21, ఫిబ్రవరి 2019, గురువారం

నీ దివ్యవిభూతియై నెగడు నీ విశ్వమున


నీ దివ్యవిభూతియై నెగడు నీ విశ్వమున
నీది కాని దిసుమంతయు లేదు లేదు లేదు

తొలుత నోం కారముచే తెలియదగిన బ్రహ్మమవు
వెలయించి నావు సృష్టి విస్తరించి విలాసముగ
సలలితముగ సకలచరాచరముల జొచ్చినావు
కలయజూడ బ్రహ్మాండము కాదు నీకు భిన్నము

సర్వభూతమయుడ వీవు సర్వసముడ వీవు
సర్వసృష్టిపోషకుడవు సర్వాంతరాత్ముడవు
సర్వేశుడ వఖిల సృష్టి శాసకుడవు నీవు
గర్వముడిగి నిన్ను నేను కడుభక్తి గొలుతును

హరి దహరాకాశవర్తి వగు నిన్ను రాముడ వని
పరమమోదమున నెఱింగి పరితృప్తుడ నైతి
నిరుపమాన మగు సృష్టిని నిన్ను వేరు నాక
నిరంతరము కీర్తింతును నిశ్చయము మహాత్మ



[ ఈ కీర్తన విష్ణుసహస్రనామములలోని 1వ నామం విశ్వమ్ అను దానికి వ్యాఖ్యాన పూర్వక సంకీర్తన.]