18, ఫిబ్రవరి 2019, సోమవారం

వాడే గోపాలుడు వాడే గోవిండుడు


వాడే గోపాలుడు వాడే గోవిండుడు
వాడే శ్రీరాముడు పరబ్రహ్మము

వాడు భూమినాథు డనెడు ప్రఖ్య గలిగిన వాడు
వాడు భూమినుధ్ధరించి పాలించిన వాడు
వాడు భూమి మునుల కెల్ల  పరమనేత్రోత్సవము
వాడు  కాక కొలువదగిన వాడెవ్వడును లేడు

వాడింద్రియంబుల కెల్ల ప్రాణతత్త్వమైన వాడు
వాడు వేదవాక్కులచే బడయనైన వాడు
వాడు పరమపురుషుడైన వాడు పరంధాముడు
వాడు  కాక కొలువదగిన వాడెవ్వడును లేడు

వాడు మొన్న రఘువంశవర్థనుండన నెగడె
వాడు నిన్న యదుకులమును వర్థిల్లజేసె
వాడు సర్వవేళలందు భక్తసంపోషకుడు
వాడు  కాక కొలువదగిన వాడెవ్వడును లేడు



గోపతి. గవాంపతిః గోవులకు పతి, గోవేషధరుడైన విష్ణువు.
గౌః అనగా భూమి. భూమికి పతి.
గోః అనగా ఇంద్రియము.ఇంద్రియములకు రక్షకుడు - ముఖ్య ప్రాణతత్త్వము.

గోవిందుడు. గాం అవిందత్ ఇతి. భూమిని తిరిగి పొందెను. నష్టాం వై ధరణీం పూర్వ ద్మయ్వి ద్గుహాగతాం। గోవింద ఇతి తే నా౽౽హం దేవై ర్వాగ్వి రభిష్టుతః॥ (మహా. శాంతి. 342-70) పూర్వము పాతాళగుహను చేరి కనబడకపోయిన భూమిని తిరిగి ఈతడు మరల పొందెను అని దేవతలచే వాక్కులతో సమగ్రముగా స్తుతించబడితిని అని మోక్షధర్మపర్వమందు భగవద్వచనము. ఈ వచనముచే పైవ్యుత్పత్తిచే గోవింద శబ్ద మేర్పడుచున్నది. గో+విద్ -> గో విన్‍ద్‍ అ -> గోవిన్ద. హరివంశంలో ఇంద్రవచనం. అహం కిలేంద్రో దేవానాం। త్వం గవా మింద్రతాం గతః। గోవింద ఇతి లోకాస్త్వాం స్తోష్యంతి భువి శాశ్వతమ్॥ (హరి -2-19-45)నేను దేవతలకు ఇంద్రుడిగా ప్రసిధ్ధుడను, నీవు గోవులకు ఇంద్రత్వమును పొందితివి. అందుచే లోకములు నిన్ను భూలోకమున గోవులకు ఇంద్రుడవుగా శాశ్వతముగా గోవిందః అని స్తుతింతురు. గో+ఇంద్ర + ఇంద -> గోవింద. లేదా గౌ రేషాతు యతో వాణీ తం చ విందయంతే భవాన్। గోవిందస్తు తతో దేవ మునిభిః కథ్యతే భవాన్॥(హరి 3-88-50) ఈ వాక్కునకు(వాణికి) గౌః అని వ్యవహారము. నీవు ప్రాణులచే వాక్కును పొందింతువు. అందుచేత మునులచే నీవు గోవిందః అని చెప్పబడుతున్నావు. గాం విందయతే. గో+వింద -> గోవింద.

గోభః విందతే ఏవమ్. ఈతనిని ముముక్షువులు గోవుల(వాక్కుల)చే పొందుదురు. (వేదవచనములచే తెలిసికొందురు) గోభః వేత్తి ఏవ ముముక్షుః - ఈతని ముముక్షువులు వేదవాక్కుల చేతనే తెలిసికొనుచున్నారు. గోభి రేష యతో వేద్యో గోవిందః సముదాహృతః. - ఈతడు గోవులచే(వాక్కులచే) వేద్యుడు కాబట్టి గోవిందుడు అని విష్ణుతిలకమున కలదు.

రామ. నిత్యానందరూపుడగు ఈతనియందు యోగులు రమింతురు. రమన్తే యోగినో యస్మిన్ నిత్యానందే చిదాత్మని। ఇతి రామ పదేనైతత్ పరం బ్రహ్మో౽భిధీయతే॥ ఏ నిత్యానందచిదాత్ముని యందు యోగులు రమించు చుందురో అట్టివాడు అని అర్థమును తెలుపు రామ పదముచే ఈ పరబ్రహ్మము చెప్పబడుతున్నది. అని పద్మపురాణము. రమయంతి స్వేన రమణీయేన వపుషా ఇతి రామః తన సుందరమైన శరీరశోభచే ఆనందపరచు వాడు. తన ఇఛ్ఛ చొప్పున మిక్కిలి రమణీయమైన తనువు దాల్చిన దశరథరామునకు ఈ రామ పదము చెల్లును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.