27, ఏప్రిల్ 2021, మంగళవారం

ఉత్తరకాండ.వాల్మీకి కృతమే

రామాయణం మహాకావ్యం

అది గాయత్రీమంత్రవ్యాఖ్యానస్వరూపం.

గాయత్రి చతుర్వింశతిబీజాక్షరసంపుటి కల మంత్రం.

న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్ 

అని నానుడి.

రామాయణం చతుర్వింశతిసహస్రశ్లోక సంపుటి కల కావ్యం.

వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే

వేదః ప్రాచేతసదాశీత్ సాక్షాద్రామారణాత్మనా

అని రామాయణప్రశస్తి.

వాల్మీకులవారు రామాయణకావ్యంలో గాయత్రీమంత్రాన్ని నిక్షేపించారు. వేయిశ్లోకాలకు ఒక గాయత్రీ బీజాక్షరం ప్రయోగించి.

ఉత్తరకాండసహితంగానే రామాయణంలో ఇరువదినాలుగు వేల శ్లోకాలు అవుతున్నాయి.

అందుచేత ఉత్తరకాండ వాల్మీకివిరచితమే కాని ప్రక్షిప్తం కాదు. కానేరదు.

మరొకమాట.

కావ్యం మంగళమయంగా ఉండాలి. ఆదిమధ్యాంతములయందు మంగళం సూచించబడాలి.

రామాయణంలో ఆది జగత్కల్యాణకారకమైన రామావతారం మంగళసూచకం.

రామచంద్రుడు దుష్టుడైన రావణుని సంహరించి నిజపురాని విచ్చేసి పట్టాభిరాముడు కావటం లోకకళ్యాణసూచకం.  ఇది ఉత్తరకాండసహిత రామాయణకథలో ముఖ్యఘట్టం.

శ్రీహరి రాముడై పదునొకండువేల సంవత్సరాలు సామ్రాజ్యాన్ని పాలించి అలతారసమాప్తి చేసి వైకుంఠం చేరువేళ రామవియోగాన్ని సహించలేని పురజనులు ఆయనను అనుగమించి వచ్చారు. వారందరికీ హరి ఉత్తమగతిని అనుగ్రహించి బ్రహ్మచే వారికై ప్రత్యేకంగా ఒక లోకమే సృజింపజేసారు. అక్కడ ఆప్రజకు హరి సీతాలక్ష్మణసమేతుడైన రామచంద్రుడిగా నిత్యసన్నిహితుడై యున్నాడు. ఇలా ఉత్తర కాండలో కావ్యాంతమంగళం చెప్పారు భగవాన్ వాల్మీకులవారు.

ఇలా ఉత్తర కాండతో కూడి మంగళత్రయయుక్తమై రామాయణం త్రిజగన్మంగళకారకమై శోభిల్లుతోంది.

రామాయణకథను నాలుగవతరగతి పిల్లలకోసం రెండు పేజీల పాఠంగా చూపవచ్చును. దాని అర్ధం రామాయణం చిన్నకథ అనో మరేమీ.విశేషం లేదనో కాదు. కేవలం రుచి చూపటానికి మాత్రమే అనే కదా అర్ధం. అలాగే అనేకులైన కవులూ నాటకకర్తలూ ఇతరకళాకారులు తమధోరణిలో చేప్పేది ఏదైనా రాముడి గురించి కొంత అవగాహన కలిగించాలనే.  ఇలా వాటిప్రయోజనం.వాటికి తప్పకుండా ఉంది.

మూలరామాయణం.ఆధారంగానే తప్ప ఇతర విధాలుగా రామకథను కాని తత్కథాంతర్గత పాత్రలను కాని విమర్శిచటం తరచుగా తప్పుడు సంకేతాలను ప్రచారం చేస్తుంది లోకంలో.