24, అక్టోబర్ 2019, గురువారం

పోషణ నీదే రామభూమిపాలా


పోషణ నీదే రామభూమిపాలా భక్త
పోషక బిరుదాంకిత హరి పురుషోత్తమా

ఎంచియెంచి నీవే నన్నిచట నుంచినావు నా
మంచిచెడ్డల బాధ్యత మరి నీదే కాదా
అంచితముగ నిన్ను కొలుచు నట్టివాడ న
న్నించుకదయ నేలకుండిన నేమన గలవాడను నా

మణులు మాన్యములు భూషణము లడుగ లేదురా
ఘనమైన పదవుల నిమ్మని కోరలేదురా
మనుజుడ సామాన్యుడ నేనేమని నిను కోరితిరా
తినుట కింత పెట్టుమనుచు తిరిగి తిరిగి యడిగితి నా

నీవు కాక త్రిభువనముల దీనపోషకుం డెవడు
నీవు కాక యాపదల నెవ్వరు దాటింతురు
నీవు కాక సజ్జనులకు నేలమీద దిక్కెవ్వడు
నీవే నా పతివి గతివి కావున కాపాడుము నా