23, అక్టోబర్ 2019, బుధవారం

తెలిసీ తెలియక సంసారములో


తెలిసీ తెలియక సంసారములో దిగబడు చుండును జీవుడు
తెలివి వచ్చెనని మొత్తుకొన్నను తెరలి వెనుకకు రాలేడు

వదలక నిత్యము వెదకుచు నుండును బయటపడుటకై మార్గములు
చదువును శాస్త్రము లందు రహించెడు చక్కని మోక్షోపాయములు
విదులగు గురువుల వెంబడి తిరుగుచు విడువక ప్రశ్నించుచు నుండు
నదులను మునుగును కొండల నెక్కును నానా తిప్పలు పడుచుండు

నానా దేవతలను పూజించగ నానా నిష్ఠల పాటించు
నానా దీక్షల నాచరించుచుటకు నానా బాధలు పడుచుండు
నానా యాగవ్రతాచరణంబుల నలుగుచు నుండును నిత్యమును
నానా మంత్రపునశ్చరణంబుల ప్రాణము బిగబట్టుచు నుండు

ఏమిలాభ మటు లేమి చేసిన నీ సంసారము విడలేడు
ఏమో యెప్పటికైన నీశ్వరుడె యించుక బోధను చేయడా
రామరామ శ్రీరామరామ యని రామనామమును చేయుమని
ప్రేమగ చెప్పిన వినినప్పుడు కద వీనికి సంసారము వదలు