18, ఫిబ్రవరి 2019, సోమవారం

రాజకీయ బెదిరింపుల స్వామీజీ!


ఈ రోజున వచ్చిన ప్రముఖ వార్త  చంద్రబాబుపై కేసు పెడతా.. రాజశ్యామల యాగం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు  అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నది. ఈ వార్త వార్తాపత్రికల్లో ప్రముఖంగానే వచ్చింది.

స్వామీజీ గారి ఈ రాజకీయ ప్రకటన పట్ల నిరసనలు వ్యక్తం కావటంతో ఆయన మాటమార్చి ముఖ్యమంత్రిపై కేసు పెడతానని చెప్పలేదని.. టీటీడీలో అక్రమాలపై ప్రభుత్వంపై కేసు పెడతానన్నానని సెలవిచ్చారట.

విశాఖపట్టణంలో ఉన్నది శారదాపీఠం అని వింటున్నాను. శారద సౌమ్యదేవతాస్వరూపిణి. సర్వశుక్లా సరస్వతీ అని ఆవిడ నిత్యం ప్రసన్నమైన శుధ్ధసాత్వికస్వరూపంగా ఉండాలి. అలా ఉంటుందని, కనీసం అలా మొన్నటివరకూ ఉండేదని అనుకుంటున్నాను.

ఈ క్రింది ఫిబ్రవరి 11నాటి  TV5 news పేజీ లోని వార్తను చూడండి

విశాఖ శారదాపీఠంలో శ్రీశారదా చంద్రమౌళీశ్వర సమేత పరివారదేవతా శిలా ఉత్సవ ప్రతిష్టాపన ఘనంగా మొదలైంది… గణపతిపూజ, పుణ్యాహవచనంతో ఉత్సవాన్ని ప్రారంభించారు. విశాఖ శ్రీశారదా అమ్మవారిగా ఇక్కడ పీఠంలో కొలువై అనాదిగా పూజలందుకుంటోన్న అమ్మవారు రాజశ్యామల యంత్ర మహిమతో ఎంతో మహిమాన్వితురాలై విరాజిల్లుతోంది… ఆలయ పునఃప్రతిష్ట సందర్భంగా శ్రీ శారదా అమ్మవారికి రాజశ్యామల అమ్మవారి నామాన్ని కూడా జోడించి మరింత శక్తిని ఆవాహన చేయడం ఈ క్రతువులో ప్రత్యేకత…ఇందుకోసం చతుర్వేద రుగ్వేద పారాయణం, రాజశ్యామల యాగం, వనదుర్గమూల మంత్ర హోమాల ఏకకాలంలో నిర్వహించారు.

జగద్గురు ఆదిశంకరాచార్యులు శృంగేరిలో ప్రతిష్టించిన దక్షిణామ్నాయపీఠానికి ఉపపీఠంగా ప్రసిద్ధి చెందిన విశాఖ శ్రీ శారదాపీఠంలో కొలువుకాబోయే అమ్మవారు ఇకపై శ్రీ శారదా సహిత రాజశ్యామల అమ్మవారిగా భక్తులను అనుగ్రహించనుంది… అమ్వారితోపాటు చంద్రమౌళీశ్వర స్వామి, విజయగణపతి, వనదుర్గ అమ్వార్ల ప్రతిష్ట కూడా నిర్వహిస్తున్నారు… ఇందుకోసం చతుర్వేద వాహనాన్ని పండితులు ప్రారంభించారు…ఎంతో పవిత్రమైన ఈ క్రతువులో పాల్గొన్న వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు…

దీనిని బట్టి నాకు అర్థం ఐనది ఏమిటంటే శుద్ద్గసాత్వికరూపిణీ ఐన శారదా అమ్మవారిని ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి గారు రాజశ్యామలగా మార్చారు.

ఇది చిత్రంగా ఉంది!  ఈ కారణంగా ఐనా దేవతా స్వరూపం యొక్క ప్రతిష్ఠ ఉగ్రమూర్తిగా ఉంటే శక్తిమంతులూ లోకహితకాములూ ఐన స్వాములు యంత్రప్రతిష్ఠాదుల ద్వారా సాత్వికమూర్తిగా మార్చటాన్ని విన్నాం కాని తద్విలోమంగా జరగటం వినలేదు.

మాటవరసకు, ర్యాలిలో గ్రామదేవత సరస్వతీ అమ్మవారు. ఆవిడ ఉగ్రరూపిణిగా ఉండి జనబాహుళ్యాన్ని హడలెత్తిస్తూ ఉంటే శ్రీ ఆది శంకరాచార్యులవారు యంత్రప్రతిష్ఠ చేసి అమ్మవారిని సౌమ్యురాలిగా చేసారని ఐతిహ్యం.

మరొక చిత్రమైన సంగతి గమనించండి. శృంగేరీ పీఠం దక్షిణామ్నాయసంప్రదాయానికి చెందినది. వారిది సమయమతం. అటువంటి సంప్రదాయిక పీఠానికి అధిపతి ఒకరు దేవతామూర్తిని ఉగ్రదేవతగా చేయటం నభూతోనభవిష్యతి!

పూర్తిగా అనుచితమైన చర్య ఇది!

ఏప్రిల్ 9 2018 నాటి ఒక బ్లాగు టపాలో ఈ విధంగా ఉంది.
మాతంగి దశమహావిద్యలలో ఒక దేవత. ఈమెకు శ్యామలా అని మరియొక పేరు. మతంగ ఋషి దర్శించిన దేవత కనుక ఈమెకు మాతంగి అని పేరు వచ్చి ఉండవచ్చు. కొన్ని మతముల ప్రకారము సరస్వతి ఉగ్రరూపమే మాతంగిగా తెలుస్తున్నది. మాతంగి సాధన వామ, కౌళాచారములలో చాలా ప్రసిద్ధి చెందినది. ప్రాణతోసిని తంత్రము ప్రకారము పార్వతీదేవి శివునితో ఒకచండాల స్త్రీరూపంలో సంగమిస్తుంది. ఆ రూపము దశమహావిద్యలలో ప్రఖ్యాతరూపముగా పరిణమించిందని చెబుతారు. మాతంగి సాధనలో ఉచ్చిష్ఠ చండాలి, రాజశ్యామల, హసంతీశ్యామల, రక్తశ్యామల, శారికాశ్యామల, వీణాశ్యామల, వేణుశ్యామల, లఘుశ్యామల అను విద్యలు కలవు.

రాజకీయంగా విజయం సాధించుటకు, కవిత్వసాధనకు, సంగీతవిద్యలో నిష్ణాతులగుటకు ఈ మంత్ర సాధనలు ఉపయోగపడతాయి.

ఈ ప్రకారంగా మనకు రాజశ్యామల అనే దేవీ రూపం ఉగ్రదేవత అని తెలుస్తున్నది.  ఈ విద్య కౌళమార్గానికి చెందిన వామాచారము అని తెలుస్తున్నది.

శ్రీ ఆది శంకరులు స్థాపించిన శృంగేరీపీఠానికి చెందిన మఠంలో, ఆదిశంకరులు నిషేధించిన కౌళమార్గంలో దేవీ ప్రతిష్ఠలూ పూజలూ సముచితం కాదు కదా!

ఈ స్వరూపానందేంద్రసరస్వతీ స్వామి విధానం అంతా చిత్రంగా ఉంది. రాజకీయాలలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొనటం, పాల్గొనటం వంటివి శంకరస్వాములు చేయటం చిత్రమైన విషయం.

ఈయన విమతావలంబకుడైన ఒక రాజకీయ నేతతో మిత్రపూర్వకంగా మెలగుతూ ఆయన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. మరొక వేరే రాష్ట్రానికి చెందిన నేత, ఆంద్రదేశంపై విషం చిమ్ముతూ మాట్లాడుతూ ఉన్నా, ఆయనపై అవ్యాజానురాగం కురిపిస్తూ వారి అభ్యున్నతికోసం రాజశ్యామల యాగాలు చేయిస్తూ ఉంటారు.

తనకాళ్ళకు మ్రొక్కటం లేదనే అక్కసుతో ఆంద్రముఖ్యమంత్రి దిగిపోవాలీ ఆయన ప్రభుత్వం పడిపోవాలీ అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు.

ఈయన ఒక గౌరవనీయుడైన పీఠాధిపతి! అభిచారహోమాలు చేయిస్తూ ఉంటాడు!

ఇదిలా ఉండగా బీసీలకు రాజ్యాధికారం కోసం 'రాజశ్యామల హోమం' అంటూ మొన్న 8న వచ్చిన ఒక వార్త ప్రకారం 9వ తారీఖున శనివారం గుంతకల్లులో రాజశ్యామల హోమం జరిగింది.

ఫిబ్రవరి 11న మాట్లాడుతూ స్వరూపానందేంద్ర సరస్వతీ గారు అన్నమాటల ప్రకారం రాజశ్యామల అమ్మవారిని పూజించి, అర్చన చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని, ఉగ్రవాద సమస్యలు తొలిగి శత్రువులు పలాయనమవుతారు!

ఫిబ్రవరి 14న జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ దళంపై దాడి జరిగింది. అందులో 40 మందికి పైగా జవాన్లు మృతి చెందారు.

ఐతే ఈ రాజశ్యామల హోమాల వలన దేశం సుభిక్ష్హంగా ఉండి ఉగ్రవాదులు పలాయనం అయ్యే పక్షంలో 14న జరిగిన ఘోరం జరగకుండా ఉండాలి కదా!

బహుశః, అలా ఉద్దేశించి ఆ హోమం చేయవలసి ఉంటుందా? 11న స్వామి వారు అన్న మాట ప్రకారం అటువంటి అవసరం ఉండకూడదే!

ఈ స్వరూపానందేంద్ర గారు  ఇటు విశాఖపరువూ అటు శృంగేరీజగద్గురు పీఠం పరువూ తీస్తున్నారు.

ఈయన ఇటు ఆంధ్రావని పరువూ అటు పవిత్రమైన సన్యాసాశ్రమం పరువూ కూడా తీస్తున్నారు.

ఈయన వలన కేసీఆర్ గెలిచారట.

ఎంత గొప్ప మాట!

[ ఏదీ చూదాం, ఈ స్వరూపానందేంద్ర గారిని మరొక వందరాజశ్యామల యాగాలు చేసి ఐనా తప్పించమనండి, తెలంగాణాకు తగులుకొన్న త్రిశతవర్షభోక్తవ్యమైన శాపాన్ని! దీర్ఘశాపం కనుక క్రమశః అనుభవంలోనికి వస్తుంది! నాయకుల దుష్ప్రవర్తనకు ప్రజలు కూడా ఫలం అనుభవించవలసిందే! ముఖ్యంగా అట్టి వర్తనను అనుమోదించినందుకు!  ఏదీ ఈ స్వరూపానందేంద్రను తప్పించమనండి చూదాం. ]

ఎందుకు వచ్చిన ప్రగల్భాలు!

పీఠాధిపత్యాన్ని కలుషితం చేస్తున్న ఈ స్వామికి ఎటువంటి ఉత్తరగతులో శ్రీమద్రామాయణం ఉత్తరకాండలో స్పష్టంగానే ఉంది కదా.

శాంతమ్ పాపమ్.

16 కామెంట్‌లు:

  1. ఆవార్తలు నేనూ చదివాను. అయినా ఒబామాని K A పాల్ అమెరికా అధ్యక్షుడిగా చేయగాలేనిది ఈయన కేసీయార్ ని ముఖ్యమంత్రిగా చేయడంలో ఆశ్చర్యం లేదు!!
    స్వామివారు కాశ్మీర్ వెళ్లి పాకిస్తాన్ వాళ్ళ దుంపతెంచే యాగం ఏదైనా చెయ్యొచ్చుకదా. ఆంధ్రానడిబొడ్డులో అరవడం దేనికి?!

    రిప్లయితొలగించండి
  2. >>>ఏదీ చూదాం, ఆయన్ను మరొక వందరాజశ్యామల యాగాలు చేసి ఐనా తప్పించమనండి, తెలంగాణాకు తగులుకొన్న త్రిశతవర్షభోక్తవ్యమైన శాపం నుండి! దీర్ఘశాపం కనుక క్రమశః అనుభవంలోనికి వస్తుంది! నాయకుల దుష్ప్రవర్తనకు ప్రజలు కూడా ఫలం అనుభవించవలసిందే! ముఖ్యంగా అట్టి వర్తనను అనుమోదించినందుకు! ఏదీ ఈయన్ను తప్పించమనండి చూదాం.>>>

    ఈ వ్యాఖ్య చదివి నవ్వుకున్నాను. కేసీఆర్ గారిని తప్పించడం సులువే దానివల్ల మనకొచ్చే లాభం ఏమిటీ ? మనకేం కావాలో అది అడగాలి. రామ భక్తులు కాబట్టి రామాలయం అడిగినా కట్టేయవచ్చు కానీ ఆ రామాలయంలో శక్తిని ఆవాహనం చేసేవారెవరు ? అసాధ్యమనుకున్న ముఖ్య మంత్రి పీఠం రాజశేఖర్ రెడ్డిగారు అధిరోహించి సాధ్యం చేసి చూపించారు కదా ? కేసీఆర్ కే మంత్ర శక్తి ఉంది. ఆయనని ఎవరో గెలిపించడం ఏమిటీ ? అందితే జుట్టు అందకపొతే కాళ్ళు పట్టుకుంటే గెలుస్తారు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను ఈ స్వాములవారిని తప్పించండి చూదాం అని అడిగింది కేసీఆర్ గారిని కాదు. ఆయనతో నాకేమీ నిమిత్తం లేదు. బహుశః వాక్యంలో కొంచెం అన్వయక్లిష్టత ఉందేమో సరిచేస్తాను.

      తొలగించండి
  3. యాగాలు గట్రా చేస్తే గద్దె ఎక్కవచ్చనుకుంటే మానిఫెస్టోలు, ప్రచారాలు వగైరాలు ఎందుకు? ఇరు పక్షాల వారు తమకు ఇష్టం వచ్చిన స్వాములతో పోటీ పడి యాగాలు చేయిస్తే సరిపోతుంది. ఎవరి అను"కుల" మీడియా వాటిని ప్రత్యక్ష ప్ర"చా"రం చేస్తుంది కనుక భక్తజనులకు సందడే సందడి.

    మంత్రాలకు చింతకాయలూ రాలవు. జనాదేశం ముందు శాపాలన్నీ బలాదూర్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తనమంత్రాలకే ఇంతకాయ రాలి కేసీఆర్ ఒళ్ళో పడిందని ఈస్వామీజీ డప్పేసుకుంటూన్నారు. ఇకపోతే పాపాలూ శాపాలూ జనంచేత చప్పట్లు కొట్టించుకున్నంత మాత్రాన్నే నివృత్తి కావు! అవశ్యమనుభోక్తవ్యం అని గ్రహించగలరు.

      తొలగించండి
    2. నేను ఆయన వ్యాఖ్యలు చూడలేదు, వ్యాసంలో ఇచ్చిన లింకులు ఎంతవరకు "నమ్మబుల్" చెప్పలేము. అంచేత స్వామీజీ డప్పేసుకుంటున్నారో లేదా ఆయన డప్పేసుకుంటున్నట్టు "ఫలానా మీడియా" డప్పేస్తుందో తెలీదు.

      ఏదేమయినా ఒక్క మానవమాత్రుడు ఏవో నాలుగు మాటలతో ఎదో అద్భుతం/విఘాతం సృష్టించగలడనుకోవడం అనుమానమే. ఇంకో పీఠాధిపతి ఊరూరా తిరిగి ప్రచారం చేసినా డిపాజిట్టులు దక్కలేదు.

      తొలగించండి
    3. జై గారూ,
      మీరు చిత్రంగా మాట్లాడుతున్నారు. ఆంధ్రలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వార్తావిశేషాలను మీరు వెయ్యికళ్ళతో గమనిస్తుంటారు. వీలైనంతగా ఎత్తిపొడుపు మాటలను విసరటానికి వాటికోసం మీరు గాలిస్తుంటారా అన్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబుపైన ధ్వజం ఎత్తి ఈస్వామి మాట్లాడినది మీదృష్టికి రాలేదంటే నమ్మటం కష్టమే. వ్యాసంలో ఉంటంకించిన లింకులు ఎంతవరకూ నమ్మదగ్గవీ అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయం ప్రముఖంగా అనేక వార్తాసంస్థలద్వారానే వెలుగుచూసిన వార్త కాని ఎవరో యూట్యూబులో వేసిన నిరాధారవార్త కాదే. అందుచేత ఒక్కఫలానా మీడియా అని తీసిపారేయటానికి యత్నించకండి.

      తొలగించండి
    4. నేను కొట్టిపారేయలేదండీ, సదరు వ్యాఖ్యలు నేను చూడలేదు అన్నాను. It is a fact that most vernacular media reports are slanted and/or selective.

      తొలగించండి
  4. జై గారూ స్వరూపానంద శాపం ఫలించి జగన్ గారు ముఖ్యమంత్రి అయితే చింతకాయలు రాలతాయంటారా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారూ, శాపానుగ్రహసమర్థుడైన వ్యక్తికి అభిచారహోమాలను ఆశ్రయించే అవస్థ ఎందుకుంటుంది చెప్పండి! తనకు అక్కరలేని ముఖ్యమంత్రి దిగిపోవాలనీ, కావలసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనీ మరో రాజశ్యామలయాగం చేస్తాడంతే!

      తొలగించండి
  5. మీరు ఇచ్చిన నాలుగు లింకులలో "చంద్రబాబునే బెదిరిస్తున్నారా..? స్వరూపానంద టార్గెట్ ఏంటి ..?" అన్న prideoftelugu.com కథనం & దీంట్లోని "కేసీఆర్ తనతో యాగాలు చేయించుకుంటున్నారని… గర్వమో.. జగన్మోహన్ రెడ్డి…కాళ్ల దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారనే.. అహంభావమో కానీ… స్వరూపానంద స్వామి.. మితిమీరిన రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు" వాక్యాలే మీ వ్యాసానికి అత్యంత చేరువగా ఉంది.

    It appears that this story is the chief (or only) source behind your strident remarks against this "godman".

    ఒకసారి ఈ రెండు లింకులు చూడండి:

    http://www.andhrajyothy.com/elections/districtarticle?SID=718213
    http://www.prideoftelugu.com/telugu/lagadapati-cotest-from-325/

    "తెరపైకి లగడపాటి.. అక్కడి నుంచే పోటీ.. టీడీపీ చాన్స్ ఇస్తుందా..?" అని శీర్షిక మార్చడం, "(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి):" అన్న క్రెడిట్ తొలగించడం మినహా "తెలుగోడి పొగరు" సైటు జ్యోతిని అక్షరం పొల్లుపోకుండా కాపీ కొట్టింది. They did not even bother to acknowledge the original source.

    http://www.prideoftelugu.com/telugu/ అన్న వీరి హోమ్ పేజీ చూస్తే ఒక్కటి కూడా వార్త కాదు, అన్నీ పావు వార్త ముక్కాలు ఊహాగానం కలిపిన కథనాలే. అన్ని కథనాలు ఒకే కులం/కుటుంబం/పార్టీ అనుకూలంగా రాసినవే. వీటిలో ఎన్ని సొంతమో ఎన్ని paid news లేదా plagiarism చెప్పజాలం.

    నా ఈ వ్యాఖ్యను "మీడియా" విశ్వసనీయత కోణంలోనే చూడమనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై గారూ, రాత్రిపూట నేనీ వ్యాసం వ్రాయటానికి ముందుగా ఆ ఉదయమే ఈనాడు ప్రింట్ ఎడిషన్ పేపర్లో వ్యాసానికి ఆధారమైన వార్తను చదవాను. మీరు ఈనాడు నమ్మదగినది కాదంటే ఇంక చెప్పవలసింది ఏముండదు.

      తొలగించండి
    2. మీరు ఈనాడు అని రాసి ఉండుంటే నేనూ అడిగే వాడిని కాదండీ.

      ఈనాడు "మ్రొక్కటం లేదనే అక్కసు" తరహా భాష వాడకపోవొచ్చు కానీ అది కూడా "అసమదీయ మీడియా", కాకపోతే గుడ్డిలో మెల్ల.

      తొలగించండి
  6. Yellow media is adept in Goebbels propaganda and in character assassination. Every media house has its own agenda. To hell with the sickular media. Request you not to jump to conclusions on swamijis.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పేరు తెలుగు వ్రాత ఆంగ్లమూ బుచికీ, మీకు నచ్చనిదంతా పచ్ఛనిదన్నమాట!

      తొలగించండి
    2. అయ్యా బుచికీ.. స్వామీజీ అయిన వ్యక్తి హుందాగా మాట్లాడాలిగాని డప్పేసుకోవడం రాజకీయ కామెంట్లు విసరడం సరికాదనేదే మా కంక్లూజన్.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.