1, అక్టోబర్ 2019, మంగళవారం

హరి యొక్కడే కాక యాత్మబంధువు


హరి యొక్కడే కాక యాత్మబంధు వనగ
మరి యొక్కడును లేడు మాటవరుస కైన

నరుల కైన సురల కైన సురవైరుల కైన
ధరనైనను స్వర్గపాతాళము లందైన
అరయ నెల్ల ఋక్షవానరాదులకు నైన
నిరుపమాను డా రాముడె నిజమైన చుట్టము

ధనము లున్న వారి కైన ధనహీనుల కైన
వనేచరుల కైన పట్టణవాసుల కైన
గుణగరిష్ఠులకు నైన గుణహీనుల కైన
అనుమాన మేల రాముడె యసలైన చుట్టము

బలము గలుగు వారి కైన  బలహీనుల కైన
తెలివిగల వారికైన దేబెలకే నైన
కలయ సుఖము నందైన కానివేళ నైన
తలప నెప్పు డైన రాముడె దయచూపు చుట్టము