25, అక్టోబర్ 2019, శుక్రవారం

నీకు మ్రొక్కుటకునై నాకీతనువు


నీకు మ్రొక్కుటకునై నాకీతనువు కాని
లోకవినోదార్ధమై చేకొన్నదా

నీకు పాడుటకునై నాకీ రసన కాని
లోకులను పొగడగా చేకొన్నదా
నీ కెఱుకే లెమ్మిది నిశ్చయంబుగను
ఓ కీర్తిమంతుడా ఓ రామచంద్రుడా

నీవు మెచ్చుట కొఱకు నే నాడుటలు కాని
భూవలయమున మెప్పు పొందనేనా
నీ వెఱుంగుదు విది నిశ్చయంబుగను
ఓ వేదవేద్యుడా ఓ రామచంద్రుడా

నీ కులుకుమోము జూడ నాకీ కనులు కాని
లోకుల సింగారాలు రూపించనా
నీకిదియు తెలియును నిశ్చయంబుగను
ఓ కళ్యాణమూర్తి ఓ రామచంద్రుడా