13, ఏప్రిల్ 2021, మంగళవారం

నీవే రక్ష శ్రీరామ

నీవే రక్ష శ్రీరామ నిశ్చయంబుగ

కావవయ్య మమ్ము కరుణామయా


గ్రామాధిపతికి నగరాధిపతి రక్ష

రామా నగరాధిపతికి భూమిపతి రక్ష

భూమిపతులకు సార్వభౌముడే రక్ష

రామా రాజాధిరాజ రక్షకా


రాజులందర కీవే రక్ష యనగ సుర

రాజునకును చూడ నీవే రక్షకుడవుగా

నీజయశీలమే నిఖిలజగద్రక్ష

రాజశేఖరనుత రామరాజేంద్రా


రక్ష వీవు నృపులకు ప్రజల కందరకు

రక్ష వీవు మాబోంట్లు రామభక్తులకు

రక్షవై భవసాగరంబు దాటించుము

రక్షితామరా రామ శిక్షితాసురా