31, ఆగస్టు 2022, బుధవారం

జగదీశ్వరుడగు శ్రీరఘురాముని

జగదీశ్వరుడగు శ్రీరఘురాముని చరణయుగళముల శరణము జొచ్చిన
తగినవిధంబుగ రక్షణ కలుగును తన యాపదలు నివారితమై చను

రాముని క్రోధము బ్రహ్మాస్త్రంబై రాగా జగములు తిరిగిన కాకము
రామపాదముల శరణమువేడెను ప్రాణరక్షగొని సంతోషించెను

అగ్రజుఢాకకు గడగడవణకుచు హరిపాదంబుల నాశ్రయించిన
సుగ్రీవుడు కపిరాజుగ నంతట శోభిల్లుట మీరెఱిగినదే కద

అన్నకు నీతులు చెప్పుట తప్పై ఆవిభీషణుడు శరణము వేడుచు
తిన్నగ రాముని పాదము లంటెను తేజరిల్లె మరి లంకాధిపుడై

ఆపదలన్నియు తొలగించున వీ హరిపాదములని యంద రెఱుగుడు
పాపులు పుణ్యచరిత్రులు నందరు శ్రీపతిపాదము లంటి తరించుడు

30, ఆగస్టు 2022, మంగళవారం

శ్రీమద్దశరధనందన రామా

శ్రీమద్దశరధనందన రామా చిత్తశుధ్ధితో కొలిచెదను
నీమము గలిగి నీశుభనామము నేమర కేను భజించెదను
 
శ్రధ్ధాభక్తులతో నీచరితము చక్కగ నిత్యము చదివెదను
బుధ్ధిమంతులగు నీభక్తులతో పొందుగలిగి వర్తించెదను

మానక నెప్పుడు నీపూజలను మనసా చేయుచు నుండెదను
ధ్యానములో నీశుభరూపంబును లోనారయుచు నుండెదను
 
నీవే తల్లివి నీవే తండ్రివి నీవే పతివని తలచెదను 
నీవే గురుడవు నీవేదైవము నీవేగతి యని తలచెదను
 
కౌసల్యాసుఖవర్ధన నిన్నే కావుమనుచు నే వేడెదను
నీసరి లేరని త్రిభువనములలో నిన్నే శరణము వేడెదను

నీవే కరుణాసాగరుండవని నీకటాక్షమును కోరెదను
నీవే పురుషోత్తముడవు గావున నిన్నే శరణము వేడెదను
 
నీవే సృష్టిస్థితిలయములను నియమింతువని నమ్మెదను
నీవే భవనాశకుడవు గావున నిన్నే శరణము వేడెదను
 
నీవే మోక్షప్రదాతవు గావున నీపదయుగళము లంటెదను
నీవే సర్వేశ్వరుడవు గావున  నిన్నే శరణము వేడెదను


ప్రేమతో పాడుకొనుడు విబుధులారా ..

ప్రేమతో పాడుకొనుడు విబుధులారా

రామనామాంకితములు రసరమ్యగీతములు ప్రేమతో ..
కామితార్ధప్రదాయకుని ఘనతచాటు గీతములు ప్రేమతో ..
స్వామి దివ్య మహిమలను చాటిచెప్పు గీతములు ప్రేమతో..
రామభక్తహృదయములను రంజించు గీతములు ప్రేమతో..

రామకథాగానముతో రాజిల్లెడు గీతములు ప్రేమతో ..
స్వామికటాక్షమును గూర్పజాలునట్టి గీతములు ప్రేమతో ..
పామరత్వజాడ్యమును బాపునట్టి గీతములు ప్రేమతో ..
రామభక్తులతో కలసి రామునిపై గీతములు ప్రేమతో ..

భూమిజామనోహరుని పొగడునట్టి గీతములు ప్రేమతో ..
స్వామిరూపవర్ణనమును సలుపునట్టి గీతములు ప్రేమతో ..
స్వామి కృపను తెలుపునట్టి చక్కనైన గీతములు ప్రేమతో ..
రామభక్తవిజయములను రమ్యమైన గీతములు ప్రేమతో ..



దేవుడు శ్రీరాముడై దిగివచ్చెను

దేవుడు శ్రీరాముడై దిగివచ్చెను వాడు
రావణుని మదమణచి రాణకెక్కెను

నరుల వానరుల విడచి వరమడిగి బ్రహ్మను
మరి తన కెదురేమి లేక మదమున వాడు
సురలను వేధించుచుండ శోకించుచు వారు
హరిని చేరి దుఃఖించుచు నడిగిరి రక్ష

దేవతల మొఱలువిని దిగివచ్చెను శ్రీసరి
భూలయమున నరుడై మొలచి మెఱసెను
శ్రీవీదేహసుత నపహరించిన రావణునిపై
ఠీవిగ విల్లెత్తి నిలచి లావు జూపెను

పదునొకండు వేలేండ్లు భగవంతుడు రాముడై
పదిలముగా నయోధ్యా ప్రజలను కాచి
విదితముగా వారినెల్ల వెంటబెట్టు కొని నిజ
సదనంబును చేరుకొనెను శాశ్వతయశుడు


దేహము వేరని దేహి వేరని ...

దేహము వేరని దేహి వేరని తెల్లంబుగను తెలియుడయా
దేహికి భ్రమలు తొలగు సంగతులు తెల్లంబుగను తెలియుడయా

దేహంబునకే శీతోష్ణంబులు దేహికి లేవని తెలియుడయా
దేహంబునకే రాగద్వేషములు దేహికి లేవని తెలియుడయా
దేహంబునకే యభిమానంబులు దేహికి లేవని తెలియుడయా
దేహంబునకే బాంధవ్యంబులు దేహికి లేవని తెలియుడయా
 
దేహంబునకే సుఖదుఃఖంబులు దేహికి లేవని తెలియుడయా
దేహంబునకే జననమరణములు దేహికి లేవని తెలియుడయా
దేహంబునకే పరిణామంబులు దేహికి లేవని తెలియుడయా
దేహము బుద్బుదప్రాయము కాని దేహి నిత్యుడని తెలియుడయా

దేహముపై నభిమానము వీడక దేహికి మోక్షము కలుగదయా
ఆహా శ్ర్రీరఘురాముని దయచే దేహముపై భ్రమ తొలగునయా
దేహము తానను భ్రమతొలగినచో దేహికి పుట్టువు లుడుగునయా
శ్రీహరి యుండెడు వైకుంఠంబును దేహి యప్పుడు చేరునయా




జయజయ రఘుకులజలనిధి సోమా

జయజయ థఘుకులజలనిధి సోమా

జయజయ జయ శ్రీరామా



జయజయ జయజయ జానకిరామా 

జయజయ సద్గుణధామా


జయజయ జయజయ జగదభిరామా 

జయ భవతారకనామా


జయజయ జయజయ దశరథరామా 

జయజయ మునిజనకామా


జయజయ దానవదర్పవిరామా

జయజయ భండనభీమా



జయజయ జయజయ రాజలలామా

జయజయ నీరదశ్యామా


జయజయ జయజయ సురగణవందిత

జయజయ త్రిజగద్వందిత


జయజయ జయజయ వేదవిహారా

జయజయ పాపవిదారా


జయజయ జయజయ త్రిభువననాయక

జయజయ శుభసంధాయక



జయజయ జయజయ కరుణాభరణ

జయజయ నతజనశరణ


జయజయ జయజయ కారణకారణ

జయజయ దుఃఖనివారణ


జయజయ జయజయ హరి నారాయణ

జయజయ ధర్మపరాయణ


జయజయ జయజయ పావనచరణ

జయజయ మోక్షవితరణ


29, ఆగస్టు 2022, సోమవారం

రామనామము నీ నాలుకపై రంజిల్లగ వలెరా

రామనామము నీ నాలుకపై రంజిల్లగ వలెరా
రామని ధ్యానములో నీ మనసు రాజిల్లగ వలెరా

మరువక బుధ్ధిని రామసేవలో మసలజేయ వలెరా
కరములు రాముని కైంకర్యంబున పరవశించ వలెరా
చరణంబులును రామకార్యముల చరియింపగ వలెరా
శిరమును రాముని పాదంబులపై చేర్చి మ్రొక్క వలెరా

రాముని రమ్యగుణంబులు తలచుచు రక్తి పొందవలెరా
రాముని దివ్యచరిత్రము పాడుచు రక్తి పొందవలెరా
రాముని పూజలు నిత్యము చేయుచు రక్తి పొందవలెరా
రాముని కాత్మసమర్పణ చేయుచు రక్తి పొందవలెరా

రాముని భక్తుల మధ్యన మసలుచు రాణించగ వలెరా
రాముని కీర్తన లెప్పడు పాడుచు రాణించగ వలెరా
రాముని కీర్తిని చాటుచు జగతిని రాణించగ వలెరా
రాముని ప్రేమను పొందుచు నపవర్గమును పొందవలెరా


28, ఆగస్టు 2022, ఆదివారం

వాదవివాదాల గురించి...


చ. వినయము లేని వారు నవివేకులు మూర్ఖులు దుష్టబుధ్ధులుం
బనిగొని యేమి పల్కిన నవశ్యము ధీరులు శాంతచిత్తులై 
వినని ప్రకారమే జనుట వేయివిధంబుల మేలు వారితో 
ననయము వ్యర్ధవాదముల నక్కట చిక్కుట కంటె చూడగన్

ఇది నా పద్యమే. ఇప్పుడే వ్రాసినదే. అదటుంచి యీ పద్యం వెనుక ఉన్న సంగతిసందర్భాలను గురించే యీ వ్యాసం.

నిన్న నా యీ బ్లాగు శ్యామలీయానికి రమారమి నాలుగువందల వీక్షణలు వచ్చాయి. అంటే జనం చదువుతున్నారు అని అర్ధం అవుతోంది.

ఈరోజున తెలుగు బ్లాగుల్లో కనిపిస్తున్న వారి సంఖ్య బహుస్వల్పంగా ఉంది. ఐనా శ్యామలీయం బ్లాగుకు తగినంత ఆదరణ ఉండటం ఆనందించవలసిన విషయమే‌ నాకు.

నాకున్న వ్యక్తిగతమైన పరిమితుల కారణంగా శ్యామలీయం బ్లాగులో అంత చురుకుగా ఉండటం కుదరటం లేదు నాకు. ఐనా నేను ఏమీ వ్రాయని రోజుల్లో‌ కూడా రెండువందల చిల్లర వీక్షణలు వస్తూనే ఉన్నాయి. 

బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం నేను ఎప్పుడో తగ్గించివేసాను. తగిన సందర్బం ఉన్నా నాకు వీలవక వ్యాఖ్యలు ఉంచలేదు చాలా సార్లు.

ఈమధ్యన కష్టేఫలీ‌ బ్లాగులో నేను చేసిన ఒక వ్యాఖ్యబోలెడంత చర్చకు దారితీసింది!
 
అచర్చ నిజానికి ఒక ఆరోగ్యకరమైన చర్చలా కాక ఒక రగడలా నడిచింది. అ రగడకు ప్రధాన సూత్రధారి Chiru Dreams అనే ఆయన అని నా ఉద్దేశం. ఆయన "పాండవులు తమ ఆస్థుల్ని అప్పటికే జూదంలో కౌరవులకి కోల్పోయారు" అన్న అభిప్రాయం చెప్పటమూ దానికి సమాధానంగా  నేను "జూదం ద్వారా వచ్చిన లబ్ధిని దృతరాష్ట్రుడు రద్దుచేసి జూదానికి పూర్వం ఉండిన పరిస్థితిని పునరుధ్ధరించాడు. పాండవుల సిరిని అపహరించాలని మరొకప్రయత్నం చేసారు దుష్టచతుష్టయం. దాయాదులకు నో అననని ధర్మరాజు ఒట్టువేసుకొని ఉండటం వలన పునర్ద్యూతం జరిగి, వనవాసమూ అజ్ఞాతవాసమూ నెత్తిన బడ్డాయి పాండవులకు." అని నావ్యాఖ్యలో చెప్పటం జరిగింది. 
 
చిరు గారు రిఫరెన్స్ కావాలన్నారు. మంచి కోరికే. ఐతే విపులంగా చెప్పటానికి ఒక వ్యాసం వ్రాసి ఈశ్యామలీయంలో ఆ "ధర్మరాజు జూదం ఎందుకు ఆడినట్లు" అన్న వ్యాసాన్ని ప్రచురించాను. 

నిజానికి చర్చ ఇక్కడితో‌ ముగిసిపోవాలి. 

కాని "మీరుచెప్పిన విషయం మహాభారతంలో ఎక్కడ వ్రాయబడి వున్నదనే" ప్రశ్న చిరు గారి నుండి వచ్చింది అంటే ఆయనకు మహాభారతం గురించిన కనీస అవగాహన లేదనే అనుకోక తప్పదు. కాని ఆయన మొదటనే "పాండవులు తమ ఆస్థుల్ని అప్పటికే జూదంలో కౌరవులకి కోల్పోయారు" అన్న మాట ఎలా అనగలిగారూ? పొరపాటు మాట కదా?
 
అక్కడికీ ఓపిగ్గా ఇదంతా సభాపర్వంలోనికి వస్తుంది అని చెబితే ఒక అనామకుడి వ్యాఖ్య చూడండి "ఏ లైనో ఎన్నో పేజీయో చెబ్తే ఏమన్నా సొమ్ములు పోతాయా ? అంతా పండితుల పైత్యం కాదా యిది?" అని!

దీనికి ఏమనాలి? ఈధోరణి చూస్తే చర్చ కన్నా రగడకే కొందరు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. కనీసం నాకలా అనిపిస్తోంది.

అక్కడికీ నేను ఆ కొనసాగుతున్న రగడలో "వ్యాసులవారి మహాభారతం తెలుగులిపిలో గీతాప్రెస్ వారి వద్ద లభిస్తుంది" అనీ "అందరికీ కవిత్రయాన్ని చదువమని నాసూచన. ఆతరువాత వీలైతే విశేషాంశాలను మూలం నుండి గ్రహించండి. లేదా తెలిసిన వారి నుండి గ్రహించండి. మేము ఏమీ చదువుకోము. కాని ప్రశ్నలు వేస్తాము. అన్నిటినీ వినికిడి కథల (సినీమాలూ నాటకాలూ బుర్రకథలూ బాలల బొమ్మల పుస్తకాలూ టీవీ సీరియళ్ళూ వగైరా) మాధ్యమాల ఆధారంగా చర్చలు చేస్తాం అంటే ఎలాగు? " అనీ అన్నాను. అసలు ఇంక ఏమీ మాట్లాడకుండా ఉండవలసింది! కాని ఉబోస ఇచ్చినందుకు చిరు గారు చేసిన పరాభవం చూడండి

"బాబూ శ్యామలీయం! నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వడూ ఏమీ చదవడు అనే కుతినుబంచి బయటకురా ముందు. సమాధానం చెప్పలేక దాటేసేవేశాలు నీదగ్గర, నీలాంటోల్ల దగ్గర చాలా చూశాం. "

ఇదే మన్నా బాగుందా? ముఖ్యంగా ఏకవచనంలోని దిగి ఏమిటా మాటలు అని?

కొంచెం నచ్చజెప్పటానికి యత్నించి, మరింత భంగపడి, "నేను మాత్రం దేవిడీమన్నా చేస్తున్నాను" అని ప్రకటించాను.

ఐనా చిరు గారు ఇకనుండి శ్యామలీయం లోనికి వద్దన్నా వ్యాఖ్యలను పంపటం మొదలు పెట్టారు. ఆయనకు దేవిడీమన్నా అంటే తెలియలేదేమో. దానికి నేనేమీ చేయలేను. నేను మాత్రం చిరు గారు వ్యాఖ్యలను ప్రకటించటం లేదు. ఆయనకు ఊరకే వాదిస్తూ కూర్చోవటం ఒక హాబీ కావచ్చును కాని నాకు తీరదే.

నా భాగులోనే దరిమిలా ఒక వ్యాఖ్యలో  "అసమంజసులు ఎవరైనా ఒకవేళ సరైన ప్రశ్ననే వేసినా, వారికి జవాబు చెప్పటం ద్వారా అడుసుత్రొక్కటం అవుతుందని తెలుసుకొని - అటువంటి పొరపాటు చేయకుండా జాగ్రత వహించటమే పరిష్కారం అనిపిస్తోంది." అని చెప్పాను.

ఇక హరిబాబు గారు రంగప్రవేశం చేసారు. అయనకు నేను ఇతిహాసాలు రెండే కదా అనటం నచ్చలేదు. ఆపైన నేను వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గ్రంథం మహాబారతతత్వకథనము archive.org సైటులో లభిస్తుంది అని చెప్పటం నచ్చలేదు. ఆపుస్తకానికి లింకు ఇవ్వచచ్చు కదా అని చెడామడా వాయించారు. అయనకు నేను బాధ్యతారహితంగా మాట్లాడుతున్నానని అనిపించింది పైగా. చదువరులే ఈవిషయంలో ఆలోచించి గ్రహించ ప్రార్థన. ఐనాఓపిగ్గా మరొక వ్యాసం వ్రాసి ఈ archive.org సైటులో పుస్తకాన్ని ఎలా సంపాదించాలీ అని చెప్పాను. ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడికి ఇదంతా నిజంగా చెప్పవలసిన అవసరం ఉందా చెప్పండి?

ఇక చిరు గారు వ్యాఖ్యలను శ్యామలీయానికి వద్దన్నా పంపుతున్నారు కదా. ఒక వ్యాఖ్యలో ఆయన "రెండవజూదంలో కూడా పాండవులు తమరాజ్యాలుకోల్పోయారు. తర్వాతనే అరణ్య,అజ్ఞాతవాసాలపాలయ్యారు" అని అభిప్రాయపడి తదనుగుణంగా తీర్పు చెప్పారు. కాని అనుద్యూతంలో రాజ్యాలను పందెంగా ఒడ్డటం జరుగలేదు. కనీసం ఆంధ్రమహాభారతంలో చూసినా ఈసంగతి తెలుస్తుంది, కాని చదవరే! వ్యాఖ్యలు మాత్రం బుధ్ధికుశలతతో చేసేస్తారు. 
 
మరొక వ్యాఖ్యలో చిరు గారు "మంచిగా వ్యాఖ్యచేస్తే, దాన్ని ప్రచురించకుండా మిమ్మల్ని తిట్టాను అని రాసుకున్న మీరు భాధ్యతారాహిత్యాల గురించి మాట్లాడడం కామెడీ" అన్నారు. ఆయన రెండవజూదంలో కూడా పాండవులు తమ రాజ్యాలు కోల్పోయారు అని అభిప్రాయపడటం పొరపాటు అని నేను జవాబు చెప్పటం అడుసు త్రొక్కటమే అని చదువరులకు వేరే చెప్పాలా? మేమేమీ చదువం వినం తెలుసుకోం చర్చలు మాత్రం నిరంతరాయం చేస్తాం అనే వారికి జవాబు చెప్పినా ఉపయోగం ఉండదు కదా. అదీ కాక నేను చిరు గారికి దేవిడీమన్నా చెప్పాను కాబట్టి ఆయనకు జవాబులు చెప్పను. కుదరదు.
 
చిరు గారయ్యేది మరెవ రయ్యేది మంచి విషయం లేవనెత్తి నప్పుడు నాకు వీలైనంత వరకూ నాబ్లాగులో నేను దాని గురించి వ్రాస్తాను. అందుకే ధర్మరాజు జూదం గురించి వ్రాస్తున్నాను. అదీ వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి గ్రంథం ఆధారంగా. వీలైన చోట తెలుగుభారతం నుండి కూడా చూపుతున్నాను.

ఇప్పుడు పాఠకులకు విజ్ఞప్తి. ఈవ్యాసం మొదట చెప్పిన పద్యాన్ని మరొకసారి చదువుకొనవలసింది.

27, ఆగస్టు 2022, శనివారం

దయామయుడ వని వింటిని

దయామయుడ వని వింటిని దాశరథీ శరణంటిని
దయజూపు మని యంటిని దరిజేరి నిలుచుంటిని

జగదీశాహరి మృదుతరభాషా జనకసుపుత్రీ హృదయేశా
నిగమాగమసంవేద్యవి‌లాసా నిరుపమదివ్యసుగుణభూషా
పగవారలకును నీవు నరేశా తగునని దయజూపెద వీశా
పగవాడను కాను కదా నాపై పరపుము నీకృప శ్రీశా

సకలదేవతార్చితపద శ్రీహరి వికచోత్పలశుభనేత్ర హరి
మకరిని ద్రుంచి కరినేలిన హరి మంకురాక్షసుల ద్రుంచు హరి
సకలము నెఱిగిన సర్వేశ హరి సర్వబుధుల కాపాడు హరి
సకలశుభంబుల నొసగి ప్రోచు హరి జానకీశ శ్రీరామ హరి

నిన్ను దక్క నే నొరుల స్మరింపను నీనామమునే నుడివెదను
నిన్ను దక్క నే నొరులను కొలువను నిన్నే నిత్యము కొలిచెదను
నిన్ను దక్క నే నొరులను వేడను నిన్నే మనసా వేడెదను
సన్నుతాంగ శ్రీరామచంద్ర నను సరగున బ్రోవగ నడిగెదను



రామనామము పరమానందప్రదాయక మని

రామనామము పరమానందప్రదాయక మని తెలిసి
ధీమంతులు భజియించుచు నుందురు దీక్షగ నిరతమును

వారలు సంపద లాశించకయే భజియింతురు హరిని
ధారుణి సంపద లానందమునకు కారణములు కావు
కారణములనే భ్రమకలుగుటకు కారణము మాయ
పారద్రోలి పెనుమాయను రాముని భజియింతురు బుధులు

వారలు కోరిక లన్నియు విడచి భజియింతురు హరిని
ధారుణి నుండెడి వస్తుచయమున కోరదగిన దున్నె
కోరదగినదా పరమానందమె కువలయవాసులకు
నేరుపు మీరగ రామనామజపనిష్ఠ నుందురు బుధులు

వారలు వీరిని వారిని గొలువక భజియింతురు హరిని
వారిని వీరిని సేవించుటలో పరమార్ధము లేదు
శ్రీరఘురాముని సేవించుటలో క్షేమము గలదనుచు
ధీరులు విడువక రామనామమున తెరలుచుందు రెపుడు



 

కనబడకుంటివి బహుకాలముగ

కనబడకుంటివి బహుకాలముగా కలలోనైనను రఘురామా
ఇనకులతిలకా యిటులుండగ నీ మనసెటు లొప్పెను రఘురామా

తప్పులు తోచిన మన్నించవయా దాసుడ గానా రఘురామా
ఎప్పగిదిని నీకోపము తీరెడు నెఱిగించవయా రఘురామా
తిప్పలు పెట్టక దరిసెనమీయర చప్పున నాకిక రఘురామా
ఎప్పుడు నీశుభరూపము గాంచెద నప్పుడు మురిసెద రఘురామా

నీకు గాక మరి యితరుల కెప్పుడు నే తలవంచను రఘురామా
నీకీర్తనమునె చేయుచు నుందును నిచ్చలు ప్రీతిగ రఘురామా
లోకములో పనియేమున్నదిరా నాకిక నిజముగ రఘురామా
ఏకరణిని నినుపొగడని దినముల నిట్లు సహింతును రఘురామా

నారదాది మునులందరు పొగడెడు నారాయణుడా రఘురామా
శ్రీరఘునాయక భక్తజనావన సీతానాయక రఘురామా
కారుణ్యాంబుధి వగు నీవలుగుట కష్టము తోచును రఘురామా
రారా అలుకలు చాలును రామా రమ్యగుణాకర రఘురామా


26, ఆగస్టు 2022, శుక్రవారం

హరిబాబు గారికి సమాధానం....


నేటి హరిబాబు గారి వ్యాఖ్య నొప్పించింది. దానికి నా జవాబు చాలా పెద్దగా ఉందని బ్లాగరు వాడి నిరాకరణ కారణంగా విడిగా ఒకటపాగా వేయవలసి వచ్చింది. 

archive.org మీకొక పెద్ద అడవిలా కనబడితే అందులో అశ్చర్యం లేదు. అక్కడ చాలా రకాల సరంజామా ఉంది. ముఖ్యంగా పుస్తకాలు కొల్లలు.

నేనేమీ వెక్కిరింత కామెంట్లు చేయలేదండీ. ఇతిహాసాలు అంటే సంప్రదాయంగా చెప్పేవి రామాయణ భారతాలు మాత్రమే, మీరు పెంచుతానంటే శుభం అన్నాను. దానిలో వెక్కిరింత ఏమీ లేదు. మీరు రెండును మూడు చేస్తున్నారు. కొన్నాళ్ళకు మరికొన్నింటిని విజ్ణులు జత చేయవచ్చును. అలా జరుగవలసి ఉంటే కానివ్వండి అన్నానంతే.

మీకొక్కరికే బ్లాగులో కనబడటానికి కూడా అంతగా వీలు లేని అరిజెంటు పనులు ఉన్నాయా? అని కోప్పడుతున్నారు. మా శ్రీమతి ఆరోగ్యరీత్యా నాకు తీరటం లేదండీ. గత కొద్దినెలలుగా పరిస్థితి బాగులేదు. జూలైనెలలో ఐతే ప్రతిరోజూ హాస్పిటల్ దర్శనం జరిగింది. ఒక ప్రక్కన కిడ్నీసమస్యకు (ESRD అంటారు) డయాలసిస్, తత్సంబంధిత బాధలతో తరచుగా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎమర్జెన్సీకి పరుగులు పెట్టటం జరుగుతోంది . ఆబాధలు అటుంచి కళ్ళసమస్యలు కారణంగా ఎల్.వి.ప్రసాద్ ఆస్పత్రికి పదేపదే వెళ్ళటం - కుడికంటికి అపరేషన్ మరొక హడావుడి. మాయిల్లు ఒక మినీ హాస్పిటల్ లాగా ఉంది - ఇంటినిండా మందులూ, మెడికల్ ఎక్విప్‌మెంట్ ,మెడికల్ ఫైల్స్ - వగైరాతో నిండిపోయి ఉంది. ఇంటిని సర్దుకుందుకు కూడా మాకు తీరికా ఓపికా ఉండటం లేదు - ఘోరంగా ఉంది. గత మార్చి నుండి ఇప్పటివరకూ నేను నిద్రపోయిన రాత్రి  అంటూ ఏదీ లేదు.  ఈమాటలో అతిశయోక్తి ఏమీ లేదు. నమ్మటమో నమ్మకపోవటమో మీయిష్టం. దానితో నా ఆరోగ్యం కూడా బాగానే దెబ్బతిన్నది. ఒకసారి నేనూ ఎమర్జెన్సీలో చేరవలసి వచ్చింది పది రోజుల క్రిందట. ఆదరిమిలా బోలెడు టెష్టులూ డాక్టర్ల చుట్టూ ఎలాగో అలా సందుచూసుకొని నేనూ తిరగటమూ జరిగింది. ఇంకా జరుగుతోంది. ఇంత గందరగోళపరిస్థితుల్లోనూ ఇంట్లో ఉన్నది ఇద్దరమే కాబట్టి మేమే అన్నీ చూసుకోవాలి. ఈమధ్యకాలంలో ముఖ్యమైన శుభాశుభసందర్భాల్లో ఇంటిపెద్దలుగా హాజరు కావలసి ఉన్నా మేమిద్దరమూ వెళ్ళలేకపోవటమూ జరిగింది - కొందరు పైకి అనకపోయినా నొచ్చుకోవటమూ తటస్థించి ఉండవచ్చును. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. నా ఒక్కడికే ఇన్ని సమస్యలు అనుకోవటం లేదండీ. ఇదంతా వ్రాయవలసి వచ్చినది మీరు నిలదీయటం కారణంగానే తప్ప మరొక కారణం ఏదీ లేదు.

దీర్థ చర్చలపైన ఆసక్తి లేకపోవటానికి నాకారణాలు నాకున్నాయి. నాది బాధ్యతారాహిత్యం అని మీరు అనుకుంటే నేనేమీ చేయలేను. అవలి వారిలో మీరు కాకపోయినా కొందరు సాగతీత చర్చలకు దిగుతుంటే నేనున్న పరిస్థితుల్లో అనంతగా మాట్లాడుతూ కూర్చోవటానికి నాకు సావకాశం లేదు కదా.

సమాచారం ఇచ్చే పధ్ధతి ఇదేనా? అని నిలదీస్తున్నారు. ఫలాని పుస్తకం ఫలానిచోట దొరుకుతుంది అని చెప్పినప్పుడు అది సరైన పధ్ధతి ఎలా కాకపోతుంది?  తప్పకుండా సరైన పధ్ధతే అనుకుంటాను. ఐతే, మీకు ఆ  archive.org సైటులో వెదికే పధ్ధతి కూడా చెప్పవలసి ఉంటుదని నేను ఊహించలేకపోయాను. అందులోనూ మీరు సాఫ్ట్‌వేర్ పని చెస్తున్నారు కదా, మీరే ఇబ్బంది పడతారని ఊహించలేకపోయాను. మన్నించండి. 

సరే, అక్కడ వెదికే పధ్దతి కూడా చెబుతాను. మరికొందరికి కూడా ఉపయోగించవచ్చును. మీరు archive.org సైట్ తెరచి చూస్తే ఆపేజీలో search box ఒకటి కనిపిస్తుంది. అందులో మీరు "తత్త్వ కథనము" (please type without these double quotes) అని టైప్ చేస్తే వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పుస్తకాలు కనిపిస్తాయి. మీకు కావలసిన పుస్తకం పైన క్లిక్ చేస్తే ఆ పుస్తకం తాలూకు పేజీ తెరచుకొని అందులో DOWNLOAD OPTIONS కూడా కుడివైపున  కనిపిస్తాయి. అక్కడ PDF అన్న దానిపై మరలా క్లిక్ చేయండి. మీకు ఆ పుస్తకం PDF మీ బ్రౌజర్ లోనే తెరచుకుంటుంది. అలా తెరచుకున్న పుస్తకం పేజీలో మీకు Download బటన్ కూడా కనిపిస్తుంది. మీరు పుస్తకాన్ని బ్రౌజర్ నుండీ చదువుకోవచ్చును లేదా డౌన్‌లోడ్ చేసుకొని దాచుకోవచ్చును. మీ వీలును బట్టీ అవసరాన్ని బట్టీ చేయవచ్చును. మీరు search box లోపల టైప్ చేసిన దానిని బట్టి పుస్తకాలు కనిపించటం ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకొని రకరకాల search keys వాడి చాలా పుస్తకాలనే వెదకి పట్టుకోవచ్చును. "భారతము" అని దెదికితే 55 పుస్తకాలు కనిపించాయి నాకు. అలాగే "శతకము" అని వెదికితే 394 కనిపించాయి! ఇలా మీకు తోచిన అవసరమైన వెదుకులాట అన్నమాట.

నేను విడిగా పుస్తకం తాలూకు లింక్ అక్కడి నుండి ఇవ్వక పోవటానికి కారణం ఎక్కువమందికి ఈపుస్తకం మిగిలిన భాగాలూ అవసరం పడవచ్చును లేదా అక్కడ ఉన్న అనేక ఇతరగ్రంథాలూ ఆసక్తి కలిగించవచ్చును అని తలచి. అందులో బాధ్యత ఉన్నదో బాధ్యతారాహిత్యం ఉన్నదో మీరూ ఇతర పాఠకోత్తములూ ఎలా అనుకుంటే అలా.

మీరు నిలదీసి మాట్లాడుతున్న విధానం చూస్తే, ఐతే 24 x 7 బ్లాగులో మాట్లాడటానికి సంసిధ్ధంగా ఉండండి - లేకపోతే బ్లాగుల్లోంచి వెళ్ళిపోండి. అన్నట్లుగా ఉంది. ఎవరికీ నిజంగా 24 x 7 సమాధానాలు చెబుతూ వాదనలకు సిధ్ధంగా ఉండటం కుదరదనే నా ఉద్దేశం అండీ. 

మీరు అరవిందుల వారి సావిత్రి గ్రంథం చదివారా? ఆ పుస్తకం చాలా పెద్ద గ్రంథం. అంత పెద్ద పుస్తకం చివరన ఎంత మితంగా ఆయన ప్రశ్నోత్తరాలు జతపరచారో గమనించారా? అటువంటిది మనం ప్రతి ఒక్క పేజీ లేదా పేజీన్నర టపాకు పది పేజీల చర్చావేదికను నిర్వహించటం అంత అవవరమా? సమంజసమా అన్నది కొంచెం ఆలోచించండి.

బాధ్యతారాహిత్యం చాలా పెద్దమాట. అటువంటి మాటలు వాడేటప్పుడు ఎవరైనా చాలా బాధ్యతగా ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ వాడటం బాగుంటుందని నా అభిప్రాయం. మిమ్మల్ని కాని మరెవరిని కాని వ్రేలెత్తి చూపటం నా ఉద్దేశం కాదు. కాని ఒక్కొక్కసారి మనం అలవోకగా వాడిన మాటలు ఆవలి వాళ్ళకు రాళ్ళల్లా తగిలే అవకాశం ఉంటుందని మనందరం కొంచెం గమనికగా ఉండవలసిన అవసరం ఉందని చెబుతున్నానంతే.

ధర్మరాజు జూదం - 1


ధర్మరాజు గారు దిగ్విజయం చేసి మహావైభవంగా రాజసూయయాగం చేసారు.
అ వైభవం చూసి దుర్యోధనుడికి అసూయతో మండిపోయింది.
శకుని దగ్గర ఏమని వాపోయాడో చూడండి.

వహ్నిమేవ ప్రవేక్ష్యామి భక్షయిష్యామి వా విషం
అపోవాపి ప్రవేక్ష్యామి న హి శక్ష్యామి జీవితుం


అని. అంటే నిప్పుల్లో దూకుతాను, విషం తింటాను లేదా నీళ్ళలో దూకి చస్తాను కాని యింక జీవించి ఉండలేను అని  అన్నాడు. ఇంకా చాలా వాపోయి చివరని అంటాడూ

కృతోయత్నో మయా పూర్వం వినాశే తస్య సౌబల
తచ్చ సర్వ మతిక్రమ్య సంవృధ్ధోప్సివ పంకజం

ఆంటే ఆ ధర్మరాజును నాశనం చేయటం కోసం ఇంతకు ముందు ఎన్నో ప్రయత్నాలు చేసాను కానీ వాటి నన్నిటినీ‌ దాటుకొని ఆయన నీళ్ళల్లో ఉన్న పద్మం లాగా చక్కగా వృధ్ధిపొందాడూ అని.

అప్పుడు శకుని అబ్బే అలాంటి పిచ్చిపని చేయకు. నేను మంచి ఉపాయం చెబుతాను విను.

అహమక్షే ష్వబిజ్ఞాతః పృథివ్యా మపి భారత
హృదయజ్ఞః పణజ్ఞశ్చ విశేషజ్ఞశ్చ దేవనే
ద్యూతప్రియశ్చ కౌంతేయో న చ జానాతి దేవితుం
ఆహూత శ్చేష్యపి వ్యక్తం ద్యూతా దపి రణా దపి
నియతం తం విజేష్యామి కృత్వాతు కపటం విభో
అనయామి సమృధ్ధిం తాం దివ్యాం చోపాహ్వయస్వతం

అంటే శకుని చేప్పేది ఇది. ఈభూలోకంలో పాచికలు విసరటంలో నాకున్న నేర్పు మరెవ్వరికీ లేదు. ధర్మరాజుకు జూదం అంటే ఆసక్తి ఉంది కాని నేర్పు చాలదు. ఆయన యుధ్ధానికి పిలిచినా జూదానికి పిలిచినా తప్పక వస్తాడు.నేను కపటంతో ధర్మరాజును ఓడిస్తాను. ఆ దివ్యసంపదను నీవశం చేస్తాను. పిలువు జూదానికి అని.

తెలుగు భారతంలో శకుని మాటలు:


క. భాను ప్రభుఁ డగు పాండుమ
హీనాథాత్ముల లక్ష్మి యెల్లను నీకున్
నే నపహరించి యిత్తు ధ
రానుత మాయాదురోదరవ్యాజమునన్
వ. ధర్మతనయుండు జూదంబునకుఁ బ్రియుండు గాని యందుల యుక్కివం బెఱుంగం‌ డే నక్షవిద్య యం దతి దక్షుండ నాతని నశ్రమంబున నోడించి తదీయ రాజ్యవిభూతి నీకిచ్చెద వగవకుండుము.

ఇక్కడ  శకుని స్వయంగా కృత్వాతు కపటం అని చెప్పుకున్నాడు కదా. అంటే మోసం చేసి మరీ గెలుస్తానని తానే స్వయంగా శకుని దుర్యోధనుడితో చెప్పినప్పుడు కౌరవులు న్యాయంగా జూదం ఆడారూ అన్న వాదనకు అర్ధమే లేదు. ధర్మరాజుకు నైపుణ్యం చాలదు అంటూనే మోసం చేసి గెలుస్తాను అంటున్నాడు. అంటే ఏమిటీ? న్యాయంగా జూదం ఆడితే ధర్మరాజు గెలిచే అవకాశం ఉందని తానే అనుమానించుతున్నా డనే‌ కదా అర్ధం? అంటే ధర్మరాజుకు కౌశలం లేకపోవటం జూదం ఆడటంలో కాదు తన మోసాన్ని పసిగట్టటంలో ఆయనకు నేర్పు లేదూ అని చెప్తున్నాడన్న మాట.

ఈ ఉపాయం బాగుందని దుర్యోధనుడు సంబర పడ్డాడు. తాను పిలిస్తే ధర్మరాజు వస్తాడా జూదానికి?‌ కాని పెదనాన్న గారి పిలుపు అంటే తప్పక శిరసావహించి వస్తాడు కదా. అందుచేత పోయి తాను ధృతరాష్ట్ర్డుకి చెవులు కొరికాడు. ఆయన విదురుణ్ణి పిలిచి విషయం చెప్పి ధర్మరాజుని జూదానికి ఆహ్వానించి తీసుకొని రమ్మాన్నాడు. అసలు కురువృక్షాన్ని దొలిచిని పురుగు ఈ ధృతరాష్ట్ర్డుడే! తన కోరిక కూడా పాండవుల కన్నా తన కొడుకులే‌ బాగుండాలని కదా. అందుకని దుర్యోధనుడి పన్నాగం మహబాగా నచ్చింది మరి.

విదురుడు అభ్యంతరం చెప్పాడు.

నాభినందామి తే రాజన్ వ్యవసాయ మిమం ప్రభో
పుత్రేర్బేధో యథా న స్యాత్ ద్యూతహేతో తథా కురు

తెలుగు భారతంలో విదురుడి మాట


ఆ. ఇట్టి కార్యంబునకు నే నవశ్యంబును
నొడ బడంగ నోప నుక్కివమున
సుతుల తోడ నేల సుతులకు భేదంబు
సేయ గడఁగి తిదియు జెట్ట యనక

తే. ఒలసి నీపుత్రులెల్ల నొండొరుల తోడ
నెట్లొడంబడి యుండుదు రట్ల చేయ
వలయుఁ దమలోన జూదంబు వాదు నగుటఁ
కలహ మూలంబ యెట్టి శాంతులకు నైన

వ. నీ‌ నేర్చు విధంబుల శకుని దుర్యోధనుల దుర్వవసాయం బుడిగించి యిక్కురు వంశంబు రక్షింపుము.

రాజా నీవు ఇలా కొడుకుల మధ్య జూదం నడిపిస్తే కలహం వస్తుంది సుమా అని చెప్పాడు. కాని గ్రుడ్డి రాజు మనస్సు కూడా పుత్రమోహంతో గ్రుడ్డిదై ఉంది కదా అందుచేత విదురుడిని ఆజ్ఞాపించాడు.

తదద్య విదుర ప్రాప్య రాజానం మమ శాసనాత్
క్షిప్ర మానయ దుర్ధర్షం కుంతీపుత్రం యుధిష్టిరం

సరే నా శాసనం ఇది, ఈ ప్రకారం దర్మరాజును జూదానికి పిలుచుకొని రా అంటే ఆయన ఏంచేస్తాడు పాపం!

విదురమహాశయుడు వచ్చి ఆహ్వానం అందించగానే ధర్మరాజు విరక్తుడై ఏమన్నాడో వినండి.

ద్యూతే‌ క్షత్రః కలహో విద్యతే నః
కో వై ద్యూతం రోచతే బుధ్యమానః
కిం వా భవా న్మన్యతే యుక్తరూపం
భ్వద్వాక్యే సర్వ ఏవ స్థితా స్మః

మహాత్మా ఈ జూదం అనేది కలహ హేతువు.  ఏ బుధ్ధిమంతుడు దాన్ని కోరుకుంటాడు? ఇప్పుడు మేము ఏమి చేస్తే బాగుంటుంది. నీవు ఎలా చేయమంటే అలాగు చేస్తాం అన్నాడు ధర్మరాజు.

పాపం విదురుడు మాత్రం తన నోటితో తాను జూదం ఆడమనీ చెప్పలేడు. రాజాజ్ఞ ఉండగా జూదానికి రావధ్దు అనీ చెప్పలేడు. అందుకే

జానామ్యహం ద్యూత మనర్ధమూలం
కృతశ్చ యత్నోఽస్య మయా నివారణే
రాజా చ మాం ప్రాహిణోత్త్వకాశం
శ్రుత్వా విద్వన్ శ్రేయ ఇహాచరస్వ

తెలుసునయ్యా అనర్ధాలకు మూలం ఈజూదం అనీ, రాజుకు చెప్పి చూసాను కూడా. కాని ఆయన ద్యూతానికి నిన్ను పిలువమనే‌ అన్నాడు. బాగా అలోచించుకొని నీకేది మంచిది అనిపిస్తే అలా చేయవయ్యా అని విదురుడు అన్నాడు. ఇంకే మనగలడూ పాపం?

సరే అక్కడ జూదానికి ఉబలాట పడుతున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారూ‌ అని దర్మరాజు అడిగితే‌ విదురుడు శకుని పేరు చెప్పనే చెప్పాడు. అప్పుడు దర్మరాజు గారు ఏమన్నారంటే

మహామాయాః కితవా సన్నివిష్టా
మాయోపవా దేవితారోఽత్ర సంతి
ధాత్రా తు దిష్టస్య వశే  కి వేదం
సర్వం జగ త్తిష్టతి న స్వతంత్య్రం

నాహం రాజ్ఞా ధృతరాష్ట్రస్య శాసనా
న్న గంతు మిఛ్ఛామి కవే దురోదరం
ఇష్టోహి పుత్రస్య పితా సదైవ
తదస్మి కర్తా విదురాత్&థ మాం యథా

న చా కామ శ్శకునినా దేవితాఽహం
న చే న్మాం ధృష్ట ఆహ్వయితా సభాయాం
ఆయూతోఽహం ననివర్తే కదాచి
త్తదా హితం శాశ్వతం వై వ్రతం మే

మాయావులు జూదానికి సిధ్ధంగా ఉన్నట్లు కనిపిస్తూనే‌ ఉందే! ఈప్రపంచం అంతా విధికి వశమై అస్వతంత్రంగా ఉంది. పిలుపు పంపినది సాక్షాత్తూ పెదనాన్నగారు. ఆయన అజ్ఞను కాదనటం ఎలా? ఆయన తండ్రి - నేను కొడుకును. నాకాయన ఎప్పుడూ ఇష్టుడే కదా. ఈ ఆహ్వానం అంగీకరించవలసిందే. సభలో మాత్రం శకుని తానై పిలిస్తే తప్ప అతడితో జూదం ఆడను. అతడు పిలిస్తే మాత్రం ఆడక తప్పదు - అది నా వ్రతం.

అప్పటికే ధర్మరాజు గారు దాయాదులకు అహితంగా ప్రవర్తించను అని ఒట్టువేసుకొన్నారు కదా, కలహాలను నివారించటానికి. అందుకని వెళ్ళటం తప్ప గత్యంతరమూ లేదు!

సరే ధర్మరాజుగారు ఆహ్వానం మేరకు బయలు దేరి వెళ్ళారు.ఆయనతో పాటుగా సోదరులూ ద్రౌపదీదేవీ వారి పురోహితుడు ధౌమ్యుడు కూడా వెళ్ళారు.


24, ఆగస్టు 2022, బుధవారం

వ్యాసభారతం (సంస్కృతమూలం) తెలుగులో చదువుకొనే అవకాశం.

కొంత వెదికిన తరువాత నాకు వ్యాసభారతం (సంస్కృతమూలం)  ఆన్‌లైన్‌లో తెలుగులో చదువుకొనే అవకాశం కలిగించే సైట్ కనిపించింది.

మహాభారతం  https://sanskritdocuments.org వారి పేజీల్లో ఒకటి. ఇక్కడకు వెళ్ళిన తరువాత మనకు Devanagari (and other Indian scripts from each sarga page)  అని లింక్ కనిపిస్తుంది. దాన్ని తెరవండి. 

మనకు పర్వాల పేర్లు దేవనాగరిలోనే కనిపిస్తాయి. మనకు కావలసిన పర్వం పేరు మీద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి తెరవండి. నేను सभापर्वम् తెరుస్తున్నాను. ఇప్పుడు మనకు సభాపర్వం పేజీ దేవనాగరి లిపిలో తెరుచుకుని కనిపిస్తుంది. 

ఇబ్బంది లేదు. ఆపేజీలో పైన కుడివైపున ఒక చిన్న డబ్బాలో మనం కావలసిన భాషను ఎన్నుకోవచ్చును.  నేను తెలుగును ఎన్నుకున్నాను.

చక్కగా శ్లోకాలన్నీ అన్నీ తెలుగులిపిలో కనిపిస్తున్నాయి చదువుకుందుకు వీలుగా. మొత్తం సభాపర్వం అంతా మనకు ఒకే పేజీగా కనిపిస్తుంది!

ఇలాగే మనకు కావలసిన పర్వం తాలూకు మూల గ్రంథపర్వాన్ని చక్కగా చదువుకోవచ్చును.

ఇలా ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నది కేవలం మూలగ్రంథం మాత్రమే. 

ఇదంతా తెలుగులిపిలో ఉన్నా, గ్రంథభాష సంస్కృతమే.

మూలగ్రంథం శ్లోకాలతో కావాలీ, తెలుగులిపిలో చదువుకోవాలీ. అంతేకాదు తెలుగులో అర్ధతాత్పర్యాలు కూడా కావాలీ అనుకొనే వారికి కూడా ఒక ఉపాయం ఉంది. గీతాప్రెస్ వారు అటువంటి విధంగా వ్యాసభారతాన్ని అచ్చుపుస్తకాలుగావేసి అమ్ముతున్నారు. ధర నాకు గుర్తున్నంతవరకూ ప్రస్తుతం రెండున్నరవేలు అనుకుంటాను. హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లో గీతాప్రెస్ వారి విక్రయశాల ఉందని ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు చెప్పారు.


23, ఆగస్టు 2022, మంగళవారం

చేయండీ జనులారా మీరు శ్రీరఘురాముని నామము

చేయండీ జనులారా మీరు శ్రీరఘురాముని నామము
తీయతీయని చక్కనినామము దివ్యమైన శుభనామము

శ్రీరఘురాముని పావననామము చేతోమోదము గూర్చును
శ్రీరఘురాముని పావననామము మారజ్వరము తొలగించును
శ్రీరఘురాముని పావననామము చిత్తశాంతి కలిగించును
శ్రీరఘురాముని పావననామము శీలవంతులుగ జేయును
 
శ్రీరఘురాముని పావననామము ధీరులుగా నొనరించును
శ్రీరఘురాముని పావననామము శూరత పెంపొందించును
శ్రీరఘురాముని పావననామము జీవితములు సరిదిద్దును
శ్రీరఘురాముని పావననామము చింతలన్నిటిని తీర్చును
 
శ్రీరఘురాముని పావననామము శీఘ్రమె శోకము బాపును
శ్రీరఘురాముని పావననామము కోరిన వరముల నిచ్చును
శ్రీరఘురాముని పావననామము చేర్చును రామపదమునకు
శ్రీరఘురాముని పావననామము చేసెడి వారలు ధన్యులు

22, ఆగస్టు 2022, సోమవారం

ధర్మరాజు జూదం ఎందుకు ఆడినట్లు - 2.


ఈ విషయం గురించి మొన్న వ్రాసిన  వ్యాసంలో తగిన విధంగ వివరణ ఇచ్చినప్పటికీ ఒకరి నోటి దురుసుకు గురికావలసి వచ్చింది. ఆవిషయంలో చింత లేదు. మంధరా పాపదర్శినీ అని వాల్మీకి మహర్షి సెలవిచ్చినట్లుగా కొందరు కేవలం దోషాన్వేషణాతత్పరు లుంటారు. వారికి మీరు ఎదురు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదో ఒక మాటపడటం తప్పదు. కాబట్టి ప్రాజ్ఞతవహించి నిబ్బరంగా ఉండటం మంచిది.

నేను అన్న "దాయాదులకు నో అననని ధర్మరాజు ఒట్టువేసుకొని ఉండటం" అన్న మాట వలన రగడ కేవలం అనవసరమైనది. సరే, ఎవరికైనా ఉపయుక్తంగా ఉండే సమాచారం అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ధర్మరాజు జూదం ఎందుకు ఆడినట్లు అన్న వ్యాసాన్ని వెలువరించాను. ఐనా నోటిదురుసు వారు ఏదో ఒక విధంగా విరుచుకు పడటం మానలేదనుకోండి.

నా మాటలకు ఋజువు భారతం సభాపర్వంలో ఉంటుందనీ. వ్యాసమహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయం ఈవిషయం గురించి ప్రస్తావించలేదనీ చెప్పాను. ఐతే ఇందులో ఆంధ్రీకరణం చేసిన కవిత్రయం దోషం ఏమీ ఎన్ననవసరం లేదు. లక్షశ్లోకాల మహాభారతాన్ని తెలుగు చేసేటప్పుడు అది తెలుగులో మరింత పెద్ద గ్రంథం అవుతుంది. అంత విస్తృతమైన పరిథిలో తెలుగుసేత అభిలషణియం కాదన్న ఉద్దేశంతో‌ అంధ్రీకరణంలో కొన్నికొన్ని చోట్ల సంక్షిప్తం చేయటం తప్పనిసరి ఐనది. ఈవిషయం గురించి కూడా ముందటి వ్యాసంలో ప్రస్తావించాను.

ఇప్పుడు పాఠకులకు మరింత సౌలభ్యం కోసం బాలవ్యాస వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారతతత్త్వకథనము అనే‌ గ్రంథం నుండి ప్రమాణాలు చూపుతున్నాను. ఈ గ్రంథం పెద్దది. ఆరు సంపుటాలుగా ఉంది. ప్రస్తుతం చూపుతున్న పేజీలు నాలుగవది ఐన పాండవనిందానిరాకరణము అన్న భాగం లోనివి.


 

ఈపైన చూపినది గ్రంథ సంపుటం లోని మొదటి పేజీ. ఇందులో గ్రంథం గురించిన ముఖ్యవివరా లున్నాయి. ఇక మనకు కావలసిన సమాచారం ఉన్న పేజీలు రెండింటిని చూపుతున్నాను.


ఇక్కడ శాస్త్రి గారు సంస్కృతంలో ఉన్న మూల గ్రంథం వ్యాసుల వారి మహాభారతం నుండి శ్లోకాలను ఉటంకించి వివరించారు. గమనించగలరు.

ఈవిధంగా ఋజువు చూపినా సంతుష్టిపొందని వారుంటారా అంటే తప్పక ఉండవచ్చును. భర్తృహరి సుభాషితం ఉంది కదా!

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు 
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు 
తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు 
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
 
అందుచేత తాబట్టిన కుందేటికి మూడేకాళ్ళనే వారు తప్పకుండా ఉంటారు. ముందే అనుకున్నట్లు అటువంటి వారి విషయంలో చింత అనవసరం. అటువంటి వారికి ఒక నమస్కారం పెట్టి వాదనకు పోకుండా ఊరుకుందాం. ఇదంతా వారికోసం కానే కాదు. ఈఋజువులు విషయగ్రహణపారీణులైన పాఠకుల కోసం.


21, ఆగస్టు 2022, ఆదివారం

హరేరామ హరేకృష్ణ యనక ముక్తి లేదు

హరేరామ హరేకృష్ణ యనక ముక్తి లేదు
శరీరధారులార చక్కగా తెలియుడు

ఘనమైన కులము నందు కలుగుగాక మీజన్మము
ధనధనేతరములు చాల మొనయు గాక
ఘనమైన ప్రభుత కలిగి గర్వమంద వచ్చు గాక
పనివడి పదిమంది పొగడ వచ్చు కాక

వనజాక్షులు మిమ్ము మెచ్చి వచ్చిన రావచ్చు గాక
కనని వినని భోగంబులు కలుగు గాక
వినయముతో జనులు మిమ్ము వేడుచుందురు కాక
ఘనమగు తేజంబు మీకు కలుగు గాక

చాల దానధర్మములను సలిపిన సలుపుదురు గాక
నేలమీద మీకు పేరు నిలుచు గాక
చాల పుణ్యశీలురగుచు సంతసింతురు గాక
కాలమున మేలు గతులు కలుగు గాక

19, ఆగస్టు 2022, శుక్రవారం

ధర్మరాజు జూదం ఎందుకు ఆడినట్లు?


 ఈ ధర్మరాజుగారు జూదం ఆడటం ప్రస్తావన వచ్చింది ఒక కష్టేఫలీ బ్లాగుటపా తాలూకు చర్చలో. సరే వచ్చింది. నేనా చర్చలో దూరి (అనవసరంగా అంటారా? కావచ్చును!) ఒక మాట అన్నాను. "జూదం ద్వారా వచ్చిన లబ్ధిని దృతరాష్ట్రుడు రద్దుచేసి జూదానికి పూర్వం ఉండిన పరిస్థితిని పునరుధ్ధరించాడు. పాండవుల సిరిని అపహరించాలని మరొకప్రయత్నం చేసారు దుష్టచతుష్టయం. దాయాదులకు నో అననని ధర్మరాజు ఒట్టువేసుకొని ఉండటం వలన పునర్ద్యూతం జరిగి, వనవాసమూ అజ్ఞాతవాసమూ నెత్తిన బడ్డాయి పాండవులకు." అని. ఇది చూసి ఒక వ్యాఖ్యాత గారు "ఇది నాకు తెలియని కొత్తవిషయం. రిఫరెన్స్ ఇవ్వగలరా?" అని అడిగారు.

అలా అడగటాన్ని ఎద్దేవాచేస్తూ మరొకరు "వెతికి పట్టుకోవోయ్ అంతా అరటిపండు ఒలిచి యిస్తే తినేసే రకంగా వున్నారే" అన్నారు కాని అది సరైన మాట కాదు.

ఎందుకంటే ఆంధ్రమహాభారతంలో మీకు ఈవిషయానికి సంబంధించిన వివరాలు దొరకవు. అలా ఎందుకో కొంచెం వివరిస్తాను.

సంస్కృతంలో వేదవ్యాసమహర్షి విరచించిన మహాభారతం ముఫ్ఫైలక్షల శ్లోకాల మహాపర్వతం. దానిని మానవమాత్రులు చదవటం మహాదుష్కరం. కాబట్టి మానవలోకంలో కేవలం లక్షశ్లోకపరిమితిగా మహాభారతం ఇవ్వబడింది. కాని కాలక్రమేణా, కలిముదిరి లక్షశ్లోకాల సంగతి అటుంచి సంస్కృతభాషలో ఉన్న ఇతిహాసాన్ని జనసామాన్యం చదవటం అసాధ్యం ఐపోయింది.

కవులు జనభాషల్లోనికి దానిని యధాశక్తిగా తీసుకొని రావటం మొదలైంది. సంస్కృతభారతాన్ని తెలుగులోకన్నా ముందుగా కన్నడంలో అనువాదం చేసారు. ఆచేసినాయన జైనమతస్థుడు. దానితో పాండవులంతా మహాశ్వేత భక్తులైపోయారు. ఇంకా చాలా మార్పులు జరిగి సనాతనధర్మాన్ని ప్రబోధించే మహాభారతం దుర్గతి పాలౌతోందని పెద్దలు వాపోవటం మొదలైంది. అప్పట్లో తెలుగు కన్నడ భాషలింకా పూర్తిగా విడిపోలేదు. మనవాళ్ళు రెండుభాషల్నీ ఆదరించేవారు. దాని వలన తెలుగుదేశంలో భారతాన్ని ఆంధ్రీకరించాలీ అనే ఒక తపన మొదలయ్యింది. నన్నపార్యుడు దానికి పూనుకోవటంతో శ్రీమదాంధ్రమహాభారతం రూపుదిద్దుకోవటం జరిగింది.

ఇది పూర్తికావటానికి బహుకాలం పట్టింది. నన్నయ్య, తిక్కన్న, ఎఱ్ఱన్న అని ముగ్గురు మహాత్ములు శ్రీమదాంధ్రమహాభారతంమనకి అందించారు మొత్తం మీద.

ఈ మహాభారతాంధ్రీకరణం అంటే మూలంలోని లక్షశ్లోకాలనూ ఎలాఉన్నవి అలా తెలుగులోనికి తేలేదు. అక్కడ ఉన్న కధలూ ఉపకథలూ అన్నీ అలాగే తేలేదు. కొంత ప్రణాళికవేసుకొని చేసారు. మనకాలం వారి శక్తికి అనుకూలంగా కొంత క్లుప్తీకరించారు.

గరుత్మంతుడి కథ రెండు చోట్ల వస్తుంది మూలంలో - దాన్ని ఆదిపర్వంలో మాత్రం చెప్పారు. ఇల్లాంటివి చాలానే స్వతంత్రమైన పోకడలు పోయారన్నమాట.

ఇక విషయంలోనికి వద్దాం.

ధర్మరాజు గారు రాజసూయ యాగం చేసారు. అందరికీ తెలిసిన సంగతే. ఆయాగంలో కృష్ణుడికి అగ్రపూజ చేయటమూ దాన్ని అక్షేపించిన శిశుపాలుణ్ణి కృష్ణుడు వధించటమూ కూడా అందరికీ తెలిసినదే.

యాగం పూర్తి అయ్యాక దాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళారు. చివరగా బయలుదేరినది వేదవ్యాసమహర్షి. ఆయన్ను ఊరిపొలిమేర దాకా పాండవులు సాగనంపారు.

సరిగ్గా ఆసందర్భంలో ధర్మరాజుగారు వేదవ్యాసుల వారిని ఒక ప్రశ్న వేసారు.

ఈ రాజసూయమహాయాగం కారణంగా జనక్షయం అన్నది చెప్పారు కదా. అది ఈ శిశుపాల వధతో తీరిపోయినట్లే కదా అని అడిగారు.

దానికి వేదవ్యాసుడు చెప్పిన జవాబు వినండి. ధర్మరాజా, నీవీ‌ ప్రశ్న అడగకుండా ఉంటేనే బాగుండేదేమో. విను. ఈరాజసూయం తెచ్చే కలహం మాసిపోలేదు శిశుపాలవధతో. అది పదమూడు సంవత్సరాల తరువాత వస్తుంది మహా జనక్షయం జరుగుతుంది. అది నీ నిమిత్తంగా జరుగుతుంది. దానికి దుర్యోధనుడు కారణం అవుతాడు తన అత్యాశతో.

ఈసమాధానంతో ధర్మరాజు గారు హతాశుడయ్యాడు. ఇంటికి పోయి సోదరులతో సమావేశం ఐనాడు. వ్యాసభగవానుడు సెలవిచ్చిన మాటలు చెప్పి దుఃఖపరవశుడయ్యాడు.

హఠాత్తుగా ఒక నిర్ణయం ప్రకటించాడు. కలహానికి దుర్యోధనుడి దుర్బుధ్ది కారణం ఐనా అది నా నిమిత్తంగా వచ్చే‌ ప్రళయం ఐనప్పుడు దానిని శాయశక్తులా నివారించాలి. ఇకమీద దుర్యోధనాదులు ఏమి కోరినా కాదనను. అలా చేస్తే కలహానికి కారణమే ఉండదు కదా. అదే కర్తవ్యం నాకు అని.

దుర్యోధనుడు పాండవశ్రీని ఓర్వలేక తానూ రాజసూయం చేయాలని తలపోసాడు. కాని అది కుదరదు. చక్రవర్తి కాని వాడు చేయరాదనీ  అసలు దుర్యోధనుడు మూర్ధాభిషిక్తుడైన రాజే కాదు కనక కుదరదనీ పురోహితులు తేల్చి చెప్పారు. ఐతే ప్రత్యామ్నాయంగా వైష్ణవం అనే దొడ్డయాగం చేయవచ్చుననీ చెప్పారు.

సరే అని ఆ వైష్ణవయాగం చేసాడు దుర్యోధనుడు. గొప్ప సభాభవనం కూడా కట్టించాడు. పాండవులను ఆహ్వానించాడు. అపైన జరిగినది తెలిసినదే.

ఆవిషయంలో కొంచెంగా చెప్పుకోవాలి ఐనా సరే. పాండవులను సరదాజూదం పేరుతో సర్వవిధాలా అవమానించిన తరువాత ద్రౌపదీదేవి శపిస్తే పుట్టగతులుండవని ధృతరాష్ట్రుడు ఆవిడకు వరాలిస్తాడు. 

అంతేకాక తనంత తానుగా ఆవిడ ధర్మపరాయణత్వానికి ముగ్ధుడై మరొక వరం ఇస్తాడు. ఈ జూదం ముందు ఉన్న స్థితిని పునరుధ్ధరించుతున్నానని ప్రకటించాడు.

కడుపుమండి, దుర్యోధనుడు మళ్ళా జూదం నడిపించి పాండవులను అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించాడు.

అదీ సంగతి.

ఈ కథాక్రమంలో నన్నయ్య గారు తెలుగు చేయకుండా వదిలిన ఘట్టాల్లో ధర్మరాజు గారు ప్రయత్నపూర్వకంగా విరోధాన్ని నివారించటానికి పెట్టుకున్న ఒట్టు విషయం ఒకటి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా ఐనది. ధర్మరాజు అలా ఒట్టు పెట్టుకోక పోతే జూదానికి ఒప్పుకోవలసిన అగత్యం ఉండేది కాదు. కలహ నివారణకోసం పెట్టుకున్న ఒట్టే కలహానికి బీజం వేసింది!

పిల్లంగోవి చేతబట్టి పిల్లి వస్తుందా

పిల్లంగోవి చేతబట్టి పిల్లి వస్తుందా ఆ
పిల్లి నెత్తిమీద నెమలిఫించ ముంటుందా

పిల్లైతేను పాలుతాగి వెళ్ళిపోతుందే ఈ
పిల్లి వెన్నదుత్తలన్ని కొల్లగొడుతుందే
పిల్లైతేను ఉట్లజోలి కెల్లాపోతుందే ఈ
నల్లపిల్లి నందునింటి పిల్లే నోయమ్మా

పిల్లైతేను తానొంటిగ మెల్లగవచ్చేనే ఈ
పిల్లి పెద్దదండు తెచ్చి యిల్లు దూరేనే
పిల్లైతేను కాపుగాచి వెళ్ళగొట్టేమే వేయి
కళ్ళున్న ఈపిల్లిరాక కానలేమమ్మా

పిల్లైతే వంటింటిసిరి కొల్లగొట్టేనే ఈ
పిల్లి వచ్చిపోతే సిరులు వెల్లివిరియునే
పిల్లికాదు పిల్లికాదు గొల్లపల్లెనే ఇది
చల్లగ కాచే చక్కని శ్రావణమేఘమే 

1, ఆగస్టు 2022, సోమవారం

మనం‌ పాడుకోవలసిన కొత్తపాటలు. నేర్చుకొని తరించండి.

ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్న ఆధునిక భారతదేశపు పాట.

 

ఏం చేసినా మా మోదీ గొప్ప.
ఏం చేయకపోయినా మా మోదీ గొప్ప.
ఎలా చేసినా మా మోదీ గొప్ప.
ఎలా చేయకపోయినా మా మోదీ గొప్ప.
అసలు మా మోదీ ఏం ఆలోచించినా గొప్పే.
మా మోదీ ఏమి ఆలోచించకపోయినా గొప్పే.
ఎట్టిపరిస్థితుల్లోనూ మా మోదీ మాత్రమే గొప్ప.
అసలు గొప్ప అంటేనే మా మోదీ.
మా మోదీ కారణంగా మీరు బాగుపడితే ఆయనదే గొప్ప.
మా మోదీ కారణంగా మీరు చెడిపోయినా ఆయనే గొప్ప.
నోరు నొవ్వంగ మా మోదీ ఘనతను అనునిత్యం స్తుతించి తరించటమే గొప్ప.
జై మోదీ.
జై జై మోదీ.
జై భారత్.



భూలోకస్వర్గంగా మారిపోయిన బంగారు తెలంగాణా పాట

 

ఏం చేసినా మా కేసీఆర్ గొప్ప.
ఏం చేయకపోయినా మా కేసీఆర్ గొప్ప.
ఎలా చేసినా మా కేసీఆర్ గొప్ప.
ఎలా చేయకపోయినా మా కేసీఆర్ గొప్ప.
అసలు మా కేసీఆర్ ఏం ఆలోచించినా గొప్పే.
మా కేసీఆర్ ఏమి ఆలోచించకపోయినా గొప్పే.
ఎట్టిపరిస్థితుల్లోనూ మా కేసీఆర్ మాత్రమే గొప్ప.
అసలు గొప్ప అంటేనే మా కేసీఆర్.
మా కేసీఆర్ కారణంగా మీరు బాగుపడితే ఆయనదే గొప్ప.
మా కేసీఆర్ కారణంగా మీరు చెడిపోయినా ఆయనే గొప్ప.
నోరు నొవ్వంగ మా కేసీఆర్ ఘనతను అనునిత్యం స్తుతించి తరించటమే గొప్ప.
జై కేసీఆర్.
జై జై కేసీఆర్.
జై తెలంగాణా.



అభివృధ్ధి పరుగులు పెడుతున్న నవ్యాంధ్ర పాట

 

ఏం చేసినా మా జగన్ గొప్ప.
ఏం చేయకపోయినా మా జగన్ గొప్ప.
ఎలా చేసినా మా జగన్ గొప్ప.
ఎలా చేయకపోయినా మా జగన్ గొప్ప.
అసలు మా జగన్ ఏం ఆలోచించినా గొప్పే.
మా జగన్ ఏమి ఆలోచించకపోయినా గొప్పే.
ఎట్టిపరిస్థితుల్లోనూ మా జగన్ మాత్రమే గొప్ప.
అసలు గొప్ప అంటేనే మా జగన్.
మా జగన్ కారణంగా మీరు బాగుపడితే ఆయనదే గొప్ప.
మా జగన్ కారణంగా మీరు చెడిపోయినా ఆయనే గొప్ప.
నోరు నొవ్వంగ మా జగన్ ఘనతను అనునిత్యం స్తుతించి తరించటమే గొప్ప.
జై జగన్.
జై జై జగన్.
జై ఆంధ్రా.




గమనిక: ఈపై పాటలు మాత్రమే పాడుకోవలెను. ఇతరత్రా పాటలుపాడువారు దేశద్రోహులూ రాజద్రోహులూ అత్మద్రోహులూ ఐపోతారు తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత.