వెంటబడి వేధించు వట్టితుంటరి ననుకొనకు రామా బంటునై నిన్నంటి యుండే భాగ్యమే కల్పించవయ్యా |
|||
ఏటి కొకసారి శ్రీరామచంద్ర యెంచి నిను తలచి పాటలూ పద్యాలు తప్పులు పాటిసేయక యరచి పాడి కోటికోరికల చిట్టాను చదివి గొప్పభక్తుడను సాటి లేరిక నా కటకంచు జబ్బచరచితినా |
వెంటబడి | ||
నిన్నమొన్నటి వాడనా నిన్నెన్నడైనా విడచియుంటిన ఎన్నిజన్మల నుండి నినునే నెన్నికోరితి నేమి పొందితి ఎన్నడైనను నన్యదైవము నెన్ని కొలిచుట యున్నదా వెన్నవంటి మనసు నీదని ప్రేమతో నిను కొలుచుచుంటిని |
వెంటబడి | ||
నిన్ను కొలుచు వారిలో నన్నెన్ని చేర్చితి వదియెచాలు పన్నుగా నన్నంతరంగ భక్తుడంటి వదియెచాలు ఎన్ని జన్మలు కలుగనేమి ఎన్ని యిడుములు కలుగనేమి వెన్ను గాచి నాకు నీవు విభుడవై యున్నదియె చాలు |
వెంటబడి | ||
15, ఏప్రిల్ 2016, శుక్రవారం
బంటునై నిన్నంటి యుండే భాగ్యమే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)