8, ఏప్రిల్ 2021, గురువారం

హరిని జూడరే

హరిని చూడరే శ్రీహరిని చూడరే వాడు

ధరకు శ్రీరాముడై దయచేసెనే


హరిని చూడరే వా డందరి మేలుదలచి

నరుడై జీవించగ నడచివచ్చెనే

పరమాత్ముడై గూడ నరమాత్రుడాయెనా

హరిని తానన్నదే మరచి యుండునే


హరిని చూడరే వాడు సురవైరి గణముల

పరిమార్చి యసురేశు బట్టిచంపెనే

సరిసిజాసనుడు పొగడ శంకరుడు పొగడగ

నరుడ దాశరథి నని నగుచు బల్కెనే


హరిని చూడరే వాడు భక్తులందరకు నెపుడు

వరదుడై యుండునే పరమప్రీతితో

కరుణతో భక్తులకు కైవల్య మిచ్చునే

హరిని నేననుచు నగవు తెరల బల్కునే


4 కామెంట్‌లు:

  1. హరినామ సంకీర్తన చాలబాగుంది. శ్రీ హరుడే నీతో వ్రాయిచుకున్నట్లుంది.

    రిప్లయితొలగించండి
  2. నోరార రామదాసుడు
    శ్రీరాముని 'హరినిజూడరే' యని పాడెన్ ,
    తీరా , కట్టెదుట శుభా
    కారత వసుదేవ సుతునిగా కనుపించెన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునా అండీ. యద్భావం తద్భవతి. భావగ్రాహి జనార్దనః అన్నారు కదా. ఒక ఐతిహ్యం గుర్తుకు వస్తోంది. ఒకచోట దేవాలయంలో విగ్రహప్రతిష్ఠ. తులసీదాసు గారూ వచ్చారు. ఎవరో ఆయనను మేలమాడారు. దాసుగారూ రాముడు కాదండీ ఇక్కడ కృష్ణుడూ అని. నాయనా రాముడే అనుకున్నానే అన్నారు జవాబుగా దాసుగారు. హారతి ఇచ్చి తెరతీసారు అర్చకులు. రక్మిణీసత్యభామాసమేతుడైన కృష్ణుడు కాదు సీతాలక్ష్మణసమేతుడైన శ్రీరామచంద్రుడు దర్శనం ఇచ్చాడు. అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. ఋషీణాం పునరాద్యానాం వాచమర్ధోనుధావతి!

      తొలగించండి
    2. ప్రద్యుమ్ను డీతడు ప్రవ్యక్తమై సృష్టి
      రచియించు నప్పుడు రమణ మీర
      అనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టిని
      కాచి రక్షించు ప్రకరణ మందు
      సంకర్షణు డితడు సకల సృష్టి హరించు
      పట్టున ప్రళయ తాపములయందు
      వాసుదేవు డితడు వర పరమాత్మయై
      సర్వము తానయి పర్వునపుడు

      విష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచు
      వేద వేద్యు లరసి వేడు నపుడు
      చిన్ని కృష్ణు డితడు చేరి యశోద యొ
      డికి చనుగుడియునపు , డితడె హరియు .

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.