14, జనవరి 2020, మంగళవారం

అటవీ స్థళముల కరుగుదమా!



యతి రాజ్యం అనే అమ్మాయి నాకెప్పుడూ గుర్తుంటుది.

సంక్రాంతి పండగప్పుడు ఈ అటవీ స్థలముల పాటను ఎవరో ఒకరు ప్రస్తావిస్తూ ఉంటారు. ఈరోజున   గారు  బోల్డన్ని కబుర్లు బ్లాగులో ప్ర స్తావించినట్లు.

ఆపాటతో బాటే నాకు యతిరాజ్యం కూడా గుర్తుకు వస్తుంది తప్పకుండా.

ఒక సంప్రదాయ వైష్ణవకుటుంబంలోని పిల్ల యతిరాజ్యం.

చదివేది ఏడవ తరగతి. మా బేబిపిన్నికి స్నేహితురాలు.

అటవీ స్థలముల పాటను ఆ అమ్మాయి ఇలాగే అటవీ స్థళముల కరుగుదమా అని తమాషాగా పాడేది.

ఆ పాట ఇలా ఉంటుంది.

అటవీ స్థలములు కరుగుదమా చెలి
వట పత్రమ్ములు కోయుదమా

చింత పిక్కాలాడుదమా
   చిరు చిరు నవ్వులు నవ్వుదమా

చెమ్మా చెక్కాలాడుదమా
   చక్కిలిగింతలు పెట్టుదమా

కోతీ కొమ్మచ్చులాడుదమా
   కొమ్మల చాటున దాగుదమా

చల్లని గంధం తీయుదమా
   సఖియా మెడకూ పూయుదమా

పూలదండలు గుచ్చుదమా
   దేవుని మెడలో వేయుదమా

అప్పట్లో మా బేబీ పిన్ని మాయింట్లోనే ఉండి ఒక యేడాది చదువుకుంది. అప్పుడు నేను ఆరవతరగతి, తాను ఏడవ తరగతి అన్నమాట.

ఐతే యతిరాజ్యం నాకు బాగా గుర్తు ఉండిపోవటానికి కారణం ఈపాట కాదు. ఆమె అటవీ స్థళముల కరుగుదమా అని  ల ను ళ చేసి అనటం కూడా కాదు.

యతిరాజ్యం నా ప్రియాతిప్రియమైన బేబీ పిన్నికి స్నేహితురాలు కావటం కూడా కాదు.

అవన్నీ కొంతవరకే కారణాలు.

అసలు కారణం వేరే ఉంది.

అప్పట్లో మేము గెద్దనాపల్లిలో ఉండే వాళ్ళం. మా నాన్నగారు అక్కడి జిల్లాపరిషత్ మిడిల్ స్కూలుకు ప్రథానోపాధ్యాయులుగా ఉండేవారు. అదే పాఠశాలలో నేను ఆరవతరగతిలోనూ మా బేబీ పిన్ని ఏడవతరగతిలోనూ ఉండేవాళ్ళం. యతిరాజ్యం మా పిన్నికి స్నేహితురాళ్ళలో ఒకమ్మాయి. మరొకమ్మాయి పేరు వరలక్ష్మి అనుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు మరొకరిద్దరు అమ్మాయిలూ మా పిన్నితో పాటు మాయింటికి వచ్చేవారు ఆడుకుందుకు.

వాళ్ళెవ్వరితోనూ నాకు పరిచయం ఐతే ఉన్న గుర్తులేదు. యతిరాజ్యం మాత్రం ఈఅటవీ స్థళముల పుణ్యమా అని బాగానే గుర్తు.

ఒకరోజున మా యింటికి భాష్యం గారు వచ్చారు.  భాష్యం గారు అంటే యతిరాజ్యం వాళ్ళ నాన్నగారన్న మాట. ఆయన మా నాన్నగారికి ఒక శుభవార్త చెప్పటానికి వచ్చారు.

ఆ శుభవార్త ఏమిటంటే యతిరాజ్యానికి పెళ్ళి కుదిరింది అని.

ఆ రోజున మా నాన్న గారూ మా అమ్మ గారూ భాష్యంగారితో కొంత సేపు మాట్లాడారు.

ఏముంటుందీ, అంత చిన్నపిల్లకు పెళ్ళేమిటండీ అనే.

భాష్యం గారు మాత్రం ఆచారం అనీ సంప్రదాయం అనీ ఏమేమో చెప్పారట మా అమ్మానాన్నలకు సమాధానంగా. వాళ్ళు మాత్రం పాపం ఏం చేస్తారు. వీలైనంతగా చెప్పి చూడగలరే కాని.

యతిరాజ్యం ఆ తరువాత మా యింటికి ఎప్పుడూ రాలేదు.

యతిరాజ్యం స్కూలు మానివేసింది

యతిరాజ్యానికి పెళ్ళయిపోయింది.

చాలా కాలం పాటు, ఆ అమ్మాయి గుర్తుకు వచ్చినప్పుడల్లా మా అమ్మగారు, బంగారం లాంటి పిల్ల అంటూ బాధపడే వారు.

ఎవరు ఎక్కడ అటవీ స్థలముల పాట పాడినా నాకు యతిరాజ్యం గుర్తుకు వస్తుంది. బంగారం లాంటి అభం శుభం తెలియని ఏడో తరగతి అమ్మాయికి పెళ్ళి చేసిన ఆ అమ్మాయి పెద్దల చాదస్తం గుర్తుకు వస్తుంది.

మా పిన్ని భాషాప్రవీణ చేసింది.  ఆతరువాత కొన్నాళ్ళు నిడదవోలులో ఉపాధ్యాయురాలిగా పని చేసింది.

మా పిన్నిని నేను తరచూ కలుసుకుంటూనే ఉండే వాడిని. ఆమెను కలుసుకుందుకు కొవ్వూరు వెళ్తూ ఉండే వాడిని.

ఒకసారి యతిరాజ్యం ప్రసక్తి వచ్చింది మా మధ్యన.

ఆడపిల్లల బ్రతుకులు వాళ్ళ చేతుల్లో ఉంటాయేమిట్రా అనేసింది ఆరోజున మా బేనీ పిన్ని.