31, జనవరి 2026, శనివారం

నీదే భారము


నీటముంచుము పాలముంచుము నీదేభారము
నేటి దుస్థితి నాటి నాస్థితి నీదయే ప్రభూ

అవనినుండగా నాజ్ఞచేసినా వట్లుచేసితి

పవలురాత్రులు రామ నీకునై పాడుచుంటిని

వివిధదేహముల్ దాల్చుచుంటిని వీరరాఘవ

భువనపాలన మరల స్వస్థితిన్ పొందు టెప్పుడో


నిరుపమానమౌ నీదు కరుణనే నేను నమ్మితి

పరమపావన వరప్రదాయక పతితపావన

మరల స్వస్థితిన్ పొందు వరము నిమ్మందురా ప్రభూ

శరణు శరణు నా మొరలు వినవయా స్వామి నీవికన్

 

కీర్తిప్రభలు


సరిలేని శ్రీరామచంద్రు డను వీరుడిదే

సురవైరిమూకలను సొదబెట్టి నాడు


సురల కష్టములు తీర నరుల కష్టములు తీర

విరిబోండ్ల జాతికిని వెతలు దీర

పరమాద్భుత విక్రముడై ధర మీద వెలసినాడు

ధర నాతని కీర్తిప్రభల ధగధగలను కనరే


మునులందరు పొగడగా జనులందరు పొగడగా

వనజాసనాదులే వచ్ఛి పొగడ

వినతాసుతవాహనుడే వెలసినాడు ధరననగా

కనుడాతని కీర్తిప్రభల కాంతులెల్ల దెసల


వికచోత్పలనయనుడై సకలజనమోహనుడై

సకలలోకరక్షకుడను సత్కీర్తిని

అకళంకవిక్రముడై యవలీలగ పొందినాడు

ఇక వాని కీర్తిప్రభల వికాసము కనరే



సుంత యోచించి చూడు


సుంత యోచించి చూడు  మంతకాంతకుండు లోన
చింతించుచు నుండు హరిని శ్రీరాముని చింతించుము

ఎంతదాక విష్ణుభక్తి యంతరంగ మందు పుట్ట
దంతదాక నజ్ఞానం బంతరించదు

ఎంతదాక భాగవతుల సంతసమున గొలువవో
యంతవరకు పామరత్వ మంతరించదు

ఎంతదాక విష్ణునామ చింతనమున మనసునిలువ
దంతదాక రిపువర్గం బంతరించదు

ఎంతదాక విష్ణురూప మంతరంగ మందు నిలువ
దంతదాక భవబంధము లంతరించవు

ఎంతదాక విష్ణుతత్త్వ చింతనమును చేయకుందు
వంతదాక నా యవిద్య యంతరించదు

ఎంతదాక నెల్లచోట్ల నీశ్వరుడగు హరియె తోచ
డంతదాక మిథ్యాజగ మంతరించదు

ఎంతదాక వెన్నునే నిరంతరముగ వేడవో
యంతదాక భవమోహం బంతరించదు

ఎంతదాక శరణాగతి చింతించవు శౌరికి నీ
వంతదాక మోక్ష మబ్బు టన్నది లేదు


28, జనవరి 2026, బుధవారం

శ్రీమారుతీ


సీతారామ భృత్యవర్య శ్రీమారుతీ నీకు
చేతులెత్తి మ్రొక్కెదను శ్రీమారుతీ

ఇంతవాడ వంతవాడ వెంతవాడ వందునయా
  చింతలన్ని పారద్రోలు శ్రీమారుతీ ని
శ్చింతగాను రామనామ చింతనంబు చేయువేళ
  చెంతనుండి కాపాడెడు శ్రీమారుతీ ఆ
పంతగించు రాకాసుల యంతుజూచు రామకార్య
  చింతనాపరుండవైన శ్రీమారుతీ మద
నాంతకుడవు స్వామి యంతకాంతకుడవు కదా నీ
  యంతవాడు లేడందు నయా మారుతీ

ఎంత కష్టకార్య మైన హృదయపూర్వకముగ నిన్ను
  చింతించిన నెరవేరును శ్రీమారుతీ అది
ఎంత దుష్టపీడ యైన ఎంచి నిన్ను రక్షకునిగ
  చింతించిన తొలగిపోవు శ్రీమారుతీ అది
ఎంత రోగబాధ యైన అమితశ్రధ్ధతో నిన్ను 
   చింతించిన చక్కబడును శ్రీమారుతీ 
ఎంత మనోవ్యాధి యైన నాత్మశుధ్ధిగా నిన్ను
   చింతించిన స్వస్థుడగును శ్రీమారుతీ

నీయాజ్ఞ

అవజ్ఞయే లేని యాజ్ఞ రామాజ్ఞ
  అది పొందుటేరా యసలైన ప్రజ్ఞ

తల్లిదండ్రుల యాజ్ఞ బాలుడవైతే
  తనయుల యాజ్ఞయె వృధ్ధుడవైతే
ఇల్లాలియాజ్ఞయె యువకుడవైతే
  యెప్పుడు నీయాజ్ఞ చెల్లేది

చదువుల నుండిన గురువుల యాజ్ఞ
  పదవుల నుండిన పైవారి యాజ్ఞ
పదవేమి లేకున్న పదిమంది యాజ్ఞ
  అదనేది చెల్లగ నీయాజ్ఞ

పూజలవేళ పురోహితు నాజ్ఞ
   బుధ్ధి మందమైన బందుగు లాజ్ఞ
రాజాజ్ఞ తలపైన నిత్యముం డాజ్ఞ
    నీజన్మలో నెపుడు నీయాజ్ఞ


గోవుల కాచేవు చిన్నోడా

గోవుల కాచేవు చిన్నోడా నీది యేవూరయ్యా గోపయ్యా
యేవూరంటేను చిన్నమ్మీ మాది మీవూరేనే గోపమ్మా

మావూరైతేను చిన్నోడా మీది యేవీధయ్యా గోపయ్యా
యేవీధంటేను చిన్నమ్మీ మాది మీవీధేనే గోపమ్మా

మావీధైతేను చిన్నోడా మీది మరి యెవరిల్లయ్యా గోపయ్యా
మీవాళ్ళిల్లేను చిన్నమ్మీ మాది నీవెరిగినదే గోపమ్మా

నేనెరుగుదునా చిన్నోడా చెప్పు నీవారెవరో గోపయ్యా
మీనందరాజే చిన్నమ్మీ నిజము మానాన్నగారు గోపమ్మా

మీనాన్నగారే చిన్నోడా అవ్వ మానందరాజు గోపయ్యా
ఔనే అవ్వేమి చిన్నమ్మీ కండ్లకానదొ మాఠీవి గోపమ్మా'

ఆనుచున్నది ఠీవి చిన్నోడా వట్టి అల్లరి చేతల గోపయ్యా
ఆనేది యల్లరి చిన్నమ్మీ కండ్ల కానదు మాలీల గోపమ్మా

లీలలు విన్నాము చిన్నోడా తెలియలేకున్నామో గోపయ్యా
యేలాగు తెలియును చిన్నమ్మీ దాని నెఱుగరు సురలును గోపమ్మా

సురదుర్లభుడవా చిన్నోడా చాల చోద్యమెవ్వడవు గోపయ్యా
మరి యింకెవ్వాడ చిన్నమ్మీ నేను హరినే సత్యము గోపమ్మా

హరిదేవుడవా చిన్నోడా కృష్ణ యంజలించెదను గోపయ్యా
సరిసరి మ్రొక్కిన చిన్నమ్మీ నీవు తరియించినావు గోపమ్మా


నీవే దిక్కు శ్రీరామ

నీవే దిక్కు శ్రీరామ నీదే భారము
నీవేమని నిర్ణయించినా వదే జరుగు

లోకంబులు సర్వమును నీకృపచే నేర్పడెను
లోకేశులు సర్వులును నీకృపచే నేర్పడిరి
లోకస్థులు సర్వులను నీకృపయే పోషించును
శ్రీకర యట్లగుట చేత నీకే మ్రొక్కెద నయ్య

పాపంబులు బాపు నట్టి పరమకృపా మూర్తి వీవు
శాపంబులు బాపు నట్టి పరమశుభంకరుడ వీవు
తాపంబులు బాపెడు భవ తారకుడవు హరివి నీవు
నాపాలిటి దైవ రాయ నమ్మి మ్రొక్కెదను నీకు

నాగశయన జగన్నాథ నారాయణ మ్రొక్కెదను
రాగరహిత పరమేశ్వర రామచంద్ర మ్రొక్కెదను
యోగిరాజగణసేవిత సాగిలపడి మ్రొక్కెదను
వేగమె రక్షించెదవో విడతువొ నాకర్మమునకు


పలుకవె మనసా

పలుకవె మనసా హరినామములను 
  పలుకవె తీయగ మనసా
పలికిన భవహరమగునే మనసా 
  పలుకవె హాయిగ మనసా

కేశవ మాధవ గోవిందా యని 
  కృష్ణ ముకుందా గోవిందా యని
దాశరథీ హరి గోవిందా యని 
  తరచుగ పలుకవె మనసా

శ్రీశ సురేశా గోవిందా యని
  నాశనరహితా గోవిందా యని
యీశానప్రియ గోవిందా యని
  యిపుడే పలుకవె మనసా
   
సర్వార్తిహరా గోవిందా యని 
  నిర్వాణప్రద గోవిందా యని
సర్వేశ్వర హరి గోవిందా యని 
  చక్కగ పలుకవె మనసా

సర్వజ్ణా హరి గోవిందా యని
  సర్వకామదా గోవిందా యని
సర్వదర్శనా గోవిందా యని
  సరగున పలుకవె మనసా



హరినామమే

హరినామమే కద యతిమధురము శ్రీ
హరినామమే మన కానందము

హరినామమున కన్య మది యెట్టి దైన
సరిసరి మన కది సరిపడదే
హరినామమును గ్రోల ననవరతంబును
త్వరపడుచుందుము తహతహతో

పరవశమున నిదే పాడుచు నుందుము
హరేరామ యని శ్రీ హరేకృష్ణ యని
మరి యన్యముల గోల మనకెందుల కని
హరినామసుధారస మానుచును

27, జనవరి 2026, మంగళవారం

సీతారాముడా

సీతారాముడా ఓ సీతారాముడా 
మాతప్పులు మన్నించుము సీతారాముడా

భూతలమున జీవులమై పుట్టినామయా
సీతారామ తప్పులెన్నొ చేసినామయా
మాతండ్రీ మహాకృపామయుడ వన్న గొప్ప 
ఖ్యాతిగన్న దేవదేవ సీతారాముడా

మాతల్లివి తండ్రి వీవె సీతారాముడా మ
మ్మే తీరున బ్రోచెదవో సీతారాముడా 
భూతలమున మరల బుట్ట సీతారాముడా ఇక
మాతరమే కాదు సుమా సీతారాముడా

చేతులెత్తి మ్రొక్కేము సీతారాముడా మా
రాత లింక మార్చవయా సీతారాముడా మహి
మాతిశయము కలిగినట్టి సీతారాముడా నీ
చేతిలోని పనికదా సీతారాముడా

అనవయా

రామ రామ రామ రామ రామ యనవయా శ్రీ
 రామా నీనామమె నాప్రాణ మనవయా

ముదముగొలుపు నామస్మరణ వదల ననవయా

నిదురనైన నీనామము వదల ననవయా

సదయా నీసత్కరుణయె చాలు ననవయా

వదలరాదు నాచేతిని ప్రభో యనవయా


వదలినాను సిరులపైన భ్రాంతి ననవయా

పదవులపై భ్రాంతిలేదు ప్రభో యనవయా

వదలలేను రామ నీదు పాద మనవయా

వదలించుము ప్రభో భవబంధ మనవయా 



26, జనవరి 2026, సోమవారం

ముక్తి

శ్రీరామభక్తులకె సిధ్ధంబు ముక్తి

  వేరొక్కరికి లేదు ముక్తి


శ్రీరామనామమును చేయండి జనులార

  చేసిన వారికే ముక్తి

శ్రీరామచింతనము చేయండి జనులార

  చేసిన వారికే ముక్తి

శ్రీరామధ్యానమే చేయండి జనులార

  చేసిన వారికే ముక్తి

శ్రీరామభజనంబు చేయండి జనులార

  చేసిన వారికే ముక్తి


శ్రీరామునే కోరి చేరండి జనులార

  చేరిన వారికే ముక్తి

శ్రీరామసన్నిధిని కోరండి జనులార

   కోరిన వారికే ముక్తి

శ్రీరామని కొలువు చేయండి జనులార

  చేసిన వారికే ముక్తి

శ్రీరామునే గొప్ప చేయండి జనులార

  చేసిన వారికే ముక్తి


రామనామమే

ఏమున్నదయా పామరులారా

  రామనామమే గొప్నదయా

రామనామమును చేసెడు వారికి

   కామితములు నెరవేరునయా


రామనామమున కంటెను సంపద

   యేమున్నదయా యేమున్నదయా

రామనామమున కంటెను మధురం

   బేమున్నదయా యేమున్నదయా

రామనామమమున కన్న జయప్రద 

  మేమున్నదయా యేమున్నదయా

రామనామమున కన్న సుఖప్రద

  మేమున్నదయా యేమున్నదయా


రామనామమున కంటెను చక్కని

    దేమున్నదయా యేమున్నదయా

రామనామమున కన్న భయాపహ

   మేమున్నదయా యేమున్నదయా

రామనామమున కంటెను మంత్రం

    బేమున్నదయా యేమున్నదయా

రామనామమున కంటెను మోక్షద

   మేమున్నదయా యేమున్నదయా


రామనామమున జేసి విభీషణు

  డేమో రాజ్యము బడసెనయా

రామనామమున జేసిన దొంగను

  రాముడు మునిగా చేసెనయా

రామనామమును పొందిన మారుతి

  బ్రహ్మపదవినే బడసెనయా

రామనామమును శివుడును నిత్యము

  ప్రేమగ జేయుచు నుండునయా

23, జనవరి 2026, శుక్రవారం

నమ్మండి రాముని

నమ్మండి రాముని నమ్మిన వారికి 
 నమ్మకముగ మోక్ష మున్న దండీ 
నమ్మి సాటినరుల నమ్మి వ్యర్ధసిరుల 
 నిమ్మహి పొందే దేమున్న దండీ 

 శ్రీరామనామమె సిరులన్నిటి నొసగు 
 చింతామణి యని తెలుసుకోండి 
ఆరామనామంబు నాశ్రయించిన వారు 
 వేరేమీ జన్మలో కోరరండీ 
శ్రీరామునే నమ్మి కూరిమితో చేసి 
 శ్రీరామధామంబు చేరేరండి 
శ్రీరామపాదాల సన్నిధికే బుధులు 
 వేరొక్క దారేదీ వినబడదండీ 

రామభక్తుల జేరి రామనామము పొంది 
 రాముని సన్నిధి చేరుకోండి 
భూమిపై నల్పుల పొగడుచుండక మీరు   రామసంకీర్తనారతులు కండీ 
కామారియే పొగడు రామనామము కన్న 
 కామించదగిన దేమున్న దండీ 
శ్రీమన్నారాయణు శ్రీరామచంద్రుని 
 మీమనసులో నిల్ప మేలౌనండీ

22, జనవరి 2026, గురువారం

అనరే మీరు

హరినామము మాకు చాలు ననరే మీరు

హరిసన్నిధి మాకు చాలు ననరే మీరు


హరియొక్కడె మాకు గురుం డనరే మీరు

హరియొక్కడె మాకు చుట్ట మనరే మీరు

హరియొక్కడె మాకు నృపతి యనరే మీరు

హరియొక్కడె మాకు దైవ మనరే మీరు


హరియొక్కడె మాకు హితుం డనరే మీరు

హరియొక్కడె మాకు మిత్రు డనరే మీరు

హరియొక్కడె మాకు రక్ష యనరే మీరు

హరియొక్కడె మాకు లోక మనరే మీరు


హరియే శ్రీరాముండని యనరే మీరు

హరేరామ హరేరామ యనరే మీరు

హరియే శ్రీకృష్ఢుండని యనరే మీరు

హరేకృష్ఢ హరేకృష్ణ యనరే మీరు

20, జనవరి 2026, మంగళవారం

అలసట చెందియున్నారే

శ్రీరాములవా రలసట చెందియున్నారే యుప
చారములను సలుపవలయు చక్కగ నిపుడు

శీతలోదకముల దెచ్చి శీఘ్రమే యిపుడు
సీతాపతి కందించరె సేదదీరగ

పన్నీటిని జల్లరమ్మ ప్రభువుపై నిపుడు
పన్నీటను కప్పురంపు పలుకులు కలిపి

వింజామరలను తెచ్చి వీచరే యిపుడు
కంజాక్షులార చల్లని గాలి తగులగ

వాసనతైలములు పూల పరిమళములతో
కోసలేశు గది నింపరె కోమలులార

అమ్మా సీతమ్మ హరి కంగరాగములు
నెమ్మేనను నీవలద వమ్మ చక్కగ 

ముదమారగ వీణియపై మోహనరాగం
సుదతులార మీటరే నిదురించ హరి


19, జనవరి 2026, సోమవారం

శ్రీరామ రామ

శ్రీరామ రామ రాజీవలోచనా దు
ర్వారఘోరసంసారబంధమోచనా

సన్నుతాంగ నిన్ను నేను శరణుజొచ్చితి
నిన్నే నమ్ముకొంటినని నీవెఱింగియు
నన్ను కావరావే యిది న్యాయమేనా
యెన్ని యుగము లాయెను లెక్కించుకోరా

నమ్మలేదు గ్రహములను నరులను సురల
నమ్మలేదు వేరే దైవమ్ముల యునికి
నమ్ముకొన్న నీవు కూడ నన్ను విడచుట
నమ్మలేను నమ్మలేను నారాయణా

వేగ రమ్ము రామా సర్వేశ్వర నీవు
వేగ రమ్ము దీనబంధు బిరుదాంకిత
వేగ రమ్ము కరివరద వేగ రారా
వేగ రార నాతండ్రీ బింకమేలా

18, జనవరి 2026, ఆదివారం

హరికన్నను చుట్టమై

హరి కన్నను చుట్టమై మరియొక డున్నాడా
నరులారా యని విదులు నవ్వుచున్నారు

హరి కన్నసు సిరిగలవాడై యొక డున్నాడా
నరులారా మీరితరుల నడుగ బోవగ
హరి కన్నను సంరక్షకుడై యొక డున్నాడా
నరులారా వీరి వారి మరువున చేర

హరి కన్నను వందనీయుడై యొక డున్నాడా
నరులారా మీరిప్పుడు నమస్కరింప
హరి కన్నను వరములిచ్చు దొర యొక డున్నాడా
నరులారా చేరి మీరు వరము లడుగగ

హరి కన్నను మొక్షమొవ్వ రందింతు రయ్యా
నరులారా హరినామము లవి చాలవా
హరియే శ్రీరాముడు నాత్మబంధువనుచు
నరులారా తెలియుదాక పరమే లేదు


17, జనవరి 2026, శనివారం

దేవదేవ నిన్ను నమ్మితి

దేవదేవ నిన్ను నమ్మితి
నావాడవే యని నమ్మితి

ఉత్తుత్తి బ్రతుకులాయె నుర్విపైన రామ నే
నెత్తిన బహుజన్మముల నిన్నాళ్ళుగ గడచినవి
క్రొత్తగ నీనామ మిది కొన్ని జన్మముల నుండి
హత్తుకొన నాలుకపై నానందపడుచు నేను

మునుకొని నీగుణనామములను కీర్తించుచు
జనకజాహృదయేశ్వర సంతసమున పాడుచు
వినతాసుతవాహ యిక వేగముగను సంసార
మున నుండి విడిపించగ వేడుచు నా మనసులో

చాలు నిక పొట్టకూటి సంపాదన బ్రతుకులును
చాలు నిక మూడునాళ్ళ సమసిపోవు బంధములును
చాలు నిక కలసిరాని జనులతో కలహములును
మేలు స్వస్థానమునకు సత్కరుణను పిలుతువని


16, జనవరి 2026, శుక్రవారం

నన్ను బ్రోవరాద టయ్యా

నన్ను బ్రోవరాద టయ్యా నాతండ్రీ ప్రేమతో
సన్నుతాంగ రామచంద్ర సందేహ మెందుకయ్య

కన్ను చెదరునంత ధనము కావలెనని యడిగితినా
చిన్న పెద్ద వరములని చేయిజాచి యడిగితినా
పన్నుగ నిను కీర్తించుచు పాడుచునే యుంటి గాని
నిన్ను తప్ప వేరొక్కరి నెన్నడైన పొగడితినా

భక్తి భిక్ష నింత పెట్టి బాగుగ కరుణించినావు
ముక్తి భిక్ష కూడ బెట్టి ప్రోచుట ధర్మమ్ము కదా
యుక్తమైన కోరిక యిది యొక్కసారి యోచింపుము
భక్తవరద దయతో నాభావమెరిగి సర్వేశ్వర

నరపతికులపతి మతిసులభం


సులభం నమామి శ్రీరఘురామం సుఖదం నమామి ఘనశ్యామం

నమామి జగదాధారం రామం నరపతికులపతి మతిసులభం
నమామి భండనభీమం రామం నరపతికులపతి మతిసులభం
నమామి  త్రిజగత్పూజితచరణం నరపతికులపతి మతిసులభం
నమామి దీనాధారం రామం నరపతికులపతి మతిసులభం
నమామి గగనశ్యామం రామం నరపతికులపతి మతిసులభం
నమామి సీతాశోకవినాశం నరపతికులపతి మతిసులభం
నమామి దీనాధారం రామం నరపతికులపతి మతిసులభం
నమామి రాజీవాక్షం రామం నరపతికులపతి మతిసులభం
నమామి  ఖండితపశుపతిచాపం నరపతికులపతి మతిసులభం
నమామి రఘుకులరత్నం రామం నరపతికులపతి మతిసులభం
నమామి రావణవైరిం రామం నరపతికులపతి మతిసులభం
నమామి నారాయణనరరూపం నరపతికులపతి మతిసులభం


జయజయ రామా

జయజయ రామా జయజయ భవ
భయహర రామా జయజయ

శ్రీవైకుంఠపురేశ్వర జయజయ
భావాతీతప్రభావా జయజయ
దేవదేవ సురభావిత జయజయ
పావనరఘుకులవర్ధన జయజయ

మునివరముఖ్యసుపూజిత జయజయ
ఘనశివకార్ముకఖండన జయజయ
దినమణిసత్కులదీపన జయజయ
జనకసుతావర జయజయ జయజయ

పావనపూజిత పదయుగ జయజయ
రావణదర్పవిరామా జయజయ
భావజమదహరప్రస్తుత జయజయ
దైవరాయ బుధసేవిత జయజయ


రామ నీనిర్ణయము

రామ నీనిర్ణయము చెప్పరా రాజీవనయన
కామితము నాకిచ్చువాడవొ కాదో చెప్పరా

స్వామి నీనిర్ణయము మేరకు 
  భూమి మీదకు చేరుకొంటిని
రామచంద్రా నీదు కీర్తిని 
  ప్రేమతో నే చాటుచుంటిని
నీమముగ నీనామ జపమును 
  నిత్యమును నే చేయుచుంటిని
శ్యామసుందర తొంటిపదమున 
  చక్కగా నను నిలుపుటెపుడు

ఎన్నడును వేరొకరి నెన్నక 
  నిన్ను నిత్యము తలచుచుంటిని
నిన్ను మించిన వాడు లేడని 
  నిన్ను పొగడుచు పాడుచుంటిని 
నిన్ను చేరుట యెన్నడో యని 
  నిన్నువేడుచు నడుగుచుంటిని 
సన్నుతాంగా తొంటిపదమున 
  చక్కగా నను నిలుపుటెపుడు

చాలురా యీ యిలను చుట్టుట 
  చాలురా సంసార మీదుట
చాలురా తనువులను దాల్చుచు 
  సర్వకష్టము లనుభవించుట
చాలురా స్వస్థానమునకు 
  చాల దూరముగా వసించుట 
చాల ప్రేమగ తొంటిపదమున 
  చక్కగా నను నిలుపుటెపుడు


13, జనవరి 2026, మంగళవారం

ఇతరులతో నేమి పనో

ఇతరులతో నేమి పనో యీరాముడు లేడా
ప్రతిమారును పిలువగనే పలుకుటయే లేదా

ఎవరెవరో వరములిచ్చి యేదో యుధ్ధరింతు రని
యవివేకము తోడ గొలిచి యలమటించ నేలా
భువనేశ్వరు డైన రామభూమిపాలు డొక్కని
సవినయముగ సేవించిన సర్వ మబ్బు చుండగా

వచ్చిన దీభూమికి రఘువరుడు పంపినందులకు
ముచ్చటగా హరికార్యము ముగియించుకు పోవలెను
పిచ్చిపిచ్చి యాశలతో వెంగళులై చెడనేటికి
యచ్చమైన సంపద శ్రీహరిదయ మనకుండగా

శ్రీరాముల కన్న దైవశిఖామణి వేరెవ్వరు
శ్రీరాముల పాదపద్మసేవ మోక్షదాయకమని
శ్రీరాముల కీర్తి వ్యాప్తి చేయుటయే మనకార్యము
వారివీరి గొప్ప లెంతవైనను మనకెందుకయా


11, జనవరి 2026, ఆదివారం

శ్రీరాముడె

శ్రీరాముడె మార్గము శ్రీరాముడె గమ్యము
ధారుణి సజ్జనులకు శ్రీరాముడె సర్వము

శ్రీరాముడె తనవాడని స్థిరముగా నమ్మిన
వారిది సద్భక్తి కాని ప్రతివానిది కాదు
శ్రీరాముడె దాత యనుచు చేయిజాచి యడిగిన
వారల కోరికలు తీరు తీరవితరులవి

శ్రీరాముడె సద్గురుడని చేరి సేవించితే
తీరును సంశయము కాని వేరుదారి లేదు
శ్రీరాముడె రక్షకుడని చిత్తమునం దెఱిగిన
నారాటము తొలగు గాని యన్యమునం బోదు

శ్రీరాముడె తండ్రియని చిత్తమునం దెఱిగిన
పూరుషుడే ధన్యు డన్య పురుషుడట్లు కాడు
శ్రీరాముడె దైవమనుచు ప్రీతితో గొలిచిన
వారలకే ముక్తిగాని ప్రతివానికి లేదు


రామరామ రామ

రామరామ రామరామ రామరామ రామ శ్రీ
రామరామ రామరామ రామరామ రామ

రాజులైన పేదలైన రామరామ రామ రామ
భూజానికి సేవకులే రామరామ రామ
పూజనీయులైన పుణ్యపురుషులెల్ల రామ
తేజోశసంభవులని తెలుసుకోవలెను

రాము డాజ్ణ సేయ గాను రామకార్యములను సలుప
భూమి పైకి వచ్చి వారు రామరామ రామ శ్రీ
రాముని కార్యములు తీర్చి రామరామ రామ
రాముని కడ కేగు వారు రామరామ రామ

రామరామ రామ యనుచు రామనామ తారకమును
భూమి నుపాసించువారు పొందునట్టి ఫలము శ్రీ
రామరామ రామ యనుచు రామ సన్నిధానమున
క్షేమముగా నుండుటయే రామరామ రామ