29, అక్టోబర్ 2017, ఆదివారం

నిజమైన యోగ మనగ


నిజమైన యోగ మనగ నిన్ను కలిసి యుండుటయే
నిజమైన భోగ మనగ నిన్ను తవిలి యుండుటయే

ఓ దేవదేవ నీవు కాదనవని వినిపింతును
నాదైన విన్నపము నాదురాగతం బేమి
వేదనా భరితములు వేనవేల జన్మంబుల
నీ దీను నెత్తించితి వెందుకయా రామ

ఓ దయామయ రామ నా దెంతభాగ్యమో
కాదనక నాబోటి కష్టాత్ముని దుష్టాత్ముని
వేదనలు పోనడంచి వేలదీవన లిచ్చి
చేదోడువాదోడై యాదుకొందు వే మహాత్మ

ఎన్ని జన్మములైన నెత్తితి నే కాని
నిన్ను తవిలియుండుట నేను మానితినా
అన్ని వేళలను కలసియున్నా మది చాలును
ఎన్నగ నా యోగమే  యెంతో దివ్యభోగము


27, అక్టోబర్ 2017, శుక్రవారం

మనసు నీ నామమును



మనసు నీ నామమును మరుగవకుండు గాక
తనువిది నీ సేవకు తప్పకుండు గాక

అన్నివేళలను నిన్నే యనుగమింతు గాక
అన్నిటికి నీయాదర మండ యగును కాక
మిన్ను మన్నేకమైన నిన్ను విడువ గాక
నన్ను నీవు విడువవని నమ్మియుందు గాక

లోకము ననుమెచ్చినా కాక మెచ్చకుండిన
శోకవ్యామోహములు లేకుండును కాక
చీకాకు పరచునట్టి సిరులు సంపదలకై
నీ కన్యుల నాశ్రయించ బో కుందును కాక

బ్రతుకు నీ కంకితమై వరలుచుండు కాక
మెతుకు నిన్ను తలపక  కతుక కుందు కాక
ప్రతిదినము నిన్ను గూర్చి పాడుచుందు కాక
ప్రతిగ శ్రీరామ మోక్షపద మిత్తువు కాక


26, అక్టోబర్ 2017, గురువారం

నిన్నే తలచి నీ‌ సన్నిధి నున్నాను


నిన్నే తలచి నీ‌ సన్నిధి నున్నా నయ్యా
అన్నిటికి నీదే భార మన్నా నయ్యా

పదివేల జన్మలకు వలదు వేరు తలపు
మదిలోన నీ కరుణ మాత్రమే తలతు
వదలక నీపాదపద్మములు భజింతు
ముదమార నీసేవ మొనసి నే తరింతు

నీ భక్తుల గాధలను నిత్యము స్మరింతు
నీ భక్తులతో జేర నిత్య ముత్సహింతు
నీ భక్తిభాగ్యమే వైభవమని యెంతు
నీ దయాలబ్ధికై నిత్యమును తపింతు

నీ‌ నామమే‌ నాకు మానసోల్లాసము
మానితమౌ నీ సేవ నా నిత్య కృత్యము
నానాంతర్యామి రామ నాదైన జీవితము
నీ నిర్మలపదయుగళి నిలచిన కుసుమము


పురుషోత్తమా యింక పోరాడలేను


(కాంభోజి)

పురుషోత్తమా యింక పోరాడలేను
కరుణాలవాల రాఘవ ప్రోవవయ్య

అగడంబులు చేయు నారుగు రున్నారు
వేగలేకున్నాను వీరితో రామ
దాగి నాలో నుండి దడపించు వీరిని
నే గెలువ లేనయ్య నీరేజనేత్ర

రాగద్వేషములను రాకాసులను జూడు
మాగమాగము చేసి యన్నివేళలను
లోగొందురే పోర లొచ్చాయరా శక్తి
నా గోల వినవయ్య నళినాయతాక్ష

ఆపైన యీ మాయ యనున దింకొక్కటి
నాపైన పగబూని న న్నేర్చు చుండె
నాపాలి దైవమా నారామచంద్రుడా
నా పలుకు లాలించి నన్నేల వయ్య


25, అక్టోబర్ 2017, బుధవారం

ఎవ డీశ్వరుండని యెవరైన నడిగిన


(కాంభోజి)

ఎవ డీశ్వరుండని యెవరైన నడిగిన
భువనేశ్వరుడు రామభూపాలు డందు

ఎవడు ధర్మిష్టి యని యెవరైన నడిగిన
రవికులేశ్వరుడు శ్రీరాముడే యందు
ఎవడు నిష్కాముడని యెవరైన నడిగిన
అవనిజాపతి గాక యన్యు డెవ డందు

ప్రతిలేని వీరు డగు వాడెవ్వడో యన్న
అతిలోకవీరుడై యలరు రాముం డందు
స్థితప్రజ్ఞులందున స్థిరయశుం డెవడన్న
అతిశేముషీ విభవు డా రాము డందు

సురపూజితుండగు నరు డెవ్వడో యన్న
హరియవతారమై యలరు రాముం డందు
పరిపూర్ణసుఖమిచ్చు భగవాను డెవ డన్న
మరి యట్టి దైవమా మారాముడే యందు


దేవదేవ నీ దివ్యప్రభావము



దేవదేవ నీ దివ్యప్రభావము తెలియగ తరమా రామయ్యా
దేవతలైనను తమచిత్తంబుల తెలియనేర రన రామయ్యా

అనిలో రావణు నంతము చేసి యవనిజ నటకు రావించి
వనితా పౌరుష ప్రకటనమునకే వధించితి నే రావణుని
చన వచ్చును నీ వని పలికిన భూజాత మిక్కిలిగ చింతించి
తనువు నగ్నిలో దగ్ధము చేయగ తలచిన నగ్నియె శాంతించె

రయమున బ్రహ్మసురేంద్రులు శివుడును రణాంగణంబున కరుదెంచి
జయజయ రామ జానకి రామ చాల నచ్చెరువు నీవు భవ
భయవారకుడగు శ్రీహరివే యీ పడతి సీత నీ లక్ష్మి కదా
అయయో యిటు లేమిటికిం జేసివి వని పలికినదే ఋజువు కదా

సామాన్యుడ నొక మానవమాత్రుడ చక్కగ నెటు నీ చెయుదముల
నా మనంబున నెఱిగి కొందు నది నావశమా కరుణించవయా
పామరుడను నా లోపము లెంచక పాలించవయా రామయ్యా
నీ మహిమలనే పాడుదు గాక నిన్నే చెందుదు నంతియె కాక


దినదినము నీనామ దివ్యసంకీర్తనా



(కాంభోజి)


దినదినము నీనామ దివ్యసంకీర్తనా
ఘనవ్రతాచరణాన కరుగనీ బ్రతుకు

తుదిలేని సమరమై మొదలైన యీ జీవి
బ్రదుకెల్ల విధముల భ్రష్టమై యిన్నాళ్ళు
చదువుసాములపేర సంపాదనల పేర
కుదురెరురుగ కుండెరా కోదండరామ

పరుల మెప్పుల గోరి పాటుబడుటే కాని
పరమాత్మ నీదయా ప్రాప్తిగోరగ నైతి
నిరుపమగుణధామ నీలమేఘశ్యామ
కరుణించుమా నన్ను కల్యాణరామ

విశ్వాత్మక వివిధవేదాంతసంవేద్య
విశ్వమోహనరూప విష్ణ్వావతార
విశ్వసంపోషక విశ్వపాలక నిన్ను
విశ్వసించితిని సర్వేశ శ్రీరామ


24, అక్టోబర్ 2017, మంగళవారం

నిను గూర్చి వ్రాయుదునా - నను గూర్చి వ్రాయుదునా


నిను గూర్చి వ్రాయుదునా నను గూర్చి వ్రాయుదునా
అను ప్రశ్న వచ్చె నయ్య ఆనతీయవయ్య రామ

సకలలోకములు నీవు చక్కగా చేసితివి
సకలలోకములు నేను చక్కగా తిరిగితిని
సకలలోకపరిసేవిత చరణయుగళి నీది
సకలలోకసంభ్రమణ చరణయుగళి నాది

ప్రకృతిపైన నేకాకృతి వగువాడవు నీవు
ప్రకృతి ననేకాకృతుల బడయు వాడ నేను
సుకృతవంతసంసేవ్యసుగుణరాశివీవు
వికృతబుధ్ధిగలుగు దుర్వినీతుడను నేను

నిను గూర్చి వ్రాయగా నేనెంతవాడ
నను గూర్చి వ్రాయగా నేమున్నవాడ
మనవి చేసితి నిజము మన్నింపుమయ్య
పనిచి నీ తోచినటుల వ్రాయించవయ్య


శ్రీరామనామ రసాయనము


శ్రీరామనామ రసాయనము నోరార గొనుడీ పాయసము
మీరెల్ల గొనుడీ పాయసము మీ వ్రాత మార్చు పాయసము

చాలకల్లలు పలికీపలికీ చాలనొచ్చెడు నాలుకకు
జాలిమాలి సాటివారిని చాలతిట్టే నాలుకకు
తూలుమాటల సాధుపురుషుల దొసగులెంచే నాలుకకు
మేలిబుధ్ధులు నేర్పుమందై చాల రుచిగల పాయసము

స్వపరభేదము లెంచిపలికే సహజగుణపు నాలుకకు
కపటబుధ్ధి దాచు పలుకుకమ్మదనపు నాలుకకు
శపథములతో జనులగుండెల జంకు గొలిపే నాలుకకు
మేలిబుధ్ధులు నేర్పుమందై చాల రుచిగల పాయసము

కాలచోదితమగుచు వదరే కానిమాటల నాలుకకు
మేలుచేసెడి వారిపైనను చాల యెగిరే నాలుకకు
చాల కొంచెపు వారిని పొగడుచు కాలమీడ్చే నాలుకకు
మేలిబుధ్ధులు నేర్పుమందై చాల రుచిగల పాయసము


ఈమంత్ర మామంత్ర మేమి లాభము

ఈమంత్ర మామంత్ర మేమి లాభము శ్రీ
రామమంత్ర మున్న ముక్తిరాజ్యలాభము

గవ్వలు పదివేలసంఖ్య కలిగి యేమి లాభము మంచి
రవ్వ చేత నొక్కటున్న రంజకం బగు గాక
అవ్విధి నకటావికటము లగు మంత్రముల బట్టి
నొవ్వనేల లేదొ మీ కనూన రామ మంత్రము

కాకులు పదివేలు చేరి కావుకావు మనిన నొక్క
కోకిలారవంబు కన్న గొప్పదనము రాదు
మీకు స్వల్పలబ్ధినిచ్చి మిడుకు నట్టివి వదలి
చేకొనగ రాదో‌ మీరు శ్రీరామ మంత్రము

చెంబులతో నీరుపోసి చేను తడుపరాదు మంచి
యంబువాహ మరుగుదెంచి నంతట తడియు గాక
తొంబలు మంత్రాల వలన తోచు సద్గతులు మిధ్య
సంబరముగ రామమంత్ర జపము మీరు చేయుడు


23, అక్టోబర్ 2017, సోమవారం

రామా రామా రామా యనుమని


రామా రామా రామా యనుమని రాముని కీర్తన పాడుమని
మీ మీ పెద్దలు బోధించిరని మీ రెరుగుదు రది మరచిరని

కామితార్థములు ఘనముగ నొసగే రామచంద్రునే మరచిరని
ప్రేమగ నొకపరి పిలచిన పలికే స్వామినామమే మరచిరని
కామక్రోవవశులై మీరు కాని పనులతో చెడితిరని
మీ మనసులకే తెలియునుగా మిక్కిలి కుందుచు నుంటిరిగా

రామనామమే హరినామంబుల రమ్యతరంబని తెలియుడయా
రామనామమే హరిదయ గొనుటకు రాజమార్గమని తెలియుడయా
రామనామమే సప్తకోటిమంత్రముల దొడ్డదని తెలియుడయా
రామనామమే ముక్తిమార్గమని మీ మీ‌మనసుల తెలియుడయా

జరిగిన దేదో జరిగిన దికపై చక్కగ రాముని నామమును
మరువక మీరు మనసున నిలిపుట మంచిదని లో నమ్ముచును
తరియించుడయా దానికి మించిన తరణోపాయము చూడగను
ధరనే కాదీ త్రిభువనములలో దొరుకదు దొరుకదు జనులారా


16, అక్టోబర్ 2017, సోమవారం

వెలుగనీ నా తెలుగు వేయిపాటలై నీకు


నీ విచ్చిన పలుకుసిరి నిన్ను గొలువ నీ వేళ
నీ విచ్చిన తనువుతో నిలచితి నీ మ్రోల

నీ నియతి మేర కేను నానాయోనుల బుట్టి
తే నేమి యా జన్మలు తెరలె నీ సేవలో
కాన నీ జన్మమున కలుగనీ నీ సేవయె
మానక నా పలుకులెల్ల మంచిపాటలై నీకు

పలుకులన్ని నీ సేవా భాగ్యంబున తరియింప
వలయు గాని యన్యులపాలుగా నీయకయ్య
తలపులన్ని నీ సేవాతత్పరమై చెలగుచుండ
వెలయనీ నా తెలుగు వేయిపాటలై నీకు

నా తెలుగు పలుకులు నాతండ్రీ నినుపొగడ
నాతురపడుచున్న విదే యాలకించవయ్య
నీ తీరుతెన్ను లెన్న నేనెంతటి వాడ గాని
చేతనైనంత పొగడజూతు శ్రీరామ నిన్ను


11, అక్టోబర్ 2017, బుధవారం

మనవిచేయ వచ్చునా మరియొక మాట


మనవిచేయ వచ్చునా మరియొక మాట
వినక ముందే‌ రామ నవ్వ ననినచో నుడివెదను

మొట్టమొదట నీవు నన్ను పుడమి కేల పంపితివి
గట్టిగట్టి కష్టాలను కలిగించగ కాదు కదా
అట్టులైన నా కష్టము లన్నియు తిలకించుచు
ఇట్టు లూరకుండుటకు హేతువేమొ తెలుపుమా

ఈ కర్మస్వాతంత్ర్యము మాకేల నిచ్చితివి
మా కొలది వారు దాని మట్టిపాలు చేయనా
మా కర్మస్వాతంత్ర్యము మాకు కష్టహేతువై
నీకు మమ్మెడబాప  నీ వడ్డుపడ వెందుకు

ఎన్నో‌మార్లు చచ్చిపుట్టి ఏనాటికో మాకు
నిన్ను చేరుకొను బుధ్ధి నిక్కముగా కలిగినా
పన్ని చిక్కు లారూఢపతన దుర్యోగములు
తిన్నగా చేదుకొనక తిప్పలు పెట్టేవేల

8, అక్టోబర్ 2017, ఆదివారం

జరిగిన దేదో జరిగినది





జరిగిన దేదో జరిగినది ఆ జరిగినది నను కలచినది
తరుణమెఱిగి కాపాడెదవని నీ దయకై చిత్తము వేడినది

భేషజమేటికి కుటిలుర నమ్మి విన్నదనంబును పొందినదై
ఈషణ్మాత్రము శాంతిలేనిదై యిటునటు పరువులు పెట్టినది
దోషాచరులను దండించే నిర్దోషుల మొఱ్ఱల నాలించే
శేషశయన నీ సన్నిధి చేరి చిత్తము తహతహలాడినది

కొందరు కుటిలుర నమ్మిన దోసము  కొలువగ చేదొక కొంత
కొందరు కుటిలుర తోడి వాదములు కొలువగ చేదొక కొంత
చిందరవందర లారోగ్యంబులు చిక్కులు పెట్టుగ కొంత
కొందలమందిన చిత్తము నిను చేయందించమని కోరినది 

రామా జలధరశ్యామా జగదభిరామా నిన్నే నమ్మినది
రామా భండనభీమా దనుజవిరామా నిన్నే కొలిచినది
రామా యినకులసోమా సీతాకామా నిన్నే చేరినది
రామా శివసుత్రామాదికనుత రక్షించుమని వేడినది



తీవ్రమైన ఒత్తిళ్ళ మధ్యన ...

దాదాపు ఒక నెల రోజుల నుండి చాలా తీవ్రమైన ఒత్తిళ్ళ మధ్యన ఉన్నాను.

అవి బహుముఖంగా ఉన్నాయి.

అందులో‌ అసలు మనుష్యులంటేనే సర్వవిధాలా సంపూర్ణంగా నమ్మకం అనేది పోయిన పరిస్థితిని కల్పించిన సంగతీ ఉన్నది. మన్నించాలి. ఇప్పుడు వివరించలేను.  ఎందుకంటే నా మనఃస్థితి అస్సలు బాగోలేదు కాబట్టి.

ఈ ఒత్తిళ్ళ ప్రభావం ఎంతగా ఉందంటే నా ప్రవర్తన నాకే సార్లు చిత్రంగా అనిపిస్తోంది. మాటల్లో తడబాటు వ్రాతలో అక్షరదోషాలూ‌ పదాలు కొన్ని మనసులోనుండి కాగితంపైకి రాకుండా ఎక్కడికో ఎగిరిపోవటం. ఒకటి వ్రాయబోయి మరొకటి వ్రాయటం,  ఏ పనిలోనూ‌ ఏకాగ్రత కుదరక పోవటం. స్వభావవిరుధ్ధంగా తరచు అనేక విషయాలలో మరపుకు గురికావటం. స్థిరంగా ఉండలేక చేతిలో ఉన్న పనులు వాయిదా వేస్తూ పోవటం, చేసిన పొరపాట్లే పదేపదే వరసగా చేస్తూ ఉండటం.... ఇత్యాదులు.

ఆకాశంలో మబ్బులు ఎన్నిపట్టినా చివరకు అవన్నీ‌పోయి అది నిర్మలం కావటం జరుగుతుంది.

అలాగే ఈ ఒత్తిళ్ళు దూరమై ఇతఃపూర్వస్థితికి వస్తానన్న నమ్మకం‌ నాకుంది.

ఐతే వత్తిళ్ళను తగ్గించుకుందుకు నాకు వీలైన ప్రయత్నాలు నేను చేయాలి కదా.

అదే చేస్తున్నాను కూడా. కనీసం‌ ఇంంతగందరగోళ స్థితిలోనూ‌ సాధ్యమైనంతగా ప్రయత్నిస్తున్నాను.

అందులో తగ్గించుకోదగిన కార్యక్రమాలూ వ్యాపకాలూ తగ్గించుకోవటం ఒకటి.

ఈ బహుళమైన ఒత్తిళ్ళలో బ్లాగువ్యాసంగం కూడా ఒకటి అనిపిస్తోంది.

బ్లాగుటపాలు వ్రాసుకోవటంలో ఒత్తిడి ఏమీ లేదు.  పోనీ ఒత్తిడి ఏమీ లేదని నేను అనుకుంటున్నాను.

కాని బ్లాగుల్లో వస్తున్న వ్యాఖ్యల ధోరణి వలన మాత్రం నాపై ఒత్తిడి చాలానే ఉంది.

ఈ వ్యాఖ్యలను నేను మాలిక వ్యాఖ్యలపుటలో చూస్తూ ఉంటాను.

ఈ మధ్యకాలంలో కొందరు చేసిన వ్యాఖ్యలను చదివి చాలా చాలా గ్లాని కలిగింది.

ఆవ్యాఖ్యలపైనా అలాంటి వ్యాఖ్యలను చేసిన, ఇంకా చేస్తూనే ఉండే వ్యాఖ్యాతలపైన నేను కూడా వ్యాఖ్యల రూపం లోనూ, కొన్ని సార్లు టపాల రూపంలోనూ స్పందించటం‌ అందరూ గమనించే ఉంటారు.

ఇలా స్పందించవలసి రావటమూ స్పందించటమూ కూడా అసలే పలు ఒత్తిళ్ళ మధ్యన ఉన్న నన్ను మరింతగా ఒత్తిడికి గురిచేయటం జరుగుతోంది.

అసలు అలా స్పందించటం అవసరమా అనో స్పందించకపోతేనేం అనో అనుకోవలసింది. కాని నా బాధ్యత అని అనుకున్నాను. చాలా ఒత్తిడికి గురయ్యాను. స్పందించి ఒత్తిడిని మరింతగా  పెంచుకున్నాను.  ఇందువలన నేను సాధించినది ఏమన్నా ఉందో‌ లేదో‌ కాని నా మనశ్శాంతిని నేను మరింతగా చెడగొట్టుకున్నాను. అందుకే అలోచనలో పడ్డాను ఈవిషయంలో.

సభామర్యాదావిరుధ్దంగా ఉండటానికి ఏమాత్రం సంశయించని బ్లాగర్ల పేర్లతో పాటు శ్యామలీయం అన్న పేరు కూడా మాలిక వ్యాఖ్యలపుటలో కనిపించటం నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు.

సభామర్యాదను పాటించని బ్లాగర్లను భళీభళీ అని ప్రశంసించే వారూ తెలుగుబ్లాగులోకంలో నాకు బాగానే కనిపిస్తున్నారు.

అందుచేత ఇకపైన నా పేరుతోకాని నా బ్లాగరు నామధేయం ఐన శ్యామలీయం పేరుతో కాని ఏవిధమైన వ్యాఖ్యలనూ‌ చేయబోవటం లేదు.  అంటే అనామకంగా వ్యాఖ్యలు వేస్తారా అని ఎవరైనా సంశయించ నక్కర లేదు. అలా ఇంత వరకూ చేసిందీ‌ లేదు ఇకముందు చేసేదీ‌ లేదు.

అలాగే మాలిక వ్యాఖ్యలపుటను చూడబోవటమూ‌ లేదు.

బ్లాగువ్యాసంగం‌ అంటే నేను వ్రాసుకొనే అథ్యాత్మికరచనలు నా ఒత్తిడిని తగ్గించేవే కాబట్టి వాటివల్ల నాకు ఇబ్బంది లేదు.

ఆ రచనలు కూడా చదివే వాళ్ళున్నారు కొంచెం మంది. వారికి మరొకసారి నా ధన్యవాదాలు. సరసవ్యాఖ్యలను ప్రచురించటానికి ఇబ్బంది ఉండదు. కాని స్పందించి సమాధానాలను ఇవ్వగలనని అనుకోవటం లేదు. అందుకు తగిన మనఃస్థితిలో లేను కాబట్టి అందరూ అర్థంచేసుకొన వలసిందిగా చదువరులకు వినమ్రంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.



6, అక్టోబర్ 2017, శుక్రవారం

ధారాళమైన సుఖము వదలి తప్పుజేసితి


(అఠానా)

ఏల నిన్ను విడచివచ్చి నేలజేరితి ధా
రాళమైన సుఖము వదలి తప్పుజేసితి

నిన్ను గలసి యున్న నన్ను తన్నుకుపో గలుగు మాయ
అన్నన్నా యెటుల గలిగె నన్ను జన్మచక్రమందు
తిన్నగాను ద్రోసె నిదే యెన్నరాని బాధలు పడు
చున్నా నయ్యయ్యొ ఆపన్నుడ నను బ్రోవవయ్య

పరాత్పరా మహానుభావ భావమందు నిన్నెన్నక
దురాకృతంబు లెన్ని జేసి దుఃఖాయమానజీవన
పరాయణుండనైతినో నిరంతరంబుగా నిటన్
తరించి మాయ నిన్ను జేరు దారి చూపుమా రామ

మాయలోన చిక్కితి నను మాట నిన్ననే తెలిసె
మాయకవల నున్న నీవు మాయలోన నున్న నేను
మాయదారి మాయగోల మాయమైన నొకటే కద
నీయం దీ జీవత్వము నిశ్చయముగ కరుగనిమ్ము


3, అక్టోబర్ 2017, మంగళవారం

సంసారమును దాటు సదుపాయ మేమి



(కళ్యాణి)

సంసార మందుండి సంసారమును రోసి
సంసారమును దాటు సదుపాయ మేమి

గురువు నన్వేషించి గురుపాదములు చేరి
గురువును సేవించి గురుకృప వలన
గురుబోధ బడసి యా గురుబోధ యందు
స్థిరుడై వర్తించిన నరుడు తరించును

దేవుని చింతించి దేవుని భజింయించి
దేవుని ధ్యానించి దినములు రేలు
దేవున కన్యము భావించ కుండిన
జీవుడు తరియించి దేవుని చేరును

తన తొలి యుని కేది తానేల నిటు వచ్చె
తన నిజ తత్త్వ మేమి తన విధ మేమి
యని యెంచి బ్రహ్మం బనగ తానే నని
ఘనముగ నెఱిగిన గడితేరు రామ


2, అక్టోబర్ 2017, సోమవారం

పూజ్య బాపూజీనీ హేళన చేసిన నీహారిక తెంపరితనం!



పాఠక మహాశయులారా,

అందరికీ శంకరాభరణం బ్లాగు తెలిసే ఉంటుంది.

సమస్యాపూరణం అనేది ఒక ప్రముఖ సాహిత్యప్రక్రియ. సాధారణంగా సమస్య అంటే ఒక పద్యపాదంగా ఇస్తారు.  ఆసక్తి కల కవులు పద్యాన్ని సరసంగా పూర్తిచేయాలి.

సమస్యాపూరణంలో ఇచ్చే సమస్యలు గడ్డుగానే కనిపిస్తాయి. "భార్య లిద్దరు శ్రీరామభద్రునకును" అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాముడు ఏకపత్నీవ్రతుడు. ఆయన భార్య సీత. మరొక భార్య కూడా ఉందని చెప్పి పద్యం పూర్తిచేయ మంటారేమిటీ అని అనిపిస్తుంది.

అదే తమాషా. అలాంటి గడ్డు సమస్యనూ అందమైన పద్యంగా చెప్పాలి.
ముఖ్యంగా ఔచిత్యం ఎక్కడా కించిత్తు కూడా దెబ్బతిన కూడదు మరి.

శంకరాభరణం బ్లాగును  శ్రీ కంది శంకరయ్య గారు ఏళ్ళతరబడి ఎంతో నిష్ఠతో దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఎందరో ఔత్సాహిక కవులూ అప్పుడప్పుడు కాస్త చేయితిరిగిన కవులూ కూడా పాల్గొని బ్లాగును జనరంజకంగా చేస్తున్నారు.

ఈ నాటి సమస్య  "గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాడు నిజము" అనేది.

ఔత్సాహికులైన కవులు యథాశక్తి పూరణలు చేస్తున్నారు.

ఐతే ఒక పూరణ క్రింద నీహారిక గారు ఒక వ్యాఖ్య చేసారు. "బోడిగుండు ని చూసి బోర్ కొడుతుంది" అని!

ఈ చెత్తవ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉంది.

పూజ్యబాపూజీని అవమానించేదిగా ఉంది.

మీరూ గమనించండి.   (క్రింది బొమ్మపైన క్లిక్  చేసి పూర్తి పరిమాణంలో చూడవచ్చును)




ఇదేమి తెంపరి తనం?

నీహారిక గారు సాటి బ్లాగర్లను నోటికి వచ్చినట్లు తిడుతూ వ్యాఖ్యలు పెడుతున్నారు. ఇదేమి కొత్త కాదు.

చివరికి ఆవిడ పూజ్య బాపూజీని కూడా వదిలిపెట్టకుండా అడ్డదిడ్దంగా మాట్లాడటం ఏమిటీ?

ఆవిడ తాను ప్రపంచసామ్రాజ్ఞిని అనుకొంటూ  తనకు ఎవరిమీద కోపం వస్తే వాళ్ళందరినీ హీనంగా సంబోధిస్తూ వెఱ్ఱిమొఱ్ఱి వ్యాఖ్యలతో విసిగించటమూ ఏవేవో శిక్షలు వేసేస్తున్నానంటూ బెదిరింపులు విసరటమూ చేస్తూ వస్తున్నారు.

ఆవిడ పూర్తిస్పృహలోనే ఉండి ఇలా వ్యవహరిస్తున్నారో లేక ఆవిడకు ఏమన్నా మానసిక సమస్య ఉన్నదో అర్థం కావటం లేదు.

అసలు నీహారిక గారికి శంకరాభరణం బ్లాగుతో ఏమి పని?

నాకు తెలిసినంతవరకూ ఆవిడ పద్యాలు గట్రా ఏమీ వ్రాయరే?

నీహారిక గారైనా మరెవరైనా చేతనైతే అక్కడ ఇచ్చిన సమస్యను పద్యరూపంలో చక్కగా సరసంగా పూరించటానికి ప్రయత్నించాలి. ఇంకా శక్తి ఉంటే,  అక్కడకు వస్తున్న పూరణల గుణదోషాలను చర్చింవచ్చును.

లేకపోతే

అక్కడ కవులూ ఔత్సాహికులూ చేస్తున్న పూరణలను చదివి ఆనందించాలి.

లేదా

తనపనేదో తాను చూసుకోవాలి.

అంతే కాని పూజ్య బాపూజీని అవమానిస్తూ వ్యాఖ్య పెట్టటం ఏమిటి?

జాతిపితను అవమానించటం చూస్తూ సహించి ఊరకోలేక ఈ టపా వ్రాస్తున్నాను. అంతే కాని తీరికూర్చుని ఈ నీహారిక ప్రసక్తి ఎత్తతం నాకు  ఎంతమాత్రమూ  అవసరం కాదు.

బాపూజీని కూడా వదలకుండా గాంధీజయంతి రోజున ఇలా ఘోరంగా అవమానిస్తూ వ్యాఖ్యానించటం ఎంతమాత్రమూ క్షమించరాని నేరం.

నిత్యమూ శిక్షలూ శిక్షలూ అంటూ అందరివెంటా పడే ఈ నీహారిక గారికి ఇలాంటి అసహ్యమైన వ్యాఖ్య చేసినందుకు తప్పకుండా శిక్ష పడవలసిందే. సందేహం లేదు.

ఈ విషయంలో అందరూ నీహారిక గారి  ప్రవర్తనను ముక్తకంఠంతో గర్హించవలసిన అవసరం ఉంది.

జైహింద్!


అంతులేని యానందం‌ బందించిన దీవే


అంతులేని యానందం‌ బందించిన దీవే
చింతలేని యీభాగ్యము చేకూర్చిన దీవే

గుణములను కల్పించిన గుణాతీత నీవు
గుణాత్మకమైన జగతి గూడియాడుచుండ    
అణువణువున నిన్ను గని నేను మురియగ
అణకువతో‌ నిలచి వందనము చేయగ

వినయంబున నేను నీదు వివిధవిభూతులను
మునుకొని పొగడుచు మోదమందు చుండగ
ననుగని చిరునగవుల నీవును నను చేరగను
నినుగని పరవశమున నేనును నిను చేరగను

పూని నీవు నన్ను పొలుపుగ ననిశమును
మానక పెనగొనుచు మసలుచు నుండగను
నే ననిన నీ వనగను నీ వనిన నే ననగను
న్యూనాధికంబు లేమి లేని దగు శ్రీరామ


1, అక్టోబర్ 2017, ఆదివారం

తిరువేంకటాద్రిపైఁ దిరమై నిలచినట్టి తుమ్మెదరో




వేడుక కాఁడవై విడివడి తిరిగేవు తుమ్మెదరో
చూడఁ చూడఁగ దొంటి చూపు దప్పక వయ్య తుమ్మెదరో

తలఁపుఁదామరలోన తావై యుండుదు వీవు తుమ్మెదరో
తలఁపగ నీవె తలఁప వైతివి మమ్ముఁ దుమ్మెదరో
పొలయ గమ్మని తావి పొందున దిరిగేవు తుమ్మెదరో
పొలసి నీ తిరిగేటి పొందు లెఱుంగుదుము తుమ్మెదరో

పచ్చని విలుకాని బంటవైతివి గద తుమ్మెదరో
మచ్చిక తలఁపులు మనలోనె సరివోలు తుమ్మెదరో
అచ్చపు దీమస మందరి కెక్కడిదయ్య తుమ్మెదరో
చిచ్చువంటి వెన్నెల చెలిమి సేయకువయ్య తుమ్మెదరో

తిరువేంకటాద్రిపైఁ దిరమై నిలచినట్టి తుమ్మెదరో
పరమయోగుల పూలఁ బరిమళములు గొన్న తుమ్మెదరో
కరుణించి మా మీఁదఁ గలిగిన యీప్రేమ తుమ్మదరో
ఇరవాయె నిటువలె నెలసి వుండంగదవె తుమ్మెదరో

ఈ‌ సంకీర్తనం అన్నమాచార్య శృంగారసంకీర్తనల లొనిది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన తాళ్ళపాక పదసాహిత్యం యొక్క ఆరవ సంపుటంలోని 31వ సంకీర్తనం.

అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో రకరకాల ప్రక్రియలు దర్శనం ఇస్తాయి. కొన్ని యుగళ గీతాలు. కొన్ని కోలాటం‌ పాటలు. కొన్ని చందమామ పాటలు. కొన్ని సువ్వి పాటలు కొన్ని ఉగ్గు పాటలు కొన్ని తుమ్మెద పాటలు మరికొన్ని ఉయ్యాల పాటలు. ఇలా  ఇంకా అనేక రూపాల్లో ఆయన సంకీర్తనాలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసాయి.

ఇదొక తుమ్మెద పాట.

ఆ మహానుభావుని సంకీర్తనలు కొన్ని ఆధ్యాత్మకీర్తనలు కొన్ని శృంగారసంకీర్తనలు కొన్ని మేలుకొలుపులు కొన్ని వైరాగ్యప్రబోధకాలు ఇలా అనేక విధాలుగా స్థూలంగా తోస్తాయి. అంతర్లీనంగా అంతా భక్తిరసప్రవాహమేను.

ఈ తుమ్మెద పాటలు సహజంగా శృంగారరసప్రధానమైనవి.

ఇవి జానపదస్త్రీలు తమ తమ మనోభావలను తుమ్మెద అనేదే ఒక తుంటరి పురుషుడిగా లెక్కించి పాడే శృంగారగీతాలనే భావన ఉన్నది.

అందరికీ సుపరిచితమైన ఒక సినిమా పాట ఉంది పాండవులు పాండవులు తుమ్మెదా పంచపాండవులో యమ్మ తుమ్మెదా అంటూ.

అన్నమాచార్యులవారి శృంగార సంకీర్తనల్లో పురుషుడు ఇంకెవ్వరు? ఆ శ్రీనివాసుడే కదా!

ఒకప్పుడు మీరాబాయి ఒక మాట అన్నదట. పరమాత్మ ఒక్కడే పురుషుడూ అని. సందర్భం ఏమిటంటే ఆవిడ ఒక సాధుపురుషుడి దర్శనానికి వెడితే ఆయన శిష్యులు అడ్డుకున్నారట. "అమ్మా, మా గురువు గారు స్త్రీలను చూడడూ" అని. అప్పుడు మీరా ఆశ్చర్యపోయి "సృష్టిలో పరమాత్మ ఒక్కడే పురుషుడు. ఇప్పుడు మీ‌గురువుగారు మరొక పురుషుడు బయలుదేరాడా" అన్నదట.  ఆమాట తెలిసి ఆ సాధువుగారు ఆవిడను ఎంతో వినయాదరాలతో సంభావించారని లోకంలో ఒక కథ ప్రచారంలో ఉంది.

అందుచేత ఈ సృష్టిలో పరమాత్మ ఒక్కడికే పురుషత్వం చెప్పటం భక్తసాంప్రదాయం.

ఆన్నమయ్య శృంగారసంకీర్తనల్లో అమ్మవార్లు స్త్రీలు.  గోపీజనాది భక్తవరేణ్యులంతా కూడా అయన స్త్రీలు.  ఆ పరమాత్మ శ్రీనివాసుడే పురుషుడు.

ఈ పాట యొక్క అంతరార్థం రేపు పరిశీలిద్దాం. ప్రస్తుతం ఈ‌ అధ్బుతగీత మాధుర్యాన్ని ఆస్వాదించండి.


ఉభయభూపతనములు నుట్టుట్టి మాటలు



ఉభయభూపతనములు నుట్టుట్టి నటనలు
రభసగా నడుమ నడచు రంజైన నాటకము

వచ్చునా వాని బ్రతుకు వాడు బ్రతికి పోవునా
పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండ పోవునా
ముచ్చటగా మూణ్ణాళ్ళు ముందు గానక తిరిగి
ఎచ్చోటికి పోవునో  యెగిరిపోవు నొకనాడు

ఆ లోననె యెందరిపై నలవి గాని ప్రేమలో
ఆ లోననె యెందరిపై నధికమైన పగలో
అ లోననె లోకమెల్ల నేల  నెన్ని భ్రమలో
ఆ లోన పరువెత్తే కాలంబును కనడు

వచ్చిన పని యెఱుగడు పంపిన నిన్నెఱుగడు
ముచ్చటగ వేమారులు మూర్ఖుడై యిటు తిరిగి
అచ్చమైన తెలివి తిరిగి హత్తుకొనగ నొక నాడు
పిచ్చి వదలి నిన్ను చేరు వేడుకతో‌ శ్రీరామ