్పకుండా అడగుతారు.

రాముడి వంశానికి మూలపురుషుడు సూర్యభగవానుడి కుమారుడైన వైవస్వత మనువు. ఈ సూర్యుడంటే సమస్త భూమండలంలోని సమస్త జీవులకూ జీవన కారకుడు! ఆ వైవస్వతమనువు కుమారుడు ఇక్ష్వాకుడు. అందుచేత ఈవంశాన్ని ఇక్ష్వాకు వంశం అని కూడా అంటారు. రామదాసు గారే ఒక కీర్తనలో ఇక్ష్వాకుకులతిలక అని పిలిచారు రాముణ్ణి. గుర్తుచేసుకోండి.

ఈ వంశక్రమంలో 61వ మహారాజు రఘుమహారాజు. ఆయన కుమారుడు అజుడు. ఈ‌అజును కుమారుడు దశరథమహారాజు. దశరథుని కొడుకు కాబట్టి రాముణ్ణి దాశరథి అంటారు. అలా ఈరాముడు సూర్యవంశంలో 64వ వాడు.

రఘుమహారాజు గారు చాలా దొడ్డప్రభువు. అయనకు వచ్చిన కీర్తి కారణంగా వారిది రఘువంశం ఐనది.

ఒకసారి రామచంద్రుడు వశిష్టు మహాముని గారిని ఒక ప్రశ్న వేసాడు. మహాత్మా, మాది రఘువంశం అని పేరు. ఇప్పుడు నేను రావణాసురుణ్ణి చంపి లోకాలకు క్షేమం కలిగించానని దేవతలే పొగడుతున్నారు కదా. ఈ‌కారణంగా నానుండి ఈవంశానికి రామవంశం అని పేరువస్తుందా అని అడిగాడు. వశిష్టమహర్షి నవ్వి, అబ్బాయీ, మీవంశం రఘువంశంగానే నిలిచిపోతుందయ్యా అన్నాడు.

ఒకప్పుడు రఘుమహారాజు విశ్వజిత్తు అనే‌ యాగం చేసి సమస్తసంపదనూ‌ పంచిపెట్టేసాడు. ఇంక యజ్ఞపరిసమాప్తి కావస్తుండగా ఒక ముసలి బ్రాహ్మడు వచ్చి నాకొక దాసీ కావాలయ్యా, ఎవరూ అండలేని వాడిని, ఇంత ఉడకేసి పెట్టే దిక్కూ‌లేదు నాకు అని అర్ధించాడు.. 

దానికేం‌ భాగ్యం అని మహారాజు గారు అంతఃపురదాసీలను అందరినీ పిలిపించాడు.ఆ బ్రాహ్మడు అందరినీ దగ్గరగా వచ్చి చూచి చివరకు ఒకామెను చూపి ఈమెను ఇవ్వండి అన్నాడు.

అందరూ కొయ్యబారిపోయారు. ఆతను చూపించినది మహారాణిని.

కొంచెం కలకలం రేగటంతో ఆబ్రాహ్మడు ఏమి అని అడిగితే‌ దాసీలు విషయం చెప్పారు.

అయ్యో, నాకు చూపు సరిగా అనదు. అదీ కాక, నగానట్రా కూడా ఆట్టే లేక సాదా వస్త్రాలు ధరించి ఉంటే ఈమె కూడా దాసీ అనుకున్నాను మన్నించండి అన్నాడు బ్రాహ్మడు.

అయ్యయ్యో అదేమీ ఇబ్బంది కాదు. ఈమెను మీరు దాసీగా స్వీకరించండి అన్నాడు రఘుమహారాజు!
 
అప్పుడు ఆబ్రాహ్మడు నిజరూపం ధరించి, ఇంద్రుడిగా ప్రత్యక్షం అయ్యాడు. రఘుమహారాజును ఆశీర్వదించాడు. ఏమి దాతవయ్యా, ఇంక నీవంశం రఘువంశం అవుతుంది అని.

ఈకథను చెప్పి, రామా నీవు రఘుమహరాజు ఎంతటి దాతయో విన్నావు కదా, నువ్వే‌చెప్పు అన్నాడు వశిష్ఠుడు. రాముడు నవ్వి మాది ఎప్పటికీ‌ రఘువంశమే అన్నాడు.

ఆ రఘువు వంశంలో జన్మించి రాముడు రాఘువుడు అయ్యాడు. అందుకే ఈపద్యంలో రఘురామ అన్న సంబోధన.
 
మరొక సంబోధన ఈపద్యంలో చారుతులసీదళదామ అని. శ్రీమహావిష్ణువుకు తులసి అంటే‌ ప్రీతి. ఆయన అవతారం ఐన రాముడు తులసీదళాల మాలలు ధరించినవాడు.తులసి అంటే లక్ష్మియే.  
 
ప్రసీద దేవదేవేశి ప్రసీద హరివల్లభే 
క్షీరోదమాధనోద్భూతే తులసి త్వాం నమామ్యహమ్

అని తులసీ ధారణ శ్లోకం.

పూర్వం పురుషులు ముఖ్యంగా రాజులు పుష్పహారాలను ధరించటం అనేది ఉండేది. శ్రీరాముడు వనవాసం చేస్తున్న రోజుల్లో అమ్మవారు సీతమ్మ ఆయనకు తులసి మాలలు గ్రుచ్చి ఇస్తూ ఉండేదని ప్రతీతి. అమ్మవారు స్వయంగా ప్రీతితో గుచ్చిన దండలు బావుండవా యేమి. అందుకే చారు తులసీదళ దామాలు. చారు అంటే అందమైన అనీ, దామం అంటే మాల  అర్ధం సంస్కృతంలో.

ఇంకా రాముణ్ణి శమక్షమాదిశృంగారగుణాభిరాముడు అంటున్నారు. శృంగార అంటే చక్కని అని అర్ధం ఇక్కడ. మనస్సుకు ఆహ్లాదం కలిగించేది అన్న భావంలో. అయనకు ఉన్నవన్నీ‌ మంచి గుణాలే. అన్నీ మన మనస్సుకు సంతోషం కలిగించేవే. అయన గొప్ప శమం‌ అనే‌ గుణం కలవాడు. ఈ‌శమం అన్న మాటకి అర్ధం ఇంద్రియ నిగ్రహం. ముఖ్యంగా అంతరింద్రియ నిగ్రహం. ఎంత క్లిష్టపరిస్థితిలోనూ‌ మనస్సులో ఏవికారమూ లేక ధర్మం నుండి అంగుళం కూడా కదలకుండా ఉండే వాడు రాముడు. ఇక క్షమ అంటే తెలుసుగా. ఇతరులు తనపట్ల తప్పులు చేసినా, వాళ్ళు వచ్చి తప్పైపోయిందయ్యా మన్నించు అంటే‌ మంచులా కరిగిపోయి క్షమించేయటం రాముడికే చెల్లుతుంది.

కాకాసురుడి కథ అంటూ‌ ఒకటి ఉంది. సాక్షాత్తూ సీతమ్మవారే ఈకథని హనుమంతుడికి చెప్పి నన్ను చూసినట్లు ఈకథ చెప్తే రామయ్య నమ్ముతాడుపో అంటుంది. మీదిమీదికి వచ్చి సీతమ్మను ఒక కాకి రూపంలోని దుష్టుడు గాయపరచితే రాముడి వాడిమీద కోపించి బ్రహ్మాస్త్రం వేసాడు. దాన్నుండి కాపాడేవాళ్ళెవరూ లేరని తెలిసివచ్చి వాడు రామయ్య కాళ్ళమీద పడితే క్షమించేసాడు రాముడు. అంతదాకా ఎందుకూ? రావణుడు కాని వచ్చి క్షమించమంటే కూడా క్షమించటానికి తనకు అభ్యంతరం లేదని కూడా రామయ్య సెలవిచ్చాడు కదా! అదీ ఆయన ఉదారత. ఈవిధంగా రామయ్య వన్నీ మంచి గుణాలే. ఈముక్కని చెప్పటం ఎందుకూ అంటే మనబోటి వాళ్ళం ఎన్నో తప్పులు తెలిసీ తెలియకా చేస్తూనే ఉంటాం. మరీ యోగ్యులం ఐతే క్షమిస్తా రక్షిస్తా అని రామయ్య మడికట్టుకొని కూర్చోవటం లేదు. అయన మంచివాడు. మనం ఇంతవరకూ ఎలాంటి వాళ్ళమైనా శరణాగతులం ఐతే తప్పకుండా మనని రక్షించి తీరతాడు అని చెప్పటానికే రామదాసుగారు రామయ్యను శమక్షమాదిశృంగారగుణాభిరాముడని అనటం.

అయన, అంటే రాముడు త్రిజగన్నుతశౌర్యరమాలలాముడు. మీరు అష్టలక్ష్ములని వినే ఉంటారు. లక్ష్మి అంటేనే సౌభాగ్యం, సమృధ్ధి. ఏవిషయంలో ఐనా అలా ఉంటే అది తద్విషయకమైన లక్ష్మి. రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి ఇలా అనేకంగా చెప్పుకోవచ్చును.  రమ అంటే కూడా లక్ష్మి అనే అర్ధం. శౌర్యరమ అంటే ప్రతాపలక్ష్మి అన్నమాట. లాలామ అంటే స్త్రీ అని అర్ధం. రాముడి ప్రతాపాన్ని దేవతలే దిగివచ్చి మరో పొగిడారు. వాళ్ళూ వీళ్ళు పొగిడితేనే గొప్ప అనుకుంటామే, ఏకంగా బ్రహ్మ , గారూ, శివుడూ, ఇంద్రుడూ‌ వచ్చి పొగిడారు. అగ్నిదేవుడు పొగిడాడు. దశరథుడే వచ్చి ఆశీర్వదించాడు. ఇదీ రాముడి ప్రతాపానికి వచ్చిన ప్రశంశ. అన్నిలోకాల్లోనూ‌ ప్రతిష్ఠ ఉన్న మునులూ దేవతలూ పొగడ్డం సామాన్యం కాదు కదా. మూడులోకాల్లోనూ‌ పొగడిక వచ్చిన శ్రీరామచంద్రుడిని త్రిజగన్నుత శౌర్య రమాలలాముడు అన్నాడు రామదాసు.

దుర్వారకబంధరాక్షసవిరామ అని అన్నారు కదా, ఈ‌కబంధుడు ఎవరంటే వాడొక రాక్షసుడు అని ఈ‌సంబోధనలోనే‌ కబంధరాక్షస అని చెప్పారు కాని ఇంతకీ ఎవడు వీడు?  వీడు నిజానికి ఒక శాపగ్రస్తుడైన గంధర్వుడు. వికారమైన రాక్షసరూపంతో అడవిలో పడి ఉన్న వీడు సీతకోసం వెదకుతున్న రామలక్ష్మణులను పట్టుకుంటాడు. వాళ్ళు వాడి చేతులు నరికిపాడేస్తే శాపం పోయి తనవృత్తాంతం గుర్తుకు వస్తుంది. రామా నన్ను మీరు ఎంతకొట్టినా చావను. నన్ను ప్రాణాలతోనే గోతిలో‌పూడ్చి వేయండి అని అడుగుతాడు. అలా చేసిన పిదప వాడు స్వస్వరూపంతో స్వర్గానికి పోయాడు. యోజనం‌పొడుగు చాచగల చేతులతో కబంధుడు ఎలాంటి ప్రాణికీ తప్పించుకోలేని భయంకరమైన రాక్షసుడు. అంతే దుర్వారుడు అన్నారు. ఇదీ దుర్వారకబంధరాక్షస విరామ అనటంలో తాత్పర్యం. ఇక్కడ విరామం ఏమిటండీ అంటే వాడికి మంగళం పాడటమేను. అంటే చంపటం అన్నమాట.

జగజ్జనకల్మషార్ణవోత్తారకనామ అని ఒక కొంచెం జటిలమైన సంబోధన చేసారు.  ఇందులో జగత్తు అంటే ప్రపంచం ఉంది. జనం అంటే ప్రపంచప్రజల ప్రస్తావన ఉంది. కల్మషార్ణవం అంటే పాపసముద్రం ఉంది. తరణం అంటే దాటడం. ఇక్కడ ఉత్తారకం అంటే (సముద్రాన్ని) దాటించేది అన్న సూచన ఉంది. నామం అంటే‌ మరేమిటీ రామనామమే. కొంచెం అన్వయం చేసుకుందాం. ప్రపంచం ఉంది. దాన్నిండా జనం ఉన్నారు. వాళ్ళు పాపాలు చేస్తున్నారు. అసలీ ప్రపంచమే‌ ఒక పాపసముద్రం ఐపోయింది. దాన్ని దాటటం దాదాపు అసంభవం. ఎలా పడ్డారో వీళ్ళు ఇందులో పడ్డారు. అలుస్తున్నా, ఈ పాపసముద్రాన్ని ఈదటమే‌కాని దాటటం లేదు. దుర్లభం. పుణ్యం బ్రహ్మాండంగా ఉంటే స్వర్గమూ, పాపం విస్తారమైతే నరకమూ. మిశ్రమం ఐతే ఈప్రపంచంలో జన్మలెత్తి అనుభవిస్తూ ఉండటమూ. పాపాల వల్ల వల్లమాలిన బాధలు. అలాగని ప్రపంచం అనేదాన్ని దాటిపోలేరు. కానీ, ఈజనం రామనామం చేసారో, ఆపాపాల సముద్రాన్ని సుళువుగా దాటిపోతారండీ. ఇంక జన్మ ఎత్తే‌ పనే లేదు. అందుకై జగజ్జనకల్మషార్ణవోత్తారకనామ అని పొగడ్డం. అందుకే కదా రామనామాన్ని తారకనామం అంటారు. రాముడి నామాన్ని పొగడ్డం అన్నా రాముణ్ణి పొగడ్డం అన్నా ఒక్కటే. నామానికి, నామ్నికీ‌ అబేధం అని మర్చిపోకండి.

ఈ‌శతక మకుటం భ్రద్రగిరి దాశరథీ, కరుణాపయోనిధీ అన్న రెండు సంబోధనలతో ఉంది. భద్రగిరి దాశరథీ అంటే భద్రగిరి మీద విడిది చేసి  ఉన్న దాశరథీ అని అర్ధం. దాశరథీ అని అనటం గురించి మొదట్లోనే‌ చెప్పుకున్నాం కదా, దశరథుడి కొడుకు కాబట్టి అని. ఇది సంస్కృతభాషలో పధ్ధతి. దశరథుడి కొడుకు దాశరథి.ధృతరాష్ట్రుడి కొడుకు ధార్తరాష్ట్రుడు. కుంతి కొడుకు కౌంతేయుడు. ఇలాగు అన్నమాట.

కరుణాపయోనిధీ అంటే కరుణ అనే సముద్రం. పయోధి, పయోనిధి అన్నవి సముద్రానికి పర్యాయపదాలు. ఇక్కడ పయస్సు అంటే పాలు అనీ‌ నీరు అనీ రెండు రకాల అర్ధాలూ ఉన్నాయి సంస్కృతంలో. రాముణ్ణి కరుణాసముద్రుడు అని అనటం వినే‌ ఉంటారు కదా. ఇక్కడ కొంచెం అందంగా కరుణ అనే పాలసముద్రం అండీ‌ మా రాముడు అని చెప్పుకుందాం.

కొంచెం వివేచనగా మరొకసారి చూదాం.
 
శ్రీరఘురాముడు అనటం ద్వారా మహాదాత వంశంలో పుట్టి దాతృత్వం వారసత్వంగా కలవాడివి, మాకు నీదయతో మోక్షం అనేది దానంగా ఇవ్వు అని సూచించటం కనిపిస్తుంది.
 
చారుతులసీదళదాముడు అనటం ద్వారా విలాసవంతమైన పుష్పాలమాలలున్నా నీవు సువాసన ఉన్న తులసిని ఆకు ఐనా ఆదరించేవాడివి, సామాన్యులమైన మాలో మంచిని చూచి ఆదరించమనటం కనిపిస్తుంది.
 
శమక్షమాదిశృంగారగుణాభిరాముడు అనటం ద్వారా మాతప్పులను మన్నించే ఔదార్యం చూపమని అర్ధించటం సూచ్యంగా ఉంది.
 
త్రిజగన్నుతశౌర్యరమాలలామ అన్నప్పుడు నీశౌర్యం మమ్మల్ని పీడించే అరిషడ్వర్గంపైన నీ‌ప్రతాపం చూపమని సూచన ఉంది.

దుర్వారకబంధరాక్షసవిరామ. మనిషిలోని లోభమే కబంధుడు. అరిషడ్వర్గం రాక్షసమూకయే. రాక్షసులను విరచినట్లే మాలోపాలను విరచి మాకు స్వస్వరూపజ్ఞానం అనుగ్రహించమన్న ప్రార్ధన ఉంది.
 
జగజ్జనకల్మషార్ణవోత్తారకనామ అని చెప్పటం ద్వారా కల్మషపూరితమైన జగత్తు నుండి ఉద్దరించి మోక్షం ప్రసాదించమని అడగటం ఉంది.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.