18, డిసెంబర్ 2020, శుక్రవారం

ధనమేరా అన్నిటికీ‌ మూలం‌ - 2 (రెండు కథలు)



ఎందుకో కాని ఈ రెండు కథలనూ కొంచెం‌ క్లుప్తంగా ఐనా తప్పకుండా అందరికీ చెప్పాలీ అనిపించింది.

రెండూ అలనాటి కథలే.  అంటే దశబ్దాల క్రిందటి కథలే.

ఉత్తుత్తి కథలు కావు. నిజంగా జరిగిన కథలే. ఈ రెండూ కూడా ఒకే ఊరి కథలు.

మొదటి కథ శ్రీరామమూర్తి-భగవంతరావు గార్లనే అన్నదమ్ముల కథ.  శ్రీరామమూర్తి గారంటే ఒకప్పుడు తూ.గో.జి.లో ప్రసిధ్ధులైన డాక్టరు గారు. ఆయన ఆర్.ఎం.పీ. డాక్టరు గారు. ఐతేనేం ఇంగ్లీషు మందులూ‌ ఇచ్చే వారు. ఆయుర్వేదం‌ మందులూ ఇచ్చే వారు. ఇదం బ్రాహ్మ్యం - ఇదం క్షాత్రం అన్న ట్లన్నమాట.

శ్రీరామమూర్తిగారికి కొత్తపేట మెయిన్ రోడ్ మీద ఒక క్లినిక్ ఉండేది. ఆ క్లినిక్ ముందు అంబారుఖానా శ్రీరామమూర్తి అని చాలా పెద్దపెద్ద అక్షరాలలో వ్రాసి ఉండేది.

ఎందుకో తెలియదు కాని ఆ బోర్డుమీద అయన తమ్ముడు భగవంత రావు గారి పేరు ఉండేది కాదు.

భగవంత రావు గారు అన్నగారితో పాటు ఆ హాస్పిటల్‌లో వైద్యం చేస్తూ మహా బిజీగా ఉండే వారు. ఆయన కూడా ఆర్.ఎం.పీ డాక్టరు గారే.

పేషంట్లను చూడాలి బయటకు వెళ్ళి అన్నప్పుడు భగవంత రావు గారు ఒక పెద్ద మోటర్ సైకిల్ మీద అన్నగారిని తీసుకొని వెళ్తూ ఉండే వాడు. తరచుగా తానొక్కడే వెళ్ళటం కూడా ఉండేది.

వారి ఆహార్యాలు తమాషాగా అనిపించేవి. ముఖ్యంగా శ్రీరామ మూర్తి గారి విధానం. ఆయన కొంచెం గోదుమ రంగు పంచె చొక్కా వేసేవారు. ఆచొక్కాని పంచలోనికి టక్ చేసే వారు. ఆపంచను తన బూట్లలోనికి దోపేవారు. అవి కూడా హంటర్ బూట్లు అంటామే‌ అలాంటివి. భగవంతరావు గారు ఎప్పుడు మల్లెపూల వంటి తెల్లటి పేంట్ షర్టు వేసుకొనే వారు. ఇతరత్రా అహార్యంలో వీరిద్దరినీ ఎప్పుడూ చూడలేదు.

ఇద్దరూ వైద్యం‌ చేస్తున్నా అందరూ శ్రీరామమ్మూర్తి గారి ఆస్పత్రి అనే అనే వారు.

ఆ ఆస్పత్రి నిజంగా ఒక ధర్మాసుపత్రి అనే చెప్పాలి. ఇచ్చే వారు వారి తాహతుని బట్టి ఇచ్చే వారు. ఇవ్వలేని బీదాబిక్కీ ఇవ్వరు. ఎవ్వరూ‌ ఇంత అని అడగటం కూడా ఉండేది కాదు. ఐనా ధనవర్షం‌ బాగానే కురిసేది.

కురవదా మరి? ఊళ్ళో శ్రీరామ్మూర్తి గారిదే వైద్యం ముఖ్యంగా. 

ఒక్క కాశిన చిన్నంరాజు గారని ఒక ఎంబీబీయస్ డాక్టరు కూడా ఉండే వారు కాని వారు ఖరీదైన డాక్టరనే‌ ప్రతీతి. అందుచేత ఎక్కువ మంది వెళ్ళేది శ్రీరామమూర్తి గారి దగ్గరకే. 

అదీ‌కాక ఈ‌ చిన్నంరాజు గారికి ఒక తమాషా పేరుండేది - ఎంత చిన్న సమస్య కైనా పేజీకి తక్కువ మందులు వ్రాయరని. అది నిజమే  కూడాను. మా పక్కవాటా వక్కలంక నరసింహ మూర్తి గారి సతీమణికి ఒకసారి చాలా ఉధ్ధృతంగా శిరోవేదన వచ్చింది. ఇక తప్పదని డాక్టరు గారిని పిలిచారు. చిన్నంరాజు గార్ని అన్నమాట. ఆయన వచ్చి పరీక్షించి అక్షరాలా పేజీ నింపేశారు మందులతో. అవన్నీ ఇక్కడ దొరుకుతాయా మన కొత్తపేటలో అంటే  ప్రయత్నించండి అన్నారు. దొరకనివి చాలానే ఉండినవి - వాటిని మర్నాడు రాజమండ్రికి వెళ్ళి కొనాల్సిందే అనుకున్నారు. ఆరాత్రికి ఆవిడకు ఏమన్నా మందులు ఇచ్చారా అన్నది తెలియదు. ఏదైతేనేం తెల్లవారేసరికి తలనొప్పి గిలనొప్పి జాడలేదు. రాజమండ్రి పోలేదు. మందులూ తేలేదు. అందరూ చాలా కాలం నవ్వుకొనే వారం ఆ డాక్టరు గారి మందుల పట్టీ చూసి.

ఎందుకు అందరూ శ్రీరామ్మూర్తి గారి దగ్గరకు వెళ్ళి ఒకటి రెండు రూపాయల వైద్యంతో హాయిగా ఉండే వారో అర్ధం ఐనది కదా. అదీ సంగతి.

ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి. ఈ‌ భగవంతరావు గారు మానాన్నగారికి చిన్ననాటి స్నేహితుడే - బెంచిమేట్ అనుకుంటాను. అందుచేత సహజంగా మా యింటి వైద్యం అంతా శ్రీరామమూర్తి గారు మరియు భగవంత రావు గార్ల చేతిలో నడిచేది.

ఈ శ్రీరామమూర్తి గారు కొత్తపేట ఊరి చివరన, పలివెల వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ మీద భవంతి కట్టుకున్నారు. గృహప్రవేశం కోలాహలంగా జరిగిందని విన్నాను కాని వివరాలు గుర్తులేవు. కాని ఆ తరువాత కాలంలో ఆయన సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. మాకు కూడా ఒక ప్రత్యేకమైన అహ్వానం అందింది. హాస్పిటల్‌కు వచ్చిన వారికి ఆహ్వానం ఇచ్చినట్లుగా ఇవ్వటం కాదు, ఇంటికి వచ్చి మమ్మల్ని పిలిచారని గుర్తు.

ఆరోజున సత్యనారాయణ వ్రతం మధ్యలో చదివింపులు మొదలయ్యాయి. డాక్టరు గారికి అన్నమాట. అవేమి చదివింపులో గంటో గంటన్నరో ఐనా తెమలటం‌ లేదు. ఆతరువాత మానాన్నగారు చెప్తే అర్ధమైంది. డాక్టరు గారు వైద్యం చేస్తున్నందుకు కృతజ్ఞతగా ఊరి వారు యథాశక్తిగా కానుకలు సమర్పించుకోవటం అది అని. ముఖ్యంగా ఈచదివింపుల్లో ముప్పాతిక మువ్వీసం ధనరూపంలోనే. అలా వచ్చింది ఎన్నో వేలుంటుంది ఆ అరవైల్లోనే అంటే అతిశయోక్తి ఏమీ‌ లేదు.

ఈ వ్రతం జరిగే నాటికి నేను హైస్కూలు విద్యార్ధిని. దరిమిలా కొన్ని సంవత్సరాల తరువాత నేను హైదరాబాదుకు ఉద్యోగనిమిత్తం వచ్చాను. కొంతకాలం తరువాత శ్రీరామ మూర్తి గారు కాల గతి చెందారు.

ఆపుడు తెలిసింది ధనం అంటే ఏమిటో‌ దాని ప్రభావం ఏమిటో అన్నది.

శ్రీరామమూర్తి గారూ భగవంతరావు గారూ ఇద్దరూ రామలక్ష్మణులే అన్నట్లుండే వారు. రాముడెక్కడన్నా లక్ష్మణుడిని ముంచుతాడా నిలువునా?

ఈ కలియుగ రామ మూర్తి గారు ముంచారనే జనం విస్తుపోయారు.

ఆస్తిపాస్తులన్నీ రామమూర్తి గారివే. చివరకు భగవంత రావు గారి దర్జా స్కూటరూ శ్రీరామ మూర్తి గారి పేరనే ఉంది. ఈ లక్షణుడికి కనీసం ఉండటానికి స్వంత ఇల్లు ఐనా లేదు. పూచిక పుల్లంతైనా ఆస్తి పాస్తులన్నవి లేవు.

యావజ్జీవం ఏ‌హాస్పిటల్ కోసం ఊడిగం చేసాడో అందులో కాలు పెట్టరాదన్నారు.

కట్టుబట్టలతో మిగిలాడు ఈ అభినవ లక్ష్మణుడు. 

తానూ‌ డాక్టరే, వేరే చిన్న ఆస్పత్రి పెట్టుకున్నాడు. 

మిగిలిన కథ ఏముంది. ఉనికి కోసం కష్టపడ్డారు భగవంత రావు గారు. పిల్లలు అంది వచ్చారు లెండి దైవకృప వలన.

అన్ని పరిణామాలూ ఈకథలో నాకు అంత వివరంగా తెలియవు.


* * *


ఇప్పుడు రెండవ కథ. చెప్తాను. ముళ్ళపూడి వారు వారి ఇంటి పేరు. ఈ ఇంటిపేరు కల వారు అనేక వర్ణాల్లో ఉన్నట్లున్నారు. వీరు బ్రాహ్మణులు. శాఖా గీకా గురించి నాకు తెలియదు. అదేమీ ముఖ్యం కాదు. 

ఇంట్లో ఉండేది కొంచెం మందే. గృహస్థు, ఆయన భార్య, బావమరది, కుమారుడు మాత్రమే. ఇందులో నాకు తెలిసిన వ్యక్తి ఆ కుమారుడు ఒక్కడే. వాడి పేరు సత్యనారాయణ. మాస్కూల్‌మేట్. నాకన్నా ఒక క్లాసు దిగువన చదివే వాడు. కాని నాతో‌  మంచి దోస్తీ‌ ఉండేది. 

ఒక చేదు జ్ఞాపకం. ఎందుకో కాని వాడూ‌ నేనూ ఒకనాడు స్కూలు గ్రౌండ్‌ లోనే‌ బాగా తన్నుకున్నాం. ఎందుకో గుర్తులేదు. ఎవరిది తప్పూ అన్నది ఎవరికి గుర్తు. కొట్టుకున్నాం ఏదో చిన్న చిలిపి కారణానికే. కాని అది మా స్నేహానికి కించిత్తు కూడా దెబ్బ కొట్టలేదు. 

సత్యనారాయణ తండ్రి గారు ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉండే వారు. సంప్రదాయిక వైద్యుడు. ఆయన మీద గురి ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉండే వారేమో - వారి జరుగు బాటు బాగానే ఉండేది. వారి ఉనికి వారి స్వంత ఇంటిలోనే. చిన్నదే అయినా పక్కా పెంకుటిల్లు. ఆయింటికి నేను బోలెడు సార్లు వెళ్ళాను. వాడు కూడా మాయింటికి లెక్కలేనన్ని సార్లు వచ్చాడు. 

సత్యనారాయణ తండ్రిగారు అయన బావమరది కూడా ఆయుర్వేద వైద్యులే. ఈ బావమరది గారు స్వయాన వైద్యుడు కాకపోవచ్చును అని నా ఉద్దేశం. వైద్యం ఆపెద్దాయన చేస్తూ ఉంటే మందులు చేయటంలోనూ పేషంట్లను చూసుకోవటం లోనూ బావమరది సహాయకుడిగా ఉండే వారు. ఆయన చెప్తుంటే ఈ‌బావమరది మందులు కలపటమూ‌ నూరటమూ వంటివి చేస్తూ ఉండటం నేను స్వయంగా చాలా సార్లే చూసాను.

కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా. ఉన్నట్లుండి ముళ్ళపూడి వారు జబ్బుపడ్దారు. ఊరిలో ఉన్న వైద్యులు కొన్నాళ్ళు వైద్యం చేసి చేతులెత్తే సారు. కాకినాడ పెద్దాస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించండి అని సలహా ఇచ్చారు.

ఊళ్ళో‌ వైద్యం అంటే అది వేరే సంగతి. ఎంతైనా సాటి వైద్యులన్న గౌరవంతో ఎవరూ రొక్కించి అడగక పోవటంతో ఆట్టే ఖర్చు లేకుండానే ఇంత కాలమూ నడిచింది. కాకినాడ పట్నమే. ఎరగని ఊరే మరి. అక్కడెలా?

సకుటుంబంగా కాకినాడ వెళ్ళారు. వైద్యం నడుస్తోంది. దనం ధారాళంగా కర్చు అవుతున్నది.

మరీ అంత ఉన్నకుటుంబం కాదాయిరి. ఊళ్ళో నుండి కొంత సహయం అందిందేమో కొన్నాళ్ళు ఎలాగో అలా ఖరీదైన వైద్యానికి తట్టుకొని నిలిచారు.

జబ్బు తగ్గటం లేదు.

చివరికి తమ స్వంత ఇల్లు తెగనమ్మి వైద్యం చేయించాలని నిశ్చయించారు.

నిశ్చయించటం అంటే ఎవరిది నిర్ణయం?

సత్యనారాయణ తల్లికి ఉన్న దిక్కూ సలహా దారు తన తమ్ముడే. సత్యనారాయణ అంటే ఇంకా చిన్నపిల్లాడే‌ కదా.

వినండి. తప్పని సరై ఇల్లు అమ్మేసారని ఊరంతా గుప్పుమంది.

అందరూ చాలా బాధపడ్దారు. ఆకుటుంబం మంచి అందరికీ తెలుసును ఊళ్ళో. మా అమ్మగారూ‌ నాన్నగారూ కూడా బాధపడటం‌ నాకు బాగానే గుర్తుంది. తెల్లవారిలేస్తే ఈ సత్యనారాయణ అనే చిన్నపిల్లవాడు కళ్ళముందు తిరుగుతూ ఉండే వాడు కదా. అస్తమానం మాయింటికి వస్తూనే ఉండే వాడు కదా. వాడి కుటుంబానికి వచ్చిన కష్టం కదిలించకుండా ఉంటుందా చెప్పండి.

పెద్దాయన వైద్యం కోసం అని చెప్పి,  అక్కాతమ్ముళ్ళు వచ్చి ఇంటిని ముఫ్ఫైవేలకు అమ్మి సొమ్ముతో‌ అదరాబాదరా వెళ్ళిపోయారు కాకినాడకు.

మరి కొద్ది రోజుల్లోనే దుర్వార్త వినవలసి వచ్చింది.

దానితోపాటే అందర్నీ కలచివేసింది మరొక ముఖ్యమైన సంగతి.

సొమ్ముని మగదిక్కు తమ్ముడు గారు జాగ్రత్తగా పట్టుకొని అక్కగారితో‌ కాకినాడ వెళ్ళాడు. ఆవిడ భర్తను చూడటానికి అదరాబాదరా పరుగెత్తింది. 

కొద్ది సేపటికి డబ్బు సర్దుబాటు చేసుకొని వచ్చారా అని ఆస్పత్రి వారు అడిగారు. అవునండి, ఇదిగో మా తమ్ముడి దగ్గరుందీ.. అంటూ ఆవిడ తమ్ముడి కోసం చూసింది.

ఇంకా ఎక్కడి తమ్ముడు?

ఇంకా ఎక్కడి డబ్బు?

ఆ తమ్మయ్య గారి జాడ ఎవ్వరికీ ఎన్నటికీ దొరకలేదు.

ఇటు పెద్దాయనా దక్కలేదు.

అక్షరాలా అన్నీ పోగొట్టుకొని కట్టుబట్టలతో వెనక్కు వచ్చారు స్వగ్రామానికి! ఇంకా ఏం‌ స్వగ్రామం, ఇక్కడ నిలువ నీడ లేదు.

ఊరందరికీ మతిపోయినంత పని అయింది.

సత్యనారాయణ ఇలా జరిగింది అని కన్నీళ్ళతో చెప్తుంటే వింటున్న మాకు మతిపోయినంత పని అయింది.

సత్యనారాయణా వాళ్ళమ్మ గారూ‌ మరి ఎలా నిలద్రొక్కుకున్నారో నాకు సరిగా తెలియదు. వారు ఆ తరువాత పొన్నాడ రత్తమ్మ గారి ఇంట్లో అద్దెకు ఉండే వారు. ఇప్పుడు ఆ సత్యనారాయణ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో!

 

****

 

ఈ రెండు కథలను గమనించారుగా, డబ్బు ఎలాంటి ఎలాంటి తమాషాలకు కారణం అవుతుందో. అందుకే‌ అన్నారు "మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః" అని. డబ్బు ముందు అన్నీ‌ దిగదుడుపే అవుతున్నాయి దురదృష్టవశాత్తు. మానవసంబంధాలను ఈడబ్బు ఈడ్చి అవతల పారేస్తున్నది.