4, జులై 2024, గురువారం

తొలగించుము


కం. తొలగించుము శాపములను

తొలగించుము పాపములను దుర్భావములన్

తొలగించుము తాపములను

కులదైవమ రామచంద్ర కువలయనాథా

ఏపాదంబును


శా. ఏపాదంబును లచ్చి యొత్తు సతము న్నెంతేని గారంబుతో
నేపాదంబున కిచ్చె పాద్యము నజుం డెంతేని సధ్బక్తితో
నేపాదంబును యోగిరాజులు సదాహృత్సీమలం గొల్తురో
ఆపాదంబును చేరగోరెదను రామా నీదు పాదాబ్జమున్

నీపాదంబుల నెన్నకుండు


శా. నీపాదంబుల నెన్నకుండు నరునిన్ నీదివ్యగాథాళిలో
లోపంబెన్నుచు నుండునట్టి నరునిన్ లోకాన జీవాళికిన్
తాపంబుల్ హరియించు నామమును జిహ్వాగ్రంబునం దాల్చగా
నోపంజాలని వాని రామ యెటు సర్వోధ్ధార రక్షింతువో

చాలుంజాలును


శా. చాలుంజాలును నీపదాబ్జములపై సర్వేశ పుష్పంబునై
వ్రాలంజాలిన నంతకంటె కలదే భాగ్యంబు వాంఛింపగన్
కాలాతీతప్రభావ రామనృపతీ కంజాక్ష విశ్వంభరా
యేలా మ్రొక్కెద నయ్య నన్యులకు నే నింకేమి వాంఛించెదన్

హరిపాదంబుల


చం. హరిపాదంబుల నాశ్రయించు ఘను
లందరు మోక్షము పొందుచుండుటన్
హరిపాదంబుల నాశ్రయింపమను
నందరు దుర్గతి చెందుచుండుటన్
పరమదయాళవాలు రఘువంశసు
ధాంబుధి చంద్రు రామునిన్
హరియని లోనెఱింగి వెస
నాతని పాదము లాశ్రయించితిన్

కూరిమి రామగాథ వినగోరని


ఉ. కూరిమి రామగాథ వినగోరని చెంపల డొప్ప లెందుకో
శ్రీరఘువీరునిన్ వలచి చేరగనోచని చిత్త మెందుకో
శ్రీరఘురాము తత్త్వమును చింతనచేయని బుధ్ధియెందుకో
ధారుణి నట్టి మేనొకటి దాల్చిచరించుట యన్న దెందుకో

ఆరయ రామచంద్రునకు


ఉ. ఆరయ రామచంద్రునకు నంజలి చేయని చేతు లెందుకో
శ్రీరఘునాథుపాదముల జేరని చూపుల కన్ను లెందుకో
తీరుగ రామ రామ యని తీయగ బల్కని నాలు కెందుకో
ధారుణి నట్టి మేనొకటి దాల్చిచరించుట యన్న దెందుకో

3, జులై 2024, బుధవారం

మనసున రామనామమును


చం. మనసున రామనామమును
మానక నేను స్మరించువాడనై
ఘనుడగు రామచంద్రునకు
గాక మరొక్కని కెట్లు మ్రొక్కెదన్
వినుత దయామృతాబ్ధి యగు
వెన్నుడు రాముడు మోక్షమిచ్చు వా
డని మదిలో నెఱింగి మరి
యన్యుల పాదము లంటనేర్తునే


ఇదిగో శ్రీరామనామము


ఇదిగో శ్రీరామనామము 
    ముదమార గొనుము
విదితముగను భవతారకమై 
    వెలుగుమంత్రరాజము

సదమలాత్ములైన యోగి
    జను లుపాసించు మంత్రము
హృదయమున శ్రీరామభక్తు 
    లెపుడు తలచు మంత్రము
ముదమున నిది నీజిహ్వాగ్ర
    మున నిల్చి యుండునేని
వదలకరక్షించితీరు 
    పరమదివ్యమంత్రము

వేడుకతో వెండికొండ
    వేలు పుపాసించు మంత్రము
ఏడుకోట్ల మంత్రంబుల 
    నెన్నికైన మంత్రము
నేడు నీవు మనసుపెట్టి 
    నిష్ఠతో జపియింతు వేని
వీడక నిన్నెల్లప్పుడు కా
    పాడు దివ్యమంత్రము


2, జులై 2024, మంగళవారం

శ్రీరామమయమైన చిత్తమున్నది


శ్రీరామమయమైన చిత్తమున్నది భళి

ఆ‌రాటము లన్ని విడచి యది యున్నది


ఉన్నది రామభజన నున్నదే చాలునని

ఉన్నది రామునికొఱ కున్నదే చాలునని

ఉన్నది రామునికడ నున్నదే చాలునని

ఉన్నది రామునిదయ యున్నదే చాలునని


వలపు రామమయము చేసి వరలుచున్పది అది

తలపు రామమయము చేసి కులుకుచున్నది అది

కలలు రామమయమను నొక కడిది నున్నది అది

పలుకు రామమయము చేసి నిలచి తానున్నది


రామనామదివ్యసుధారసము గ్రోలుచున్నది

రామతత్త్వచింతనమున నేమరక యున్నది

రామపాదసీమ నుండు రామచిలుక యైనది

రాముడొకడె తనకు పంచప్రాణములని యున్నది



సీతారాములను మీరు సేవించరే

సీతారాములను మీరు సేవించరే మీ

పాతకములు పా‌ర మీజాతకములు మార


భూతలమున నరులుగా పుట్టుటయే గొప్ప

నీతిమంతులగుచు పుడమి నిలచుటయే గొప్ప

మీతలపులు హరిమయముగ మెలగుటయే గొప్ప

సీతారాములకు సేవ చేయుటయే గొప్ప


తగదని షడ్వర్గంబును తన్నుటయే గొప్ప

పగలు రాత్రులును హరిని భావించుటె గొప్ప

నిగమగోచరుని మ్రోల నిలచుటయే గొప్ప

జగత్పితరులకు సేవ సలుపుటయే గొప్ప


హరినామము నోటనెపుడు నాడుటయే గొప్ప

హరిమయ మీసకలవిశ్వమని తెలియుట గొప్ప

పరమభాగవతులుగా బ్రతుకుటయే గొప్ప

హరిని సిరిని కొలిచి మోక్షమందుటయే గొప్ప


1, జులై 2024, సోమవారం

వెలసె రామనామము


వెలసె రామనామము
తెలుసుకోండయా

పరమభక్తసులభమై
పరమమంత్రరాజమై
నిరుపమానవరదమై
ధరపై హరినామమై

అవనిని బుధసేవ్యమై
అవిరళసుఖదాయియై
భవతారకమంత్రమై
రవికులపతి నామమై

అవనిజకు ప్రాణమై
పవనసుతారాధ్యమై
నవనీతమధురమై
శివసన్నుతనామమై


శ్రీరాముడు మాశ్రీరాముడు


శ్రీరాముడు మాశ్రీరాముడు భవ
తారకుడు దేవుడు మాశ్రీరాముడు

పేరు గలవాడు మాశ్రీరాముడు మాట
తీరు గలవాడు మాశ్రీరాముడు

వీరాగ్రేసరుడు మాశ్రీరాముడు దైత్య
వీరమృగసింహము మాశ్రీరాముడు

చేరికొలుచు వారికి మాశ్రీరాముడు నో
రార పలుకువాడు మాశ్రీరాముడు

సారసాక్షు డండి మాశ్రీరాముడు సం
సారభయము బాపును మాశ్రీరాముడు

నారదాది వినుతుడు మాశ్రీరాముడు చూడ
నారాయణు డండి మాశ్రీరాముడు

కారణకారణుడు మాశ్రీరాముడు బం
గారు తండ్రి యండి మాశ్రీరాముడు