7, ఏప్రిల్ 2021, బుధవారం

రామనామము చేయరా

 రామనామము చేయరా రామనామము చేయరా

రామనామము చేసి పొందగ రాని దేమియు లేదురా


రాజయోగము లున్నను గ్రహము లొప్ప కున్నవా

రాజయోగము నీకు కూర్చగ రామనామము చాలురా


నాగబంధము.లట్టుల రాగద్వేషము లున్నవా

రాగద్వేషము లణచి వేయగ రామనామము చాలురా


తామసత్వము వదలగ తరము కాక యున్నదా

తామసత్వము తరిమి వేయగ రామనామము చాలురా


పామరత్వము వీడగ వలనుగాక యున్నదా

పామరత్వము తొలగ జేయగ రామనామము చాలురా


కామితార్ధము లున్నవా రామనామము చేయరా

కామితార్ధము లన్ని యీయగ రామనామము చాలురా


ఏమి రా భవసాగరం బెట్లు దాటుదు నందువా

ఈమహాభవసాగరమున రామనామమె నౌకరా