8, ఏప్రిల్ 2021, గురువారం

చిల్లరమల్లర చేతలు


చిల్లరమల్లర చేతలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపడే చేతలేల హాయిగ రాముని సేవించర

చిల్లరమల్లర మాటలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే మాటలేలర  హాయిగ రామా రామా యనర


చిల్లరమల్లర చూపులు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిచేసే చూపు లనింక హాయిగ రాముని పైన నిల్పర

చిల్లరమల్లర బుధ్ధులు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపడగ నేల బుధ్ధిని హాయిగ రామునకే యర్పించర

చిల్లరమల్లర రాతలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే రాతలేలర  హాయిగ రాముని గూర్చి వ్రాయర


చిల్లరమల్లర స్నేహాలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే స్నేహాలేల హాయిగ రాముని స్నేహముండగ

చిల్లరమల్లర బంధాలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే బంధాలేల హాయిగ రాముని అండ చేరర

చిల్లరమల్లర వృత్తులు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే వృత్తులేలర హాయగు రామదాస్య ముండగ

చిల్లర మల్లర కొలువులు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే కొలువులేలర హాయిగ రాముని కొలువుండగను

చిల్లరమల్లర పూజలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే పూజలేలర హాయిగ రాముని పూజించుముర

చిల్లరమల్లర ఆశలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే ఆశలేలర ఆశించర శ్రీరాముని కృపను

చిల్లరమల్లర గురువులు ని న్నల్లరిపాలు చేతురు
అల్లరిపెట్టే గురువులేలర ఆరాముని గురువనుకొనర

చిల్లరమల్లర విద్యలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే విద్యలేలర హాయగు రామవిద్య యుండగ

చిల్లరమల్లర యోగాలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే యోగాలేలర హాయగు రామయోగ యుండగ

చిల్లరమల్లర సంపదలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టే సంపదలేల హాయగు రామరత్న ముండగ

చిల్లరమల్లర బేధాలు ని న్నల్లరిపాలు చేయును
అల్లరిపెట్టు విబేధాలేలర అందరు రాముని వారై యుండగ