20, ఏప్రిల్ 2021, మంగళవారం

అందమైన రామనామము

 అందమైన రామనామ మందుకోండి దీని

నందుకొన్న వారిదే యదృష్టమండీ


నాతి సీత కమితరుచి నాటుకొన్న రామనామము 

వీతరాగులకు రుచి విహితమైన రామనామము

కోతిమూక కెంతోరుచి గొలుపునదీ రామనామము

రాతికొండ కైన రుచి రమ్యమైన రామనామము


చేతోమోదమును గూర్చు చేయుకొలది రామనామము

ప్రీతితోడ రక్షించును ప్రియముగొల్పు రామనామము

పాతకముల హరించునీ పావనమగు రామనామము

భీతినణచి జయమునిచ్చు వేడ్కగొల్పు రామనామము


మూడులోకముల లోన పూజ్యతమము రామనామము

వేడుకతో నద్రిజావరు డాడిపాడు రామనామము

కూడి భాగవతులు కొలుచుకొనుచు నుండు రామనామము

నేడు నన్నుధ్ధరించు వేడుకగల రామనామము


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.