30, ఏప్రిల్ 2021, శుక్రవారం

దండాలు దండాలు

దండాలు దండాలు దశరథనందన

దండాలు శ్రీరామ  దానవాంతక


దండాలు దండాలు దశముఖమర్దన

దండాలు రామ కోదండపండిత

దండాలు రామ శ్రీమదయోధ్యానాయక

దండాలు రామ సీతానాయక


దండాలు దండాలు తాపసమందార

దండాలు భక్తమందార రాఘవ

దండాలు రామ ధారాధరసుశ్యామ

దండాలు రామ భూతలనాయక


దండాలు దండాలు ధర్మాచరణవ్రత

దండాలు  వాయునందనవత్సల

దండాలు భక్తహృత్పద్మస్థిత రామ 

దండాలు మోక్షవితరణాసక్త


29, ఏప్రిల్ 2021, గురువారం

ఈవిలయము నుండి

ఈవిలయము నుండి జనుల నెవరు రక్షింతురో

నీవు తక్క నిక్కముగ నీరజాక్ష


మూడులోకములను ముప్పుగా మారిన

పాడురావణుని పనిపట్టిన రామా

నేడు నీవిట్లు చూచిచూడనట్లున్నావు

వేడుకొందు కరోనా పీడనణచరా


ఆరని చితిమంటలును హాహాకారములును

ఘోరమైన దృశ్యములకు గుండెలదరగ

వీరుడా నీవేలిన భారతావని యిది

యీరీతిగ బావురుమను టెట్టులోర్తువు


నీరాజ్యము నీప్రజలు నీభక్తులు నీవారు

ఈరోజున నీరక్షణ కోరుచున్నారు

రారా వేవేగ బ్రోవ రామచంద్ర రఘువర

శ్రీరామరక్ష కలుగజేయర మాకు


శ్రీరామచంద్ర నీకు

శ్రీరామచంద్ర నీకు చేతులెత్తి మ్రొక్కెద

ఆరాటపడెడు నన్ను చేరదీసి నందుకు


ఎన్ని వేల జన్మలెత్తి ఇలను తిరిగి యుంటినో

ఎన్నెన్ని పాపములను చేసి ఎంత పొగిలి యుంటినో

నిన్ను మరచి తిరితిరిగి ఇపుడే తెలివిడి గలిగి

తిన్నగ నిను శరణుజొచ్చి యున్న ఈవేళ


పాపమేమి పుణ్యమేమి పరగ జీవుడొక్కడిటు

నాపాదము లంటెనేని నావాడైనాడుగా

తాపములిక వాని నంట తగదు గాక తగదనుచు

నాపై కృపజూపి నావు నాభాగ్యమేమందును


నీవు నా రాముడ వని నీవు నా దేవుడ వని

నీవే యౌగీంద్రహృదయనిత్యసేవ్యమూర్తి వని

భావములో నెంచి పొంగి పరవశాత్ముండ నగుచు

సేవింపగ దొడగినంత శీఘ్రమే మెచ్చితివని


27, ఏప్రిల్ 2021, మంగళవారం

ఉత్తరకాండ.వాల్మీకి కృతమే

రామాయణం మహాకావ్యం

అది గాయత్రీమంత్రవ్యాఖ్యానస్వరూపం.

గాయత్రి చతుర్వింశతిబీజాక్షరసంపుటి కల మంత్రం.

న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్ 

అని నానుడి.

రామాయణం చతుర్వింశతిసహస్రశ్లోక సంపుటి కల కావ్యం.

వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే

వేదః ప్రాచేతసదాశీత్ సాక్షాద్రామారణాత్మనా

అని రామాయణప్రశస్తి.

వాల్మీకులవారు రామాయణకావ్యంలో గాయత్రీమంత్రాన్ని నిక్షేపించారు. వేయిశ్లోకాలకు ఒక గాయత్రీ బీజాక్షరం ప్రయోగించి.

ఉత్తరకాండసహితంగానే రామాయణంలో ఇరువదినాలుగు వేల శ్లోకాలు అవుతున్నాయి.

అందుచేత ఉత్తరకాండ వాల్మీకివిరచితమే కాని ప్రక్షిప్తం కాదు. కానేరదు.

మరొకమాట.

కావ్యం మంగళమయంగా ఉండాలి. ఆదిమధ్యాంతములయందు మంగళం సూచించబడాలి.

రామాయణంలో ఆది జగత్కల్యాణకారకమైన రామావతారం మంగళసూచకం.

రామచంద్రుడు దుష్టుడైన రావణుని సంహరించి నిజపురాని విచ్చేసి పట్టాభిరాముడు కావటం లోకకళ్యాణసూచకం.  ఇది ఉత్తరకాండసహిత రామాయణకథలో ముఖ్యఘట్టం.

శ్రీహరి రాముడై పదునొకండువేల సంవత్సరాలు సామ్రాజ్యాన్ని పాలించి అలతారసమాప్తి చేసి వైకుంఠం చేరువేళ రామవియోగాన్ని సహించలేని పురజనులు ఆయనను అనుగమించి వచ్చారు. వారందరికీ హరి ఉత్తమగతిని అనుగ్రహించి బ్రహ్మచే వారికై ప్రత్యేకంగా ఒక లోకమే సృజింపజేసారు. అక్కడ ఆప్రజకు హరి సీతాలక్ష్మణసమేతుడైన రామచంద్రుడిగా నిత్యసన్నిహితుడై యున్నాడు. ఇలా ఉత్తర కాండలో కావ్యాంతమంగళం చెప్పారు భగవాన్ వాల్మీకులవారు.

ఇలా ఉత్తర కాండతో కూడి మంగళత్రయయుక్తమై రామాయణం త్రిజగన్మంగళకారకమై శోభిల్లుతోంది.

రామాయణకథను నాలుగవతరగతి పిల్లలకోసం రెండు పేజీల పాఠంగా చూపవచ్చును. దాని అర్ధం రామాయణం చిన్నకథ అనో మరేమీ.విశేషం లేదనో కాదు. కేవలం రుచి చూపటానికి మాత్రమే అనే కదా అర్ధం. అలాగే అనేకులైన కవులూ నాటకకర్తలూ ఇతరకళాకారులు తమధోరణిలో చేప్పేది ఏదైనా రాముడి గురించి కొంత అవగాహన కలిగించాలనే.  ఇలా వాటిప్రయోజనం.వాటికి తప్పకుండా ఉంది.

మూలరామాయణం.ఆధారంగానే తప్ప ఇతర విధాలుగా రామకథను కాని తత్కథాంతర్గత పాత్రలను కాని విమర్శిచటం తరచుగా తప్పుడు సంకేతాలను ప్రచారం చేస్తుంది లోకంలో.



మాయామానుషరూప

మాయామానుషరూప మంగళరూప ముని

ధ్యేయశుభదరూప దయాస్వరూప


సకలధర్మస్వరూప సత్యస్వరూప

సకలదానవవంశసంహారరూప

సకలార్తినాశరూప శాంతస్వరూప

శుకాదియోగీంద్రసంసస్తుత్యస్వరూప


భవపంకవిశోషణ భానుస్వరూప

భవమహారణ్యదావాగ్నిస్వరూప

భవమదోన్మత్తనాగపంచాస్యరూప

భవమహారోగధన్వంతరిస్వరూప


శోకమోహాంతకసుశోభనరూప

శ్రీకరార్చితరూప శ్రీకరస్వరూప

సాకేతసామ్రాజ్యచక్రవర్తిరూప

భూకన్యాయుతరామభూపాలరూప



26, ఏప్రిల్ 2021, సోమవారం

మనసంటే హరిమయమై మసలునదే‌ మనసు

మనసంటే హరిమయమై మసలునదే‌ మనసు
జనులార అపవర్గము సాధించే మనసు

హరినామము తలచినంత పరవశించవలెను మనసు
పరవశించనట్టి మనసు పాటిబండ
హరినిచూచినంతనే అన్నీ మరువవలెను మనసు
మరువకుండునట్టి మనసు మురికిదిబ్బ

హరికథలను చదివినంత హాయినొందవలెను మనసు
మరి యట్లు గాని మనసు మనకెందుకు
హరితీర్ధము లందు తిరుగ ఆశపడవలెను మనసు
మరి యట్టి యాశలేని మనసెందుకు

హరేరామ హరేకృష్ణ యన గోరవలెను మనసు
పరుల నెన్ను చుండు మనసు వద్దు మనకు
నిరంతరము రామనామనిష్ఠ నుండవలెను మనసు
పరము నిచ్చు మంచిమనసు వలయును మనకు

కమలామనోహర కామితఫలద

కమలామనోహర కామితఫలద
అమరార్చితపదకమలా అనంత

సరసినలోచన సురగణతోషణ
సురరిపుశోషణకరశుభవిక్రమ
నిరుపమశుభగుణనికర శుభకర
పరమదయాకర  హరి పరిపాలయ

లాలితప్రహ్లాద లక్ష్మీనృసింహ
పౌలస్త్యాంతక వరరామాకృతి
లీలాధృతగోపాలశుభాకృతి
పాలితకింకర పరిపాలయ హరి

వరశుభకారణ దురితనివారణ
వరమునిగణహృద్భావితచరణ
నిరుపమానశుభవరవితరణచణ
పరిపాలయ మాం హరి నారాయణ

25, ఏప్రిల్ 2021, ఆదివారం

హరిని గుర్చి పాడునదే అసలైన పాట

హరిని గూర్చి పాడునదే అసలైన పాట 

హరి కొఱకై యాడునదే అసలైన ఆట


హరినామస్మరణంబే యసలైన స్మరణము

హరిపూజనాదికములె అసలు పూజలు

హరిగుణగానమొకటె అందమైన గానము

హరిశుభరూపమొకటె అందమైన రూపము


రామభజన మొక్కటే రమ్యమైన భజనము

రామచరిత మొక్కటే రసపూరితము

రామభక్తి యొక్కటే రక్తిముక్తి దాయకము

రామచంద్రు డొక్కడే ప్రేమమయస్వరూపుడు


హరేరామ హరేరామ యనువాడే భక్తుడు

హరేకృష్ణ  హరేకృష్ణ యనువాడే యోగ్యుడు

హరిలీలలు పాడునదే అసలైన జీవితము

హరిలీలలు నటించుటే అందమైన ఖేలనము


22, ఏప్రిల్ 2021, గురువారం

దిగిరాదా ఒకపాట

దిగిరాదా ఒకపాట దేవుడా నీకీర్తి

ధగధగలు నింపగ ధరను నిండుగ


దేవలోకాల పాడే దివ్యమైన ఒకపాట

దేవతల నోళ్ళు దాటి దేవలోకాలు

ఠీవిగా దాటివచ్చి దేవుడా రాముడా

నీవారి హృదయముల నింపరాదా


దేవతలూ మిగిలిన దేవుళ్ళూ నోళ్ళువిప్పి

నీ వైభవము నెంత నిష్ఠగా పొగడేరో

దేవదేవ లోకానికి తెలియజెప్పు పాటయై

భూవలయము నేలగ పొంగిరాదా


రామమంత్రాన్వితమై రవళించు ఒకపాట

రామమహిమచాటగా రాకుండునా యేమి

భూమి చేర రానేవచ్చె పొరి భక్తులకుదక్కె

స్వామిమహిమ కేదైనా సాధ్యమేగా



20, ఏప్రిల్ 2021, మంగళవారం

అందమైన రామనామము

 అందమైన రామనామ మందుకోండి దీని

నందుకొన్న వారిదే యదృష్టమండీ


నాతి సీత కమితరుచి నాటుకొన్న రామనామము 

వీతరాగులకు రుచి విహితమైన రామనామము

కోతిమూక కెంతోరుచి గొలుపునదీ రామనామము

రాతికొండ కైన రుచి రమ్యమైన రామనామము


చేతోమోదమును గూర్చు చేయుకొలది రామనామము

ప్రీతితోడ రక్షించును ప్రియముగొల్పు రామనామము

పాతకముల హరించునీ పావనమగు రామనామము

భీతినణచి జయమునిచ్చు వేడ్కగొల్పు రామనామము


మూడులోకముల లోన పూజ్యతమము రామనామము

వేడుకతో నద్రిజావరు డాడిపాడు రామనామము

కూడి భాగవతులు కొలుచుకొనుచు నుండు రామనామము

నేడు నన్నుధ్ధరించు వేడుకగల రామనామము


రమణీయమైన దీ రామనామము

రమణీయమైనదీ రామనామము

భ్రమలు తొలగజేయు నీ రామనామము


కామాదుల నణచు నీ రామనామము

ప్రేమతో చేయండీ రామనామము

కామితముల నిచ్చు నీ రామనామము

ప్రేమతో చేయండీ రామనామము


కామారి మెచ్చిన దీ రామనామము

ప్రేమతో చేయండీ రామనామము

సామీరి జపమంత్రము రామనామము

ప్రేమతో చేయండీ రామనామము


భూమిజనుల కాచునీ రామనామము

ప్రేమతో చేయండీ రామనామము

మీ ముక్తికి కారణ మీ రామనామము

ప్రేమతో చేయండీ రామనామము


మాటలేల మైథిలీ

 మాటలేల మైథిలీ మంచిచూపు చాలునే ఆ

మాటయే చాలునయా మహానుభావ


మాటికిని మనమధ్య మాటలకు తావేదీ

కోటలో ఏకాంతము కొంచెమే నంటే

వీటి నుండి విపినములకు వెడలివస్తి మైనా

లోటే అది మరది గారి చాటు బ్రతుకు


పాప మతడేమి చేసె పడతిరో సౌమిత్రి

నా పైని ప్రేమతోడ నీపగిదిని వచ్చె

నీ పైన భక్తిగల నీమరది మన కడ్డా

కోపమేల నవ్వుల కనకూడ దటయ్యా


దేవుడు రాముడైతే జీవుడీ లక్ష్మణుడు

ఓ వయారి చెప్పవే నీవిషయమును

దేవేరిని నేను తెలియగ నీ చాయను

కావున నీచూపు చాలు కాదా భూజాత


రామనామము చాలును

రామనామము చాలను నీ బ్రతుకు పండగా శ్రీ

రాముడొకడు చాలును నీ రాత మార్చగా


వందలకొలది జన్మ లెత్తి పండని నీ బ్రతుకును

అందముగా పండించ నమరె నేటికీ

అందమైన రామనామ మదిచాలు నదిచాలు

ముందుముందు భూమిపై పుట్టవులే నీవు


రాముడొకని నమ్మక రాలిపడిన తనువులే

నీ మూర్ఖత చాటిచెప్పు నిజ మంతేగా

ఏమో ఈనాటికైన రామభక్తి కలిగినది

పామరత్వ మంతరించు పండును నీ బ్రతుకు


రామనామ మంటేనే రాముడే అన్నమాట

రాము డంటే శ్రీరామ నామమేలే

రామునాశ్రయించితే రాతమారి పోవులే

రామనామమే ముక్తిధామమునకు చేర్చును


16, ఏప్రిల్ 2021, శుక్రవారం

మోదముతో రామమూర్తి

 మోదముతో రామమూర్తి భజన మాని

వాదము లాడవద్దు మీరు భేదము లెంచవద్దు


అరయ పండితవర్యు లాడంబరము గాను

మరియు పామరజనులు మురిపెముతోడను

పరమభక్తిని వేరు పధ్ధతులను పాడి

హరిభజన చేయుట యందగించును కాదె


ఇవలి యొడ్డున జలము లెంత స్వాదువు లటుల

నవలి యొడ్డున జలము లంత మంచివి కావొ

వివిధ దేహములందు వెలుగొందు వాడొకడె

భవనాశనుని గూర్చి పాడు డందరు కలిసి


అందరును వచ్చిన దరయ నొకటే తీరు

అందరు కదలి పోవు నదియు నొకటే తీరు

అందరి బ్రతుకులును చిందరవందరలె

ఎందుకు కలసి చేయ రీశ్వరునకు భజన


రాముని తలచవె మనసా

రాముని తలచవె మనసా సీతా

రాముని కొలువవె మనసా


రాముని కాలాంబుదఘనశ్యాముని

  రాజారాముని శ్రీరాఘవుని

కామితఫ‌లదుని కరుణాధాముని

  కోమలహృదయుని రఘుపుంగవుని

సామజగమనుని జగదారాధ్యుని

   క్షేమంకరుడగు రఘునాయకుని

తామసహరణుని ధర్మస్వరూపుని

   శ్రీమద్దశరథనందను హరిని


పరమానందుని పతితపావనుని

  భండనభీముని శ్రీరాఘవుని

వరదాయకుని బ్రహ్మాద్యమర

   వంద్యచరితని రఘుపుంగవుని

సురహితకరుని పరదైవమును 

  నరనాయకమణి రఘునాయకుని

పరమేశ్వరుని ధరణీతనయా

  వరుని అయోధ్యాపురపతి హరిని


సుజనసేవితుని సుందరమూర్తిని

  సూర్యవంశజుని శ్రీరాఘవుని

కుజనదూషితుని  కువలయనాథుని

   గుణగణభూషణు రఘుపుంగవుని

విజయవిలాసుని విజయరాఘవుని

   వీరవరేణ్యుని రఘునాయకుని

నిజభక్తజనోత్సాహవర్ధనుని

   నిరుపమముక్తివితరణుని హరిని



శ్రీరామదైవమా కారుణ్యమేఘమా

శ్రీరామదైవమా కారుణ్యమేఘమా
నేరుపుమీఱగ నిన్నుకీర్తించనీ

మారశతకోటిసుకుమారుడవు నీవని
క్రూరరాక్షససంహారశీలుడవని
వారిజమిత్రసద్వంశపావనుడవు
నారాయణుడవు జనార్దనుండవనుచు

నరనాయకుడవని సురనాయకుడవని
పరమమునిసంఘసంభావితాకృతివని
వరభక్తలోకసంప్రార్థితనిరుపమ
పరతత్త్వమీవని పావనాకృతివని

వేదవేద్యుడవని విజయశీలుడవని
మాదేవదేవుడవు మంగళాకృతివని
నాదలోలుడవని జ్ఞానప్రదుడవని
భూదేవి కల్లుడవు మోక్షప్రదుడవని


13, ఏప్రిల్ 2021, మంగళవారం

నీవే రక్ష శ్రీరామ

నీవే రక్ష శ్రీరామ నిశ్చయంబుగ

కావవయ్య మమ్ము కరుణామయా


గ్రామాధిపతికి నగరాధిపతి రక్ష

రామా నగరాధిపతికి భూమిపతి రక్ష

భూమిపతులకు సార్వభౌముడే రక్ష

రామా రాజాధిరాజ రక్షకా


రాజులందర కీవే రక్ష యనగ సుర

రాజునకును చూడ నీవే రక్షకుడవుగా

నీజయశీలమే నిఖిలజగద్రక్ష

రాజశేఖరనుత రామరాజేంద్రా


రక్ష వీవు నృపులకు ప్రజల కందరకు

రక్ష వీవు మాబోంట్లు రామభక్తులకు

రక్షవై భవసాగరంబు దాటించుము

రక్షితామరా రామ శిక్షితాసురా


శుభవృష్టిమేఘమా

శుభవృష్టిమేఘమా సుందరతరమేఘమా

విభుతనెఱపి ప్రోవవే వీరమేఘమా


నల్లనివాడ వైతేనేమి నమ్మదగినవాడవు

చల్లని సామివే నీవు చక్కనిమేఘమా

అల్లన నీయండజేరు నందరిబాగు చూచెదవు

కల్లకపట మెఱుగని కాలమేఘమా


అమృతమున బుట్టితివి యంబుధిని కట్టితివి

సమృధ్ధిగ మునులకెల్ల సత్తువిస్తివి

అమృతాశనుల పీడ లంతరింపజేసితివి

అమృతోపమానచరిత నలరుమేఘమా


తక్షణమే ఆర్తిబాపు దయావృష్టిమేఘమా

నిక్షేపము నీవే మాకు  నీలమఘమా

దక్షతతో లోకశాంతి దాయివగుచు సద్భక్త

రక్షణాదీక్ష నొప్పు రామమేఘమా


ఏమి చెప్పమందువయ్య యీ నాలుక

ఏమి చెప్పమందువయ్య యీ నాలుక యిది
నామాట వినదాయె నారాయణా

అనిశంబును కల్లలే యాడు నాలుక నిను
వినుతించగ వెనుదీయు వెర్రినాలుక
పనవుచుండు రుచులకై పాడునాలుక యిది
తనను తాను గొప్పగ తలచు నాలుక

రామ రామ యన కలసిరాదీ నాలుక ఓ
రామా నామాట వినని రాలుగాయిర
పామరుల పొగడుచుందు పాడునాలుక యిది
తామసించి కల్లలాడు తప్పుడునాలుక

కలహములకు పోయి గ్లాని తెచ్చు నాలుక నా
వలన కాదు దీని దిద్ది బాగుచేయగ
పలుకదురా తారకమీ పాడు నాలుక యిది
పిలుచుటెపుడురా నిన్ను పిచ్చినాలుక

11, ఏప్రిల్ 2021, ఆదివారం

ఇదిగో రామయ్య నీ‌ కెవరు చెప్పిరో కాని

ఇదిగో రామయ్య నీ‌ కెవరు చెప్పిరో గాని

అదనుచూచి నాతప్పులు వెదికేవోహో


కదలివచ్చి నాకై నేను కాలు మోపలేదు భువిని

పదపదమని నీవే నన్ను పంపితి గాని

వదలిపోలేను నిన్ను వద్దన్నా వినకుండా

అదయుడవై పంపినా వంతియె కాదా


నిన్ను మరచి యున్నానని నీకెవ్వరు చెప్పినారొ

అన్నన్నా నమ్మి యడుగు చున్నావు గాని

ఎన్నడైన నిన్ను గాక యెన్నితినో‌ యన్యుని

నన్ను హాస్యమాడు టన్యాయము కాదా


మన మొక్కటి యనుచుందువు మరల తప్పు లెన్నుదువు

పనిగొని వినోదమునకు పలికెదు కాని

నిను నన్నును వేరుచేయు నేరుపుగల వారెవరు

ఇనకులోత్తమ సత్య మింతే‌ కాదా


10, ఏప్రిల్ 2021, శనివారం

సరిలేదు శ్రీహరి

సరిలేదు శ్రీహరి సంకీర్తనమునకు

నరులార మీరిది మరువకుడీ


తొలగించు తాపముల కలహించు కామాదుల

పిలుకుమార్చు కలి పీడడచు

నళినాక్షు నామకీర్తనానంద మెపుడును

కలిగించు నఖిల సుఖంబులను


తుళువలు వలదని.దుర్బోధ లొనరింప

తెలియమిచే దారి తొలగకుడీ

కలిలోన నామసంకీర్తనమునకన్న

కలయ నింకొకదారి కనబడదు


రామ రాఘవ యని ప్రేమతో శ్రీరామ

నామసంకీర్తనము నడుపవలె

మాముధ్దర కృష్ణ మాధవహరి యని

నీమముతో నెపుడు వేడవలె


పాటలు పాడేరో

పాటలు పాడేరో ఆటలాడేరో

ఆటపాట లందున హరినే మరచేరో


పాటలందు మీరు భగవానునే మరచితే

ఆటలాడు పురాకృత మయ్యో మీతో

పాటించి హరిలీలలు పాడితే వేడుకతో

పాటలే మీకు మోక్షప్రదములు కావో


ఆడు వేళ మీరేమో హరిని మరచితే

ఆడునేమో పురాకృత మాటలు మీతో

కూడి నలుగు రాడితే గోవిందుని లీలలు

వేడుకగా హరిమోక్ష మీడే మీకు


అన్ని చోట్ల కృష్ణలీల లాడరే జనులారా

అన్ని చోట్ల రామనామ మాలపించరే

చిన్నపెద్ద లందరిట్లు చేసిరా గోవిందు

డన్ని వేళలందు మీ కండగా నుండడే


విభుడని లోనెఱిగి

విభుడని లోనెఱిగి వీరరాఘవు గొల్చి

యభయము పొందరో యందరును


వీని నుభయప్రదుడైన వాని గొల్వ

బూనక నేల చెడిపోయేరో

దీనబాంధవు డితడు దిక్కిత డేయని

కానని వారిదుష్కర్మ మెంతో


భక్తులందరు తమ భావంబులలో

శక్తికొలది నిల్ప జాలుదురు

ముక్తిచెందగ నుత్తమోత్తమ మీదారి

యుక్త మింకొకదారి యున్నదొకో


రామ రామాయన్న రాముడు హృదయా

రామములోన విరాజిలునే

పామరులైనను పండితులైనను

రామచంద్రుని బిడ్దలే మహిని 


9, ఏప్రిల్ 2021, శుక్రవారం

హరినామమే మరచిరా

హరినామమే మఱచిరా మీకింక

సరివారెవ్వరు పొండయా


శివుడైన చేసేది - పంకజ

భవుడైన చేసేది - ఈరేడు

భువనాల వెలిగేది - మీరే

అవలీలగ మరచిరా


రవికోటినదృశమును

పవనజసంస్తుత్యమును

భవపాశలవిత్రమునే

అవలీలగ మరచిరా


రామా యనిన చాలునే

రాముని తలపే చాలునే

రామనామమే చాలునే

రాముని ఇట్ఞే మరచిరా


ఏమియు నెఱుగ

ఏమియు నెఱుగ నీ నామ మొకటి దక్క

రామా నినే నమ్మితి రక్షించర


కామాది రిపులపై కత్తి దూయు విధము

భూమిని జపతపములు చేయువిధము

పామరత్వమును వదలిపెట్టువిధము

ఏమని చెప్పుదు నించుక యెఱుగను


భాగవతుల జేరి బాగుపడెడు విధము

బాగొప్ప నీపూజ పచరించెడు విధము

నీగొప్ప లోకాన నినదించెడు విధము

నాగేంద్రశయాన నాకెఱుక కావు


వేదముల నెఱుగ విజ్ఞాన మెఱుగను

వాదముల గెల్చు పధ్ధతు లెఱుగను

నీదు మహిమ చాటు నేఱుపు నెఱుగను

నీదయ కొఱకని నేను వేడుదును



ఈమందిర మిది నీదే

 ఈమందిర మిది నీదే యిందు విశ్రమించుము

రామా సలక్ష్మణముగ రామామణి సీతతో


హనుమన్న ననుమతింతు మన భరతు ననుమతింతు

జననుతుల శత్రుఘ్న విభీషణుల ననుమతింతు

అనుమతించబో నన్యుల హాయిగా విశ్రమించు

మనఘ రామచంద్ర నామనోమందిరమున


సాకేతమునకే కాదు సకలబ్రహ్మాండములకు

శ్రీకరుడవు పోషకుడవు శ్రీరామచంద్ర

నీకొకింత విశ్రాంతియు లేక బడలుచున్నావే

నీకు విశ్రాంతి నిచ్చి.నేకావలి యుందును


పొద్దుపొయినా వదలక పూజలుచేయను నేను

అద్దమరేతిరి సుప్రభాత మారంభించను నేను

సద్దుచేయక నేను బయట చక్కగ కావలుందును

వద్దువద్దనక నీవు వచ్చి విశ్రమించవే


8, ఏప్రిల్ 2021, గురువారం

పనిగొని నిన్ను నేను భావించున దేమున్నది

పనిగొని నిన్ను నేను భావించున దేమున్నది

వినవయ్య నీతలపు విడచి యుందునా


నీ నామకీర్తనమే నీ గుణ వర్ణనమే

నీ నిర్మలాకృయే నిత్యము నాకు

ధ్యానమందుండునే దాశరథీ నేడు

దేనికని యీప్రశ్న దేవదేవా


అన్ని యవస్థలలోను నన్నితావుల యందు

నన్ని వేళలయందు నాత్మలోపల

సన్నుతాంగ నిన్నే క్షణమెడబాయక

యెన్ని కీర్తించుట నెఱుగ వొక్కో


భావనాతీత నిను భావించు వాడనని

భావించి మురియునా వ్యవహారము

నీవు నవ్వుతాలుగా నేడు ప్రశ్నింతువో

భావజజనక రామ వందనాలు 

హాయి రామభక్తి మాకు తాయిలా లెందుకు

హాయి రామభక్తి మాకు తాయిలా లెందుకని

మాయలకు లొంగరు మహిని రామభక్తులు 


తాయిలాలిచ్చి ఓట్లు దండుకోగల రేమో

తాయిలాలిచ్చి పదవి దండుకో గలరేమో

తాయిలాలిచ్చి హరి దాసులను  కొనలేరు

హాయి రామభక్తి యని హరిదాసు లుందురు


తాయిలాలిచ్చి తప్పులు దాచిపెట్ట గలరేమో

తాయిలాలిచ్చి సతుల మాయచేయగల  రేమో

తాయిలాలిచ్చి హరి దయను మీరు  కొనలేరు

హాయిగా రామభక్తి యందించును హరిదయ


తాయిలాలిచ్చి సభల దర్జా చాటగల రేమో

తాయిలాలిచ్చి దండధరుని మీరు కొనలేరు

తాయిలాలిచ్చి మోక్షద్వారమును చొరలేరు

హాయిగా రామభక్తి యందించును మోక్షము

చిల్లరమల్లర చేతలు


చిల్లరమల్లర చేతలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపడే చేతలేల హాయిగ రాముని సేవించర

చిల్లరమల్లర మాటలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే మాటలేలర  హాయిగ రామా రామా యనర


చిల్లరమల్లర చూపులు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిచేసే చూపు లనింక హాయిగ రాముని పైన నిల్పర

చిల్లరమల్లర బుధ్ధులు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపడగ నేల బుధ్ధిని హాయిగ రామునకే యర్పించర

చిల్లరమల్లర రాతలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే రాతలేలర  హాయిగ రాముని గూర్చి వ్రాయర


చిల్లరమల్లర స్నేహాలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే స్నేహాలేల హాయిగ రాముని స్నేహముండగ

చిల్లరమల్లర బంధాలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే బంధాలేల హాయిగ రాముని అండ చేరర

చిల్లరమల్లర వృత్తులు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే వృత్తులేలర హాయగు రామదాస్య ముండగ

చిల్లర మల్లర కొలువులు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే కొలువులేలర హాయిగ రాముని కొలువుండగను

చిల్లరమల్లర పూజలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే పూజలేలర హాయిగ రాముని పూజించుముర

చిల్లరమల్లర ఆశలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే ఆశలేలర ఆశించర శ్రీరాముని కృపను

చిల్లరమల్లర గురువులు ని న్నల్లరిపాలు చేతురు
అల్లరిపెట్టే గురువులేలర ఆరాముని గురువనుకొనర

చిల్లరమల్లర విద్యలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే విద్యలేలర హాయగు రామవిద్య యుండగ

చిల్లరమల్లర యోగాలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే యోగాలేలర హాయగు రామయోగ యుండగ

చిల్లరమల్లర సంపదలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే సంపదలేల హాయగు రామరత్న ముండగ

చిల్లరమల్లర బేధాలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టు విబేధాలేలర అందరు రాముని వారై యుండగ

రాముడు లోకాభిరాముడు

రాముడు లోకాభిరాముడు మన
రాముడు సీతారాముడు

సుగుణాకరుడీ రాము డితడు
జగదీశ్వరుడు దేవుడు
తగనివిరోధము దాల్చు నసురుల
తెగటార్చెడు ఘన దీక్షగలాడు

జనహితైషుడీ రాము డితడు
మునిజననుతుడు దేవుడు
ఇనకులేశుడై యిలలో వెలసిన
వనజాక్షుడు హరి భక్తవరదుడు

ధర్మావతారుడు రాము డితడు
నిర్మలచరితుడు దేవుడు
మర్మము తెలియని మనసుగలాడు
కర్మానుబంధవిఘటనకారుడు


హరిని జూడరే

హరిని చూడరే శ్రీహరిని చూడరే వాడు

ధరకు శ్రీరాముడై దయచేసెనే


హరిని చూడరే వా డందరి మేలుదలచి

నరుడై జీవించగ నడచివచ్చెనే

పరమాత్ముడై గూడ నరమాత్రుడాయెనా

హరిని తానన్నదే మరచి యుండునే


హరిని చూడరే వాడు సురవైరి గణముల

పరిమార్చి యసురేశు బట్టిచంపెనే

సరిసిజాసనుడు పొగడ శంకరుడు పొగడగ

నరుడ దాశరథి నని నగుచు బల్కెనే


హరిని చూడరే వాడు భక్తులందరకు నెపుడు

వరదుడై యుండునే పరమప్రీతితో

కరుణతో భక్తులకు కైవల్య మిచ్చునే

హరిని నేననుచు నగవు తెరల బల్కునే


పలుకరో . . . .

పలుకరో యినకులతిలక శ్రీరామ యని

పలుకరో సద్భక్తవరద శ్రీహరి యని


పలుకరో సురగణప్రార్ధిత హరి యని 

పలుకరో దశరథవంశవర్ధన యని

పలుకరో శివచాపభంజక రామ యని

పలుకరో జానకీప్రాణనాయక యని


పలుకరో కాననవాసదీక్షిత యని

పలుకరో విదళితబహుదనుజగణ యని

పలుకరో సుగ్రీవ భయవినాశక యని

పలుకరో పౌలస్త్యవంశనాశక యని


పలుకరో నినుచాల భక్తి గొల్చెదమని

పలుకరో కైవల్యపదము వాంఛింతుమని

పలుకరో యన్యదైవముల నెంచబోమని

పలుకరో శ్రీరామ పాహిమాం పాహియని


7, ఏప్రిల్ 2021, బుధవారం

రామనామము చేయరా

 రామనామము చేయరా రామనామము చేయరా

రామనామము చేసి పొందగ రాని దేమియు లేదురా


రాజయోగము లున్నను గ్రహము లొప్ప కున్నవా

రాజయోగము నీకు కూర్చగ రామనామము చాలురా


నాగబంధము.లట్టుల రాగద్వేషము లున్నవా

రాగద్వేషము లణచి వేయగ రామనామము చాలురా


తామసత్వము వదలగ తరము కాక యున్నదా

తామసత్వము తరిమి వేయగ రామనామము చాలురా


పామరత్వము వీడగ వలనుగాక యున్నదా

పామరత్వము తొలగ జేయగ రామనామము చాలురా


కామితార్ధము లున్నవా రామనామము చేయరా

కామితార్ధము లన్ని యీయగ రామనామము చాలురా


ఏమి రా భవసాగరం బెట్లు దాటుదు నందువా

ఈమహాభవసాగరమున రామనామమె నౌకరా

6, ఏప్రిల్ 2021, మంగళవారం

దశరథనందన దాశరథీ

 దశరదనందన దాశరథీ జయ

దశముఖమర్దన దాశరథీ


కరుణాసముద్ర కల్యాణగాత్ర

దరహాసవదన దాశరథీ

పరమేష్ఠినుత పరమేశనుత భవ

తరణైకనౌకా దాశరథీ


శరనిథిబంధన సత్యపరాక్రమ

తరణికులేశ్వర దాశరథీ

పరమగంభీర పరమోదార సుం

దరతరవిగ్రహ దాశరథీ


మునిగణచర్చిత హనూమదర్చిత

దనుజాంతక హరి దాశరథీ

జనకసుతావర వరసుగుణాకర హే

ధనుష్మదగ్రణి దాశరథీ


4, ఏప్రిల్ 2021, ఆదివారం

రామా రామా రామా యనరాద టయ్యా

రామా రామా రామా యనరాద టయ్యా ఈ
రాముడు నావా డనరాద టయ్యా

రాముడే రక్షకు డనరాద టయ్యా ఈ
రాముడే నాతో డనరాద టయ్యా
రాముడే పోషకు డనరాద టయ్యా ఈ
రాముడే జీవన మనరాద టయ్యా

రాముడే కేశవు డనరాద టయ్యా ఈ
రాముడే శంకరు డనరాద టయ్యా
రాముడే గణపతి యనరాద టయ్యా ఈ
రాముడే బ్రహ్మం బనరాద టయ్యా

రాముడే వరదుం డనరాద టయ్యా ఈ
రాముడే మోక్షదు డనరాద టయ్యా
రాముడే జనకుం డనరాద టయ్యా ఈ
రాముడే దిక్కన రాదటయ్యా


3, ఏప్రిల్ 2021, శనివారం

రామా నినే నమ్మితి

రామా నినే నమ్మితి నిక  రక్షించుట నీవంతు

సామాన్యుల నుధ్ధరించు సద్వ్రతమే సాగించు


రాముడే సకలలోక రక్షకుడని చాటితిని

రాముడే శరణమని రచ్చరచ్ఛ చేసితిని

నామాట వమ్ముచేసి నవ్వులపాల్చేయక

రామా రక్షించవయ్య రాజీవలోచన


కామారినుతుడ వని కడులెస్సగ చాటితిని

స్వామి నీకు యముడైన చాలవెఱచు నంటిని

రామా యనువారికెల్ల రక్షణ కలదంటిని

నామాట నిలబెట్టుట నాతండ్రీ నీవంతు


ఇపుడు వచ్ఛి నీవు రక్షించకున్నా వనుకో

కపటివైపోదు వీవు కల్లలగు నామాటలు

కృపణులైన జనులేవో విపరీతము లాడనేల

నృపకులోత్తమ రామ నేడే రక్షించ వయ్య


2, ఏప్రిల్ 2021, శుక్రవారం

పాహిపాహి శ్రీరామ పతితపావన

పాహిపాహి శ్రీరామ పతితపావన

పాహి శ్రీజానకీవర జనార్దన


పాహిపాహి అతిలోకమోహనాకార

పాహి కారుణ్యధామ పరమోదార

పాహి జగదీశ భవబంధనవిదార

పాహిమాం పాహిమాం భక్తమందార


పాహిపాహి సుజనసంభావితాకార

పాహి యోగిరాజహృద్భవనసంచార

పాహి పాపాంధకారభాస్కరాకార

పాహిమాం పాహిమాం భక్తమందార


పాహిపాహి లోకైకపావనాకార

పాహి రఘువీర పతితపావనాకార

పాహి గర్వితామరారివంశసంహార

పాహిమాం పాహిమాం భక్తమందార