8, ఫిబ్రవరి 2026, ఆదివారం

తారకనామము ధరను లభించగ

తారకనామము ధరను లభించగ
    యూరక నితరము లెందుకయా
చేరక కాలుని శ్రీహరి పదమును
    చేర్చెడు నామము చేయుడయా

మోక్షప్రదుడా ముకుందుడే యని
    ముందుగ చక్కగ తెలియుడయా
మోక్షము కొరకై యన్యుల వేడెడు
    మూర్ఖత దేనికి విడువుడయా
లక్షణముగ హరి లక్ష్మీనాథుని
    రామనామమును చేయుడయా
పక్షివాహనుడు నిజభక్తుల యో
     గక్షేమంబులు విడువడయా

అక్షయసంపద హరికృపయే యని
    యాత్మశుధ్ధిగ తెలియుడయా
కుక్షింభరులై తిరుగుచు ముక్తిని
    కోరుట పొసగదు తెలియుడయా
రక్షకుడకు శ్రీరాముని వేడక
    బ్రతికిన బ్రతుకొక బ్రతుకటయా
త్ర్యక్షుడు నిత్యము తారకనామము
    ననిశము ధ్యానము చేయునయా
    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు