8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

భువనమోహన రామ పుట్టిన దాదిగా


భువనమోహన రామ పుట్టిన దాదిగా
తవిలియుంటిని నిన్నే దయచూడవే

పుడమిని నినునమ్ము పుణ్యాత్ముల నీవు
విడువక రక్షించు విధము లన్నియు
గడచిన భవముల గట్టిగ గురువులు
నుడువ వివేకము బడసి యుంటి గాన

నిరుపమ గుణనిధివి నిన్నాశ్రయించిన
మరల పుట్టరన్న మాట యొక్కటి
తిరముగ నమ్మితి పరమాత్ముడ నను
తరియింప జేయవె కరుణావార్నిధి

నాలుక తారకనామము దాల్చెను
మేలుకల్గమి కేమి మిషగలదయ్య
చాలజన్మము లాయె సరిసరి యికనైన
పాలించ రాకున్న బాగుండదు సుమ్ము