26, అక్టోబర్ 2017, గురువారం

పురుషోత్తమా యింక పోరాడలేను


(కాంభోజి)

పురుషోత్తమా యింక పోరాడలేను
కరుణాలవాల రాఘవ ప్రోవవయ్య

అగడంబులు చేయు నారుగు రున్నారు
వేగలేకున్నాను వీరితో రామ
దాగి నాలో నుండి దడపించు వీరిని
నే గెలువ లేనయ్య నీరేజనేత్ర

రాగద్వేషములను రాకాసులను జూడు
మాగమాగము చేసి యన్నివేళలను
లోగొందురే పోర లొచ్చాయరా శక్తి
నా గోల వినవయ్య నళినాయతాక్ష

ఆపైన యీ మాయ యనున దింకొక్కటి
నాపైన పగబూని న న్నేర్చు చుండె
నాపాలి దైవమా నారామచంద్రుడా
నా పలుకు లాలించి నన్నేల వయ్య


3 కామెంట్‌లు:

  1. మనకు శ్రద్ధ కుదిరి దైవాన్ని అర్చిస్తేనే ఆయన కరుణిస్తాడని అంటున్నప్పుడు మనలోని అహంకారం వల్ల అసలు శ్రద్ధయే కుదరకపొతే ఇంక ప్రార్ధించడం కూడా కుదరదు కదా - ఈ వైరుద్ధ్యాన్ని ఎట్లా అధిగమించాలి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మనలోని అహంకారం వల్ల అసలు శ్రద్ధయే కుదరకపొతే ఇంక ప్రార్ధించడం కూడా కుదరదు కదా

      ప్రార్థన అవసరం లేదు. అప్పుడు అహంకారం మీదే పూర్తీగా ఫోకస్ చేయాలి. రెండు పడవల లో కాళ్ళు వేయవలసిన అవసరం లేదు.

      తొలగించండి
  2. హరిబాబు:
    శ్రద్ధ కుదిరేదాకా అలా పోరాడుతూ ఉండడమే మనసుతోటి. అదొక వీర పోరాటం - బయట ఎవరికీ తెలియని చెప్పుకోలేని పోరాటం. "హే రామయ్యా నాకేం చెతకాదు; నేను ఇలా తినేసి అలా మంచం ఎక్కేస్తా అన్నీ నువ్వే చూడూ" అంటే "సరే నీకు లేని గోల నాకెందుకూ?" అని ఆయన వేరే చోటు చూసుకుంటాడు. మరి ఈ మనసుని దార్లోకి తెచ్చుకోవడం ఎలా?

    ఆశంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం
    అభ్యాసేనతు కౌంతేయా వైరాగ్యేణచ గృహ్యతే

    అభ్యాసం చేయక ఎవరికీ ఏదీ ఉత్తినే దొరకదండి. అలా దొరికితే ప్రతీ ఒక్కడూ పరమ బద్ధకస్తుల్లా తయారౌతారు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.