1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ఎన్నెన్ని మాటలన్న నిట్టే దులుపుకొందువు


ఎన్నెన్ని మాటలన్న నిట్టే దులుపుకొందువు
మన్నింతువు నీవు చాల మంచివాడవు

కష్టములకోర్వక కలహించి తిట్టినా
కష్టపెట్టుకొనక నెపుడు కాపాడుదువు
శిష్టులను నీ వుపేక్షింతువని తిట్టినా
దుష్టుడనక వాని కెపుడు తోడుందువే

నమ్మితే మోసగించినావని తిట్టినా
చెమ్మకనులు తుడువగా చేయిజాచెదు
ఇమ్మంటే దర్శనం బీయవని తిట్టినా
కమ్మగ మా కలలలోన కానవత్తువె

మ్రొక్కినా వరమీవని మిక్కిలి తిట్టినా
మక్కువతో వరములిచ్చి మన్నింతువు
తక్కువబుధ్ధిచే తాళలేక తిట్టినా
చక్కగ మము బ్రోచెదవో జానకీపతీ