25, అక్టోబర్ 2019, శుక్రవారం

చేయందించగ రావె చిక్కులు పెక్కాయె


చేయందించగ రావె చిక్కులు పెక్కాయె
నీయందే చిత్తము నిలిపి వేడుచు నుంటి

నీ కొఱకే యాడుచు నీ కొఱకే పాడుచు
నీ కొఱకే యాశల నించుచు మనసున
నీ కీర్తి నెంచుచు నీ గుణము నెంచుచు
నీ కాయమున్నది నీ వెఱుగని దేమి

నీ యాజ్ఞమేరకు నేనిట నుంటిని
నీ యాన చక్కగ నెఱవేర్చుచుంటిని
ఓ యయ్య నేనిటు లుండుట నెఱిగియు
గాయపడిన నాపై కనికార ముంచవు

పామరుడనె గాని భక్తుడనే కద
యేమయ్య నీకన్యమే యెఱుగనయ్య
స్వామి దైన్యము బాపి చక్కగ బ్రోవగ
రామయ్యా వేగమే రావయ్య రావయ్య