6, అక్టోబర్ 2017, శుక్రవారం

ధారాళమైన సుఖము వదలి తప్పుజేసితి


(అఠానా)

ఏల నిన్ను విడచివచ్చి నేలజేరితి ధా
రాళమైన సుఖము వదలి తప్పుజేసితి

నిన్ను గలసి యున్న నన్ను తన్నుకుపో గలుగు మాయ
అన్నన్నా యెటుల గలిగె నన్ను జన్మచక్రమందు
తిన్నగాను ద్రోసె నిదే యెన్నరాని బాధలు పడు
చున్నా నయ్యయ్యొ ఆపన్నుడ నను బ్రోవవయ్య

పరాత్పరా మహానుభావ భావమందు నిన్నెన్నక
దురాకృతంబు లెన్ని జేసి దుఃఖాయమానజీవన
పరాయణుండనైతినో నిరంతరంబుగా నిటన్
తరించి మాయ నిన్ను జేరు దారి చూపుమా రామ

మాయలోన చిక్కితి నను మాట నిన్ననే తెలిసె
మాయకవల నున్న నీవు మాయలోన నున్న నేను
మాయదారి మాయగోల మాయమైన నొకటే కద
నీయం దీ జీవత్వము నిశ్చయముగ కరుగనిమ్ము


4 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ధన్యవాదాలు. ఈవేదాంతం అనేది గహనంగానే ఉంటుం దనుకోండి. ఏదో చేతనైనంత సుబోధకంగా ఉండేలా వ్రాయ యత్నిస్తున్నాను. ఇలా అనటం కూడా డాంబికం అనిపించుకుంటుందా? ఏమో తెలియదు. నా మనస్సుకు తోచినది వ్రాస్తున్నాను. అంతా ఆయన ఇఛ్ఛ.

      తొలగించండి
  2. యా మా సా మాయా అన్నారు అందుకే. చాలా బాగా వ్రాసారు.

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.