13, ఏప్రిల్ 2021, మంగళవారం

శుభవృష్టిమేఘమా

శుభవృష్టిమేఘమా సుందరతరమేఘమా

విభుతనెఱపి ప్రోవవే వీరమేఘమా


నల్లనివాడ వైతేనేమి నమ్మదగినవాడవు

చల్లని సామివే నీవు చక్కనిమేఘమా

అల్లన నీయండజేరు నందరిబాగు చూచెదవు

కల్లకపట మెఱుగని కాలమేఘమా


అమృతమున బుట్టితివి యంబుధిని కట్టితివి

సమృధ్ధిగ మునులకెల్ల సత్తువిస్తివి

అమృతాశనుల పీడ లంతరింపజేసితివి

అమృతోపమానచరిత నలరుమేఘమా


తక్షణమే ఆర్తిబాపు దయావృష్టిమేఘమా

నిక్షేపము నీవే మాకు  నీలమఘమా

దక్షతతో లోకశాంతి దాయివగుచు సద్భక్త

రక్షణాదీక్ష నొప్పు రామమేఘమా