25, అక్టోబర్ 2019, శుక్రవారం
అమ్మకచెల్ల యవియివి యమ్ముకు తినుట
అమ్మకచెల్ల యవియివి యమ్ముకు తినుట మొదలాయె
నిమ్మహి నిన్నినాళ్ళకు హీనస్థితి నాకాయెరా
కొంచెము వెండి నమ్ముకొని కొంచెము సొమ్ము తెచ్చుకొని
కొంచెము కొంచెము కరిగించి కొద్దిరోజులను గడపితిని
మంచిదినము లిక గడచినవి పంచార్చిదశయు వచ్చినది
కొంచెపుమానిసి నైతిని గోవిందా నీదయచేత
ఇన్నాళ్ళున్న వాహనమా యిప్పుడె చేయి దాటినది
కొన్నాళ్ళపాటైన నీసొమ్ము కొమ్ముకాయునని తలచెదను
చన్నవిగా మంచిదినములు చిన్నబుచ్చినది కాలము
విన్నదనము నను క్రమ్మినది విన్నావా నా రాముడా
హరియను మాటకు నర్ధము హరియించు వాడని వింటిని
హరియించ వలయు నవిద్యను హరియింతువా జీవనమును
పరమాత్ముడా నీ తలపులు పామరుండ నే నెఱుగను
హరియించ దలచిన దంతయు హరియించి నన్నుధ్ధరించుము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సర్, అమ్మకచెల్ల అంటే అర్థం తెలియపరచగలరా?
రిప్లయితొలగించండిఅమ్మకచెల్ల అంటే "ఔరా!" అని అర్ధమండీ.
తొలగించండిశ్యామల్ రావు సర్.. ఇలా అంటున్నందుకు ఏమనుకోకండి.. నాకెందుకో మీరు చెప్పినది తప్పులా తోస్తోంది.. మన్నించండి.. "ఆపత్బాంధవుడు" మూవిలో.. "ఔరా అమ్మకచెల్లా" అనే పాట ఉంది.. ఆ ప్రకారంగా చూస్తే మీ నిర్వచన తాత్పర్యం "ఔరా ఔరా" అంటు రిడండంట్ గా వస్తోంది కదా.. ఏమో నాకు తెలిసినంతలో.. ఆ ఔరా అమ్మకచెల్లా అంటే హయ్యారే అమ్మ, అక్క, చెల్లి ఇది విన్నారా అనో.. లేదా దానిని విడ్డూరం గాను పరిగణించ వచ్చనే అనుకుంటున్నాను.. ఔరా విడ్డూరం.. లేదా హయ్యారే విచిత్రం.. లేదా అహో విస్మయం గాను సూచించ వచ్చునేమో.. తప్పులుంటే మనఃపూర్తిగా క్షమించెద్దురు.
తొలగించండి~శ్రీత ధరణి
ఏంచేస్తాం. పాట అంటే సినిమాపాటే అన్నట్లు ఐపోయింది తెలుగుప్రపంచం. ఇక తెలుగుభాషను కూడా సినిమాల్లో వినిపించేదే సరైనది అనుకొనే అవకాశం పెరుగుతోంది. కాని సినిమాను ప్రమాణంగా తీసుకోలేమండీ కథకైనా భాషకైనాను.
తొలగించండి"సిగపూవు వాడకనే చెలిబ్రతుకు వాడెనయా" అన్నాడు సినీకవి. నిజానికి అక అన్నది కళయే కాని ద్రుతం కాదు కాబట్టి "వాడకయే" అని ఉండాలి.
మీరు ఉదాహరించిన పాటలో "ఔరా అమ్మకచెల్లా" అని ఉంటే అది అంగీకరించ లేను. సరైన ప్రయోగంగా "ఔరా ఔరా" అని ఆమ్రేడితంగా వాడటం సబబు లేదా అమ్మకచెల్ల అన్నది ఆమ్రేడితం చేయవచ్చును. ఈ ప్రయోగం బాగోలేదు.
ఐనా నేనేమీ సినిమాకవుల్లా పేరో ఊరూ ఉన్నవాడిని కాదు కాబట్టి నేనే తప్పంటే ఒక నమస్కారం చేసి ఊరుకుంటాను.
అమ్మకచెల్ల అన్నది సరైన అర్ధంలోనే వాడాను. ఆశ్చర్యం లేదా సంతాపం చెప్పటానికి "ఔరా" అంటామే దానికి పర్యాయంగా అమ్మకచెల్ల ఉంది.
మిమ్ములను తప్పు బట్టేంత పెద్ద వాణ్ణి ఐతే కాను, శ్యామల్ రావు సర్, అదొక సందేహ నివృత్తి మాత్రమే. సిని కవులు వ్రాసినవే ప్రమాణికాలు అని నేను అనలేదు. అదొక ఉదాహరణగా మాత్రమే తీసుకున్నాను.
తొలగించండితెలుగు గేయాలు, పద్యగద్యాదులను కేవలం సూచనప్రాయంగానే ప్రస్తావించటం జరిగింది. తెలుగు పాండిత్యాన్ని ఔపోసన పోసిన కొద్దో గొప్పో మనుషుల నడుమ ఇలా బ్లాగ్ ముఖంగా పరిచయం కావటం సుకృతమే.
~శ్రీధర్ భూక్య