రామచంద్రుని సాటి యెవరండి శ్రీ
రామచంద్రుని కీర్తి చాటండి
రామ రామ యని తరించండి శ్రీ
రామచంద్రుని మహిమ చాటండి
పతితపావనుడైన రామచంద్రుని పేరు
పలికితేనే చాలు పండిపోయేరు
కుతుకంబుతో నైన రామచంద్రుని మీరు
కొలిచితేనే చాలు పండిపోయేరు
అతికీర్తిమంతుడౌ రామచంద్రుని మీరు
స్తుతియించితే చాలు పండిపోయేరు
అతికృపామతియైన రామచంద్రుని మీరు
ఆశ్రయించిన చాలు పండిపోయేరు
అకళంకవీరుడౌ రామచంద్రుని కీర్తి
ప్రకటించితే మీరు పండిపోయేరు
సకలార్ధప్రదుడైన రామచంద్రుని కీర్తి
చాటించితే మీరు పండిపోయేరు
సకలలోకేశుడౌ రామచంద్రుని కీర్తి
సన్నుతించిన మీరు పండిపోయేరు
సకలవిధముల రామచంద్రుని బంట్లుగా
చరియించితే మీరు పండిపోయేరు
పండిపోయేరు హరి పూజలను మీరెల్ల
అండగా హరి నిల్చి యుండును కాన
పండిపోయేరు హరి సేవతో మీరెల్ల
భగవంతునకు సేవ పండించు గాన
పండిపోయేరు హరి భక్తులై మీరెల్ల
భాగవతులకు ముక్తివచ్చును కాన
పండిపోయేరు రఘువరు డాన మీరెల్ల
ప్రభుపాదముల నాశ్రయించిరి కాన