30, మార్చి 2023, గురువారం
విందురో భూజనులు వినము పొమ్మందురో
బ్రహ్మాస్త్రము వేయవయా రావణుని పైన
శ్రీరఘురామ ప్రచండవిక్రమ
శ్రీరఘురామ ప్రచండవిక్రమ జితరావణ దనుజ
రామచంద్ర ప్రచండవిక్రమ రాఘవేంద్ర ప్రచండవిక్రమ
రామభద్ర ప్రచండవిక్రమ రాక్షసారి ప్రచండవిక్రమ
శ్యామలాంగ ప్రచండవిక్రమ జాకకీశ ప్రచండవిక్రమ
కోమలాంగ ప్రచండవిక్రమ కువలయేశ ప్రచండవిక్రమ
పురుషసింహ ప్రచండవిక్రమ పూర్ణకామ ప్రచండవిక్రమ
పరమపురుష ప్రచండవిక్రమ భద్రమూర్తి ప్రచండవిక్రమ
సారసాక్ష ప్రచండవిక్రమ సార్వభౌమ ప్రచండవిక్రమ
నారసింహ ప్రచండవిక్రమ శాంతమూర్తి ప్రచండవిక్రమ
లోకపోష ప్రచండవిక్రమ లోకపూజ్య ప్రచండవిక్రమ
శోకనాశ ప్రచండవిక్రమ సుందరాంగ ప్రచండవిక్రమ
రావే రావే బాణమా రామబాణమా
29, మార్చి 2023, బుధవారం
స్వస్తి రామబాణమునకు స్వస్తి రామచంద్రునకు
బ్రహ్మవరగర్విత రావణా
శరమదే రావణుపై జనుచున్నది
శరమదే రావణుపై జనుచున్నది
విరించిమంత్రపూతమై వెలుగుచున్నది
రయమున పరువెత్తు శరము రాముని శరము
భయమును తొలగించు శరము బంగరు శరము
జయమును కలిగించు శరము చక్కని శరము
వియచ్చరులు మెచ్చు శరము వెన్నుని శరము
మునుల వెతల దీర్చు శరము పొలుపగు శరము
వనితల కసి దీర్చు శరము పావన శరము
ధనదుని పగ దీర్చు శరము దారుణ శరము
ఇనకులేశు దివ్యశరము ఇంపగు శరము
కాముకుని జంపు శరము ఘనమగు శరము
పామరత్వ మణచు శరము భగవఛ్ఛరము
భూమిజ చెఱబాపు శరము రాముని శరము
స్వామికరవిముక్తశరము బ్రహ్మాస్త్ర శరము
28, మార్చి 2023, మంగళవారం
పరాయి వాడనా పలుకరా రామయ్యా
పరాయి వాడనా పలుకరా రామయ్యా
నిరాశ పరచేవు నీకు న్యాయమా
యుగములుగా నీకీర్తి నొప్పుగా చాటుచు
జగమంతా తిరుగుచుంటి జానకీపతీ
తగునని యొక్కింతగా తలయూచి చిరుచిరు
నగవులైన చిందించవు న్యాయమా హరీ
మారాముడు మారాముడు మారాము డందునే
మారజనక నాతో నొక్కసారి పలికితే
గౌరవమే తగ్గిపోదు శ్రీరామచంద్రుడా
నోరారా పలుకరించ నేరవా ప్రభూ
కూరలకై నారలకై కొరగాని వారలను
చేరిపొగడ నేరననుచు చిత్తములోన
తీరుగా నెఱుగియు సందేహమేమి నాతో
కూరిమితో మాటలాడకుందు వేలరా
మహరాజు కొడుకండి మారాముడు
మహరాజు కొడుకండి మారాముడు
మహనీయు డండీ మారాముడు
సరసీరుహాక్షుడండి తరణికులేశుడండి
దరహాసముఖుడండి ధర్మాచరణుడండి
సరిలేని వీరుడండి సురవైరికాలుడండి
కరుణానిలయుడండి ఘనశ్యాముడండి
ధరణిజాయుతుడండి తానే శ్రీహరియండి
శరణాగతత్రాణబిరుదాంకితుడండి
పరమేశనుతుడండి పట్టాభిరాముడండి
నరనాథముఖ్యుడండి నమ్మిసేవించండి
పరమశాంతుడండి వరకీర్తియుతుడండి
పరమపూరుషుడండి పతితపావనుడండి
పరమభక్తసేవ్య పరదైవతంంబండి
పరమయోగిగణ భావితబ్రహ్మమండి
నీయండే చాలు నాకు
నీయండే చాలు నాకు నీరజాక్షా నాకు
చే యందించగ దయ్య శ్రీరామా
హనుమదాదులను బ్రోచినట్టి దేవుడా నా
వినతులు వినిపించుకోరా వీరరాఘవా
ధనకనకవాహనములు దశరథాత్మజా యి
మ్మన లేదే నీకొలువే నేనడిగితి గాన
కామవైరి పొగడునట్టి ఘనుడ రాముడా ని
న్నేమని నేను పొగడగలను యినకులేశుడా
పామరత్వ మణగజేసి పరంధాముడా యీ
కామాదుల నుండి వేగమె కావమంటి గాన
మూడులోకములను కాచు పురుషోత్తముడా నిను
వేడువారి నెల్లర కాచెడు వీరరాఘవా
వేడుకతో నీనామము పాడుభాగ్యమే నీ
వాడను నా కీయమనుచునే వేడెదనే కాన
నారాయణా శ్రీమన్నారాయణా
నారాయణా శ్రీమన్నారాయణా నీవు నారామచంద్రుడవు నారాయణా
సురలకును మునులకును నారాయణా నీవు పరమాప్తుడవు గదా నారాయణా
తరణికులతిలకుడవై నారాయణా నీవు ధరమీద వెలసితివి నారాయణా
నరుడవై వచ్చితివి నారాయణా చాపధరుడవై నిలచితివి నారాయణా
గరువంపు రక్కసుల నారాయణా నీవు గడుసుగా కొట్టితివి నారాయణా
మునియాగ రక్షణకు నారాయణా నీవు పనిగొని తరలితివి నారాయణా
వనములో తాటకను నారాయణా ఒక్క బాణమున కూల్చితివి నారాయణా
అనలసాయకంబున నారాయణా సుబాహుని కాల్చితివి నీవు నారాయణా
వనధిలో మారీచు నారాయణా గాలిబాణముతో వైచితివి నారాయణా
వనవాస మనుపేర నారాయణా నీవు వనములను జొచ్చితివి నారాయణా
చెనకు ఖరదూషణుల నారాయణా నీవు చిచ్చై దహియించితివి నారాయణా
నిను మోసగించగ నారాయణా రావణుని దుంపతెంచితివి నారాయణా
నిను చేరి నుతించిరి నారాయణా కడు ఘనముగ బ్రహ్మాదులు నారాయణా
పదివేలేండ్లును నారాయణా ఆపైవేయేండ్లును నారాయణా
ముదమున భువినేలి నారాయణా నిజపదమును గైకొన్న నారాయణా
హృదయేశుడవై నారాయణా నన్నేలుచు చెన్నొందు నారాయణా
వదలకు నాచేయి నారాయణా నీవాడనురా స్వామి నారాయణా
జయజయ రమానాధ
జయజయ రమానాథ జయ జగన్నాథ
జయజయ సురగణార్తిశమన గరుడగమన
జయ శంఖచక్రగదాచాపఖడ్గధర హరి
జయజయజయ దితిసుతకులసంశోషణచణ విక్రమ
జయ యోగిరాజహృదయసదనసుఖావాస హరి
జయజయజయ త్రిభువనపోషక సకలసుఖదాయక
జయ విరించిప్రభృతినిత్యసన్నుతశుభదివ్యనామ
జయజయజయ సకలసుజనసదాసేవ్యమానచరణ
జయ మునివరయజ్ఞరక్షణచణచండబాహుదండ హరి
జయజయజయ రామచంద్ర జనకజానాయక
జయజయజయ రామచంద్ర జయవిజితదానవేంద్ర
జయజయజయ భక్తపాలసత్యబిరుదాంకిత హరి
జయజయజయ రాఘవేంద్ర జయసూర్యకులాబ్ధిచంద్ర
జయజయజయ క్షిప్రవరద జయ ముక్తిదాయక
నన్ను రక్షించు దాక
నన్ను రక్షించు దాక శ్రీరామా నేను
నిన్ను విడువనయ్య శ్రీరామా ఆ
పన్నశరణ్య ఓ శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా నిను
చేరి కొలిచెదనయ్య శ్రీరామా మన
సార కొలిచెదనయ్య శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా సం
సార బాధలు చాలు శ్రీరామా ఈ
పోరు నరికట్టుము శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా దు
ర్వార భవాబ్ధిని శ్రీరామా నే
నేరీతి దాటెదను శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా బం
గారు తండ్రివి నీవు శ్రీరామా బహు
కారుణ్యమూర్తివి శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా రఘు
వీర గంభీర శ్రీరామా సరి
లేరు నీకెవ్వరు శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా అరి
వీరభయంకర శ్రీరామా సుర
వైరివిమర్దన శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా పా
కారిప్రముఖనుత శ్రీరామా కా
మారి సన్నుతనామ శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా సీ
తారామ జలజాక్ష శ్రీరామా లో
కారాధ్య శుభనామ శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా జిత
మారకోటిరూప శ్రీరామా శ్రిత
పారిజాత హరి శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా నీ
కూరిమియే చాలు శ్రీరామా మరి
వేరేమి కోరను శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా నా
ఆరాట మెఱిగిన శ్రీరామా నను
వేరుగ చూడకు శ్రీరామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామా దరి
జేర్చుకోరా నను శ్రీరామా హరి
నారాయణాచ్యుత శ్రీరామా
25, మార్చి 2023, శనివారం
నన్ను బ్రోవ రార నాదైవమా
రారా రారా రామ రమణీయగుణధామ
23, మార్చి 2023, గురువారం
హరి నీవాడైతే అది నీగొప్ప
21, మార్చి 2023, మంగళవారం
నాకు ప్రసన్నుడవు
నాకు ప్రసన్నుడవు కాకుందు విది యేమి
నీకు భక్తుడ గానో నీరేజనయన
నీకేల దయరాదు నిరుపమ గుణధామ
పాకారిబ్రహ్మాదిప్రస్తుతశుభనామ
సాకేతపురధామ లోకేశ రణభీమ
రాకేందువదన శ్రీరామ విజితకామ
నీకేల దయరాదు నీకొలువునకు చేరి
నీకీర్తిప్రభలను నింగిముట్టగ జేసి
నీకు సేవలు చేసి నీవాడనై మెలగి
నీకన్య మెఱుగక నేను చరించిన
నీకేల దయరాదు నీయాన మేఱకు
చీకాకు తనువుల చేరుచు వేమార్లు
నీకంటె దైవమే లోకాన లేడనుచు
నే కడిది చాటించి ప్రాకులాడిన గాని
20, మార్చి 2023, సోమవారం
గిడిగిళ్ళు రామలింగేశ్వర శర్మకు
గిడిగిళ్ళు రామలింగేశ్వర శర్మకు
కడు ప్రేమమూర్తికి ఘనునకు
సుందరరూపుడు శర్మ పలు
కందము కలవాడు శర్మ తా
నందరివాడైన శర్మ బుధ
వందితచరితుడు శర్మ యని
కీర్తిశరీరుడు శర్మ బహు
స్ఫూర్తిదాయకుండు శర్మ
నిర్మలహృదయుండు శర్మ స
త్కర్మాచరణుడు శర్మ యని
రాముడనం బడు శర్మ శ్రీ
రాముని సేవించె శర్మ శ్రీ
రాముడే మెచ్చిన శర్మ ఆ
రాముని చేరిన శర్మ యని
చూడరే చూడరే
చూడరే చూడరే సుజనులారా కడు
వేడుకతో శ్రీరాముని విభవమే చూడరే
చిరునవ్వులు చిందించే హరిని చూడరే హరి
సరసన కూర్చున్న సీతాసతిని చూడరే
హరి కటుప్రక్కన లచ్చుమన్నను చూడరే యిదే
హరిపదముల నుండిన హనుమన్నను చూడరే
చామరమును బట్టిన విభీషణుని జూడరే రఘు
రాముని సేవించెడు కపిరాజును చూడరే
భూమీశుని దీవించు మునిముఖ్యుల చూడరే జన
సామాన్యము నిండియున్న సభను చూడరే
పరమాత్ముని సభను చూచి పరవశించరే కడు
పరవశించి జయజయధ్వనులు చేయరే
హరిని చూచునట్టి భాగ్య మద్భుత మనరే యిక
తరియించితి మని లోలో తలచి పొంగరే
మాటలాడవు నీవు పాటలాపను నేను
19, మార్చి 2023, ఆదివారం
హరి చేసేదేమో అందమైన లీల
నరుడు చేసేదేమో నానాగోల
ధర మీద నరుని పెట్టి తలలోన తెలివి పెట్టి
హరి యాట మొదలుపెట్టు నటు పిమ్మటను
నరుడు మాయ తెగులుపట్టి హరియాట వదలిపెట్టి
మరియేదో దారిపట్టి తిరుగుచుండేను
మరపుమందు మ్రింగినట్లు మరులతీవ త్రొక్కినట్లు
హరియిచ్చిన బుధ్ధినే మరిచిన పిదప
హరియాటే మరచినట్లు హరియెవరో తెలియనట్లు
నరుడేమో ధరపైనే తిరుగుచుండేను
హరినామము తనబుధ్ధికి స్ఫురియించే దెప్పుడో
హరేరామ హరేకృష్ణ యనేదెప్పుడో
నరుడు తన్నుతానెఱిగి సరిగ నాడే దెప్పుడో
హరిలీల లోనెఱిగి మురిసే నపుడు
18, మార్చి 2023, శనివారం
రామనామమా నన్ను రక్షించుమా
చక్కగ రాముని సన్నిధి చేరి
సీతారామ సీతారామ చేరితి నిన్ను
సీతారామ సీతారామ చేరితి నిన్ను
నాతోడుగ నాదేవుడ నడపుము నన్ను
చచ్చిపుట్టి చచ్చిపుట్టి చాలవిసివితి యిక
చొచ్చుమనుచు తనువులీయ జూడకు నాకు
వచ్చి నీపాదములను పట్టితి చూడు కడు
ముచ్చటగా దయచేయుము మోక్షము నాకు
చేరి యల్పమానవులకు సేవచేయను తని
వార నీకు సేవచేయ భావించెదను
కోరరాని కోరికలను కోరను నిన్ను నే
కోరునట్టి మోక్షమొకటి కొసరుము నాకు
నిన్ను మించి దయాశాలి నెన్నడు గనము నీ
కన్న బంధుమిత్రు లెవరు కలుగరు నాకు
నిన్ను వేడి పొందరాని దన్నది కలదె హరి
తిన్నగాను మోక్షమిమ్ము దేవదేవుడ
17, మార్చి 2023, శుక్రవారం
వ్రతమును సడలింతునా
13, మార్చి 2023, సోమవారం
నిన్నే నమ్మితి కాదా రాఘవ
10, మార్చి 2023, శుక్రవారం
మధురం మధురం మధురతరం
మధురం మధురం మధురతరం మధురతమం జనులారా
రాముని నామమె మధురం మధురం రామస్మరణమె శుభదం
రాముని చరితమె మధురం మధురం ప్రేమామృత భరితం
రాముని పలుకే మధురం మధురం కోమలపదసంభరితం
రామధ్యానమె మధురం మధురం మామకహృదయానందం
రాముని గుణమే మధురం మధురం భూమిజనైకనుతం
రాముని తత్త్వమె మధురం మధురం బ్రహ్మాదికవినుతం
రాముని సేవయె మధురం మధురం క్షేమకరం సుఖదం
రాముని కరుణయె మధురం మధురం ప్రసాదించు మోక్షం
7, మార్చి 2023, మంగళవారం
భక్తితో మ్రొక్కితే
భక్తితో మ్రొక్కితే వద్దువద్దందువా
ముక్తిలేదు నీకు పోపొమ్మందువా
అందరు నీబిడ్డలే యనుచుండవా నీ
వందరకును సముడవై యలరుచుండవా
కొందరినే యాదరించి కొందరిని చీదరించు
చుందువా యెన్నడైన చోద్యముగాను
నీపాదము లాశ్రయించి నిలచియున్నంతనే
పాపాత్ముడైన నగును పరమభాగవతుడు
పాపములును తాపములును శాపములును మానవుడు
నీపాదము లాశ్రయించ నేర్చుదాకనే
రామరామ యనుదాకనె పామరుడు కదా
రామా యనగానె యాదరమున బ్రోవనెంతువు
రామరామ యని నీకు రయమున మ్రొక్కెనా
రామచంద్ర మోక్షమునే ప్రసొదింతువే
పొగడండీ పొగడండీ
పొగడండీ పొగడండీ పురుషోత్తముని పొగడండీ
పొగడండీ పొగడండీ పుణ్యచరిత్రుని పొగడండీ
శ్రీరఘురాముని పొగడండీ సీతారాముని పొగడండీ
ఘోరదనుజులను కాటికిపంపిన కోదండరాముని పొగడండీ
మారజనకుని పొగడండీ మంజులగాత్రుని పొగడండీ
తారకరాముని పోగడండీ ధర్మస్వరూపుని పొగడండీ
శివునివింటి నవలీలగ నెత్తిన చిన్మయరూపుని పొగడండీ
అవనీతనయాపతియై వెలసిన ఆనందరాముని పొగడండీ
భువనేశ్వరుని పొగడండీ భూరికృపాళుని పొగడండీ
భవనాశంకరు పొగడండీ పతితపావనుని పొగడండీ
మునిజనవినుతుని పొగడండీ మోక్షదాయకుని పొగడండీ
జననాధోత్తము పొగడండీ జ్ఞానస్వరూపుని పొగడండీ
ఇనకులేశ్వరుని పొగడండీ గుణసాగరుని పొగడండీ
మన హరిని సదా పొగడండీ మరిమరి యందరు పొగడండీ
6, మార్చి 2023, సోమవారం
చూచిపోవచ్చితిమో సూర్యకులతిలక
ఎన్నగ నీరాముడే యీశ్వరుడు కావున
4, మార్చి 2023, శనివారం
దినదినమును శ్రీహరి తత్త్వంబును
దినదినమును శ్రీహరి తత్త్వంబును
మననము.చేయుట మంచిపని
హరియే బ్రహ్మంబను సంగతిని
మరువక యుండుట మంచిపని
హరి సంకీర్తన మన్నివేళలను
మరువక చేయుట మంచిపని
హరిభక్తులతో చర్చలలో రుచి
మరగుట యన్నది మంచిపని
హరిసేవారతి నానందపు రుచి
మరగుట యన్నది మంచిపని
మంచివాడు మారాముడు హరి యని
యెంచుట మిక్కిలి మంచిపని
అంచితముగ మది తారకనామము
నెంచి రమించుట మంచిపని
గొప్పవాడవయ్యా నీవు
గొప్పవాడవయ్యా నీవు కోదండరామా మా
తప్పులు మన్నించి కాచు దయామయా రామా
ఆర్తజనత్రాణపరాయణుడవైన రామా బహు
ధూర్తరక్షోగణములను దునుమాడే రామా
మూర్తిగొన్న బ్రహ్మమవని పొగడబడే రామా స
త్కీర్తితోడ యుగయుగముల తేజరిల్లు రామా
సదావసుంధరాసుతాసమర్చిత రామా సం
పదలకెల్ల మూలమైన పట్టాభిరామా
సదాచతురాననాదిచర్చితగుణ రామా ఆ
పదల నెల్ల పోనడచే పరమవీర రామా
కూరిమితో భక్తజనుల చేరదీయు రామా సా
మీరి హృదయపీఠమున మెఱయుచుండు.రామా
కోరిన కోరికలు తీర్చు గుణముగల రామా భవ
తారకమని పేరొందిన పేరుగల రామా
3, మార్చి 2023, శుక్రవారం
ఎంతవాడో యీరాము డంతటిదే మాసీత
2, మార్చి 2023, గురువారం
వీనులవిందుగ
వీనులవిందుగ నాలుగుమాటలు వినిపించవె ఓమనసా
ఆనాలుగు శ్రీరామునిగూర్చి ఐతే మంచిది మనసా
రాముని పొగడే నాలుకె నాలుకరా యనరాదా మనసా
రాముని జూచెడి కన్నులె కన్నులురా యనరాదా మనసా
రాముని తెలిపే చదువే చదువన రాదా ధాటిగ మనసా
రాముని సేవకులే బంధువులన రాదా సూటిగ మనసా
రాముని కొలిచే బ్రతుకే చక్కని బ్రతుకన రాదా మనసా
రాముని నమ్మిన చిత్తమె చిత్తమురా యనరాదా మనసా
రాముని కంటెను దైవము లేడనరాదా యొప్పుగ మనసా
రాముని భక్తులు కడుధన్యులనరాదా యొప్పుగ మనసా
రాముని భజనయె పరమసుఖంబన రాదా నిత్యము మనసా
రాముని నామమె తారకమంత్రమురా యనరాదా మనసా