21, ఫిబ్రవరి 2019, గురువారం

జనకుడా హరి నీకు జామాతగా దొరకె


జనకుడా హరి నీకు జామాతగా దొరకె
అనఘా యీ సీతయే యాదిలక్ష్మి గాన

దేవతల సంకల్పము తెలియుట దుస్సాధ్యము
దేవరాతునింట శివుని దివ్యధనువు నుంచిరి
భావింపగ నావింటిని పట్టి యెత్త హరు డొండె
శ్రీవిభు డొండె నరుల చేత నేమగునయ్య

యజ్ఞాంగుడు శ్రీనాథు డవతరించ రాముడై
యజ్ఞకర్మస్వరూపిణియె యవతరించి సీతగ
యజ్ఞవాటి సముత్థితగ నబ్బెను నీ చేతికి
యజ్ఞేశానికి పతి యజ్ఞపతియే సుమా

నీ తనయగ నెగడు సీత నిజము లోకమాత
సీతాపతి శ్రీరాముడు చిన్మయుడగు విష్ణువు
సీతారాములకు పెండ్లి చేయుట నీ సుకృతము
సీతారాములకు సేవ చేయుట మా సుకృతము

నీ దివ్యవిభూతియై నెగడు నీ విశ్వమున


నీ దివ్యవిభూతియై నెగడు నీ విశ్వమున
నీది కాని దిసుమంతయు లేదు లేదు లేదు

తొలుత నోం కారముచే తెలియదగిన బ్రహ్మమవు
వెలయించి నావు సృష్టి విస్తరించి విలాసముగ
సలలితముగ సకలచరాచరముల జొచ్చినావు
కలయజూడ బ్రహ్మాండము కాదు నీకు భిన్నము

సర్వభూతమయుడ వీవు సర్వసముడ వీవు
సర్వసృష్టిపోషకుడవు సర్వాంతరాత్ముడవు
సర్వేశుడ వఖిల సృష్టి శాసకుడవు నీవు
గర్వముడిగి నిన్ను నేను కడుభక్తి గొలుతును

హరి దహరాకాశవర్తి వగు నిన్ను రాముడ వని
పరమమోదమున నెఱింగి పరితృప్తుడ నైతి
నిరుపమాన మగు సృష్టిని నిన్ను వేరు నాక
నిరంతరము కీర్తింతును నిశ్చయము మహాత్మ



[ ఈ కీర్తన విష్ణుసహస్రనామములలోని 1వ నామం విశ్వమ్ అను దానికి వ్యాఖ్యాన పూర్వక సంకీర్తన.]

18, ఫిబ్రవరి 2019, సోమవారం

రాజకీయ బెదిరింపుల స్వామీజీ!


ఈ రోజున వచ్చిన ప్రముఖ వార్త  చంద్రబాబుపై కేసు పెడతా.. రాజశ్యామల యాగం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు  అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నది. ఈ వార్త వార్తాపత్రికల్లో ప్రముఖంగానే వచ్చింది.

స్వామీజీ గారి ఈ రాజకీయ ప్రకటన పట్ల నిరసనలు వ్యక్తం కావటంతో ఆయన మాటమార్చి ముఖ్యమంత్రిపై కేసు పెడతానని చెప్పలేదని.. టీటీడీలో అక్రమాలపై ప్రభుత్వంపై కేసు పెడతానన్నానని సెలవిచ్చారట.

విశాఖపట్టణంలో ఉన్నది శారదాపీఠం అని వింటున్నాను. శారద సౌమ్యదేవతాస్వరూపిణి. సర్వశుక్లా సరస్వతీ అని ఆవిడ నిత్యం ప్రసన్నమైన శుధ్ధసాత్వికస్వరూపంగా ఉండాలి. అలా ఉంటుందని, కనీసం అలా మొన్నటివరకూ ఉండేదని అనుకుంటున్నాను.

ఈ క్రింది ఫిబ్రవరి 11నాటి  TV5 news పేజీ లోని వార్తను చూడండి

విశాఖ శారదాపీఠంలో శ్రీశారదా చంద్రమౌళీశ్వర సమేత పరివారదేవతా శిలా ఉత్సవ ప్రతిష్టాపన ఘనంగా మొదలైంది… గణపతిపూజ, పుణ్యాహవచనంతో ఉత్సవాన్ని ప్రారంభించారు. విశాఖ శ్రీశారదా అమ్మవారిగా ఇక్కడ పీఠంలో కొలువై అనాదిగా పూజలందుకుంటోన్న అమ్మవారు రాజశ్యామల యంత్ర మహిమతో ఎంతో మహిమాన్వితురాలై విరాజిల్లుతోంది… ఆలయ పునఃప్రతిష్ట సందర్భంగా శ్రీ శారదా అమ్మవారికి రాజశ్యామల అమ్మవారి నామాన్ని కూడా జోడించి మరింత శక్తిని ఆవాహన చేయడం ఈ క్రతువులో ప్రత్యేకత…ఇందుకోసం చతుర్వేద రుగ్వేద పారాయణం, రాజశ్యామల యాగం, వనదుర్గమూల మంత్ర హోమాల ఏకకాలంలో నిర్వహించారు.

జగద్గురు ఆదిశంకరాచార్యులు శృంగేరిలో ప్రతిష్టించిన దక్షిణామ్నాయపీఠానికి ఉపపీఠంగా ప్రసిద్ధి చెందిన విశాఖ శ్రీ శారదాపీఠంలో కొలువుకాబోయే అమ్మవారు ఇకపై శ్రీ శారదా సహిత రాజశ్యామల అమ్మవారిగా భక్తులను అనుగ్రహించనుంది… అమ్వారితోపాటు చంద్రమౌళీశ్వర స్వామి, విజయగణపతి, వనదుర్గ అమ్వార్ల ప్రతిష్ట కూడా నిర్వహిస్తున్నారు… ఇందుకోసం చతుర్వేద వాహనాన్ని పండితులు ప్రారంభించారు…ఎంతో పవిత్రమైన ఈ క్రతువులో పాల్గొన్న వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు…

దీనిని బట్టి నాకు అర్థం ఐనది ఏమిటంటే శుద్ద్గసాత్వికరూపిణీ ఐన శారదా అమ్మవారిని ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి గారు రాజశ్యామలగా మార్చారు.

ఇది చిత్రంగా ఉంది!  ఈ కారణంగా ఐనా దేవతా స్వరూపం యొక్క ప్రతిష్ఠ ఉగ్రమూర్తిగా ఉంటే శక్తిమంతులూ లోకహితకాములూ ఐన స్వాములు యంత్రప్రతిష్ఠాదుల ద్వారా సాత్వికమూర్తిగా మార్చటాన్ని విన్నాం కాని తద్విలోమంగా జరగటం వినలేదు.

మాటవరసకు, ర్యాలిలో గ్రామదేవత సరస్వతీ అమ్మవారు. ఆవిడ ఉగ్రరూపిణిగా ఉండి జనబాహుళ్యాన్ని హడలెత్తిస్తూ ఉంటే శ్రీ ఆది శంకరాచార్యులవారు యంత్రప్రతిష్ఠ చేసి అమ్మవారిని సౌమ్యురాలిగా చేసారని ఐతిహ్యం.

మరొక చిత్రమైన సంగతి గమనించండి. శృంగేరీ పీఠం దక్షిణామ్నాయసంప్రదాయానికి చెందినది. వారిది సమయమతం. అటువంటి సంప్రదాయిక పీఠానికి అధిపతి ఒకరు దేవతామూర్తిని ఉగ్రదేవతగా చేయటం నభూతోనభవిష్యతి!

పూర్తిగా అనుచితమైన చర్య ఇది!

ఏప్రిల్ 9 2018 నాటి ఒక బ్లాగు టపాలో ఈ విధంగా ఉంది.
మాతంగి దశమహావిద్యలలో ఒక దేవత. ఈమెకు శ్యామలా అని మరియొక పేరు. మతంగ ఋషి దర్శించిన దేవత కనుక ఈమెకు మాతంగి అని పేరు వచ్చి ఉండవచ్చు. కొన్ని మతముల ప్రకారము సరస్వతి ఉగ్రరూపమే మాతంగిగా తెలుస్తున్నది. మాతంగి సాధన వామ, కౌళాచారములలో చాలా ప్రసిద్ధి చెందినది. ప్రాణతోసిని తంత్రము ప్రకారము పార్వతీదేవి శివునితో ఒకచండాల స్త్రీరూపంలో సంగమిస్తుంది. ఆ రూపము దశమహావిద్యలలో ప్రఖ్యాతరూపముగా పరిణమించిందని చెబుతారు. మాతంగి సాధనలో ఉచ్చిష్ఠ చండాలి, రాజశ్యామల, హసంతీశ్యామల, రక్తశ్యామల, శారికాశ్యామల, వీణాశ్యామల, వేణుశ్యామల, లఘుశ్యామల అను విద్యలు కలవు.

రాజకీయంగా విజయం సాధించుటకు, కవిత్వసాధనకు, సంగీతవిద్యలో నిష్ణాతులగుటకు ఈ మంత్ర సాధనలు ఉపయోగపడతాయి.

ఈ ప్రకారంగా మనకు రాజశ్యామల అనే దేవీ రూపం ఉగ్రదేవత అని తెలుస్తున్నది.  ఈ విద్య కౌళమార్గానికి చెందిన వామాచారము అని తెలుస్తున్నది.

శ్రీ ఆది శంకరులు స్థాపించిన శృంగేరీపీఠానికి చెందిన మఠంలో, ఆదిశంకరులు నిషేధించిన కౌళమార్గంలో దేవీ ప్రతిష్ఠలూ పూజలూ సముచితం కాదు కదా!

ఈ స్వరూపానందేంద్రసరస్వతీ స్వామి విధానం అంతా చిత్రంగా ఉంది. రాజకీయాలలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొనటం, పాల్గొనటం వంటివి శంకరస్వాములు చేయటం చిత్రమైన విషయం.

ఈయన విమతావలంబకుడైన ఒక రాజకీయ నేతతో మిత్రపూర్వకంగా మెలగుతూ ఆయన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. మరొక వేరే రాష్ట్రానికి చెందిన నేత, ఆంద్రదేశంపై విషం చిమ్ముతూ మాట్లాడుతూ ఉన్నా, ఆయనపై అవ్యాజానురాగం కురిపిస్తూ వారి అభ్యున్నతికోసం రాజశ్యామల యాగాలు చేయిస్తూ ఉంటారు.

తనకాళ్ళకు మ్రొక్కటం లేదనే అక్కసుతో ఆంద్రముఖ్యమంత్రి దిగిపోవాలీ ఆయన ప్రభుత్వం పడిపోవాలీ అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు.

ఈయన ఒక గౌరవనీయుడైన పీఠాధిపతి! అభిచారహోమాలు చేయిస్తూ ఉంటాడు!

ఇదిలా ఉండగా బీసీలకు రాజ్యాధికారం కోసం 'రాజశ్యామల హోమం' అంటూ మొన్న 8న వచ్చిన ఒక వార్త ప్రకారం 9వ తారీఖున శనివారం గుంతకల్లులో రాజశ్యామల హోమం జరిగింది.

ఫిబ్రవరి 11న మాట్లాడుతూ స్వరూపానందేంద్ర సరస్వతీ గారు అన్నమాటల ప్రకారం రాజశ్యామల అమ్మవారిని పూజించి, అర్చన చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని, ఉగ్రవాద సమస్యలు తొలిగి శత్రువులు పలాయనమవుతారు!

ఫిబ్రవరి 14న జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ దళంపై దాడి జరిగింది. అందులో 40 మందికి పైగా జవాన్లు మృతి చెందారు.

ఐతే ఈ రాజశ్యామల హోమాల వలన దేశం సుభిక్ష్హంగా ఉండి ఉగ్రవాదులు పలాయనం అయ్యే పక్షంలో 14న జరిగిన ఘోరం జరగకుండా ఉండాలి కదా!

బహుశః, అలా ఉద్దేశించి ఆ హోమం చేయవలసి ఉంటుందా? 11న స్వామి వారు అన్న మాట ప్రకారం అటువంటి అవసరం ఉండకూడదే!

ఈ స్వరూపానందేంద్ర గారు  ఇటు విశాఖపరువూ అటు శృంగేరీజగద్గురు పీఠం పరువూ తీస్తున్నారు.

ఈయన ఇటు ఆంధ్రావని పరువూ అటు పవిత్రమైన సన్యాసాశ్రమం పరువూ కూడా తీస్తున్నారు.

ఈయన వలన కేసీఆర్ గెలిచారట.

ఎంత గొప్ప మాట!

[ ఏదీ చూదాం, ఈ స్వరూపానందేంద్ర గారిని మరొక వందరాజశ్యామల యాగాలు చేసి ఐనా తప్పించమనండి, తెలంగాణాకు తగులుకొన్న త్రిశతవర్షభోక్తవ్యమైన శాపాన్ని! దీర్ఘశాపం కనుక క్రమశః అనుభవంలోనికి వస్తుంది! నాయకుల దుష్ప్రవర్తనకు ప్రజలు కూడా ఫలం అనుభవించవలసిందే! ముఖ్యంగా అట్టి వర్తనను అనుమోదించినందుకు!  ఏదీ ఈ స్వరూపానందేంద్రను తప్పించమనండి చూదాం. ]

ఎందుకు వచ్చిన ప్రగల్భాలు!

పీఠాధిపత్యాన్ని కలుషితం చేస్తున్న ఈ స్వామికి ఎటువంటి ఉత్తరగతులో శ్రీమద్రామాయణం ఉత్తరకాండలో స్పష్టంగానే ఉంది కదా.

శాంతమ్ పాపమ్.

వాడే గోపాలుడు వాడే గోవిండుడు


వాడే గోపాలుడు వాడే గోవిండుడు
వాడే శ్రీరాముడు పరబ్రహ్మము

వాడు భూమినాథు డనెడు ప్రఖ్య గలిగిన వాడు
వాడు భూమినుధ్ధరించి పాలించిన వాడు
వాడు భూమి మునుల కెల్ల  పరమనేత్రోత్సవము
వాడు  కాక కొలువదగిన వాడెవ్వడును లేడు

వాడింద్రియంబుల కెల్ల ప్రాణతత్త్వమైన వాడు
వాడు వేదవాక్కులచే బడయనైన వాడు
వాడు పరమపురుషుడైన వాడు పరంధాముడు
వాడు  కాక కొలువదగిన వాడెవ్వడును లేడు

వాడు మొన్న రఘువంశవర్థనుండన నెగడె
వాడు నిన్న యదుకులమును వర్థిల్లజేసె
వాడు సర్వవేళలందు భక్తసంపోషకుడు
వాడు  కాక కొలువదగిన వాడెవ్వడును లేడు



గోపతి. గవాంపతిః గోవులకు పతి, గోవేషధరుడైన విష్ణువు.
గౌః అనగా భూమి. భూమికి పతి.
గోః అనగా ఇంద్రియము.ఇంద్రియములకు రక్షకుడు - ముఖ్య ప్రాణతత్త్వము.

గోవిందుడు. గాం అవిందత్ ఇతి. భూమిని తిరిగి పొందెను. నష్టాం వై ధరణీం పూర్వ ద్మయ్వి ద్గుహాగతాం। గోవింద ఇతి తే నా౽౽హం దేవై ర్వాగ్వి రభిష్టుతః॥ (మహా. శాంతి. 342-70) పూర్వము పాతాళగుహను చేరి కనబడకపోయిన భూమిని తిరిగి ఈతడు మరల పొందెను అని దేవతలచే వాక్కులతో సమగ్రముగా స్తుతించబడితిని అని మోక్షధర్మపర్వమందు భగవద్వచనము. ఈ వచనముచే పైవ్యుత్పత్తిచే గోవింద శబ్ద మేర్పడుచున్నది. గో+విద్ -> గో విన్‍ద్‍ అ -> గోవిన్ద. హరివంశంలో ఇంద్రవచనం. అహం కిలేంద్రో దేవానాం। త్వం గవా మింద్రతాం గతః। గోవింద ఇతి లోకాస్త్వాం స్తోష్యంతి భువి శాశ్వతమ్॥ (హరి -2-19-45)నేను దేవతలకు ఇంద్రుడిగా ప్రసిధ్ధుడను, నీవు గోవులకు ఇంద్రత్వమును పొందితివి. అందుచే లోకములు నిన్ను భూలోకమున గోవులకు ఇంద్రుడవుగా శాశ్వతముగా గోవిందః అని స్తుతింతురు. గో+ఇంద్ర + ఇంద -> గోవింద. లేదా గౌ రేషాతు యతో వాణీ తం చ విందయంతే భవాన్। గోవిందస్తు తతో దేవ మునిభిః కథ్యతే భవాన్॥(హరి 3-88-50) ఈ వాక్కునకు(వాణికి) గౌః అని వ్యవహారము. నీవు ప్రాణులచే వాక్కును పొందింతువు. అందుచేత మునులచే నీవు గోవిందః అని చెప్పబడుతున్నావు. గాం విందయతే. గో+వింద -> గోవింద.

గోభః విందతే ఏవమ్. ఈతనిని ముముక్షువులు గోవుల(వాక్కుల)చే పొందుదురు. (వేదవచనములచే తెలిసికొందురు) గోభః వేత్తి ఏవ ముముక్షుః - ఈతని ముముక్షువులు వేదవాక్కుల చేతనే తెలిసికొనుచున్నారు. గోభి రేష యతో వేద్యో గోవిందః సముదాహృతః. - ఈతడు గోవులచే(వాక్కులచే) వేద్యుడు కాబట్టి గోవిందుడు అని విష్ణుతిలకమున కలదు.

రామ. నిత్యానందరూపుడగు ఈతనియందు యోగులు రమింతురు. రమన్తే యోగినో యస్మిన్ నిత్యానందే చిదాత్మని। ఇతి రామ పదేనైతత్ పరం బ్రహ్మో౽భిధీయతే॥ ఏ నిత్యానందచిదాత్ముని యందు యోగులు రమించు చుందురో అట్టివాడు అని అర్థమును తెలుపు రామ పదముచే ఈ పరబ్రహ్మము చెప్పబడుతున్నది. అని పద్మపురాణము. రమయంతి స్వేన రమణీయేన వపుషా ఇతి రామః తన సుందరమైన శరీరశోభచే ఆనందపరచు వాడు. తన ఇఛ్ఛ చొప్పున మిక్కిలి రమణీయమైన తనువు దాల్చిన దశరథరామునకు ఈ రామ పదము చెల్లును.

14, ఫిబ్రవరి 2019, గురువారం

హరినామములే యమృతబిందువులు


హరినామములే యమృతబిందువులు
పరమసత్యమిది నరులారా

విశ్వమయుండని విష్ణుదేవుడని
విశ్వాత్మకుడని విశ్వకర్మయని
విశ్వరేతసుడు విశ్వయోనియని
విశ్వబాహుడని విశ్వమూర్తియని

యజ్ఞపురుషుడని యజ్ఞాంగుడని
యజ్ఞేశ్వరుడని యజ్ఞరూపుడని
యజ్ఞకర్తయని యజ్ఞభోక్తయని
యజ్ఞారాధ్యుడు యజ్ఞఫలదుడని

శ్రీరమణుండని శిష్టేష్టుడని
నారదనుతుడని నందకధరుడని
నారాయణుడని నారసింహుడని
శ్రీరాముండని శ్రీకృష్ణుండని


హరిజీవనులే యతిపావనులు


హరిజీవనులే యతిపావనులు
హరిజీవనులే ధరలో ధన్యులు

హరిని రాముడని గురువులు తెలుపగ
హరిపారమ్యము తిరముగ నమ్ముచు
పరమభక్తులై హరినే కొలిచెడు
హరిజీవనులే అదృష్టవంతులు

హరిని రాముడని యాతని చరితము
తరచుగ చదువుచు తరచుగ వినుచు
పరమానందము బడసెడి వారికి
మరలపుట్టువను మాట యసత్యము

హరిని రాముడని యాత్మనెఱింగిన
హరిదాసులకే యన్నిసౌఖ్యములు
హరిసేవనులై యానందించెడు
హరిభక్తులె మోక్షార్హులు ధరలో

రాముడు మనవాడు సీతారాముడు మనవాడు


రాముడు మనవాడు సీతా
రాముడు మనవాడు

ఏమి యడిగినను ప్రేమతోడ మన
కామితంబు లిడు కరుణామయుడు
సామంతులనో సామాన్యులనో
యేమి వివక్షయు నించుక జూపడు

చిరుచిరు నగవుల చిలుకువాడు మన
ధరనేలే కడు ధర్మవిభుండు
సురనరమునిగణ పరిసేవితుడై
హరవిరించినుతు డగు మన రాముడు

కోరిన ముక్తిని కొసరుచుండు మన
శ్రీరఘురాముడు కూరిమితోడ
తారకనాముని తలచు వారలకు
నారకభయమే నాస్తినాస్తి భళి

13, ఫిబ్రవరి 2019, బుధవారం

సంఖ్యాశాస్త్రంలో 9 చాలా విశిష్టమైన సంఖ్య అన్నది నిజమేనా? ముగింపు

గత టపాలో మనం సంఖ్యాశాస్త్రంలో 9 అనేది ఒక విశిష్ఠమైన సంఖ్యా అన్నది పరిశీలించాం.

మనం సంఖ్యలను వ్రాయటానికి వాడే దశాంకమానం కారణంగా ఆమానం యొక్క అవధి 10 కి ఒకటి తక్కువ ఐన 9 సంఖ్యకు కల రెండు ప్రత్యేక లక్షణాలను గమనించాం.

  1. ఏ సంఖ్యనైనా సరే 9 చేత భాగిస్తే వచ్చే శేషం ఆ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని 9 చేత భాగిస్తే వచ్చే శేషానికి సమానం అవుతుంది.
  2. ఏ సంఖనైనా సరే 9 చేత గుణిస్తే ఆసంఖ్య కూడా అప్పుడు 9 యొక్క గుణిజమే అవుతుంది కాబట్టి పై సూత్రం దానికి వర్తించి అందులోని అంకెల మొత్తం కూడా 9 కాని దాని గుణిజం కాని అవుతుంది.

మనం వాడే అంకెలు 0 నుండి 9 వరకూ 10 అంకెలు. వీటి సహాయంతో మనం స్థానాలకు విలువలు ఆపాదించటం అనే ప్రక్రియద్వారా ఎంత పెద్ద సంఖ్యనైనా వ్రాయగలుగుతున్నాం.

ఉదాహరణకు 3629 అన్నామంటే 3 x 1000 + 6 x 100 + 2 x 10 + 9  అని కదా అర్థం.
మరికొంచెం గణితశాస్త్రపరంగా వ్రాయాలంటే 3629ని ఇలా వ్రాస్తాం:

  3 x 10 + 6 x 10 2 + 2 x 10 1 +  9 x 10 0  = 3629

అవునూ మనం అసలు సంఖ్యలను 10యొక్క స్థానాల విలువలతో ఎందుకు వ్రాస్తున్నాం అన్న ప్రశ్న వస్తుంది.  మనం అలా అలవాటుపడిపోయాం అన్నది సులభమైన జవాబు. నిజం ఏమిటంటే మన రెండుచేతులకూ కలిపి పదివేళ్ళున్నాయి కదా. అందుకని పదిదాకా వేళ్లమీద ఎలాగూ లెక్కించటం చేయవచ్చును సులువుగా. అపైన లెక్కించటానికి పదుల సహాయంతోనే ఒక పద్ధతి ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట,

అన్నట్లు 0 నుండి 9 వరకూ ఉన్న గుర్తుల్ని మనం అంకెలు అంటాం కదా, ఇంగ్లీషులో డిజట్‍స్ అంటారు. డిజిట్ అంటే అంకె అనే కాదు చేతి వేలు అనే అర్థమూ ఉంది!

కొంచెం అలోచిస్తే అంకెల్ని కేవలం 10యొక్క ఆధారంతోనే వ్రాయాలన్న నియమం ఏమీ లేదు. సుబ్బరంగా మరొక సంఖ్య ఆధారంగా కూడా వ్రాయవచ్చును. ఐతే అలా రాస్తే కొంచెం తమాషాగా ఉంటాయి కొత్తగా చూసేసరికి.

కంప్యూటరు శాస్త్రజ్ఞులం ఆమధ్యకాలందాకా 8 ఆధారంగా సంఖ్యలను వాడే వాళ్ళం. అంటే మనం సంఖ్యలను 0..7 అంకెల సాయంతో వ్రాస్తామన్నమాట. ప్రతి స్థానమూ తనకన్న కుడివైపున ఉన్న స్థానానికి ఎనిమిది రెట్లు విలువ కలిగి ఉంటుంది.

ముందుగా ఒక చిన్న పని చేదాం. ఆధారసంఖ్యనూ అసలు సంఖ్యతో పాటు చూపుదాం 100 10 అంటే 10 అధారంగా 100 అనే సంఖ్య అన్నట్లు. అధారం 10 ఐనప్పుడు ఆ పదిని క్రింద చూపనవసరం లేదు.

ఈ 100 10  లేదా 100 అనే సంఖ్యను 8 అధారంగా వ్రాస్తే 144 8 అవుతుంది! (ఈ సంఖ్యల్ని ఆక్టాల్ సంఖ్యలంటాం)

ఎందుకంటే 1 x 8+ 4 x 8+ 4 x 80 =  64 + 36 + 4 =100 కాబట్టి!

ఎనిమిది ఆధారంగ కల అంకెలు అంటే అష్టాంకమానంలో వ్రాసిన సంఖ్యల్లో 7 అనే సంఖ్యకు ఎటువంటి ప్రవర్తన ఉందో చూదాం.

2810  ని అష్టాంక మానంలో వ్రాస్తే 34 8 అవుతుంది! ఇప్పుడు 3+4=7
7710  ని అష్టాంక మానంలో వ్రాస్తే 115 8 అవుతుంది! ఇప్పుడు 1+1+5=7
6310  ని అష్టాంక మానంలో వ్రాస్తే 77 8 అవుతుంది! ఇప్పుడు 7+7=16 8, 1+6 =7

అంటే అష్టాంకమానంలో 8-1=7 చేత భాగించబడే సంఖ్యల్లో అంకెల మొత్తం 7 కాని దాని గుణిజం కాని అవుతుంది!

ఇప్పుడు సప్తాంక మానం సంగతి చూదాం. అంటే మనం సంఖ్యలను 0..6 అంకెల సాయంతో వ్రాస్తామన్నమాట. ప్రతి స్థానమూ తనకన్ను కుడివైపున ఉన్న స్థానానికి ఏడు రెట్లు విలువ కలిగి ఉంటుంది.

ఏడు ఆధారంగా కల అంకెలు అంటే సప్తాంక మానంలో వ్రాసిన సంఖ్యల్లో 6 అనే సంఖ్యకు ఎటువంటి ప్రవర్తన ఉందో చూదాం

1210  ని సప్తాంక మానంలో వ్రాస్తే 15అవుతుంది! ఇప్పుడు 1+5 = 6
3610  ని సప్తాంక మానంలో వ్రాస్తే 51 7 అవుతుంది! ఇప్పుడు 5+1 = 6
12610  ని సప్తాంక మానంలో వ్రాస్తే 240 7 అవుతుంది! ఇప్పుడు 2+4+0 = 6
4810  ని సప్తాంక మానంలో వ్రాస్తే 66అవుతుంది! ఇప్పుడు 6+6 = 15 7, 1+5 = 6

అంటే సప్తాంక మానంలో 7-1=6 చేత భాగించబడే సంఖ్యల్లో అంకెల మొత్తం 6 కాని దాని గుణిజం కాని అవుతుంది!

ఇప్పుడు అందరికీ అర్థం ఐనది అనుకుంటాను ప్రతి అంకమానం లోను మానసంఖ్యకన్నా ఒకటి తక్కువ సంఖ్యకు దశాంకమానంలో 9 కి ఉన్నదిగా కనిపించే లక్షణమే ఉంటుందని స్పష్టం అని.

కాబట్టి సంఖ్యాశాస్త్రంలో అన్న గంభీరమైన ప్రసక్తి తీసుకొని వచ్చినప్పుడు 9 కి ఏవో అద్భుత శక్తులున్నాయని అనుకోవటం వట్టి భ్రమ అని చెప్పక తప్పదు.


సంఖ్యాశాస్త్రంలో 9 చాలా విశిష్టమైన సంఖ్య అన్నది నిజమేనా?



హరికాలం బ్లాగులోని  కొత్తటపా వేదాల్లో సైన్సు లేదా?మోడరన్ సైన్సు వేదాల్లో తప్పులున్నాయని నిరూపించగలదా?  అన్నదానిలో ఈ క్రింది సంగతి కనిపించింది.

సంఖ్యాశాస్త్రంలో 9 చాలా విశిష్టమైన సంఖ్య.

9 x 1 = 9
9 x 2 = 18, 1 + 8 = 9
9 x 3 = 27, 2 + 7 = 9
9 x 4 = 36, 3 + 6 = 9
9 x 5 = 45, 4 + 5 = 9
9 x 6 = 54, 5 + 4 = 9
9 x 7 = 63, 6 + 3 = 9
9 x 8 = 72, 7 + 2 = 9
9 x 9 = 81, 8 + 1 = 9
9 x 10=90, 9 + 0 = 9
9 x 11=99, 9 + 9 = 18, 1 + 8 = 9
9 x 12 = 108

నిజానికి 9 అనే అంకెకు ఏ ప్రత్యేకతా లేదు.

ఉందనిపించటం అంతా మన భ్రమ మాత్రమే.  ఈ భ్రమను గురించి వివరంగా చెప్తే కాని ఒకపట్టాన అర్థం కాదు చాలామందికి. అందుచేత ఆ బ్లాగులో ఈవిషయకంగా ఏవ్యాఖ్యనూ వ్రాయలేదు. అదీ కాక వ్యాఖ్యలను వేయటం పట్ల (ప్రస్తుతం?) నాకు విముఖత మెండుగా ఉంది కాబట్టి ఎలాగూ వ్యాఖ్యను ఉంచే ప్రసక్తీ లేదు.

అందుచేత విపులంగా ఈ భ్రమను గురించి ఈటపాలో చర్చిస్తాను.

అసలు సంగతిని వివరించటానికి ముందుగా మరొక విషయం పైన పాఠకులకు అవగాహన కల్పించవలసిన అవసరం చాలా ఉంది.

కూడికలూ తీసివేతలూ గుణకారాలూ మనం రెండు సంఖ్యల మధ్యన నిర్వహిస్తే మరొక సంఖ్య ఫలితంగా వస్తుంది.

ఉదాహరణ: 5 + 3 =  8, 5 - 3 =  2, 5 x 3 = 15

ఒక్క భాగహారం విషయంలో ఒక తమాషా ఉంది. భాగహారం వలన రెండు ఫలితాలు వస్తాయి. ఒకటి భాగఫలం, రెండవది శేషం.

ఉదాహరణః 5 / 3 = 1. ఈ 1 అనేది భాగఫలం. శేషం 2

మనం ఈ శేషాల గురించి మరి కొంచెం అవగాహన కలిగించుకోవాలి ఇక్కడ.  ఇది కూడా ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను.

17 + 13 =  30
17  - 13 =    4
17 x 13 = 221

ఇప్పుడు మనం పై సంఖ్యలకు బదులు వాటిని 7తో భాగిస్తే వచ్చే శేషాలను ఉపయోగించి తిరిగి ప్రయత్నిద్దాం.

3 + 6  = 9 = 2  (9లోనుండి 7 తీసివేయాలి శుభ్రంగా)
3  - 6  = -3 = 4  (-3 ఋణసంఖ్య కాబట్టి 7 కలపాలిక్కడ)
3 x 6  = 18 = 4  (18ని మళ్ళా 7చే భాగించి శేషం తీసుకున్నాం)

ఇప్పుడు మొదట అసలు సంఖ్యలతో చేసిన లెక్కల ఫలితాలనూ 7చే భాగిస్తే వచ్చే శేషాలుగా మారిస్తే 30 = 2, 4 = 4, 221 = 4.

అంటే మనం గణితాన్ని సంఖ్యలతో చేసినా ఏదైనా ఒక సంఖ్యతో భాగిస్తే వచ్చే శేషాలతో చేసినా మన కూడికలూ వగైరా సరిగ్గానే వస్తాయి.

ఈ తమాషా వలన ఒక ప్రయోజనం ఉందని గమనించండి.

మా చిన్నప్పుడు మానాన్నగారు ఈ సుళువును ఉపయోగించటం చూసాను. ఆయన ఎలా వాడేవారో అంటే ఒక ఉదాహరణ చూపుతాను.

152863 ను 93821 తో గుణిస్తే  ఫలితం  14341759523 అని రావాలి.

ఐతే ఆరోజుల్లో కాలిక్యులేటర్లూ వగైరాలు లేవు. చేత్తో గుణించవలసిందే. ఎక్కడైనా పొరపాటు జరిగే అవకాశం తప్పకుండా ఉంది. ఉదాహరణకు మనకు ఫలితం 14341756523 అని వచ్చింది అనుకుందాం. తప్పా ఒప్పా ఎలా సులువుగా తెలుసుకోవటం అంటే దానికి మానాన్నగారి చిట్కా చూడండి

152863 లోని అంకెల మొత్తం 1+5+2+8+6+3 = 25 = 2+5 = 7
93821  లోని అంకెల మొత్తం 9+3+8+2+1 = 23 = 2+3 = 5

అంకెలమొత్తం ఏకాంకం చేయటం అంటే ఇష్టసంఖ్యను తొమ్మిదితో భాగించి శేషం తీసుకోవటమే!  ఈ సూత్రం ఎందుకు ఎలా పనిచేస్తున్నదీ అన్నవిషయం కొద్ది సేపటి తరువాత చూదాం.

ఇప్పుడు గుణకారాన్ని ఈశేషాలతో చేదాం

7 x 5 = 35 = 3 +5 = 8

మనకు అసలు గుణకారంలో ఫలితంగా వచ్చిన సంఖ్యను తొమ్మిదితో భాగిస్తే ఏమి వస్తోందో చూదాం.

14341756523  = 1+4+3+4+1+7+5+6+5+2+3  = 41 = 4+1 = 5

మనగుణకారం తప్పు. మనకు 8 కదా రావలసింది!!

మళ్ళా మరొకసారి సరిగ్గా గుణకారం చేసుకుందాం. ఇప్పుడు మనకు  వచ్చిన ఫలితం 14341759523

దీన్ని మరలా పరిశీలిద్దాం.

14341759523  = 1+4+3+4+1+7+5+9+5+2+3 = 44 = 4 + 4 = 8

ఆఁ. ఇప్పుడు సరిపోయింది కదా.

మన గుణకారం సరిగ్గా ఉండే అవకాశం హెచ్చు.

(హెచ్చు అన్నానే కాని గుణాకారం సరిగ్గా ఉందని అనలేదు. మన మొదటి ఫలితంలో ఒకటికంటే ఎక్కువ అంకెలు తప్పితే అప్పుడు తప్పుడు ఫలితానికీ సరైన శేషం రావచ్చునుగా. మొదట మనకు 14344756523 వచ్చి ఉంటే శేషం 8 అనే వచ్చేది మరి!)

ఇలా ఈశేషాల తమాషా మనకు మన చేతిలెక్కల్ని తప్పులు వెదికేందుకు ఒక సాధనంగా పనికి వస్తుందన్నమాట.

ఇందాకనే అంకెలమొత్తం ఏకాంకం చేయటం అంటే ఇష్టసంఖ్యను తొమ్మిదితో భాగించి శేషం తీసుకోవటమే అన్నాను కదా, ఈ సూత్రం బాగానే పని చేస్తున్నది కదా, మరి ఇలా ఎందుకు ఈసూత్రం ఏర్పడిందీ అన్నది ఇప్పుడు చూద్దాం.

మాటవరసకు 20ని 9 చేత భాగించితే శేషం ఎంత వస్తుంది అంటే చిన్నపిల్లలు కూడా 2 అని ఠక్కున చెప్తారు. 2x9=18 కాబట్టి, 20లో ఆ 18 పోగా మనకు శేషంగా మిగిలేది 2 కదా అన్నది సులభంగానే తెలిసిపోతోంది.

మరి 200ను 9 చేత భాగిస్తే? 2000ను 9 చేత భాగిస్తేనో?

అప్పుడు కూడా శేషం మనకు 2 అనే వస్తున్నది కదా?

ఎవరికైనా అనుమానం ఉందేమో, లెక్కవేసి చూడండి! 2 వస్తుంది శేషంగ.

ఇలా ఎందుకు జరుగుతోందో విశదమ్ చేస్తాను.

20ని మనం 2x101+0 అనీ 200ని మనం 2x102 + 0x101 + 0 అనీ వ్రాయవచ్చును కదా.

ఎవరికైనా పై సాంకేతికత ఇబ్బందిగా ఉన్నపక్షంలో

20 = 2 x 10 + 0
200 = 2 x 10x10 + 0x10 + 0

అని వ్రాస్తే సులభంగా అవగాహన అవుతున్నది కదా!

ఇప్పుడు మరికొంచెంగా తిరుగ వ్రాద్దాం

20 =  2 x (9+1) + 0 = 2 x (9+1)
200 = 2 x (9+1) x (9+1) + 0 x (9+1) + 0 = 2 x (9+1)x (9+1)

అనీ పై విధంగా వ్రాస్తే కొంచెం పొడుగవుతున్నది కాని పరీక్షగా చూసి ఆలోచిస్తే సులభంగానే అర్థమైపోతుంది అంతా సరిగ్గానే ఉందని. ( సున్నలతో గుణకారాలూ వదిలేయవచ్చునని పెద్దగా కష్టపడకుండానే అందరికీ అర్థం అవుతుందని అనుకుంటున్నాను.)

ఇప్పుడు

20 =  2 x (9+1) = 2 x 9 + 2
200 = 2 x (9+1) x (9+1) = 2 x (9x9+2x9+1) = 2 x 9 x (9+2) + 2

పైన చేసిన గణితం ప్రకారం 20 అన్నా 200 అన్నా కూడా కొన్ని తొమ్మిదులకు పైన 2 అని వస్తున్నది కదా!

ఇలాగే 2 ప్రక్కన ఎన్ని సున్నలు పెట్టినా సరే ఆ సంఖ్యని 9 చేత భాగిస్తే శేషంగా వచ్చేది ఆ సున్నల ముందున్న అంకెయేను.

అసలు ఇంతకన్నా కూడా సులువుగా చెప్పవచ్చునేమో చూదాం.
10 = 9 +1
100 = 99 +1
1000 = 999 + 1

ఇలా సులభంగా చెప్పవచ్చును. ఇప్పుడు

2000 = 2 x (999+1) = 2 x 999 + 2

అదీ సంగతి.

823 ను 9 చేత భాగిస్తే శేషం ఎంతా అన్నది చూదాం

823 = 800 + 20 + 3

823ను 9 చేత భాగిస్తే వచ్చే శేషం ఎంతో, 800, 20, 3 లను విడివిడిగా 9 చేత భాగిస్తే వచ్చే శేషాలను కూడితే వచ్చేది అంతే!

అన్నట్లు గణిత శాస్త్రంలో శేషం అని చెప్పటానికి ఒక । గుర్తు వాడతారు. మనం అది వాడి చెప్పాలంటే

125|9 = 100|9 + 20|9 + 5|9
          = 1 + 2 + 5
          = 8

ఇప్పుడు ఏ సంఖ్యనైనా 9 చేత భాగిస్తే వచ్చే శేషం ఆ సంఖ్యలలోని అంకెలమొత్తానికి  సమానం అవుతుంది అని తెలిసింది కదా (గమనిక: అంకెలమొత్తం 9 కన్నా ఎక్కువైతె వీలైనన్ని తొమ్మిదులు పీకెయ్యటమే)

ఇదంతా ఎవరికైనా కొంచెం గందరగోళం అనిపితే మరొక్కసారి చదువుకుంటే సులభంగా అవగాహనకు వస్తుంది.

ఇప్పుడు ఇంకొక్క విషయం చూదాం. ఏ సంఖ్యనైనా 9 నిశ్శేషంగా భాగిస్తుందనుకోండి. అప్పుడు విశేషం ఏమన్నా ఉందా అన్నది చూదాం.

126|9 = 100|9 | 20|9  | 6|9
         = 1 + 2 + 6
         = 9

బాగుంది. ఇఛిన సంఖను తొమ్మిది శేషం లేకుండా భాగిస్తుంది కాబట్టి దానిలోని అంకెల మొత్తం 9 అవుతుంది.
లేదా 9కి గుణిజం అవుతుంది. ఉదాహరణకు 765 ని 9 శేషం లేకుండా భాగిస్తుంది. కాని 7+6+5=18 అవుతోంది కదా అంటే ఈ 18ని కూడా 1+8 = 9 అని మళ్ళీ లెక్కవేయాలి.

ఇదే అవగాహనను మరొకరకంగా చూదాం. ఏదన్నా సంఖ్యను 9 చేత గుణించితే ఎమవుతుందీ అని.

సమాధానం ఏమిటంటే ఆ గుణకారఫలితంగా వచ్చే సంఖ్యను చచ్చినట్లు 9 శేషం లేకుండా భాగిస్తుంది కదా. అంటే? అ వచ్చే ఫలితంలో అంకెల మొత్తం 9 అవుతుంది!

అందుచేత
   9 x 12 = 108, 1+0+8 = 9

అని చదివి ఆశ్చర్యపోవటానికి కారణం లేదు.
12753 x 9 = 114777. 1+1+4+7+7+7 = 27, 2+7 = 9

ఇప్పుడు మీకు ఇందులో వింత ఏమీ కనిపించటం లేదు కదా!

కుశాగ్రబుధ్ధులుంటారు, ఏ క్లాసులో ఐనా. వాళ్ళకు తప్పకుండా సందేహం వస్తుంది పైన చెప్పినదంతా గ్రహించాక.
మొత్తం కథ అంతా 9 చుట్టూ తిప్పి, ఇప్పుడు 9 అన్నదానిలో ఏ ప్రత్యేకతా లేదూ అంటారేం?  7 చేతో 6 చేతో గుణిస్తే ఇలాంటి తమాషా కనిపించటం లేదు కదా, అందుకని 9ని చాలా విశిష్టసంఖ్య అనాలి కదా అని.

మనం సంఖ్యలన్నింటినీ అలవాటుగా దశాంకమానంలో వ్రాస్తున్నాము. అంటే ఏ సంఖ్యలో నైనా ప్రతి స్థానం విలువా దానికి కుడివైపున ఉన్న స్థానంకన్నా పదిరెట్లు ఎక్కువ విలువ కలిగి ఉంటుంది.

దశాంకమానంలోనే కాదు ఇతర అంకమానాల్లోనూ సంఖ్యలను వ్రాయవచ్చును. ఉదాహరణకు 144 అని వ్రాసి అయ్యా ఇక్కడ అంకమానం 8 అంటే 144 అన్నది 1x64 + 4x32 + 4 = 100 అన్నమాట మన దశాంక మానంలో.

మన దశాంకమానంలో 9 ఇలా విశిష్ట సంఖ్య ఐతే అష్టాంకమానంలో 7 విశిష్టసంఖ్య మరి.

అలాగు తెలిసికొంటే 9 నెత్తిన కొమ్ములేవీ లేవని అర్థం అవుతుంది.

ఇప్పటికే టపా పెద్దదైనది కదా, ఆ వివరాలన్నీ రాబోయే టపాలో చూదాం.

12, ఫిబ్రవరి 2019, మంగళవారం

పరిహసించ రాదండీ హరిభక్తులను


పరిహసించ రాదండీ హరిభక్తులను
హరిభక్తులు కలగితే హరి యలిగేను

కలిమియున్న కట్టికుడిచి గంతులు వేయండి
బలముండిన గోదాల్లోపడి తన్నుకోండి
అలవికాని గరువముతో హరిభక్తుల చెనకితే
కలుగునెంతో పాపమని కాస్త తెలుసుకోండి

చదువులున్న పదవులున్న నది మంచిదే నండి
సదనంబులు మొదవులున్న చాల మంచిదండి
అదుపు తప్పు బుధ్ధి మీరు హరిభక్తుల చెనకితే
అది యెంతో పాపము మీ రదియు తెలుసుకోండి

ఎవరి బ్రతుకు వారిదనగ నిలనుండుట మేలు
ఎవరి మంచివారు తెలిసి యిలనుండుట మేలు
ఎవరైనను రామభక్తు లెవరినైన చెనకితే
నవల నింక  మేలేలే దదియు తెలుసుకోండి

మాయావీ రావణా మాయలకే మాయ


మాయావీ రావణా మాయలకే మాయ హరి
మాయ నిన్ను పట్టిన మాట యెఱుగవే

వరమడిగెడు వేళ నరుల వానరులను విడచి
గరువముతో పలుకాడితివో
సరిసరి హరి నరుడై నిను చంపవీ లగునని
హరిమాయ నిన్నట్లడిగించెను

నీవేదో మాయపన్ని నేరుపు జూపింంచి
శ్రీవిభునే వంచించితివా
నీ వెఱ్ఱియేకాని నీవు మాయచేయుటేమి
ఆ విష్ణుమాయకే యగ్గమైతివి

కాలుడేమొ నలువమాట కాదనక విడచిన
కాలుని గెలిచిన ఘనతతోచ
కాలాత్మకుడైన హరి కకుత్స్థ రాముడైన
నేలాగు హరిమాయ యెఱుగనిచ్చు

ఎవ డీరాముం డెందుకు వీనిని


ఎవ డీరాముం డెందుకు వీనిని
భువి నీ మనుష్యులు పొగిడేరో

ఎవడా రాముం డెల్ల లోకముల
నెవడు సృజించెనో యెల్లవేళల
నెవడు భరించునొ యెఱుగు మాతడే
స్తవనీయుడు హరి సర్వేశ్వరుడు

ఎవడా రాముడు నవలామణుల
నవమానించెడి యారావణుని
దివిజవిరోధిని తెగటార్చుటకై
యవతరించిన భువనేశ్వరుడు

ఎవడా రాముం డెవనిం భక్తితో
పవలురేలును భజియించినచో
యవలీలగ భువి నఖిలజీవులకు
భవబంధమ్ములు వదలు నాతడే

దిక్కు రాము డొకడేనని


దిక్కు రాము డొకడేనని తెలిసివచ్చే నాటికే
యక్కటా ప్రాయమెల్ల నడుగంటేనే

ఆటపాటల బాల్యమందు రాముడంటే యెవ్వడో
నాటలేదు మనసులోన నాతప్పు లేదుకదా
పూటపూటకు బుధ్ధి పెంపొందుచున్న వయసులో
వాటమెరిగి పెద్దలైన వంటబట్ట చెప్పరుగా

పడతిపైన బిడ్డలపైన వల్లమాలినట్టి ప్రేమ
కడకు రామచింతననే కప్పె తప్పాయె కదా
బడసినట్టి విద్య లేవి ప్రభువువిషయ మింతైన
నుడువవుగా మోహములను విడువుమని చెప్పవుగా

నేడోరేపో తనువిది నేల బడగనున్న వేళ
వీడు రామచింతనలో పీకదాక మునిగినాడు
వేడుకతో నారాముడు వీనిపైన దయచూపిన
వీడుకూడ తరించును విబధులార నిక్కముగ



రాముని భావించరాదా మనసా


రాముని భావించరాదా మనసా
యేమని యితరము లెంచేవే

ధనములు పోగిడు పనిలో యెందుల
కనిశము తహతహ లాడేవే
మనసా రాళ్ళును మణులును నొకటే
పనివడి పోగిడి పట్టుకపోదువే

వనితల కొరకై తనయుల కొరకై
యనిశము తహతహ లాడేవే
మనసా మోహము మానుమెవ్వరును
ననుసరించి రారని నీ వెరుగవే

నిను దరిజేర్చే నీ రామునికై
యనిశము తహతహ లాడగదే
మనసా వానిని మరువక గొలిచిన
పనిగలదా యిల పైన జనించగ

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

భువనమోహన రామ పుట్టిన దాదిగా


భువనమోహన రామ పుట్టిన దాదిగా
తవిలియుంటిని నిన్నే దయచూడవే

పుడమిని నినునమ్ము పుణ్యాత్ముల నీవు
విడువక రక్షించు విధము లన్నియు
గడచిన భవముల గట్టిగ గురువులు
నుడువ వివేకము బడసి యుంటి గాన

నిరుపమ గుణనిధివి నిన్నాశ్రయించిన
మరల పుట్టరన్న మాట యొక్కటి
తిరముగ నమ్మితి పరమాత్ముడ నను
తరియింప జేయవె కరుణావార్నిధి

నాలుక తారకనామము దాల్చెను
మేలుకల్గమి కేమి మిషగలదయ్య
చాలజన్మము లాయె సరిసరి యికనైన
పాలించ రాకున్న బాగుండదు సుమ్ము

7, ఫిబ్రవరి 2019, గురువారం

ఓరామ ఓకృష్ణ ఓదయాసింధూ


ఓరామ ఓకృష్ణ ఓదయాసింధూ
ఓరమ్యగుణార్ణవ ఓదీనబంధూ

అని తలచుట లోనే ఆనంద మున్నది
అని తెలిసిన వారిదే ఆనందము
వినుతశీలు రందరకు విదితమీ సత్యము
కనుక నేను నిత్యము కావింతు జపము

అని పనవే యదృష్టమే యబ్బే దెందరకు
తనువు లెత్తయెత్త కొందరకే కలుగు
విను డట్టి యదృష్టము ననుబట్టె నేడు
కనుక వీరిడిని కాక కావింతు జపము

అని మురిసే భక్తులకే యబ్బుగా మోక్షము
జనులార నేనెరిగి జడుడగానోప
కనుక మోదమతోడ కావింతు జపము
తనువుల నిక దాల్చబోను తరింతును వేగ

6, ఫిబ్రవరి 2019, బుధవారం

ఏలాగున నిను పొగడ జాలుదు నయ్యా


ఏలాగున నిను పొగడ జాలుదు నయ్యా
నాలుక లెన్నైతే చాలు నయ్యా

నీ కొడుకగు నలువకైన నిన్ను పొగడగ
యే కొలదికి యొక్క నాల్క యిటు గాదనుచు
చేకొని నలుదిక్కులకును చెలగి మోముల
శ్రీకరముల నిను పొగడుచు సృష్టి నెరపెను

పంచభూతమయుడ నిన్ను పరగ పొగడగ
కొంచెమనుచు నొక నాల్క కుండెడు శక్తి
అంచితముగపంచభూతాత్మకంబుల
పంచముఖములను పొందెను పరమేశ్వరుడు

నిక్కి రెండునాల్కలతో నిన్ను పొగడగ
నెక్కడికని ఆదిశేషు డెసగ శిరములు
చక్కగ నొకవేయి గొనెను సర్వేశ్వరుడ
చిక్కనైన దయామృతము చిలుకు రాముడ


ధరమీద నుత్తమోత్తమ వ్రతమేది


ధరమీద నుత్తమోత్తమ వ్రతమేది
నిరంతరహరినామస్మరణవ్రతమే

హరినామములు వేయియని విందుము
హరినామములు లెక్క కందవయ్య
మరి యటులైన నేను స్మరియింతును
హరినామముల వేడ్క నది చెప్పుము

వేయినామములైన వేడ్కమీర
హాయిగా వల్లించ టంతసులభమె
శ్రీయుతుననంతనామధేయు నెటుల
బాయని శ్రధ్ధతో భజియింతును

రామరామరామ యని రక్తి మీర
నీ మనసున తలచిన నిశ్ఛయముగ
నామసాహస్రకము నమ్మకముగ
యేమరక తలచినట్లే సుజనుడ

4, ఫిబ్రవరి 2019, సోమవారం

చిన్న మాట కూడ నేను నిన్ననలేదే


చిన్నమాట కూడ నేను నిన్ననలేదే
నిన్నంతా యెందు దాగియున్నా వయ్యా

జీవుడు నీకొరకై చింతించు చుండునని
దేవుడ వగు నీకు తెలియ దందునా
నీవిట్లు దాగితివా నేనేమైపోదునో
భావించ విది నీకు భావ్యము కాదు

దాగియున్న వీడెంత తమకించునో యని
యోగీంద్రవంద్య నీ వూహించినావో
జాగుచేసి యొకరోజు సన్నగ నవ్వేవు
వేగించి నన్నిట్లు వేధించదగునా

యుగములుగ నిర్వురము నొకటిగా నున్నాము
జగములన్నీ మనము జమిలిగా తిరిగేము
తగునా నీవు దాగ దలచుటన్న మాట
నిగమవేద్య రామా నీకెట్లు బోధింతు

1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ఎన్నెన్ని మాటలన్న నిట్టే దులుపుకొందువు


ఎన్నెన్ని మాటలన్న నిట్టే దులుపుకొందువు
మన్నింతువు నీవు చాల మంచివాడవు

కష్టములకోర్వక కలహించి తిట్టినా
కష్టపెట్టుకొనక నెపుడు కాపాడుదువు
శిష్టులను నీ వుపేక్షింతువని తిట్టినా
దుష్టుడనక వాని కెపుడు తోడుందువే

నమ్మితే మోసగించినావని తిట్టినా
చెమ్మకనులు తుడువగా చేయిజాచెదు
ఇమ్మంటే దర్శనం బీయవని తిట్టినా
కమ్మగ మా కలలలోన కానవత్తువె

మ్రొక్కినా వరమీవని మిక్కిలి తిట్టినా
మక్కువతో వరములిచ్చి మన్నింతువు
తక్కువబుధ్ధిచే తాళలేక తిట్టినా
చక్కగ మము బ్రోచెదవో జానకీపతీ


మరిమరి నీతో మాటలాడుటకు


మరిమరి నీతో మాటలాడుటకు
కరుణించవయా కాదనక

అన్నోదకముల నార్జించుటకని
తిన్నగ కన్నులు తెరువకమునుపే
ఎన్నో యోచన లెన్నో యుక్తులు
నన్నిటి మధ్యను నిన్ను మరచుటలు

నిన్ను తలచుకొను నిముషములోనే
నన్ను ముసురునే నానా చిక్కులు
యెన్నరానివై యెసగెడు నూహలు
నెన్నెన్నో మరిపించును రా నిను

ఎన్నో జన్మము లిట్లే గడచెను
మన్నించుమిది మలగెడులోన
సన్నుతాంగ శ్రీజానకీరమణ
యెన్నో నీకు విన్నవించవలె