31, అక్టోబర్ 2019, గురువారం

శ్రీహరి వీడే శివుడును వీడేశ్రీహరి వీడే శివుడును వీడే సీతారాముడు వీడే
ఊహలుచేసి బేధము లెంచుట యుచితమె బ్రహ్మము వీడే

క్షీరజలధిలో శయనించెడు నా చిన్మయమూర్తి వీడే
ఆ రజతాద్రిని హాయిగనుండే ఆదిదేవుడు వీడే
వీరరాఘవ ప్రఖ్యను భూమిని వెలసిన దేవుడు వీడే
కారణజగతిని చక్కగ నడిపే ఘనుడగు బ్రహ్మము వీడే

మదనునిగన్న మంచితండ్రి యగు మాధవదేవుడు వీడే
మదనాంతకుడను మంచి పేరుగల మహాదేవుడును వీడే
మదనకోటి సుకుమారరూపమున మసలెడు రాముడు వీడే
విదితముగ జగమంతట నిండి వెలిగెడు బ్రహ్మము వీడే

స్థిరపదమున ధృవబాలుని నిలిపిన దేవదేవుడు వీడే
చిరజీవిగ నా మృకండసూనుని చేసిన శివుడును వీడే
వరమిడి కపిని బ్రహ్మను చేసిన వాడగు రాముడు వీడే
నిరుపమానమగు సృష్టికి మూలము పరబ్రహ్మమన వీడే

4 కామెంట్‌లు:

 1. స్మార్తులు, శైవులు శివకేశవ అభేదమును మనసారా నమ్మి పాటిస్తున్నారు. కానీ వైష్ణవులు, మధ్వలు శివారాధన చేయడము అరుదు.

  అద్వైతికి ఉన్న విశాల భావం, సకల దేవతా సమాన తత్వం వారిలో లేదనిపిస్తుంది.

  వివిధమతాలకు సమ్మతం, సమన్వయం, అద్వైతం లో లభిస్తుంది.

  ఆదిశంకరులు శివకేశవులిద్దరికి అమూల్య స్తోత్రాలు రచించారు. రామానుజ, మధ్వ ఆచార్యులు శివారాధన ప్రతిపాదించ లేదు.

  చిన్న జీయర్ స్వామి వారు కూడా శివుడిని విష్ణువు కు పరమ భక్తునిగా మాత్రమే అంగీకరిస్తున్నారు.

  ఈ విషయం నాకు కించిత్ బాధ కలిగిస్తుంది.

  అద్వైత మతాన్ని నిర్ద్వంద్వంగా ప్రతిపాదించే ఉపనిషత్తులకు ద్వైత విశిష్టాద్వైత భాష్యాలు వ్రాయడం విచిత్రంగా అనిపిస్తుంది.

  ఏ రూపంలో కొలిచినా బ్రహ్మమొక్కటే. పరబ్రహ్మ మొక్కటే.

  కీర్తన బాగుంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలండీ. మీరన్నది నిజమే. చిన్నజీయర్ గారి ఉపన్యాసాలు కొన్ని విన్నాను. ఆయన జాగ్రతవహించారు శివనింద జేయకుండా. కాని శివుడి గురించి కొంచెం అప్రసన్నంగా పొడిపొడిమాటలను చెప్పి ఊరకుండటం ఆయనకు పరిపాటిగా కనిపించింది. పోనివ్వండి ఎప్పటికైనా ఆయనకు శివుడే కొంచెం హితోపదేశం చేయాలి ఈవిషయంలో - మనం ఆయనకు చెప్పేంతవారం కాము కదా. కీర్తన మీకు నచ్చినందుకు సంతోషం.

   తొలగించండి
  2. ఇంతకీ ఆయన విష్ణుపూజ చేసేముందు గణపతి పూజ చేస్తున్నారా లేదా అని చిన్న శంక!

   తొలగించండి
  3. వైష్ణవులు గణపతికి బదులు విష్వక్సేనుడికి ప్రథమపూజ చేస్తారండీ.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.