27, ఏప్రిల్ 2021, మంగళవారం

మాయామానుషరూప

మాయామానుషరూప మంగళరూప ముని

ధ్యేయశుభదరూప దయాస్వరూప


సకలధర్మస్వరూప సత్యస్వరూప

సకలదానవవంశసంహారరూప

సకలార్తినాశరూప శాంతస్వరూప

శుకాదియోగీంద్రసంసస్తుత్యస్వరూప


భవపంకవిశోషణ భానుస్వరూప

భవమహారణ్యదావాగ్నిస్వరూప

భవమదోన్మత్తనాగపంచాస్యరూప

భవమహారోగధన్వంతరిస్వరూప


శోకమోహాంతకసుశోభనరూప

శ్రీకరార్చితరూప శ్రీకరస్వరూప

సాకేతసామ్రాజ్యచక్రవర్తిరూప

భూకన్యాయుతరామభూపాలరూప3 కామెంట్‌లు:

 1. బహు చక్కటి కీర్తన.

  భవపంకవిశోషణ భానుస్వరూప భవమహారణ్యదావాగ్నిస్వరూప భవమదోన్మత్తనాగపంచాస్యరూప భవమహారోగధన్వంతరిస్వరూప

  పాపం/బురద లాంటి సంసారాన్ని అణగదొక్కే/ఆరబెట్టే భాను స్వరూపుడు,
  మహారణ్యం లాంటి సంసారాన్ని దావానంలా దహించే స్వరూపుడు, భవరోగాల నుండి విముక్తులను చేసే దేవవైద్యుడు...ఎంత చక్కటి వర్ణనో...

  అయితే, భవమదోన్మత ...ఇది అర్ధమైంది...నాగపంచాస్యరూప

  పంచాస్య అంటే శివుడు /సింహం అని అర్ధం చెప్తారు. నాగపంచాస్య అంటే సర్పాభరణ శివుడనా.....ఇక్కడ అన్వయింపు అర్ధమై అర్ధంకానట్లు ఉందండి. అన్యధా భావించక కాస్త వివరించరా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భారతి గారు‌, నాగశబ్దానికి ఏనుగు అని కూడా ఒక అర్ధం ఉన్నదండీ. మన పోతన్న గారు "విహ్వలనాగేంద్రము పాహి పాహి యన కుయ్యాలించి సురంభియై" అన్నారు చూడండి అలవైకుంఠపురంబులో అన్న పద్యం ముగింపుగా.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.