1, అక్టోబర్ 2017, ఆదివారం

తిరువేంకటాద్రిపైఁ దిరమై నిలచినట్టి తుమ్మెదరో




వేడుక కాఁడవై విడివడి తిరిగేవు తుమ్మెదరో
చూడఁ చూడఁగ దొంటి చూపు దప్పక వయ్య తుమ్మెదరో

తలఁపుఁదామరలోన తావై యుండుదు వీవు తుమ్మెదరో
తలఁపగ నీవె తలఁప వైతివి మమ్ముఁ దుమ్మెదరో
పొలయ గమ్మని తావి పొందున దిరిగేవు తుమ్మెదరో
పొలసి నీ తిరిగేటి పొందు లెఱుంగుదుము తుమ్మెదరో

పచ్చని విలుకాని బంటవైతివి గద తుమ్మెదరో
మచ్చిక తలఁపులు మనలోనె సరివోలు తుమ్మెదరో
అచ్చపు దీమస మందరి కెక్కడిదయ్య తుమ్మెదరో
చిచ్చువంటి వెన్నెల చెలిమి సేయకువయ్య తుమ్మెదరో

తిరువేంకటాద్రిపైఁ దిరమై నిలచినట్టి తుమ్మెదరో
పరమయోగుల పూలఁ బరిమళములు గొన్న తుమ్మెదరో
కరుణించి మా మీఁదఁ గలిగిన యీప్రేమ తుమ్మదరో
ఇరవాయె నిటువలె నెలసి వుండంగదవె తుమ్మెదరో

ఈ‌ సంకీర్తనం అన్నమాచార్య శృంగారసంకీర్తనల లొనిది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన తాళ్ళపాక పదసాహిత్యం యొక్క ఆరవ సంపుటంలోని 31వ సంకీర్తనం.

అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో రకరకాల ప్రక్రియలు దర్శనం ఇస్తాయి. కొన్ని యుగళ గీతాలు. కొన్ని కోలాటం‌ పాటలు. కొన్ని చందమామ పాటలు. కొన్ని సువ్వి పాటలు కొన్ని ఉగ్గు పాటలు కొన్ని తుమ్మెద పాటలు మరికొన్ని ఉయ్యాల పాటలు. ఇలా  ఇంకా అనేక రూపాల్లో ఆయన సంకీర్తనాలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసాయి.

ఇదొక తుమ్మెద పాట.

ఆ మహానుభావుని సంకీర్తనలు కొన్ని ఆధ్యాత్మకీర్తనలు కొన్ని శృంగారసంకీర్తనలు కొన్ని మేలుకొలుపులు కొన్ని వైరాగ్యప్రబోధకాలు ఇలా అనేక విధాలుగా స్థూలంగా తోస్తాయి. అంతర్లీనంగా అంతా భక్తిరసప్రవాహమేను.

ఈ తుమ్మెద పాటలు సహజంగా శృంగారరసప్రధానమైనవి.

ఇవి జానపదస్త్రీలు తమ తమ మనోభావలను తుమ్మెద అనేదే ఒక తుంటరి పురుషుడిగా లెక్కించి పాడే శృంగారగీతాలనే భావన ఉన్నది.

అందరికీ సుపరిచితమైన ఒక సినిమా పాట ఉంది పాండవులు పాండవులు తుమ్మెదా పంచపాండవులో యమ్మ తుమ్మెదా అంటూ.

అన్నమాచార్యులవారి శృంగార సంకీర్తనల్లో పురుషుడు ఇంకెవ్వరు? ఆ శ్రీనివాసుడే కదా!

ఒకప్పుడు మీరాబాయి ఒక మాట అన్నదట. పరమాత్మ ఒక్కడే పురుషుడూ అని. సందర్భం ఏమిటంటే ఆవిడ ఒక సాధుపురుషుడి దర్శనానికి వెడితే ఆయన శిష్యులు అడ్డుకున్నారట. "అమ్మా, మా గురువు గారు స్త్రీలను చూడడూ" అని. అప్పుడు మీరా ఆశ్చర్యపోయి "సృష్టిలో పరమాత్మ ఒక్కడే పురుషుడు. ఇప్పుడు మీ‌గురువుగారు మరొక పురుషుడు బయలుదేరాడా" అన్నదట.  ఆమాట తెలిసి ఆ సాధువుగారు ఆవిడను ఎంతో వినయాదరాలతో సంభావించారని లోకంలో ఒక కథ ప్రచారంలో ఉంది.

అందుచేత ఈ సృష్టిలో పరమాత్మ ఒక్కడికే పురుషత్వం చెప్పటం భక్తసాంప్రదాయం.

ఆన్నమయ్య శృంగారసంకీర్తనల్లో అమ్మవార్లు స్త్రీలు.  గోపీజనాది భక్తవరేణ్యులంతా కూడా అయన స్త్రీలు.  ఆ పరమాత్మ శ్రీనివాసుడే పురుషుడు.

ఈ పాట యొక్క అంతరార్థం రేపు పరిశీలిద్దాం. ప్రస్తుతం ఈ‌ అధ్బుతగీత మాధుర్యాన్ని ఆస్వాదించండి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.