12, ఫిబ్రవరి 2019, మంగళవారం

దిక్కు రాము డొకడేనని


దిక్కు రాము డొకడేనని తెలిసివచ్చే నాటికే
యక్కటా ప్రాయమెల్ల నడుగంటేనే

ఆటపాటల బాల్యమందు రాముడంటే యెవ్వడో
నాటలేదు మనసులోన నాతప్పు లేదుకదా
పూటపూటకు బుధ్ధి పెంపొందుచున్న వయసులో
వాటమెరిగి పెద్దలైన వంటబట్ట చెప్పరుగా

పడతిపైన బిడ్డలపైన వల్లమాలినట్టి ప్రేమ
కడకు రామచింతననే కప్పె తప్పాయె కదా
బడసినట్టి విద్య లేవి ప్రభువువిషయ మింతైన
నుడువవుగా మోహములను విడువుమని చెప్పవుగా

నేడోరేపో తనువిది నేల బడగనున్న వేళ
వీడు రామచింతనలో పీకదాక మునిగినాడు
వేడుకతో నారాముడు వీనిపైన దయచూపిన
వీడుకూడ తరించును విబధులార నిక్కముగ